14 మే, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు--పరమాత్మునికి పాద్యం --పుట్టపర్తి అనూరాధ




ఇంటిపేర్లని.. చదవడం.. పరిశోధించటం ..
భాషాశాస్త్రం లో ఒక భాగం దీన్ని 
onomastics..
onomotology అంటారు.
దీనిపై తెలుగులో 
చాలా పుస్తకాలువచ్చాయి..
 
కొద్ది కాలం క్రితమే ..
నాగార్జున యూనివర్సిటీ నుంచీ ..
పదవీ విరమణ చేసిన ప్రముఖ సాహితీవేత్త ..
ఆచార్య యార్లగడ్డ బాలగంగా ధర రావు గారు 'మాటతీరు ' అనే ఆణిముత్యాన్ని ..
తెలుగు వారికి అందించారు.
 
ఇందులో ..
మనం నిత్యం వాడే పదాల వెనుక చరిత్రని ...
అవి లోక వ్యవహారంలో స్థిరపడిన వైనాన్నీ ..


మనకి పరిచయం చేసారు.
 
ప్రతి మాటవెనుక గల కథని ..
ఆసక్తి దాయకంగా చెబుతుంటే..
 
మనం నిత్యం వాడే ..
పదాల కడుపులో ఇంతుందా ..?
అని ముక్కున వేలేసుకోవడం ..
మన వంతవుతుంది.
 
ఆంగ్ల పదం టవల్.. 
మనకు తువ్వాలయింది..
సంస్కృతపదం యువన్ ని ..
మనమీనాడు జవాను గా.. 
పిలుచుకుంటున్నాం.
 
కొడుకు-కోడలు..
కూలి-నాలి..
ఏండ్లు-పూండ్లు ..
 
ఇలా ..
రెండువందల పై చిలుకు పదాల పునాదులు ..
మనకు ప్రత్యక్షమౌతాయి..
భాషా జిజ్ఞాసువులకీ పుస్తకం పండుగే..


ఇక వీరి మరో పరిశోధన "నామ విజ్ఞానము" 2002 ,
 ఇంటిపేర్లు..(2001)
బుర్రా.. బొడ్డు..బొల్లి ..బొల్లిముంత..
మాకినేని ..దొడ్డపనేని ..రెంటాల ..
వెలగా..లావు..గోలి..గోళ్ళమూడి..
కొణిజేటి..కొంగర..ఆవుల ..అద్దంకి..
చూశారా ..
ఎన్ని ఇంటిపేర్లో..

సాని కి మూలం రెండు విధాలు: 
1) సాహిణి - అంటే సైన్యాధికారి. 
ఉత్తర భారతంలో సహానీ కూడా దీనికి మారు రూపం.
 2) స్వామిని - అంటే స్వామికి స్త్రీ లింగం.

కృష్ణారావుగారు ఏదో అశ్లీలత ఉందని ..
తమ ఇంటి పేరుని ముట్నూరు గా మార్చుకున్నా, ముట్లూరి కి మూలం వేరు - పనిముట్టు లోని ముట్టు, అంటే సాధనం.

అప్పాజోస్యుల, వల్లభజోస్యుల 
పేర్లలో ఉన్నది వారి ఒకప్పటి వృత్తి - 
జోస్యం చెప్పడం.

ఈ విషయాలు.., 
మన పేర్ల మీద పరిశోధన చేసిన ..
యార్లగడ్డ బాలగంగాధరరావు గారి పుస్తకాలలో [1] [2] ఉన్నాయి.


శారదా కళాశాల,విజయవాడ వారు ..
పుట్టపర్తి వారి సాహితీ స్మృత్యంకమును..
1993 లో వేసారు.
ఇందులో
వీరు ....
అయ్య భక్తి సాహిత్యానికి పరాకాష్టయైన 
పాద్యము ను గురించి
 కమనీయ వ్యాసాన్ని వ్రాసారు.
ఇందులో 
అయ్య భక్తి వేదనా మధనాన్ని 
చక్కగా ఆవిష్కరించారు.
చదవండి....




