20 డిసెం, 2011



"ప్రకృతికో ..మాయకో ..కాక భావనా ప్ర
     పంచ సౌదామినికో ...తపః ప్రభకో..,శూన్య
     మునకో.., యానంద రూపమై మోదమొసగు..
     సాత్విక వ్యక్తికీ నమస్కార శతము.."

    "షాజీ" నుంచీ..

పర్వీన్ సుల్తానా ఒకసారి మా వూరు వచ్చింది..
అయ్యకు ఆహ్వానం ..
అయ్య తో మేమూ అందరం వెళ్ళాం..
బ్రహ్మండంగా పాడింది 
అంటే చాలా చిన్నమాట..

ఆమె తన గానంతో..  
ప్రకృతిని  అత్యంత సుందరంగా 
దృశ్యం గావించింది..

ఆమె అమృతం తాగిందా..
ఇంత మధురంగా పాడుతుంది ..
అని  రాగానుభూతిలో 

మైమరచిపోయేలా  
మంత్ర ముగ్ధులమైపోయాం..

నేనప్పుడు పధ్నాలుగేళ్ళ పిల్లనేమో..
 
పాడుతూ పాడుతూ మధ్యలో ఆపి ..
అదిగో చూడండి.....
చీకటి నిండిన తూరుపు..
మెల్లగా ఓ వెలుగు రేక 
చీకటి ముసుగు తొలగించుకు కన్ను తెరిచింది..
అంటూ మళ్ళీ మమ్మల్ని 
తన వెంట తీసుకు పోయింది..

తన తిర్కాల పాటవంతో..
అదిగో ..
నీలాకాశం ..
చూడండి ..
పక్షులు ఆనందంగా ..
నిర్భయంగా..
పసిపిల్లల్లా ఆనందంగా 
గిరికీలు కొడుతున్నాయి..

మళ్ళీ రాగాలాపన..
మబ్బులు తొలగించుకుంటూ 
పైకొస్తున్న సూర్యుణ్ణి ..
ఆమె కంఠ లాలిత్యంలో మేము దర్శించాం..              
                         
అయ్య ఆమెను చూసి చాలా విచలితులైపోయారు..

ఆనందాశ్రువులు .. 
అయ్యను చూసి మేము ఇంకా పరవశించిపోయాము..

అక్కడ హిందుస్థానీ సంగీతం తెలిసిన 
వాళ్ళు యెవరూ లేరని 
ఆమె భావించినట్లుంది..


కానీ అయ్య ఊరికే వదలరుగా..

ఆమెకు రెండు మూడు ప్రశ్నలు వేసి 
ఆమె తన అన్నేళ్ళ సాధనను 
మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోవలసిన 
అవసరం కల్పించారు..

కానీ అయ్య లోని పాండిత్యం 
సంగీత సాధికారత 
ఊరికే విడిచి పెడతాయా మరి..
ఆమె కడపను ఇప్పటి వరకూ
 గుర్తు పెట్టుకుని వుంటుందని నేను అనుకుంటున్నాను.. 

అయ్య మిద్ది పైన హర్మొనియం వాయిస్తూ.. అన్నమాచార్యులు క్షేత్రయ్య..
కీర్తనలు మైమరచి పాడేవారు..

అదొక భావావేశం.. 

అక్కయ్యలు అందరూ చుట్టూచేరేవారు..
వాళ్ళూ పాడే వాళ్ళు..

రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు స్వరపరచినవి..
తానే స్వరపరచుకున్నవి కొన్ని..

 మగువ తన కేళిక మందిరము వెడలెన్.....  క్షేత్రయ్య..

నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచే చదువూ ..........అన్నమాచార్యులు

నల్లనిమేని నగవూ చూపుల వాడు............అన్నమాచార్యులు

అలరులుకురియగ ఆడెనదే అలకల కులుకుల అలివేల్మంగా..........అన్నమాచార్యులు
అలరులు కురియగ ఆడెనదే  
నాగపద్మిని అక్కయ్య నాట్యం చేసేది..
అబ్బ.. మా ఇల్లొక ఆనందారామం ..

అయ్య కడప మోచంపేట శివాలయంలో 
గురువారం గురువారం 
సాయీ సచ్చరిత్ర మరాఠీ పుస్తకం చదివి 
తెలుగులో అనువదించి పురాణం చెప్పేవారు..

పురాణం తరువాత
 హార్మోనియం.. తబలా..వాయిస్తూ భజనలు..
ఆ చుట్టుపక్కల వారు అందరూ 
అయ్య భక్తి ప్రవాహంలో 
మునకలేయటానికి 
సాయంకాలం కోసం ఆశగా 
ఎదురుచూసే వారంటే అతిశయోక్తి కాదేమో..


కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి