17 జులై, 2014
సన్నికర్ష
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
11 జులై, 2014
ఉలిచే రాలకు..
![]() |
పుట్టపర్తి మొదటి కావ్యం పెనుగొండలక్ష్మి మద్రాసు యూనివర్సిటీ పాఠ్యగ్రంధంగా.. |
తనపదహారవయేట
ఒక బాలుడు ఒక రచన చేసాడు
అది పేపరుపై పెట్టాడేమో కానీ..
తరువాత అది ప్రచురింపబడుతుందని..ఊహించలేదు
అది రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ వంటి పెద్దలు.. మెచ్చుకొ ని వుండవచ్చు
యేదో చిన్న పిల్లవాడు ..
బాగానే రాశాడు..
పాపం తల్లిలేదు.. పోనీలే కొంచెం ప్రోత్సహిస్తాం
అనుకొని వుండవచ్చు..
నిజంగానే అందులో చిక్కని కవిత్వం ఉండివుండవచ్చు.
అది అతని ముఫ్ఫై రెండవయేట
యెవరో ముద్రించారు..
అంతకుముందే పలువురి ప్రశంసలందుకున్న ఆకావ్యం ..
మద్రాసు వారు విద్వాన్ కు పెట్టారు..
సాధారణంగా అన్ని కాలాల్లోనూ
యెవరికి తోచిన విధంగా వారు
రకరకాల రచనలు చేస్తారు..
ముద్రిస్తారు..
కానీ కొన్నిటికే రాజయోగం పడుతుంది.. కదూ..
పుట్టపర్తి వ్రాసిన రచనల్లా సంవత్సరాల దశాబ్దాల తరబడి
అందమైన రూపం పొందేందుకు
శప్త కన్యల్లా ఎదురు చూశేవి
ఈలోగానే వాటి కీర్తి దశదిశలా గుబాళించిపోయేది
తరువాతెప్పుడో తీరిగ్గా
ఎవరి దయతోనో అవి ముద్రణపొంది వెలుగు చూశేవి..
ఇంకో విచిత్ర విషయం యేంటంటే
విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంధంగా ఆ కావ్యం పెట్టారు
కానీ రచయిత విద్వాన్ కూడా కాదు..
తానూ విద్వాన్ చేయాలంటే అదే చదవాలి ..
తెలుగు పండితునిగా ఉద్యోగం పొందాలంటే
విద్వాన్ ఉండాలి కదా..
కాలక్రమాన ఆయన విద్వాన్ పరీక్షకు
అప్పియర్ అయ్యాడు..
అందులో తన పుస్తకమే పాఠ్యగ్రంధం..
ఇక ఆ పరిస్థితి ఊహించుకోండి..
ఆ ఘడియ రానే వచ్చింది..
పరీక్ష హాలులో ఉలిచేరాళ్ళకు.. చక్కిలింతలిడి..
అన్న ప్రశ్న నిలబడింది
అంతే..
విద్యార్థి.. కవి అయిపొయ్యాడు..
పైన ఎర్రటి ఎండ..
కారిపోతున్న చెమటలు..
అప్పుడప్పుడు అటుగా వస్తున్న జనం అలికిడి..
కానీ శిల్పి యేకాగ్రత ఆ రాయిపైనే..
చెక్కగా చెక్కగా..
అది చక్కని అతివ రూపుదాల్చింది..
అందమైన కళ్ళూ ..
చక్కని నాసిక..
చిన్న చుబుకం..
అద్దాల్లాంటి చెక్కులు..
దోబూచులాడుతున్న సన్నని నవ్వు..
ప్రేమ విభ్రాంతుడై పోయ్యాడు..
అతని కన్నులనుంచీ కన్నీళ్ళుధారలు కట్టాయి
అరచేతులూ చెమర్చాయి..
అతను ఆ బొమ్మను ముద్దుపెట్టుకున్నాడు
ఇది ఎవరికైనా అనుభవమే..
తాను రాస్తున్న కథో కవితో
పాటో పద్యమో ..
అందులో లీనమైపోతే అప్రయత్నంగా కన్నీళ్ళు పొంగుకొస్తాయ్..
గుండె మూగవోతుంది..
ఎందుకూ..
ఆ సృష్టి పై తనలో పొంగిన ప్రేమ..
ఆ కొండలలో చింత వెక్కసమై యేడ్చుకొనే
భావుకుని గా
విద్వాన్ పరీక్ష రాస్తున్న పుట్టపర్తి
ఒకే ప్రశ్నకు అదీ ఒక బిట్ కు
సుమారు నలభై పేజీల వివరణ ఇస్తూ పోయారు..
పరీక్ష సమయం అయిపొయ్యింది..
అందరూ వెళ్ళిపోతున్నారు..
తానూ పేపర్ ఇచ్చి..
భారమైన హృదయంతో బయటికి నడిచాడు
చివరికి ఒకనాడు ఫలితాలు రానే వచ్చాయి..
తాను రాసిన నలభై పేజీల జవాబుకు..
ప్రశంస వస్తుందా .. ?
పాసుచేస్తారా..?
ఫెయిలా..??
ఫెయిల్..??
ఉత్తీర్ణుడు కాలేదు..
ఒక్కో ప్రశ్నకూ ఇంతా అని మార్కులు
పాసవడానికి ఇన్ని
మరి ఒక్క బిట్ కెన్ని ..??
రెండు ..
రెండే వచ్చాయి ..
పుట్టపర్తి అహం దెబ్బతింది..
కారణం
పుట్టపర్తికి క్వశ్చన్ పేపర్ మార్కుల విధానం తెలియవు..
ఎన్నడూ సీరియస్ గా బడి చదువులు చదవలేదు..
బాధవేసింది..
తను వ్రాసిన పేపర్ తానే నెగ్గక పోతే..
ప్రపంచం నవ్వదా..?
పోయిన చోటంతా..సన్మానాలు.. పూలదండలు
బిరుదులూ సత్కారాలు..
యెవ్వరు సవాల్ చేసినా .. ఓడిపోవలసిందే..
మరి ఇలా జరిగిందేమిటీ..?
కొన్ని రోజుల తరువాత..
మద్రాసు యూనివర్సిటీ వారికి సంస్కృతంలో
ఒక పెద్ద లేఖ వ్రాసారు పుట్టపర్తి..
జగమంతా నీవు కవివి..
నీవు పండితుడివి..
నీవు విమర్శకుడివి..
నీవు చక్కని ఉపన్యాసకుడివి..
చరిత్రకారుడివి..
అంటూ గొంతెత్తి అరుస్తుంటే..
తనను అనర్హుడని ప్రకటించడం
యేరకంగా న్యాయం
అంటూ ఆవేశంగా..ప్రశ్నించారు
ఆ ఉత్తరాన్ని యూనివర్సిటీలోని పెద్దలెవరో అందుకున్నారు..
జరిగిన తప్పుకు బాధపడ్డారు.
యెవరో పుట్టపర్తి నారాయణాచార్యులు..
ఒక విద్యార్థి ..
అంతే..
అతడే.. ఇతడని వారికేం తెలుసు..
కానీ తిరిగి పుట్టపర్తి ఉత్తీర్ణులవడం జరిగింది..
ఈ విషయాన్ని
నరాల రామారెడ్డి గారు అక్కయ్య నాగపద్మినితో పంచుకున్నారు..
6 జులై, 2014
అరిగా బంచమమేవగించి..
అళియ రామరాయల ఆస్థానంలో భూషణమై అలరారి
రామరాజ భూషణుడుగా ప్రశంసలందుకున్న భట్టుమూర్తి
రచించిన కావ్యాలలో
వసుచరిత్ర..ప్రసిధ్ధి పొందింది..
సంగీత రహస్యాల సారంగా
వసుచరిత్రను రామరాజ భూషణుడురచించాడు.
పింగళి లక్ష్మి కాంతం గారు.
ఈ కవి సంగీత కళానిధి గాయకుడు..
ఈతని రచనలన్నియు లఘు గమకములు గలవి
కీర్తనల వలె పాడదగినవి..
ఇతనికే శ్లేష.. సహజము..
అన్నారు..
దీనినే పుట్టపర్తి వారు..
తెనుగున భట్టుమూర్తి ఆడినది ఆట.. పాడినది పాట..
అతని నోట నే మాటవెడలినను ..
అందొక శ్లేష ఒక వైచిత్రి నవ్వు చుండును..
అంటూ అరిగా పంచమమేవగించి..
పద్యం లోని అందాల్ని చూపుతున్నారు.
ఇది పుట్టపర్తి వారి 'వసుచరిత్ర వైచిత్రి' వ్యాసం లోని ది
అరిగా బంచమమేవగించి నవలా లవ్వేళ హిందోళ వై
ఖరి సూపం బికజాత మాత్మ రవభంగ వ్యాకులంబై వనీ
ధర నాలంబిత పల్లవ వ్రత విధుల్ దాల్పం దధీయ ధ్వనిన్
సరిగా గైకొనియెన్ వసంతము మహా సంపూర్ణ భావోన్నతిన్
శిశిర వసంతముల సంధికాలము వచ్చినది
అప్పుడు యువతులు హిందోళ రాగమునాలపించిరి
ఆ రాగమునకు పంచమ స్వరము వర్జ్యము
పికములకు పంచమ స్వరమే ప్రాణము
అది లేని హిందోళ వాని చెవులకు వోటైనది
ఎటులైనను ఆ జవ్వనుల సంగీతములో
తాము స్థానము సంపాదించుకొనవలెననుకొన్నవి
అడవులలో జిగుళ్ళు మేయుచు వ్రతము పట్టినవి
వాని తపస్సు పండినట్లు వసంతము వచ్చెను
ఇంకనేమున్నది..?
కలకంఠ నాద ములతో కకుబంతములు మారుమ్రోగినవి
కలకంఠులు వల్లకులు మేళవించి
వసంతరాగము నాలపించిరి
ఆ రాగము పిక ధ్వనిని కూడ దనలో గలిపికొని
తన యుదారతను బ్రకటించెనట..
వసనము షాడవ రాగము
కాని రామ రాజ భూషణుని మతమున నది
సంపూర్ణ రాగమేమో
సంగీత కళా రహస్య నిధి సిధ్ధాంతము నందుకొనియే తర్వాత విద్వాంసులు
చ్యుత పంచమము దానిలో నుపయోగించిరి
ఇక్కడ కవి సూచించిన సంగీత సంప్రదాయమట్లుండగా..
అరిగా సరిగా నన్న పదములలో మరికొంత చమత్కారమున్నది
ఆ స్త్రీలు అ రిగా పంచమమునేవగించిరట..
అనగా శత్రువుగా నన్న యర్థము స్పష్టమే
ఋషభ స్వర వర్జ్యముగా ననియు నర్థాంతరము
హిందోళము నందు పంచమము తో బాటూ
ఋషభమును వర్జ్యమే..
వసంతము పంచమమును సరిగా స్వీకరించెను
అనగా నారోహణమున
షడ్జ ఋషభ గాంధార యుక్తముగా ననుట
ఇది రామ రాజ భూషణుడు జూపిన చమత్కారము
3 జులై, 2014
తాండవ ప్రియుడు
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి పై ప్రముఖుల అభిప్రాయం
,
శివతాండవము
2 జులై, 2014
పుట్టపర్తి వచన రచన
పుట్టపర్తి వచన రచన..అదొక సముద్రము..
ఇప్పటికే వారి కలమునుండి ఎన్నో వచన కావ్యములుద్భవించినవి..
వాక్యములు చిన్నవిగా..
తీవ్రముగా..
వ్రాయుటలో వారు సిధ్ధ హస్తులు..
ఆయన తలపులోని భావమెక్కడ ఆగిన ..
వాక్యమక్కడ ఆగును..
వాక్యములను కొండవీటి చేంతాడు వలె పొడిగించక..
పోడిమిగల పొడి పొడి మాటలలో పొదిగించి..
రచనకు ప్రసాదగుణము.. మాధుర్యము గింగడించుట..
వీరి ప్రత్యేకత..
వాక్యమును చిన్నదిచేసి విషయమునకు గాంభీర్యమును సాధించుట
వారికుగ్గుపాలతో అబ్బిన విద్య
ఎక్కడేని
వాక్యములు సుదీర్ఘములుగ సాగినప్పుడు ..
అది విస్తృ త భావమును విపులీకరించుటలోనో.. నొక్కులు దీర్చుటలోనో..
అతి వ్యాప్త్య వ్యాప్తులను నిగ్రహించుటలోనో.. నిమగ్నమగును..
అపుడు కూడ వ్యర్థ పదములు మచ్చుకైన దొరకవు..
.
వచనము వ్రాయునెడ..
వ్యర్థ పదములు దొర్లకుండ రచన సాగించుట సామాన్యుల కసాధ్యమైన పని..
ఈ విషయములో పుట్టపర్తి వారిచేయి అజేయమైనది..
శక్తి గల వారి చేతిలో తెలుగు బంగారు ముద్ద వంటిదికదా..
ఆ శక్తిని తనలో ఇముడ్చుకున్న పుట్టపర్తి
ధన్య జీవి..
వారి కవిత్వములో నగుపించు గుణములన్నియు..
వారి గద్యములో కూడ అగుపించును..
సరిగదా గద్యములో మరికొంత బాహాటమగును..
సన్నివేశ కల్పనలో ప్రకల్పనలోని చాతుర్యము..
మనోభావ చిత్రీకరణలోని నైపుణ్యము..
అడుగడుగున తొణికిసలాడును..
వారి ప్రబంధనాయికలు రామకృష్ణుని రచనావైఖరి..
రాయలనాటి రసికతాజీవనము..
మొదలగు వచన రచనలు జగత్ప్రసిధ్ధములు..
కె.సుబ్బయ్య.
లేబుళ్లు:
వ్యాసాలు
1 జులై, 2014
విస్మితి
పుట్టపర్తి ఎంత స్వతంత్రుడో..
అంతవినమ్రుడు..
నిర్మాయుడు..
నిర్మలుడు..
స్నేహపాత్రుడు..
మనసులో ఒకటి బయటికొకటి
మాట్లాడుట
ఆయన ఒంటా-ఇంటా లేదు..
ఆయనలో సర్వజనహితములైన
కొన్ని అద్భుత
గుణములున్నవి..
ఆయనతోఒకసారి పరిచయమైన
వ్యక్తిఆయననుజీవితాంతంవిస్మరించలేడు..
ఆయనకున్నంత
శిష్యపరంపర
ఆంధ్రదేశములో ఏ కవికీ ఉండదు..
ఆయన ఇంట ఉన్నా బయట ఉన్నా..
ఎప్పుడు చుట్టూ
పదిమంది ఉందురు..
వారిలో ..
ఆయన అగ్నిలో దూకమనిన దూకెడువారు కలరు..
నా శిష్యులే నా
సంపద..
అని ఆయన అప్పుడప్పుడు చెప్పుచుండును..
అది నిజమేనేమో కూడా ,,
భోగ భాగ్యములెప్పుడు ఆయనను వరించలేదు సిరిసంపదలాయన పేరు చెప్పిన
ఆమడ దూరమున నుండును..
శిష్య సంపద
తలచుకొని ఆయన అవి లేని కొరతను మరచిపోవును..
వారిలో
ధనవంతులున్నారు..
నిరుపేదలున్నారు..
ఉద్యోగులున్నారు,,
నిరుద్యోగులున్నారు,,
వ్యాపారస్తులున్నారు..,
గుమాస్తాలున్నారు,,
పారిశ్రామికవేత్తలున్నారు..
కార్మికులు ,,
కవులు ,,
నిరక్షరకుషులున్నారు..
వారి జీవితములో ఎంత వైవిధ్యమున్నదో ,,
వారి శిష్య సంతతిలో కూడ అంత వైవిధ్యమున్నది..
k.subbayya..
లేబుళ్లు:
చిత్ర కవితలు
26 జూన్, 2014
అహంకార పంచకం
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
నూటికో కోటికో ఒక్కరూ..
హృషీ కేశ్..
నిర్మల మనసు తో తపోసాధన చేయటానికి
అన్ని రకాలా అనువైన ప్రదేశం ..
అందుకే లక్షలాది మహర్షులు
ఇక్కడే తపస్సు జపము యజ్ఞ యాగాలు చేసి
ఆత్మ తత్త్వం తెలుసు కొ ని
బ్రహ్మ జ్ఞానం పొంది మోక్షం సంపాదించారు .
శ్రీ శంకర భగవత్పాదుల పవిత్ర పాద ముద్రలతో
పునీత మైన క్షేత్రం
హృషీ కేశ్..
ఆమహాను భావులు నడిచి నడిపించి ప్రపంచానికి
త రుణో పాయం చూపిన పవిత్ర భూమి
అబ్దుల్ కలాం
హృషీకేశ్ లో..
గంగానదిలో స్నానం చేసి..
శివానందుల ఆశ్రమానికి వెళ్ళి
స్వామివారి ఎదుట నిల్చున్నాడు
మనసంతా నిర్వేదం..
విమాన పైలెట్ గా వెళ్ళాలని ప్రయత్నించాడు
ఊహూ..
సెలెక్టవలేదు..
తీవ్రమైన నిరాశ..
కటిక దరిద్ర జీవితం..
చదువుకోవాలనే ఆశ..
పైకెదగాలనే కోరిక..
ప్చ్ .. ఫలించలేదు..
విపరీతమైన బాధ..
ఎదురుగా శివానంద..
మంచుకొండల నడుమ..
వాటి ఎత్తంత.. ఉన్నతమైన ప్రశాంతమైన వదనం..
చల్లటి చూపులు
అబ్బ.. హాయిగా ఉంది..
గొప్ప సంతృప్తి..
నీపేరేమి..
శివానందులడిగారు..
అబ్దుల్ కలాం..
పేరు వినగానే.. భృకుటి ముడిపడలేదు..
శరీరంలో వింత ప్రకంపన లేదు
అదే ఆదరణ అదే ప్రశాంతత..
ఎందుకంటే
వారు శరీరాలకు అతీతులు
ఆత్మోన్నతులు..
సత్యదర్శనం చేసిన వారు
అన్నిటికీ మించి దయా సముద్రులు..
ఈ శ్వరునిదయ ఎటువంటిదో
వారి దయ అటువంటిది..
ఆయన సనాతన ధర్మానిని ప్రతినిధి..
నీ ముఖం చూస్తే..
ఏదో నైరాశ్యంలో ఉన్నట్లున్నావ్..
అన్నారు..
కష్టపడి మెడ్రాస్ లో
ఐ ఐ టీ ఏరోనాటి కల్ ఇంజనీరింగ్ చదివాను..
డెహ్రాడూన్ లో పైలట్ అవ్వాలని కల
కానీ కాలేక పోయాను..
మాట ఆగింది
యేదో నీటిపొర మాట కడ్డుతగిలింది..
నాకు ఉద్యోగం రాలేదు .. చాలా బాధగా ఉంది..
నీవు ఒకటి కావాలనుకున్నావ్
భగవంతుడు నిన్ను వేరొకటి చేయాలనుకున్నాడు..
నిన్నేం చేయాలో నిర్ణయం చేసి వుంచాడు..
దానికి తయారుగా వుంటే..
నీవు అవ్వాలనుకున్న దానికన్నా
చాలా గొప్పవాడివే అవుతావు..
పరమేశ్వరుడు నిన్ను ఎందుకు ఎక్కడ ఉపయోగించుకోవాలనుకున్నాడో..
ఎక్కడ నిలబెడతాడో
నీకు ఒకనాడు అర్థమవుతుంది..
అంతే..
కలాం లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది..
జీవితంలో వెనుదిరిగి చూడలేదిక..
అది 1940 లు
ఒక యువకుడు.. ఆ శిఖరాల పైకి ఆవేశంగా వెళుతున్నాడు..
కళ్ళనుండీ ధారపాతంగా కన్నీరు..
అప్పటికి దాదాపు సంవత్సరం న్నరగా దేశం పట్టి తిరుగుతున్నాడు
ఎందరో సాధువులను సన్యాసులను కలుస్తూ.. పిచ్చివాడిలా ..
అతనిలోనూ తీవ్రమైన నిరాశ..
అతనిని పట్టే బంధాలు యేవీ ఉన్నట్లు లేదు..
అయ్యయ్యో శిఖరాన్ని చేరాడు..
కిందకు చూస్తే లోతైన లోయ..
దూకేస్తాడో యేమిటో..
ఎవరైనా కాపాడే వాళ్ళు లేరా..
అతను శిఖరం పై నిల్చుని ఆకాశం పైకి చూశాడు..
అక్కడినుంచీ అది చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది..
అతనికి ఆ ఆకాశంలో
సిరికిం జెప్పడు..
శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపని
ఆ శ్రీమన్నారాయణుడూ..
ఆయన వెనుక సిరి..
ఆ లచ్చివెంట..
అవరోధ వ్రాతములూ ..
పక్షీంద్రుడూ..
ధనుః కౌమోదకీ శంఖ చక్ర నికాయాలూ
నారదుడూ..
వైకుంఠ పురంలో వుండే ఆబాల గోపాలమూ కనిపిస్తున్నాయి..
ఆ దేవుని తో యేవేవో మాట్టాడాడు..
దూ.. క.. బో.. యా.. డం.. తే...
స్టాప్..
అన్న పిలుపూ
భుజంపై పడ్డ చేయీ..
వెనుదిరిగి చూశాడా యువకుడు ..
అదురుతున్న ముక్కు పుటాలూ..
ఉక్రోషంతో ఎరుపెక్కిన కన్నులూ..
ఒక్క చూపుతో వాని నుదుటి రేఖలను చదివేశాడా వ్యక్తి..
పెదవులపై సన్నని చిరునవ్వు..
లీలగా.. హేలగా..
కం .. కం విత్ మీ..
చేయి పట్టుకు.. తీసుకు పోయాడు..
వెంట ఆవును అనుసరించిన దూడలా..
వెనుక నుంచీ
ఆ శంఖ చక్ర యుగమును చేదోయి సంధింపని శ్రీమన్నారాయణుడూ..
చిరునవ్వుతో చూశాడు..
వెడుతున్న వానివేపు..
ఆశ్రమానికి వెళ్ళారు ఇద్దరూ ..
ఆయన శివానంద సరస్వతి..
ఆ యువకుడు పుట్టపర్తి నారాయణాచార్యులు
స్వామి తెలుసుకున్న వివరాలు..
మంచి పండితుడు..
చాలా భాషలు తెలుసు ..
సంగీత నాట్యాలు బాగా వచ్చు
అంతేకాదు
కరడు గట్టిన సాధకుడు ..భక్తుడు..
తల్లి చిన్ననాడే గతించింది
తండ్రి రెండవ పెళ్ళి చేసుకున్నాడు
ఇతనికి పెళ్ళయింది
భార్యా పిల్లలు..
అక్షర లక్షలు గాయత్రి చేసాడు
అష్టాక్షరి కోట్లాదిగా చేసాడు..
యే ఆధ్యాత్మిక అనుభూతి కలుగలేదు
అందుకే తీవ్రమైన మనస్తాపం
అదెంత వరకూ పోయిందంటే
సంసారం విడచి
దేశం పట్టి తిరుగుతున్నాడు..
ఇల్లువిడచి.. తన ప్రాంతం విడచి..
ఒకే ప్రశ్నకు సమాధానం వెదకుతున్నాడు
అది యెవరి దగ్గరా దొరకలేదు..
వైరాగ్యాలు రెండట..
జిహాసా..
జిజ్ఞాసా..
జిహాసా అప్పుడప్పుడూ వచ్చి పొయ్యేది..
జిజ్ఞాసా..
ఒకసారి వస్తే..అది తనతో అతన్నీ పరమ పదానికి తీసుకువెడుతుంది..
ఆరునెలలు ఆశ్రమంలో ఉన్నాడు..
తన శిష్యులతో పాటే అన్ని పనులూ చేస్తూ..
త్యాగరాజ కీర్తనలు పాడతాడూ..
భాష తెలియకపోయినా..
ఆ మాధుర్యం పరమాద్భుతం..
పైగా అతనే దానికి అద్భుతమైన వివరణ ఇస్తాడు..
శివతాండవం యేం పాడతాడూ..యేం ఆడతాడూ..
ఆ పరమ శివుడే నా ఆశ్రమానికి వచ్చీఅడుతున్నాడా అనిపిస్తుంది..
వీడు సామాన్యుడు కాడు
ఈ కర్మ భూమిలో ఎందరో పవిత్రాత్మలు
ఈవిధంగా మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ.. ఉంటారు..
వారికి దిశానిర్దేషనం చేయడం కేవలం లాంఛనమే..
నీవడిగే ప్రశ్నలు అనాదిగా ఋషులూ యోగులూ..
వేల వేల సంవత్సరాలుగా మధిస్తున్నారు..
వారికీ జవాబు దొరకలేదు..
కాయ పులుపు వగరు
పండితే..
తియ్యగా మారిపోతుంది.
జీవితమూ అంతే..
అనుభూతి కావాలంటే జన్మ పండాలి..
పక్వానికి వస్తే
దాని సువాసనలను నీవు దాచనేలేవు..
వెళ్ళు..
జీవితాన్ని తృప్తిగా అనుభవించు..
ఎన్నో మధురతలు నీకోసం వేచి చూస్తున్నాయి..
ఎన్నో విజయ కేతనాలు నీకు స్వాగతమిస్తున్నాయి..
ఆ ఘడియ వచ్చిందంటే..
నీవు అడగనక్కరలేదు..
ఆ పరమాత్మ నీ ఇంటి కాపలాదారుగా నిలబడతాడు
నీ సేవకుడుగా చామరం పడతాడు..
అంతటి ప్రేమను ఆయనా పంచడానికి ఎదురు చూస్తున్నాడు..
అందుకోవటానికి ఎదురుచూడు...
తలపై చేయివేసి ఆశీర్వదించాడు
వాని పాండిత్యానికీ గురు భక్తికీ..
ఇచ్చాడో వరం
అదే సరస్వతీ పుత్రా .. అన్న పిలుపు..
పోయిరమ్మన్నాడు..
దక్కిన మెప్పును హృదయమంతా మోస్తూ
వెళ్ళాడు ఆనందంగా పుట్టపర్తి నారాయణాచార్యులు
సామాన్యులనుంచీ ఎంతటి మహాత్ములకీ
జీవితంలో నిరాశ భంగపాటు ఎదురైనప్పుడు
తీవ్రమైన మనస్తాపానికి గురి కావడం సహజమే..
ఆ నిరాశలో కొట్టుకుంటున్నప్పుడు..
అతన్ని తిరిగి లేపేవి..
సాంగత్యం
చదువుకున్న పుస్తకాలూ
నమ్మిన గురువులు..
పెరిగిన వాతావరణం..
మహాత్ముల పరిచయం ఎలా వుతుంది..??
ఉన్నతమైన మార్గంలో పయనించే వారి జాడను వెతుక్కుంటూ వారే వస్తారా..??
తగిన దిశా నిర్దేశం చేసి
ఆత్మ స్థైర్యం మనో బలం గుండెల్లో నింపి..
తిరిగి వాళ్ళు గమ్యంవైపు నడిచేలా చేసి వెళతారా..??
లేబుళ్లు:
వ్యాసాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)