పరమాత్మకు పాద్యము


డాక్టర్ యార్లగడ్డ బాలగంగాధరరావు.
MAPhd.
Head of the Department of telugu and foriegn languages
నాగార్జున యూనివర్సిటీ నాగార్జున నగర్.
 
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు సృజియించిన 
కావ్య పరంపరలో 
భక్తి భావలహరిదే పైచేయి 
కవితనిండా భక్తి భావస్పూర్తి 
ప్రస్ఫుటంగా కనిపిస్తుంది..
వారి  కవితకు భక్త్యావేశమే భూమిక ..
 
శ్రీ వైష్ణవ  సంప్రదాయంలో పుట్టి.. పెరిగిన...
ఆచార్యులవారి అంతరంగం అంతా.
భక్త్యావేశంతోనూ ...
శరణాగతి వేదనతోనూ ..
పూర్తిగా నిండిపోయింది..!

భక్తి దారిద్ర్యాన్ని ..
అరక్షణమైనా అనుభవించలేని..
జీవునివేదన ఇది..!
 

పలుభాషలలోని ప్రవేశ ప్రావీణ్యాలు ..
వారిని పరి పరి విధాల ఆలోచింపజేసాయి..!
 
హిందీ కవుల రచనలు ..
వారి హృదయాన్ని ఉర్రూతలూగించాయి..!





మనస్సు మెదలదు ..గన్నులు గనవు ..పలుకు
బయలుదేరదు ..ఉపచార వాక్యములకు..
బ్రభలు చల్లు ..నివాత దీపంబునీవు..!!
మోహనంబైన ముగ్ధ పూజ నాది..!!



మరాఠీ సంత్ కవుల భావాలు ..
వారిని కదలించివేసాయి..

శ్రీ వైష్ణవ  సంప్రదాయంలోని ..
శరణాగతి ప్రవృత్తి ..
వారిని ఉక్కిరి బిక్కిరి చేసింది..
అనంత కోటి భక్తి భావాల సంగమ క్షేత్రంలా..
వారి హృదయం నిండిపోయింది..!!



  
నేననెడు భావమున దెగనీల్గిపోవు..
శిరము వంచితి గురుదేవు చరణసీమ..!
జేరడేసి కన్నీరు రాల్చితిని నాదు..
బ్రదుకు గూలిన యొక బీదవాడు వోలె..!


ఎన్నెన్నో భక్తి సంప్రదాయాలను ..
వారి మేధస్సు పండించుకుంది..
ఆ సంస్కార భాసుర మేధా సముద్రమే ...
వివిధ భక్తి వాహినులను..
కావ్య సంసారం లోకి సారించింది..
భాగవతం ..

తొమ్మిది రకా భక్తి మార్గాలను 
సూచించింది. .


ఎవరి స్థాయిని బట్టి వారు..
ఆయా మార్గాలలో ప్రయాణించి..
ఆ జగన్నాటక సూత్రధారి యైన ..
పరమేశ్వరుని సాక్షాత్కారం చేసుకోవచ్చు..
అని భాగవతం ప్రబోధించింది..!

అలాంటి మార్గాల్లో ..
సుగమాతి సుగమమైనది..
శరణాగతి అని..
 వైష్ణవ సంప్రదాయం కంఠోక్తిగా సూచిస్తోంది..!
 
"కలో స్మరణాన్ముక్తిః"..
అని ఆగమశాస్త్రాలు సూచించాయి..
కాలానుగుణంగా ..
ధర్మానుబధ్ధంగా ..
శక్తి సామర్థ్యాలరీత్యా ..
కలియుగంలో ..
కేవలం ..
భగవన్నామ స్మరణ మాత్రంగానే..
జీవకోటి తరించవచ్చని గ్రహించవచ్చు..!

ఆనంద రూపుడగు పరమాత్మనే..
సర్వలోక నాయకునిగ ..
నియామకునిగ సంభావించి ..
అట్టి సాత్విక మూర్తికి ..
నమస్కారశతము లర్పించుచు ..
అహంకారమును వీడి.., 
సాత్విక త్యాగమును వహించుటయే ..
భక్తిగ నిరూపించవచ్చు..!
మనస్సును పరిపక్వం చేసే శక్తి ..
భక్తికి పుష్కలంగా వుంది..

హృదయంతో ..
భగవంతుని దర్శించటానికి చేసే ప్రయత్నాన్నే..
 భక్తిగా అభివర్ణించవచ్చు..
జ్ఞాన యోగ కర్మ యోగాలకన్నా..
భక్తి యోగం ..
చాలా విలక్షణమైంది.. 
విశిష్టమైంది..
 
అందుకే..
ప్రాచీన తత్వ వేత్తలందరు..
ముక్తకంఠంతో ..
"భక్తిరేవ గరీయసి "..
అన్నారు ..


అలాంటి భక్తి సామ్రాజ్జ్యాన్ని..
కైవసం చేసుకోవటంలో..
శ్రీ ఆచార్యులవారు అహర్నిశలు కృషి సల్పారు..

భాగవత కథా మధనం సాగించారు..
వ్యాఖ్యానాలను విశ్లేషించారు..
వివిధ మతాచార్యుల..
వ్యాఖ్యా నిర్వచన పరిమళాలను..
ఆఘ్రాణించారు..!


అరవిందుల తాత్విక చింతనను..
ఆపోసన పట్టారు. 
నిష్కళంకమైన ...
భగవదన్వేషణ వ్యాసంగమే భక్తి యోగం.
అన్న స్వామి వివేకానంద నిర్వచనం ..
శ్రీ ఆచార్యుల వారి మనసున నాటుకుంది.. 


శ్రీ నారాయణాచార్యుల వారి రచనలలో..
భక్తి భావం వివిధ రూపాలలో..
పాఠకునికి దర్శనమిస్తుంది..
సహృదయులకు ..
ఆనందాన్ని ..
ఆలోచనను రేకెత్తిస్తుంది..!

పుట్టపర్తి వారి రచనలలోని..
భక్తి మార్గాన్ని విశ్లేషించటంలో ..
విజ్ఞత చాలా అవసరం ..
వారి రచనా ప్రపంచంలోని భక్తి కేవలం ..
యేదో ఒక సంప్రదాయానికి కట్టుబడేది కాదు..
ఆయన భక్తి ప్రపత్తి..
నిరంతరం దేదీప్యమానమగు..
జగన్నాయక రూపగుణ ..
విశేష వర్ణనలతో పాటు వేదనా భరితంగా..
పాఠకునికి దర్శనమిస్తుంది...!!


వారి రచనలలో ..
నారదాది మహామునులు నిర్వచించిన..
దాస ..శ్రవణ ..సఖ్య ..వాత్సల్య ..
కాంతా.. మధుర ..శాంతాది..
 భక్తులు పుష్కలంగా కనిపిస్తాయి ..!


వారి రచనలు పరిశీలించినపుడు మాత్రం ..
ఒక్క విషయం స్పష్టంగా గోచరిస్తుంది..
ఆచార్యుల వారి రచనలు ..
భక్తితోనే ప్రారంభమై ..
భక్తితోనే పరిసమాప్తమైనాయి..
 
వారి మొదటి రచన ..
పెనుగొండ లక్ష్మితో ప్రారంభమైంది ..
శ్రీనివాస ప్రబంధంతో ముగిసింది..!

భక్తి కావ్యాలను పరిశీలించే మార్గంలో ..
పాద్యము ..
విభూతి శతకం ..
వేదనా శతకం..
సాక్షాత్కారం ..
పండరీ భాగవతం ..
శివతాండవం..
జనప్రియ రామాయణం..
శ్రీనివాస ప్రబంధాలను పలకరించాల్సిందే ..!


ఆయా కావ్యాలలోని ..
భావ పరంపరను 
అధ్యయనం చేయటం ద్వారా.. 
విలక్షణమైన పరిపక్వత ..
మనస్సును ఆకర్షిస్తుంది..


కావ్యాలన్నింటిలోనూ..
అనున్యూతంగా ..
వివిధ భక్తి భావాలు మనకు గోచరిస్తాయి..!!

ఆచార్యుల వారి ఆది కావ్యమైన ..
పెనుగొండలక్ష్మి లోని ప్రార్థన పద్యమే ..
సృజన కర్త యైన పరమేశ్వరుని ..
అన్వేషణతో ఆరంభమైంది. 

భగవంతుని ప్రేమాధీశ్వరునిగ 
కవి సంభావించినాడు...!!
మరియు..
అల్పమైన మా మనస్సులకు..
 నీ లీలా విలాసముల ..
విన్యాసము బోధపడదనియు..

నీకు ప్రతీకయైన ఈ విశ్వమూర్తిని గూర్చి 
అన్వేషించిన ..
మా మానవ మేధస్సునకు 
సమాధానము లభించుట 
చాలా కష్ట మనియు నిశ్చయించుకొని 


తుదకు ..
ఆ భగవానుని..
మహిమాన్విత గుణాధిక్యమనే..
శరణువేడినాడు..


నీ రహస్యమును నాకు అర్థమగునట్లు..
బోధించుమని వేడినాడు..
తుదకు ..
ఈ ధరాచక్రమంతయు..
నీకు కైమోడ్పు చేయునని ప్రశంసించినాడు.. 


షాజీ కావ్యంలో ..


పరమాత్మను..
ఆనంద స్వరూపునిగ సంభావించి..
నమస్కార శత మందించినాడు..
 

ఆచార్యులవారు రచించిన పాద్యము..
వారి భక్తి భావ.. 
పరమావధికి పతాక..
దీనిని మూడుభాగములుగ విభజింపవచ్చు.
 

పాద్యము..
వేదనాశతకము..
విభూతి శతకము..
 

ఈ శతకాలలోని ప్రతి పద్యం..
 ఒక అనర్ఘ రత్నంగా భాసిస్తుంది. 


వారి మనః క్షేత్రంలో పాదుకున్న 
భక్తి భావలత ..
మొగ్గ తొడిగి.. 
వికసించి.. 
పరిమళించిన భావాలకు...
పాద్యం ఉదాహరణ ..


ఈ విషయాన్ని వారి మాటల్లోనే గమనించండి.







"నా గురువు పరమేశ్వరుడు...
అతడిప్పుడున్నాడు..లేడు..
దివ్యభావాలైన ..

ప్రేమా ..భక్తి ..
మొదలైన వానికి నశ్వరత్వమూ ..భౌతిక మాలిన్యమూ.. లేనట్లే 
వాని లక్ష్యాలకు కూడా లేవు. 
ఈ సత్యాన్ని గమనించిన వారు..
 అనుభవించిన వారు..
 ఋషులు..కవులు..
 
నేనీ గ్రంధం వ్రాయునాటికి ..
మరాఠీలో సంత సాహిత్యాన్ని ..
ఎక్కువగా చదువుతూ ఉండింది నిజము ..
ఆ పోకడలే దీని రచనకు దోహదాలు.. 

సృష్టి మాది ..
అనుభవించే రసికత ..
సహృదయులది. .
ఇప్పటికింతే..!!



అని ఆచార్యులవారు 
పాద్యానికి పీఠిక కైసేసినారు.
 
పాద్యంలోని ప్రతి పద్యం ..
భౌతిక మాలిన్యం లేని దివ్యానంద గుటికయే.. ఆచార్యులవారు చెప్పినట్లు..
ఈ కావ్యంలో ..
వారి కవిత్వం మంచి పాకాన పడింది..!


పరిణత సుమనోభావవల్లరి..
 ప్రతి పద్యంలో మనకి దర్శనమిస్తుంది.. లీలామానుషవిగ్రహుడైన ..
శ్రీమన్నారాయణుడు ..
దీనిలో యోగిపుంగవుడుగ ..
ఆచార్యులవారికి దర్శనమిచ్చినాడు. 
అట్టి పరమాత్మనే కవి యోగిరూపున దర్శించి

మా గురుస్వామి ..!నా పాలి మధురమూర్తి ..!
వచ్చినాడమ్మ ..!మా ఇంటి వరకు నేడు..!
 

అని భగవానుని భావవీధిలో దర్శించి ..
మనః పీఠంపై అధిష్టింపజేసుకున్నారు..
ఆ కనిపించిన  ఋషి ..
తన ఉపాస్య దైవమైన శ్రీమన్నారాయణుడే..


ఆయనను చూచిన కవికి..
అవ్యాజానురాగము..
ఆనందము.. మిక్కుటమైనవి..


కలవలె హఠాత్తుగ వచ్చి..
 కనులముందు నిలిచిన ..
దివ్య సుందర విగ్రహుని చూచిన..
కవి సంతోషమునకు ..
అవధులు లేక పోయినవి..


 శ్రీ మన్నారాయణుని దర్శనమును కోరుచు.. చిరకాలము గడిపిన ఆయన ఆవేదన..
ఈ క్రింది పద్యంలో తొంగిచూస్తూంది....

 




ఆయువంతయుగూడ ..నిరాశతోడ
గడచినది ..శుభాకాంక్ష యెన్నడును లేదు..
నా ప్రభూ..! నీవు వచ్చుట నమ్మలేను..
పుణ్యములపంట..!నమ్మక పోవలేను..!


మానవ సహజసిధ్ధమైన ..
అస్తి..నాస్తి ..విచికిత్స ..
ఈ పద్యంలో ప్రస్ఫుటంగా క ని పిస్తుంది.. !

వచ్చినది.. 
సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ..
అని కవికి తెలుసు ..


కానీ ..
ఆ స్వామి యీనాడు ..
అతిధివలె ..
కవి ఇంటికి విచ్చేసినాడు. 
కలియుగంలో విజ్ఞులందరు విన్నదే..

ఐనా ..
కవి ముందు ...
మధురమూర్తి ..ముగ్ధమనోహరంగా.. నిలబడగానే 
కవికి మానవసహజమైన అనుమానం..
మళ్ళీ తలెత్తింది..

నా ప్రభూ ..! 
నీ ఆగమనాన్ని నేను నమ్మలేను..
కాని ..
నా పుణ్యాల పంటలైన నీ రాకను..
నేను నమ్మకుండా యెలా వుండగలనని..??

సంశయ పూర్వక సంబోధనము..
 గావించుకుంటాడు. కవి..
 
పురాణ కాలపు ..
గజేంద్రుని సంశయమే కవికి కల్గింది..

వెనువెంటనే కవి హృదయం..
భగవదన్వేషణ ప్రారంభించింది.. 
తన ఉనికితో పాటూ ..
భగవానుని అస్తిత్వాన్ని గుర్తించింది..
హృదయం తన అల్పత్వాన్ని గమనించింది..
తన వేదనను..
పరమాత్మ ముందు ప్రకటించుకుంటూ ..
నా కలుషములు గొలువ.. మానములు లేవు..!!
నా వ్యధల నెరిగ్మిచు ..వాఙ్మయము లేదు..!!
నా కనుల నీరు నిల్వ.. సంద్రములు లేవు..!!
నన్ను రక్షింపుమని పల్క.. నాల్క లేదు..!!



 అని కవి హృదయం ..
ఆవేదన చెందుతుంది..
నా కర్మానుసారం..
యెన్నెన్నో జన్మలనెత్తి..
యీనాటికి కర్మ విపాక ..
 పరిసమాప్తి నొందించుకొనుటకై ..
యీ మానవ జన్మను ..
నీ దయాగుణ విశేషముచే పొందితిని..!!

నేటినుండి నేను ..
నీకు దాసానుదాసుడనై ఉందును..
ఇక పిదప ..
నాకిక యీ జన్మ వలదు..
సంసారార్ణవ మగ్నుడనైన..
నా కలుషములను ..
వ్యధలను ..
కన్నీటిని ..
కొలుచుటకు నేటి కొలపాత్రలేవియు చాలనంతటి.. అపచారము చేసిన వాడనని..

కవి గ్రహించి పశ్చాత్తప్తుడగుట..
ఇందు గమనింపదగును..!


నన్ను రక్షింపుమని ఆపన్నుడైన కవి..
మనసారగ ఆ పరంజ్యోతి స్వరూపుడైన..
పరమేశ్వరుని ధ్యానించుటలో..
 మిక్కిలి వినయ వినమిత భావము ..
ప్రదర్శితమైనది. 

భగవానుని వద్ద ..
దాసదాసత్వము వహించుట ...
సుగుణ సుధీమణికి అమూల్యాభరణము.
ముగ్ధ మోహనమైన పూజ ఆచరించే కవికి..
 
"నేను నేనెడు భావమున గెగనీల్గిపోవు
శిరము వంచితి గురుదేవు చరణసీమ.."
 
అహంకారం నశించింది. 
స్వత్వమైన భావం వెనుదిరిగిపోయింది. 
సాత్వికగుణం ..
ఆయన హృదయాన్ని ఆవరించింది. 


వెనువెంటనే ఆయనకు..
ఆ శ్రీమన్నారాయణుని ..
చరణారవింద సౌందర్య దీధితి క ని  పించింది....
సుఖ దుఃఖానుభవాలమధ్య ..
కవికి ఒక విచిత్ర భావం పొడసూపింది..


అంతలో ..


"పరమ పూతంబు గురుదేవు చరణసీమ ..
రాలియుంటిని .. జీర్ణ పత్రమ్ము వోలె.."

ననుకుంటూ ....
కవి సాత్విక త్యాగంతో ..
భగవంతుని యెడ తన్మయీభావం పొంది..
ఆనందాశ్రువుల తోనే పరమాత్మకు ..

పాద్యము సమర్పించాడు..
 

కవికిప్పుడు అహంకారము తొలగినది..
తన సమస్తము భగవదర్పిత మనెడి..

 భావన.. ప్రస్ఫుటమైనది.
గురుదేవుని కరుణాకటాక్ష వీక్షణ ఫలముగ..
కవికి.. భగవానుని.. 
పాదపద్మారాధన చింతన ఆరంభమైనది.. 
కనులార.. ఆయన జగన్నాయకుని ..
పదకమల సౌందర్యమును చూడగల్గినాడు..
సాష్టాంగపడినాడు..
భక్తి భావమును నిలపినాడు..
అంతఃకరణమును పవిత్రీకరించుకొనినాడు. 

పరమాత్మ ..జీవాత్మల..
సంబంధ బాంధవ్యములను గుర్తించినాడు..
ఆ అవ్యాజానురాగ ఆనందమును..
తృప్తిగ అనుభవించుట కలవాటుపడినాడు..

ఆ పరమానందమును వీడలేని కవి..
మరల తననిలా ..
భగవంతుని ముందు ..
సంభావించటం ..
పాఠకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..!!



 

నేనొక పూలమాలనయి .. 
నీ చరణాంబుజ సీమ బడి.., య
మ్లానములైన  వాసనలు రాలిచి 
పోవలెనంచు గోరుకొ
న్నాను ప్రభూ..!! 
దురంత తమ సాంతరితంబగు జీవితంబుతో..
గానని కోర్తికై గనులు కాయలు గాయగ గాచియుండెదన్.."
వేదనాశతకం.. 3 పద్యాలు..

ఆ జగజ్జనకుని ముందు ..
పుత్రునివలె మోకరిల్లిన కవికి ..
యింకను సంతృప్తి లేదు.
 
ఆయన పాదముల నాశ్రయించిన..
ఆనందమునకన్న మిన్నయైనదేదియో ....
పొందవలెననెడి తపన ..
కవిలో మిక్కుటముగ క ని  పించును..
 
ఆ ప్రభుని పాదాలచెంత నుండుటకన్న ..
పూలదండలోని పూవై ..
తన సువాసనలను స్వామి కర్పించుటకన్న ..
ధన్యత మరొక్కటి లేదనియు ..
అట్టి త్యాగమే మేల్తరమనియు..
విశ్వసించిన 
 ఈ జీవిత పర్యంతం సాధ్యం కాని కోరిక..
ఆ భగవత్కృపా కటాక్షం వలన తప్పక సాధ్యమౌతుందని ఆశించెను..

ఆ ఆశయ సిధ్ధికై ..
నశ్వరమైనది ..విలువలేనిదియైన ..
శరీరమునకన్న ..
పూదండగ నుండుటయే వేయిరెట్లు గొప్పదని..
 కవి సంభావించి.. దానికై పరితపించినాడు.
ప్రాణహీన మైన శరీరమునకు ..
విలువలేదు కావున ..
పూవువలె ..పూదండవలె ..
భగవానుని పదకమలముల చెంత ..
బ్రతుకుటయే శ్రేయమని ..
ఆయన ప్రగాఢముగ విశ్వసించినాడు.
మరియు కవి భగవత్పరీక్షకు గురియై ..
తన నిత్యసత్యానుభవమునేరీతిగ ..
పత్యక్షీకరించెనో గమనించదగును. 

 నీవు పరీక్ష సేసెద్ వనేక విధంబుల నన్ను,నీ పరీ
క్షావిధి కాగలేక కలుషంబున నిందమొనర్తు నిన్ను, గా

నీ వెనువెంటనే యెడద నిల్చును నీ దయ వానకాళువై
పోవును గన్నులందు బడిపోదును కూలిన పెద్ద వృక్షమై"..
వేదనాశతకం 22ప
 
భగవానుని పరీక్ష కఠోరమైనది
గత కాలపు గజేంద్రుని కథయే ..

దీనికి పరమ ప్రమాణము.
ఆయన 

"అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ"..
అనే వరకు  భక్తుని ఆర్తిని ....

పరీక్షించటంలోనే నిమగ్నమై వుంటాడు..
 

భక్తుని పరీక్షించడానికి ..
ఉత్తరరూపం పరిరక్షణకార్యం.
భగవానునిపై మనసు నిలపటానికి ..

యెన్నెన్నో విఘ్నాలు ..
తామరతంపరగా వస్తాయి..
 

ఆ పరీక్షలన్నీ తట్టుకొనే హృదయానికే..
పరంజ్యోతి తత్వం ..
పూర్తిగ అవగతమౌతుంది..
 

ఆ పరీక్షలకు తట్టుకోలేని ..
సాధారణహృదయం అసహనానికి గురౌతుంది..
వెనువెంటనే ..

భగవానునిపై ఏహ్యభావం యేర్పడుతుంది.
 

తదాది ..
భగవానుని దూషించడం ..
ఆరంభమౌతుంది.
పిదప ..

మనస్సుకు నిజానందం ఋజువర్తనం 
క్షణకాలంలో కల్గుతాయి.
అప్పుడే ..

పశ్చాత్తాపం ప్రారంభమౌతుంది.
పశ్చాత్తప్త హృదయానికిక ప్రాయశ్చిత్తం లేదు.
తన తప్పును గుర్తించిన జీవి 

భగవద్దూషణ చేశానని గమనించి 
మరల దుఃఖితమతియై
అవ్యాజ భక్తిభావాన్ని ఆశ్రయించి 

తుదకు భగవంతునియందు
తనకు తానుగ 

తాదాత్మ్య రూపాన్ని పొందుతాడు.

ఈ సత్యమైన భాగవత ధర్మాన్నే 

కవితాననుభవించి 
పాఠకుని కూడ 
తన కవితా స్రవంతి ద్వారా 
అనుభవింపజేశాడు.
 

తన జీవిత చరమాంకం వరకు 
ఆచార్యుల వారు 
నలభై కోట్ల 
నారాయణాష్టాక్షరీ మహా మంత్ర జపం 
చేశారని వారి సన్నిహితుల ద్వారా 
తెలుసుకున్నాను. 

ఆయనది 
సఖ్య భక్తి
దాసభక్తి 
మధురభక్తి యని వింగడించలేము.
 
వారు 
తమ జీవిత చరమాంకంలో 
భగవంతుడు-భాగవతం-భక్తుడు ..ఒక్కరే ..
నని పల్కిన తుది పల్కుల లోని ..
ఆంతర్యం అంతా ....
వారి భాగవతాను భూతియే ..
తప్ప అన్యం కాదని దర్శింపగలుగుతాము..






కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి