24 సెప్టెం, 2011

పుట్టపర్తి అంతర్ముఖం






మీకు యెక్కడ చూసినా అయ్య గారి సాహిత్య జీవితమే కనిపిస్తుంది..
కానీ అంతకు మించిన సాధకునిగా మా కుటుంబానికి ఆయన శిష్య గణానికి తెలుసు..
అయ్య గారు ఎన్నో కోట్ల అష్టాక్షరి మంత్ర సాధన చేశారు చనిపోయేనాటివరకు..


శ్రీ కృష్ణదేవ రాయల రాజ గురువువైన తిరుమల తాతా చార్యుల వంశమట మాది..
తాతా చార్యులు గొప్ప శాస్త్ర పండితుడు..కొందరు అల్ప బుధ్ధుల వలన లేని పోని హాస్య కథలు పుట్టాయి..అంటారు అయ్యగారు..                                       


తండ్రి శ్రీనివాసా చార్యులు..తల్లి లక్ష్మీ దేవి..వీరిద్దరూ గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు..తరువాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలోని పుట్టపర్తి లో పుట్టపర్తిలో  వుండడం వలన వారి ఇంటి పేరు పుట్టపర్తిగా అయ్యిందట..


అయ్యగారు చిన్నతనంలోనే భాగవతం..భారతం..పురాణాలతో పాటూ..సంగీతం కూడా నేర్చుకున్నారు..
కపిల స్థానం కృష్ణమాచార్యులు..డి.టి.తాతా చార్యుల వారి వంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద..వ్యాకరణం చందస్సు.. తదితరాలు నేర్చుకున్నారు..


పెనుగొండలో రంజకం మహలక్షమ్మ వద్ద భరత నాత్యం నేర్చుకున్నారు..
చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేయడమే కాక సన్నివేశాల మధ్య తెర లేచే లోపు నాట్యాలు కూడా.. చేసే వారట..అంటే కాదు హరి కథలు చెప్పటమూ.. ఆయన చిన్న తనంలో ఒక భాగమే..


సంగీతం..సాహిత్యం..నాట్యం..ఆయనలో త్రివేణీ సంగమంలా మిళితమయ్యాయి..
సంగీతమూ..నాట్యమూ..సాహిత్యమూ..వీనిలోని గాఢత నెరిగిన ఆయనను మూడూ ముప్పు తిప్పలు పెట్టాయి..
తన గమ్యం ఏదో ..??ఎటు వెళ్ళాలో ..??తేల్చు కోలేక .. ఆయన  సతమత మయ్యారనుకుంటాను..
చివరికి సాహిత్యమే జయించింది..
విజయనగర సామ్రాజ్యపు పూర్వ జన్మ స్మృతులు కామోసు ..ఆయనను తమ వైపు బలంగా లాగాయి..
ఆయన లోని దృఢమైన ఆధ్యాత్మిక మూలాలు..ఆయనను ..జనప్రియ రామాయణం..పండరీ భగవతం.. మొదలైన ఆధ్యాత్మిక రచనలను చేయించాయి..
భక్త కవిగా పిలిపించుకోవటంలో ఆయన ఎంతో తృప్తి పడే వారు..


తనకు తగిన గుర్తింపు రాలేదని ..జీవితం మీద విరక్తి చెందాననీ..
పిల్లబాధ్యతలు అమ్మకు వదలి  బాధ్యతలు అప్పగించి ఆత్మ త్యాగం చేసుకోవడానికి హిమాలయాలకు చాలాసార్లు వెళ్ళి పోయేవారు..
 అప్పుడే ఒకసారి దయానంద సరస్వతి హిమాలయ శిఖరాల నుంచీ దూకి ప్రాణ త్యాగం చేసుకోబోతున్న అయ్య గారిని ఆపి.. నిలువరించి.. తనతో పాటూ హిమాలయాలలోని వారి ఆశ్రమానికి తీసుకు వెళ్ళి ..
ఎన్నో నెలలపాటు తనతో వుంచుకొని.. అనేక శాస్త్రాలలో అయ్యగారిని పరీక్షించి..
నీకు ఇంకా ఎంతో జీవితముంది.. ఎన్నో గౌరవాలను అందుకుంటావు..
ఎన్నో సత్కారాలను అందుకుంటావు ..
అని చెప్పి అశీర్వదించి సరస్వతీపుత్ర బిరుదును ప్రేమతో ఇచ్చి పంపేశారు..


అందుకే.. అయ్యగారు ఎన్నో బిరుదులూ వచ్చినా.. వారిచ్చిన సరస్వతీ పుత్ర మాత్రం తనతోనే వుంచుకున్నారు. అది ఆయనకు డాక్టరేట్ కంటే గొప్పదిగా భావించేవారు..

ఇంకో మహత్తర సంఘటన ..
మద్రాసులోని ఓ ప్రదేశంలో ఒక కారు నించీ ..ఓ వ్యక్తి దిగాడు..
దారిన తనలోకంలో నడుస్తున్న మరో వ్యక్తిని అప్యాయంగా కౌగిలించుకున్నాడు..
కాసేపు..ఆత్మీయంగా మాట్లాడాడు..
ఆ పెద్దమనిషి ఎవ్వరనుకుంటున్నారా..??
డా.సర్వే పల్లి రాధా కృష్ణన్..
మరి రెండవ వ్యక్తీ..??
మరెవ్వరో కాదు.. మన పుట్టపర్తి..


శివతాండవం రాసాక.. జ్ఞాన పీఠ అవార్డ్ గ్రహీత హిందీ రచయిత్రి ..మహ దేవి వర్మ నుంచీ అయ్యగారికి ఆహ్వానం అందింది..నైనిటాల్ లో..ఆల్ ఇండియా రైటర్స్ కాంఫరెన్స్ కు..
 హిమాలయాల కింద ఒకసారి అయ్యగారు చదివిన శివతాండవ గానాన్ని వారు విని పరవశించి పోయారు..
తిరిగి హిమ సానువులపై జరిగిన మరో సమావేశానికి అయ్యగారికి తిరిగి ఆహ్వానం అందింది..
హిమాలయాలంటే కైలాసం కాక మరేమిటి..??
శివతాండవం ప్రతిధ్వనించటానికి ఇదే సరి అయిన ప్రదేశం ఆ పరమ శివుడు కూడా పరవశిస్తాడు.. .అని ..
ప్రముఖ హిందీ పండితులు దినకర్ గారు మన్ ప్రఫుల్ల హోగయా..పరవశ్ హోగయా ..అని వివశులైపోయారట..
అలా హిమాలయాల నడుమ మన శివ తాండవం.. మహామహుల మధ్య..తెలుగు జాతి గర్వించేలా.. ప్రతి తెలుగు గుండే..నిండుగా పొంగేలా ..తన సత్తాను చాటింది..
కానీ ... అయ్యగారు తనకు వచ్చిన ఏ అవకాశాన్నీ.. తన అభివృధ్ధికి..తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి..ఆర్థికంగా బలో పేతులవడానికీ వినియోగించుకో లేదు..అనిపిస్తుంది..
అసలు ఆయనకా దృష్టి లేదు..
జీవితంలో వచ్చిన ప్రతి సంఘటననూ .. ఒక యోగిలా అలా చూస్తూ.. వెళ్ళి పోయారు అంతే..


కానీ ఇల్లూ..పిల్లలూ ..సంసారమూ.. ఏనాడూ ఆయన ప్రతిబంధకంగా భావించలేదు..అందుకు ఒక కారణముందని నేను భావిస్తాను..
ఆయన చిన్నతనంలోనే అమ్మను కోల్పోయారు..
అన్న రార..చల్ది యారగింతువటన్న..
రాను ..రానంచు..మారాము చేయు..
అన్నంబులో నొక్క కడి బెట్టినంత..నా
కలి లేదటంచు..మొగాన నుమియు..
నీలాల కనులలో..నిల్వ నుత్సాహంబు..
బుడి..బుడి..నడల..నల్లెడల బాకు..
పట్టుకొమ్మని..వెంటబడి పట్టబోవంగ..
యెత్తుకొమ్మని ..చేతులెత్తు పైకి..
కురులు ఫాలస్థలంబున గునిసియాడ..
కాళ్ళ గజజ్జెలు ఘల్లు ఘల్లు మనగ..
తాను నర్తించు..ధయి..ధయ్యి..ధయ్యి..మనుచు..
చిన్న పాపడు సుఖముగ.. నున్నవాడు..
పుట్టపర్తి వారి అమ్మ గారు తన చిన్నారి పాపడిని గురించి ఆమె భర్త గారికి అంటే మా తాత గారికి.. పై విధంగా..లేఖ రాశారట..




 ఆవిడ ప్రేమగానే చూసినా.. వీరు భయంకరమైన అల్లరట..ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి పారిపోయి .. అందరికీ సుమతీ శతకాలు కొని ఊరంతా పంచేవారట..
ఇలా ఇంకా ఎన్నో..


చివరికి సవతి తల్లికి సంతానమయ్యేక.. తన పధ్నాలుగో యేట ఇంటి నుంచీ బయటికి వచ్చేశారు.. అందరూ.. వీడు వంటలు చేసుకు బ్రతుకుతాడని హేళన చేసేవారట..


యెవరో నీకు ఇంగ్లీష్ రాదని హేళన చేస్తే.. ఇంగ్లీష్ డిక్షనరీ అంతా బై హార్ట్ చేసి షేక్స్పియర్ .. మిల్టన్..షెల్లీ..అందరినీ గుటకేసి తేల్చేశారు..


రోజులోని ఇరవై నాలుగ్గంటలు అయ్యకు సరిపోవేమో అనిపిస్తుండేది..
ఎప్పుడూ.. చదివేవారు..చదివేవారు..
పరీక్షలకెళ్ళే విధ్యార్థిలా..
ఏ తెల్లవారి మూడుకో ..నాఉగుకో ..లేచేవారు.. ఏ పన్నేండుకో వంటిగంటకో పడుకున్నాసరే..
ఏ మధ్య రాత్రి మెలకువ వచ్చి చూసినా లైటు వెలుగు తుండేది .. అయ్య గదిలో..
ఏ పని పై బయటికి.. లేదా ఉరికి వెళ్ళినా .. కాస్త విశ్రాంతి తర్వాత మళ్ళీ.. అధ్యయనమే..
నాది రాక్షస పట్టుదలమ్మా.. అనే వారు..


స్వార్థం..సంకుచితత్వం..లోభిత్వం..అసూయ..ఏవీ..లేని..పసిపాప ..అయ్యగారు..


ఎవ్వరూ సాధించలేని విజయాలను మా అయ్య సాధించారు..
ఎవ్వరూ చూడని శిఖరాలను మా నాన్న అధిరోహించారు..

లేకపోతే కేవలం ఒక పన్నెండేళ్ళ బాలుడు..
విజయ సామ్రాజ్జ రమ పెనుగొండ శిధిలాల మధ్య.. కంట తడి పెడుతూ..తిరుగు తూందని ఆవేదన చెంది..
విజయ నగర విజయ గాధలు ప్రతిధ్వనించిన చోట ..
కీచురాళ్ళ గోలలకు వ్యధచెందు తున్నానంటూ..
పెనుగొండ లక్ష్మి అనే కావ్యాన్ని వ్రాయడమేమిటీ..??
దాన్ని పది మందీ మెచ్చారు అనుకుందాం..
తను వ్రాసిన కావ్యమే..అతని ఇరవై రెండవ యేట విద్వాన్ పరీక్షలో అతనికి పాఠాంశంగా వుండటమేమిటీ..
ప్రశ్న పత్రంలోని ఒక రెండు మార్కుల ప్రశ్నకు పెనుగొండ లక్ష్మి కావ్య మంతా  భావావేశంలో అతను ఆవిష్కరించడమేమిటీ..??
చివరికి పరీక్షా సమయం ముగిసి కేవలం అతను రెండు మార్కులతో ఫెయిల్ కావట మేమిటి..
ఈ ప్రపంచంలో ఇది ఇంత వరకూ ఏ కవి జీవితం లోనైనా జరిగిందా..??
కనీసం ఇందుకైనా ఆయనకు జ్ఞాన పీఠమేమిటి..నోబల్ బహుమానమీయవచ్చేమో..!!!

ఎప్పుడూ ఇంటినిండా శిష్య గణం జపమాలలు పట్టుకొని జపాలు చేస్తూ వుండే వారుట.
మా అమ్మతో ఎవరెవరి కోసమో రక రకాల పూజలూ పారాయణలూ  చేయించే వారుట..
 మా అమ్మ ఎర్రటి చీరె  ..పెద్ద బొట్టు ..జారుముడి వెంట్రుకలతో.. పూజలో..వుండేదిట ..
మా అక్కలు ఆరు ఎనిమిది సంవత్సరాలవాళ్ళుట.మా అక్కలను యెప్పుడూ.. అమ్మమ్మ గారింటికి పంపించి వేసేదిట..
అయ్య తబలా వాయిస్తూ..భజనలు చేసే వారుట ..
భజనలంటే మామూలు భజనలు కావు..కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ..తాదాత్యం చెంది..
మా అమ్మ సహ ధర్మ చారిణి ఆయన వెనక వుండాలి కదా..
ఇంట్లో ఏనాడూ బస్తా బియ్యం వుండేవి కావుట..
నలుగురు ఆడ పిల్లల్ని పెట్టుకుని మా అమ్మ....ఎలా సంసారం చేసిందో వాళ్ళు కొలిచిన ఆ దేవుళ్ళకే తెలియాలి..
అన్నట్లు ఒకసారి..
ఇంట్లో సరుకులు లేవు..
అమ్మ ఎలా ఎలా అని వేదన చెందుతున్నది..
ఇంతలో ఒకతను సుబ్బన్న పంపాడంటూ..బియ్యం బస్తా.. సరుకులూ..కూరగాయలూ.. వేసి వెళ్ళాడు..
వాడూ..భోజనానికి వస్తాడేమోనని అమ్మ వంట సిధ్ధం చేసి వుంచింది..
వాడు రాలేదు..
తర్వాతెప్పుడో నెల రోజులకు వచ్చాడు..
ఏమిరా.. అప్పుడు సరుకులు పంపావు.. మరి భొజనానికి రాలేదెందుకని.. అని అమ్మ ప్రశ్నించింది..
నేనెప్పుడు పంపానమ్మా..? అని వాడూ.. ఆశ్చర్య పోయాడు..
ఎవ్వరూ పంపక అవి ఇంటికి ఎలా వచ్చి నట్లు..??
తానీషా దగ్గరకు రామలక్ష్మణులు వెళ్ళినట్లు మా ఇంటికి వచ్చారేమో..!!!


పెళ్ళయి నప్పటికి అమ్మకు పన్నేండేళ్ళో..పధ్నాలుగో..
అమ్మకు వంటరాదుట..సరిగా..
కానీ  తర్వాత్తర్వాత..మా ఇల్లు నిత్యాన్న భోజనశాల..
తన పిల్లలకూ..శిష్యులకూ అమ్మ చేతి ముద్దలు వేసేదిట..ఎవ్వరొచ్చినా అమ్మ చేతి ముద్దలు తిని వెళ్ళ వలసిందే...
కొంత మంది ఇంట్లోనే వుండే వారుట..
మరి కొంతమంది అన్నం టయానికి.. అమ్మ చేతి ముద్దల కోసం వచ్చే వారుట..
అన్నం తిని అమ్మకు అయ్యకు నమస్కారం చేసుకుని వెళ్ళే వారుట..


అమ్మ పెళ్ళయ్యే టప్పటికే.. అమరకోశమూ..నానార్థ రత్నమాలా..పంచకావ్యాలూ..చదివింది ఆమె తాతగారినుంచీ..
చిలుక పలుకులతో చిన్ని చిన్ని పద్యాలు రాసి చూపించేదిట తాతగారికి అమ్మ..
పెళ్ళయిన తరువాత అమ్మకు అయ్య శృంగార నైషధమూ.. కాళిదాసు మేఘదూతమూ.. పాఠం చెప్పటం మొదలు పెట్టారుట..అయ్య..
వంట సరిగా కుదరక పోయినా పరవాలేదు..
నిన్నటి పాఠం ఈ రోజు అప్ప చెప్ప వలసిందే..
లేకపోతే.. అమ్మకూ దెబ్బలు తప్పేవి కాదట..ఇదేదో స్త్రీ జాతి మీద పురుషాహంకారమనుకోకండి..


అప్పటికి అమ్మ వయసు పదునైదు.. అయ్య..ఇరవై ఒక్కటి..
సత్యయనారాయణ వ్రతం చేస్తే పెద్ద గుండిగలోపులిహోర వండి ఊరంతటికీ అన్న దానం..
 రేపు యెలా అన్న ఆలోచనే లేదు ..
అటకల నిండా కుండలనిండా పూజ చేసిన పసుపూ కుంకాలే..
యెప్పుడూ మంత్రోపదేశం చేయమని శిష్యులు వెంటపడే వారట..అలా వెంట పడి వచ్చి అయ్యను గురుదేవునిగా నమ్మి తన జీవితం చివరి వరకూ నిలిచిన వాడు రఘూత్తమ రావు..
 ఆయన జోతిష్య శాస్త్రంలో దిట్ట. అయ్య తన జాతకాన్ని కొన్ని వందల సార్లన్న వేయించి తనకు ముక్తి లభిస్తుందా..??
 కృష్ణుడు సాక్షాత్కరిస్తాడా..??
అని అడిగే వారు..అయ్యగారు..
ఒక సారి ఒక తరుణ వయస్కుడు బగళా మంత్రోపదేశం పొందాడు ..వద్దురా అమ్మ వారిని నీవు తట్టుకో లేవు.అని యెంత చెప్పినా వినలేదట..కొన్ని నెలలు అయ్యగారిని అనుసరించాడు..
చివరికి ఉపదేశం చేశారుట 108 మాత్రం చేయరా రోజుకు అన్నరట అయ్యగారు.. 
అతను అహోబిలం గుహలలో కూచుని వేలకు వేలు చేసాడుట.చివరికి అమ్మ వారు నగ్నంగా దర్సన మిచ్చిందిట అతను అమ్మ వారిని పట్టుకో బోయాడట..
అంతే .. మతి భ్రమించింది..
చివరికి వాళ్ళ అమ్మా నాన్నలు మా నాన్నను దూషించి మా ఇంట వదిలి పోయారుట. మా ఇంట అతను దాదాపు రెండు సంవత్సరాలు వున్నాడుట...అన్నం తినరా.. అని పళ్ళెంలో తీసుకు వెళితే ..పళ్ళెం ఎగురగొట్టి పక ..పకా.. నవ్వే వాడుట..అతను..
ఆ పిచ్చి వాడితో ఏగుతూ మామ్మ వాడి ఆరోగ్యం యధాస్థితికి రావడానికి చండీ పారాయణం రెండు సంవత్సరాలపాటు తిరగ చేసిందట..
అంటే .. వెనక నించీ ముందుకు.. రెండు సంవత్సరాలకు అతను మామూలు మనిషయ్యాడుట.. 
కేరళలో అయ్యగారు మళయాళ డిక్షనరీ వ్రాయడానికి పిలిపు వచ్చి వెళ్ళారు.. అక్కడ..అక్కడికి వెళ్ళి మళయాళ మంత్ర తంత్రాలు పరిశోధన చేశారు.                                        


ఒకసారి..అహోబిలం గుహలలో అయ్యగారు సాధన చేస్తున్నారుట.
కనులు తెరచి చూస్తే..ఒక పెద్ద పులి ..
అయిపోయిందిరా నా జీవితం క్లోజ్ ..పోనీలే పెద్ద పులి చేతిలో చస్తే ..మరుసటి జన్మలో మహరాజు గా పుడతాం అనుకున్నారుట..
పులి అయ్యగారి కళ్ళలోకి అలానే చూసిందిట ..అయ్యగారూ అలానే చూసారు..
 అంతే అది వెనుదిరిగి పోయింది.


మా ఇంట్లో మా అమ్మ రామాయణ పారాయణలు (వాల్మీకి)చేసేది.
 24000 శ్లోకాలు.. ఎన్నో సర్గలు ఆమె వానిని వారాని ఆవృతి అయ్యేలా విభజించుకున్నారు..
పగలూ రాత్రీ.. ఆరోజు పారాయణ పూర్తి అయ్యేవరకూ.. చేసేవారు..
అప్పుడు పని మనుషులు లేరు..
అంత పనీ ఇంటికి వచ్చే వారు పొయ్యే వారు.. పిల్లలు అల్లుళ్ళు..కూతుళ్ళు.. సాహిత్య చర్చలు.. అతిధులు..అభ్యాగతులు..
ఇన్నిటి మధ్యా ఆమె దానిని కొనసాగించే వారు..
ఒకవేళ పొద్దున తీరక పోతే ఒక రాత్రి వేళ మేము నిద్ర లో కళ్ళు తెరచి చూస్తే.. ఓరగా మూసిన దేవుని గది వాకిలి సన్నగా వెలుల్గుతున్న దీపం కళ్ళద్దాలతో పారాయణ చేస్తున్న అమ్మ..
ఇలా వారానికి పారాయణ ముగిసేది.. శనివారం పట్టభిషేకం..
అబ్బ..అబ్బా.. యేమి జనం యేమి జనం.. మా పేద్ద ఇల్లు ఆ చివరి నుంచీ ఈ చివరి వరకూ భక్తులతో నిండి పోయేది..
మా అమ్మ పేద్ద గంగాళానికి పులిహోర చేసే వారు.. పట్టాభిషేక మధురఘట్టం ..ముగిసిన తరువాత.. మంత్రపుష్పం ..హారతి అమ్మ, అయ్య రాసిన భక్తి పాటలు త్యాగరాయ కృతులు అన్నీ అందరూ కలిసి పాడే వారు..
తరువాత ప్రసాదం పంపకం..
అంతే కాదు లక్ష పూజలూ కోటి పూజలూ.. అఖండదీపాలూ..
మా చిన్న తనమంటా దేవుని సాన్నిధ్యంలోనే గడిచింది..
అంతే కాదు..
ఇది రేపటికి దాచుకోవాలి ఇది మూటగట్టు కోవాలని తాపత్రయం మా అయ్య కూ లేదు అమ్మకూ లేదు..
ఇలా వచ్చిన డబ్బు అలా వెళ్ళి పోయేది..
మా నలుగురక్కల పెళ్ళిళ్ళూ ఎలా జరిగాయో ..? మా అమ్మ నమ్మిన రామునికే తెలుసు..
మా ఇంట్లో అందరికీ శివతాండవం నోటికి వచ్చు..
ఎవ్వరైనా ఆనందపడుతుంటే..యేమానందము ..భూమీతలమున..అని పరాచికమాదుకోవడం ఒక సరదా..
మా అమ్మ తిట్లు కూడా సంస్కృతాంధ్రాల మిళితమై వుండేవి..
పాడూర్పిశాచీ..అనేది అందులో ఒకటి..
మా అమ్మ గారు రాసిన అంపకాల పాట హృదయాన్ని కదిలించేదిగా వుంటుంది..
మా పెద్దక్కయ్య పెళ్ళికి ఏ పాట రాశారట మా అమ్మ..
మా అమ్మ గారు కూడా కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత..
కానీ మా అమ్మకు మా అయ్య గారిని అనుసరించటమే ఇష్టం..
సీతమ్మవారి అప్పగింతల సన్నివేశాన్ని మా అమ్మ గారు హృద్యంగా ఇలా రాశారు..
కౌసల్యకు సీతమ్మను అప్పగిస్తూ.. జనకుని ఇల్లాలు ఇలా పాడుతుంది..
అమ్మరో..కౌసల్యా.. అతివ సుకుమారియగు..
ఇమ్మహీజాత గైకొమ్మ..వేవేగ..
సమ్మతిగ నీ సుతకు ..సమముగా చూతువని..
నమ్మి మదిలోన మాయమ్మనొప్పించెదను..
అమ్మరో కౌసల్యా..
మా ఇంటిలో వెలుగు..మా కంటిలో పాప..
మాదు హృద్పేటికను మలయు రత్నమ్మూ..
మా మనో రధ ఫలము..మా వంశ గౌరవము..
మీ ఇంటి కనిపెదము.. నెలతరో కోడలిగా..
అమ్మరో.. కౌసల్యా..
మా ఇంట పారాడు మహ లక్ష్మి జానకిని..
మీ ఇంటిలోనుండ ..మేమంపుచుండా..
వేయి కన్నుల గాచి ..వేసరక పోషించి..
చేయి విడువను మనసు ..చేదు మింగినటుండే..
అమ్మరో కౌసల్యా..
పుట్టినప్పటినుంచి..చిట్టిమాటల మనసు..
అట్టే భ్రమియించి మది నానంద పరచీ..
కట్టకడ కెటులైన.కాంతు జేరెడునంచు..
పట్టరాని ముదమ్ము..పరిఢవిల్లేమనమ్మూ..
అమ్మరో కౌసల్యా..
తొలిఝాముననే లేచి..ఇలుదీర్చి..పెద్దలకు
తలవంచి యువనీత..లలిత గతులా..
పులుగడుగు ముత్తెమై..పుట్టువెరుగని సీత..
తలలోని నాల్క వలె మెలగు మీ ఇంటయనీ..
అమ్మరో కౌసల్యా..
ఎన్నేండ్లు పెంచినా..ఎన్ని గోములు పడిన..
కన్న కడుపేయైనగాని ..కడపటికీ..
సన్నుతాంగుని భాను సన్నిభుని పతి గూడి..
కన్నె తానేగునని అనుకొంటి..కనుగొంటీ..
అమ్మ్రో కౌసల్యా..
తొలిప్రాయమున తండ్రి..మలి ప్రాయమున భర్త..
మలి వయసునను సుతుడు.. పడతి కెపుడూ..
కలిగి రక్షింపగా..తులలేని సౌఖ్యాల..
తులతూగునని ధాత..లలనలకు వ్రాసెననీ..
అమ్మరో కౌసల్యా..
అతా మామల ఆజ్ఞ అన్సరించు విధమ్మూ..
బావ మరదుల మాట ..పాటించు విధమూ..
ఇరుగు పొరుగుల వారి నేమరకటంచునే..
నరమరికలను చాల కలవరించితినమ్మా..
అమ్మరో.. కౌసల్యా..
ఆడుబిడ్డల మనసు .. అలరించెడు విధమ్ము..
ఈడువారలగూడి ..యాడు విధమూ..
వాడగల వారలకు ..తోడుగా నగు విధము..
ఈడు లేని విధాన..నేర్పించినానమ్మా..
అమ్మరో ..కౌసల్యా..
జననమొందిన ఇంట..చన్న ఇంటను గూడ..
వినయగా నేడు..తరముల వారికెల్లా..
అనయంబు కీర్తి దెచ్చినదంచు జనులెల్లా..
కనుగొనగ కనులార..అనిపెదము ఈ బాల..
అమ్మరో ..కౌసల్యా..
పసితనపు చాపలము ..వశముగా నేమైన..
కసటు మాటలు బల్కా..కష్టపడబోకూ..
పసిబాలికయే గాని..పడతీ ప్రౌఢాంగనా..
వశవాక్కు గాదమ్మ.. దొసగులను మన్నించీ..
అమ్మరో ..కౌసల్యా..


ఇంకో విచిత్రం చెప్పనా..
ఓసారి అయ్య గారు అలా రామ కృష్ణా హై స్కూల్ వేపు నడిచి వెళుతున్నారు..
ఒక అబ్బయి యెదురుగా ఏడుస్తూ.. వస్తున్నాడు..
ఎందుకు రా ఏడుస్తున్నావు అన్నారు అయ్యగారు..
వాడు మా అమ్మ కావాలి అని అన్నాడు..
ఇంటికి పోరా.. మీ అమ్మ వుంది. .అన్నారుట అయ్య..
అంతే.. ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడు.. అమ్మను.. చూశాడు.. అతని మదిలో అమ్మ దేవతై వెలసింది..
ఇది ఈ నాటి సైన్సులు నమ్ముతాయో లేదో మరి..
అతని వయసు అప్పుడు తొమ్మిదేళ్ళే.. అమ్మా నాన్నలు వున్నారు.. ఇల్లూ వాకిలీ వున్నాయి .. అయినా ఆ అబ్బాయి వాళ్ళింటికి పోడు.. ఇక్కడే వుంటాడు..
అమ్మకు సహాయం చేస్తూ హనుమంతునిలా..
అతని అమ్మా నాన్న మా ఇంటి పైకి వచ్చి అమ్మనూ అయ్యనూ దూషించి దూషించి వెళ్ళే వాళ్ళుట.
అమ్మ ఒరే సుభ్రమణ్యం మీ ఇంటికి వెళ్ళరా.. అనేది అమ్మ. అయినా అతను వెళ్ళడు..
ప్రతి పనిలో అమ్మకు సహాయం..
అమ్మ నీళ్ళు పట్టు కోవటానికి వీధి కొళ్ళాయికి వెళితే పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరినీ తోసేసి.. అమ్మను పట్టుకో నిచ్చే వాడుట..
అలానే జీవితం చివరి వరకూ అమ్మకు హనుమంతునిలానే వున్నాడు..
మా అక్కల పెళ్ళిళ్ళు చేశాడు.. అన్ని బాధ్యతలూ ..సొంత అన్నయ్య కూడా చేయని యెన్నో యెన్నో ..
తనవి కాని బరువులను తన భుజాలపై వేసుకొని మోశాడు..
మా అమ్మ క్యాన్సరు తో మంచమెక్కితే తన చివరి పైసా వరకూ ఆమె హాస్పిటలుకూ మందులకూ ఖర్చు పెట్టాడు..
చివరికి ఆమె చనిపోయిన వెంటనే ఆయనకు మాపై మోహం పోయింది ..
ఏదో మాయ తొలగింది..
మా ఇంటితో బంధం విడివడి పోయింది..
ఇప్పటికీ మా అమ్మ రాసిన జాబులను పెట్టుకుని బ్రతుకుతున్నాడు..
అతని వయసు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు..ఆయనకు ఆమె  అమ్మ.. ఆమే దేవత..
మరి ఆ తొమ్మిదేళ్ళ పసి బాలునికి అయ్య ఒక్క మాటతో పడిన బంధమేమిటి..?
ఇప్పుడు వీడిన మాయ యేమిటి ఆ దేవుడే బదులు చెప్పాలి..!!!


అయ్యగారు కడప మోచం పేట శివాలయంలో అదిప్పుడు వుందో లేదో మరి దాదాపు ఎనిమిది పది సంవత్సరాలు భాగవత పురాణం చెప్పారు.. ఎందరో భక్తులు ప్రతి నిత్యం క్రమం తప్పకుండా.. విని ఆనందించే వారు కొందరు నోట్సు రాసు కునేవారు..
ఆ పురాణ క్రమంలో ఎందరో భక్తుల జీవితాలు.. స్వీయానుభవాలు..
భవభూతి..కాళిదాసు..తిక్కన.
.ఇలంగో అడిగళ్..కులశేఖరాళ్వార్..పంప..బసవేశ్వరుడు..తులసీదాసు..సూరదాసు..గాలిబ్..షేక్స్ పియర్..షెల్లీ..
తుకారాముడు..కనకదాసు..పాండురంగడు..మీర..మొల్ల..శ్రీ కృష్ణ దేవ రాయలు..అష్ట దిగ్గజాలు..విజయ నగర సామ్రాజ్యం.. ఒకరేమిటి ఎందరో ఎందరో ..వచ్చి తరించి వెళ్ళే వారు..
                                                                                
ఒకసారి ..
ఒక సంగీత విధ్వాంసుడు వచ్చాడు మధురంగా పాడాడు..                       
అయ్యగారు విన్నారు.. ఆనంద భాష్పాలు రాల్చారు..
కనకా .. నీ గాజులు స్వామి వారి పాదాల వద్ద పెట్టు అన్నారు..
అంతే..
అమ్మ తక్షణం గాజులను విప్పి ఆయన పాదాల వద్ద పెట్టారు..
ఇది ఒక సంఘటన మాత్రమే..
వారి జీవితం నిండా ఇలాంటి సంఘటనలే..
అందుకే ఇంత పెద్ద కవి అయినా చివరి వరకూ తనకో ఇల్లు సంపాదించుకోలేక పోయారు..


శివతాండవం రాసే రోజుల్లో ..అయ్యగారు.. శివాలయం లో 108 ప్రదక్షిణలు చేసే వారట..అందుకే ఆ కావ్యం శివుని ప్రసాదమని అయ్యగారు అంటారు..
ఒకసారి విజయవాడలో శివతాండవ గానం అయ్యగారు  చేసి నప్పుడు విశ్వ నాధ సత్య నారాయణ అయ్యగారిని భుజాలపై ఎత్తుకుని ఆనంద పరవశులై ఎగిరారని చెబుతారు..
మాత్రా చందస్సులో జరిగే ఆ గానం ఎవ్వరినీ రెప్ప వాల్చ నీయదు.. గుక్క తిప్పుకోనివ్వదు..
ఆ కావ్యంలో అయ్యగారు సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం..
అందుకే దానిని ఆధునిక మహా కావ్యంగా మహాకవులు అభివర్ణిస్తారు..
 అమ్మ మా నాన్న గారిని మా పిల్లల్లో ఎవ్వరైనా అగౌరవ పరిస్తే సహించేవారు కాదు..
ఆమె చివరి క్షణాలలో వున్నప్పుడు ..
మా నాన్న గారు రాఘవేంద్ర స్తోత్రం పారాయణ అటూ..ఇటూ.. తిరుగుతూ చేసేవారు.. మా అమ్మ కు మాట పడిపోయి అప్పటికి చాలా కాలమైంది.. ఆమె యెప్పుడూ అటూ .. ఇటూ.. పచార్లు చేస్తున్న ఆయన పాదాలనే చూస్తూ.. వుండేవారు..
.
మీరు కమర్షియల్ బాబా లను చూశారు.. కమర్షియల్..స్వాములను చూశారు..
కమర్షియల్ కవులను..పండితులనూ.. చూశారు..
ఈ తరం లోనే కాదు వెనుక తరాలకూ కాగడా వేసి వెతికినా కనిపించని బహుశా ఆఖరి.. అన్ కమర్షియల్ కవి పండితుడూ..బాబా.. స్వామీ.. అయ్యగారే..


అయ్యగారి జీవితం బ్రౌన్ వారు వేశారు..                                       


అయ్యకు చేతి వ్రాత అలవాటు లేదు..
రాసే టప్పుడు చేతులు వణుకు తాయిట..అక్షరాలు సరిగా కుదరవు..
అయ్యగారి చేతి వ్రాతను అర్థం చేసుకొని ముత్యాల్లాంటి అక్షరాలతో అమ్మ వానిని మళ్ళీ ఫెయిర్ కాపీ చేసేది..
అయ్య ప్రతి పుస్తకం వెనుక అయ్య శ్రమకు ప్రతి శ్రమ అమ్మ కూడా పడే వారు..
ప్రతి రోజూ రాత పని వుండేది..
అంటే..వివిధ పుస్తకాలకు ముందు మాట వ్రాయడం..వ్యాసాలు భారతి.. లత..మొదలైన పత్రికలకు వ్రాయడం.. రేడియోలకు ప్రసంగాలు వ్రాయడం..
అయ్యగారి గ్రంధాలు..ప్రింటింగ్ కు రెడీ చేయటం ..ఒకటేమిటి..??
అమ్మ అయ్యగారికి మనసెరిగిన వ్రాయసగత్తె కూడా..!!!
రాతకు రామ్మా అని పిలిచే వారు..
గబ .. గబా.. అయ్య ఒక మూడ్లో అయ్య చెప్పుకుంటూ వెళ్ళి పోయే వారు..
ఆ వేగాన్ని అందుకోవటం సామాన్యులకు సాధ్యం కాదు..
ఏవైనా పదాలు మిస్సవుతే..సందర్భాన్ని బట్టి ఎలానో సర్దేశేవారు అమ్మ..
రెండవసారి అడిగితే..అయ్యకు విపరీతమైన కోపం వచ్చేది..
థాట్ కంటెంట్ దెబ్బ తింటుందని విసుక్కునే వారు..


తరువాత..
ఆ బాధ్యతను తులజక్కయ్య.. తీసుకుంది..
తన చేతి వ్రాత కూడా అందంగా వుంటుంది..
ఊహ తెలిసిన నాటినుంచీ.. పెళ్ళయ్యే.. వరకూ..తులజక్కయ్య అయ్య రచనలను ఫెయిర్ చేయటంలో బిజీగా ఎప్పుడూ వుండేది..
కాలేజీకి వెళ్ళినా..కూడా తీసుకెళ్ళి..లీజర్ అవర్స్ లో వ్రాత పని కంప్లేట్ చెసేది..
లేకపోతే మళ్ళే ఈ రోజు రాతకు కూచున్నప్పుడు అయ్య నిన్నటిది ముగించావా.. అని అడుగుతారు..
అయ్యకు ఎదురు చెప్పటం.. తల ఎత్తి మాట్లాడటం మాకు అలవాటు లేదు..
ఎన్ని తిట్టినా సరే తల దించుకునే వుండే వాళ్ళం..అది మా అమ్మ ద్వారా నేర్చుకున్నాం..


మా పెద్దక్కయ్య కరుణాదేవి.. రెండవ అక్కయ్య.. తరులతా.. సంగీతం నేర్పించ బడ్డారు .. అయ్య కీర్తనలను త్యాగరాజ కీర్తనలను చిత్తి స్వరాలు వేస్తూ .. పాడే వారుట.. ఇంతకూ వారి వయసు.. ఎనిమిదీ.. పది.. ఏళ్ళే..
పాటలో అపశృతి దొర్లితే తొడ వాచి పోవలసిందే..


మా తరులతక్కయ్య ఆడుకోరా కృష్ణా.. ఆడుకో అన్న అయ్యగారి కీర్తనను ఎంతో మధురంగా.. పాడుతుంది..
ఆమె పెళ్ళయి పిల్లలు పుట్టిన తరువాత సెలవులకు యెప్పుడు కడపకు సెలవులలో వచ్చినా ఏదో ఒక రోజు అందరూ సరదాగా కూర్చున్నప్పుడు అయ్య అక్కయ్యను పాడమనే వారు..


అక్కయ్య గొంతు సవరించుకుని.. పాటను ఇలా పాడేది..


ఆడుకోరా.. కృష్ణా.. ఆడుకో..
వాడ..వాడల..తిరుగ వద్దురా.. నా తండ్రి..
ఆడుకోరా.. కృష్ణా.. ఆడుకో..
మనుజ తనువుల బోలు మట్టిగురిగెల యందు..
మాటికిని చైతన్య మట్టి పాలను నింపి..
ఆడుకోరా.. కృష్ణా.. ఆడుకో..
మాయ బోలిన యమున మధురముగ ప్రవహింప..
ఆయమున నీడలో అల్లనల్లన జూచీ..
ఆడుకోరా.. కృష్ణా .. ఆడుకో..


అయ్య అష్టాక్షరీ మకుటంతో కీర్తనలు రాసే వారు..
అమ్మ పరమ తారక మంత్రం మకుటం తో..
పై కీర్తనలోని అష్టాక్షరి మకుటం వున్న చరణాన్ని మరిచి పోయాను.. మళ్ళీ గుర్తు చేసుకోవాలి..
కడప విజయవాడ..విశాఖ పట్నం .. హైదరాబాదు ఆకాశవాణి స్టేషనులలో.. అమ్మ అయ్య గారి కీర్తనలు..ఆ రోజుల్లో మారు మోగి పోయేవి..ఇప్పుడూ వస్తున్నయనుకుంటాను..
నేను చివరి దాన్ని నాపేరు అనూరాధ..
అయ్య నన్ను చూసి ప్రేమగా.. మధురంగా పాడేవారు..


యేమమ్మ రాధా..
యెన్నడు కరుణింతువమ్మా..
ఈ మాయా బంధమ్ముల నెన్నడు వదలింతువమ్మ..అని...


ఆ రోజుల్లో అయ్య రోజుకు లక్ష జపం చేసేవారట ..
ఎలా అంటారా..??
సన్న సన్నని రాళ్ళు జేబులో వేసుకుని..
ఒక వెయ్యి అయిన వెంటనే .. ఆ జేబులోని రాయి ఈ జేబులోకి వేసే వారుట.. రామకృష్ణా హై స్క్లూల్ లో వుద్యొగానికి వెళుతూనే..
వారు అయ్యను గౌరవ ప్రదంగా పెట్టుకున్నారు కానీ క్లాసుల కెళ్ళమని ఏనాడూ అయ్యను ఇబ్బంది పెట్టలేదు..
అక్కడ అయ్య ఏ చెట్టు కిందో తులసీ రామాయణం లేదా.. ఇంకోటో ..మరోటో.. చదువుకొనే వారు.. అంతే..
అయ్య ఒకసారి మాటల మధ్యన ఎవరితోనో చెబుతుంటే విన్నాను..
నేనూ జపం చేయడం మొదలు పెట్టాను..
వెయ్యి.. రెండు వేలు.. నాలుగు..
ఏడు.. పదీ..
ఇంక నాకు .. తల గిర్రున తిరుగుతున్నట్లు అనిపించేది.. తలలోంచీ.. ఏవేవో శబ్దాలు రావటం మొదలయ్యేవి..
విపరీతమైన తలనొప్పి ..
అప్పుడు అర్థమ మైంది.. నాకు ఆ చిన్న వయసులో అయ్య గొప్ప తనమేమిటో..
పది వేలు జపం చేస్తే.. మామూలు శరీరం ..ఈ విధంగా రియాక్ట్ అవుతుంది..
మరి.. రోజుకు లక్ష చేయడమంటే మాటలా..
మనసు మాటల మధ్య పెట్టి నోరు మంత్రం జపిస్తుందేమో నని మీరు అన వచ్చు..
కానీ అది సామాన్య మానవులకు అయ్యకు కాదు..
మనసు మాటల మధ్య మనసులా వుండదు..తామరాకు పై నీటి బొట్టులా.
అప్పటినుంచీ అయ్యను నిజమైన గురు దేవునిలా ఆరాధించడం మొదలు పెట్టాను.. అయ్యలా కూడా.


మా అమ్మ మరణంతో మా ఇల్లు కళ తప్పింది..
అయ్య గారు లక్ష్మిని వీడిన శ్రీ మహా విష్ణువులా మిగిలి పోయారు..


అయ్యకు చివరి కూతురినవడం వలన నాపై విపరీతమైన ప్రేమను పెట్టుకున్నారు..
నాకూ అసలు పెళ్ళి చేసు కోవడం అస్సలు ఇష్టం లేదు..
అయ్యను జాగ్రత్తగా చూసుకుంటూ.. ఆయనను నా ఒడి లోనుంచీ మృత్యు దేవత ఒడిలోనికి అప్పగించాలని.. తపన పడే దాన్ని..


కానీ విధి బలీయమైనది..
ఆయన సుఖ కర్మ అనుభవించారు..
దుఃఖ కర్మా కాచుకుని వుంటుందిగా..


నేను పెళ్ళయి వెళ్ళి పోయాను..
ఆయనకు జీవితంపై కాస్త కాస్త వున్న ఆసక్తి కూడా.. పోయింది..
మా అన్న వదినా వాళ్ళ శక్త్యానుసారం చేసారు..
చివరకు ఆయనకు స్వల్ప మైన హార్ట్ అటాక్ వచ్చిందట..
నాకు రాత్రి కలలో అయ్యకు ఊపిరి అందనట్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు కల వచ్చింది.. నేను ఏడుస్తూ.. లేచాను..
తెల్లవారి పదీ పదకొండు మధ్యన అన్నయ్య మా ఆయనకు ఫోన్ చేసి చెప్పారు..


అది కాదు ఎంతో ప్రియమైన నన్ను ఆయన చివరి సారిగా చూడాలను కున్నారు..అని నా మనసుకు తెలుసు..
మా బలీయమైన ఋణానుబంధం అనుకోండీ.. గురు శిష్య సంబంధం అనుకోండి.. నన్ను లాక్కెళ్ళింది అని నేను భావిస్తాను..
వెంటనే బయలు దేరి వెళ్ళాము..
అప్పుడు మేము నాసిక్ లో వుండే వాళ్ళం..మా ఆయన ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగి..
సాయంత్రంగా కడప చేరాం..
నేను వెళ్ళగానే ఆసుపత్రిలో అయ్య గుండెలపై వాలిపోయాను..
అబ్బా.. చల్లగా వుందమ్మా.. హాయిగా వుందమ్మా.. అని అయ్య అన్నారు..
నాకోసం ఆ తండ్రి గుండె ఎంత పరితపించిందో ..నాకు తెలుసు..
నేను ఆసుపత్రిలో ఇక వుండను ఇంటికి వచ్చేస్తాను అని మారం చేయటం మొదలు పెట్టారు..
అయ్యా నాకే మైనా చెప్పు.. అని అడిగాను..
యేముందీ.. ఆ సత్యనారాయణ వ్రతాలు వదలకుండా చేసుకో.. అన్నారు..
అయ్య పాదాలకు నమస్కరించి ఇంటికి వచ్చాను..ప్రయాణం చేసి వచ్చారు ఇంటికి వెళ్ళండి అన్నారందరూ..
మా వదినను హార్లిక్స్ కలిపీ మన్నారట. మగత నిద్రలో అయ్య ..వాడు.. అదిగో వాడు..వాడు.. అని అంటున్నారని వదిన చెప్పింది..
అయ్యకు కృష్ణ దర్శన మైందనిపిస్తుంది..అని
ఏమైనా అయ్యకు కృష్ణ దర్శనమైనప్పుడు పక్కనే వున్న అదృష్ట వంతురాలు వదిన..
ఆ పుణ్యాత్మురాలు మకర సంక్రమణ పుణ్య కాలంలో రెండు సంవత్సరాల క్రితం కన్ను మూసింది..
మకర సంక్రాంతి రోజు మరణం మహా మహులకే రాలేదు..మరి..
నా కెందుకో వీళ్ళంతా కారణ జన్ములనిపిస్తుంది..
వదిన ఆసుపత్రి లోనే రాత్రి వుంది..


తెల్లవారి గోవిందు అనే శిష్యునికి.. భగవంతుడూ.. భాగవతమూ.. భక్తుడూ.. ఒకటే రా.. అని చెబుతున్నారట..
మళ్ళీ స్వల్పంగా ఎటాక్ వచ్చింది..
అయ్య అనే మహా శకం ముగిసింది..భగవంతుడూ..భాగవతం..భక్తుడూ..ఒక్కటేరా..అన్న మాటలు అయ్యగారి చివరి మాటలుగా..
ఈ ప్రపంచానికి మహత్తర సందేశంగా .. మిగిలిపోయాయి..
ధిమి..ధిమి..ధ్వని..సరిద్గిరి గర్భములు తూగ..
నమిత సమ్రంభ హాహాకారములు రేగ..
ఆడెనమ్మా శివుడు..
......................................
...................................
ఎవరైనా చనిపోతే ..
వారి ఆస్థి..పాస్థులకోసం పోట్లాడటం మనం చూశాం..
కానీ..
అయ్యగారు పరమ పదించాక .. అయ్య గారి పాద రక్షలు..ఎవరో పట్టు కెళ్ళారు..
జపం చేసేటప్పుడు లెక్కకోసం వినియోగించే చింతపిక్కలు ఇంకెవరో పట్టుకెళ్ళారు..
ఆయన కళ్ళద్దాలు..చేతి కర్ర.. కూడా భక్తులు ఆయన జ్ఞాపకంగా.. తీసుకున్నారు..
చివరికి .. ఆయన తాగి వదిలేసిన బీడీలనూ.. వదలలేదు..


సత్య సాయి బాబా భజన బృందం వారు భజనలు చేస్తూ .. వెళుతుండగా..
కమ్యూనిస్టు పెద్దలు..ముందు నడుస్తుండగా..కలెక్టరు ..వంటి అధికార గణం ..వినయంగా..అనుసరిస్తుండగా..ఎందరో భక్తులూ..సాహితీ ప్రియులు..అభిమానులూ..కన్నీళ్ళతో.. ఖాళీ అయిన హృదయాలతో..అడుగులు పడక పోయినా .. వేయక తప్పని..స్థితిలో ..వుండగా..
పోలీసుల గౌరవ వందనాల నడుమ..
గౌరవ తుపాకీ కాల్పుల మధ్య..
పుట్టపర్తీ .. అమర్ రహే..'
అన్న నినాదాల మధ్య.. పుట్టపర్తి నారాయణా చార్యులు అనే ఒక మహా కవి ప్రస్థానం ముగిసింది.






మా ఇంట్లో అందరికీ శివతాండవం నోటికి వచ్చు..
ఎవ్వరైనా ఆనందపడుతుంటే..యేమానందము ..భూమీతలమున..అని పరాచికమాదుకోవడం ఒక సరదా..
మా అమ్మ తిట్లు కూడా సంస్కృతాంధ్రాల మిళితమై వుండేవి..
పాడూర్పిశాచీ..అనేది అందులో ఒకటి..
మా అమ్మ గారు రాసిన అంపకాల పాట హృదయాన్ని కదిలించేదిగా వుంటుంది..
మా పెద్దక్కయ్య పెళ్ళికి ఏ పాట రాశారట మా అమ్మ..
మా అమ్మ గారు కూడా కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత..
కానీ మా అమ్మకు మా అయ్య గారిని అనుసరించటమే ఇష్టం..
సీతమ్మవారి అప్పగింతల సన్నివేశాన్ని మా అమ్మ గారు హృద్యంగా ఇలా రాశారు..
కౌసల్యకు సీతమ్మను అప్పగిస్తూ.. జనకుని ఇల్లాలు ఇలా పాడుతుంది..
అమ్మరో..కౌసల్యా.. అతివ సుకుమారియగు..
ఇమ్మహీజాత గైకొమ్మ..వేవేగ..
సమ్మతిగ నీ సుతకు ..సమముగా చూతువని..
నమ్మి మదిలోన మాయమ్మనొప్పించెదను..
అమ్మరో కౌసల్యా..
మా ఇంటిలో వెలుగు..మా కంటిలో పాప..
మాదు హృద్పేటికను మలయు రత్నమ్మూ..
మా మనో రధ ఫలము..మా వంశ గౌరవము..
మీ ఇంటి కనిపెదము.. నెలతరో కోడలిగా..
అమ్మరో.. కౌసల్యా..
మా ఇంట పారాడు మహ లక్ష్మి జానకిని..
మీ ఇంటిలోనుండ ..మేమంపుచుండా..
వేయి కన్నుల గాచి ..వేసరక పోషించి..
చేయి విడువను మనసు ..చేదు మింగినటుండే..
అమ్మరో కౌసల్యా..
పుట్టినప్పటినుంచి..చిట్టిమాటల మనసు..
అట్టే భ్రమియించి మది నానంద పరచీ..
కట్టకడ కెటులైన.కాంతు జేరెడునంచు..
పట్టరాని ముదమ్ము..పరిఢవిల్లేమనమ్మూ..
అమ్మరో కౌసల్యా..
తొలిఝాముననే లేచి..ఇలుదీర్చి..పెద్దలకు
తలవంచి యువనీత..లలిత గతులా..
పులుగడుగు ముత్తెమై..పుట్టువెరుగని సీత..
తలలోని నాల్క వలె మెలగు మీ ఇంటయనీ..
అమ్మరో కౌసల్యా..
ఎన్నేండ్లు పెంచినా..ఎన్ని గోములు పడిన..
కన్న కడుపేయైనగాని ..కడపటికీ..
సన్నుతాంగుని భాను సన్నిభుని పతి గూడి..
కన్నె తానేగునని అనుకొంటి..కనుగొంటీ..
అమ్మ్రో కౌసల్యా..
తొలిప్రాయమున తండ్రి..మలి ప్రాయమున భర్త..
మలి వయసునను సుతుడు.. పడతి కెపుడూ..
కలిగి రక్షింపగా..తులలేని సౌఖ్యాల..
తులతూగునని ధాత..లలనలకు వ్రాసెననీ..
అమ్మరో కౌసల్యా..
అతా మామల ఆజ్ఞ అన్సరించు విధమ్మూ..
బావ మరదుల మాట ..పాటించు విధమూ..
ఇరుగు పొరుగుల వారి నేమరకటంచునే..
నరమరికలను చాల కలవరించితినమ్మా..
అమ్మరో.. కౌసల్యా..
ఆడుబిడ్డల మనసు .. అలరించెడు విధమ్ము..
ఈడువారలగూడి ..యాడు విధమూ..
వాడగల వారలకు ..తోడుగా నగు విధము..
ఈడు లేని విధాన..నేర్పించినానమ్మా..
అమ్మరో ..కౌసల్యా..
జననమొందిన ఇంట..చన్న ఇంటను గూడ..
వినయగా నేడు..తరముల వారికెల్లా..
అనయంబు కీర్తి దెచ్చినదంచు జనులెల్లా..
కనుగొనగ కనులార..అనిపెదము ఈ బాల..
అమ్మరో ..కౌసల్యా..
పసితనపు చాపలము ..వశముగా నేమైన..
కసటు మాటలు బల్కా..కష్టపడబోకూ..
పసిబాలికయే గాని..పడతీ ప్రౌఢాంగనా..
వశవాక్కు గాదమ్మ.. దొసగులను మన్నించీ..
అమ్మరో ..కౌసల్యా..




కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి