18 అక్టో, 2012

పుట్టపర్తి భక్తి కవిత్వం డా. వఝ్ఝల రంగాచార్య








వఝ్ఝల రంగాచార్యులు గారు 
పుట్టపర్తి వారి శివతాండవం పై PhD చేసారు
భౌతిక సిధ్ధాంత పరంగా 
నిరూపించే ప్రయత్నం చేసారట
వారు వ్రాసినదే ఈ వ్యాసం

పుట్టపర్తి వారి భక్తి తత్వపు నాడిని వీరు పట్టుకోగలిగారని నాకనిపించింది
మా అయ్యగారు రచించిన పాద్యం
తీవ్ర శరణాగతి భావనతో తల్లడిల్లిన భావ పరంపర 

ఆయువంతయు గూడ నిరాశతోడ

గడచినది శుభకాంక్ష యెన్నడును లేదు
నా ప్రభూ నీవు వచ్చుట నమ్మలేను
పుణ్యముల పంట నమ్మక పోవలేను 

ఆశ నిరాశలు ప్రేమ విరహం కోపం పాదాక్రాంతత

ఇలా..
ఎన్నో..

నా కలుషములు గొలువ మానములు లేవు

నా వ్యధల నెరిగించు వాఙ్మయము లేదు
నా కనుల నీరు నిల్వ సంద్రములు లేవు
నన్ను రక్షింపుమని పల్క నాల్క లేదు..

దాశరధీ శ తక కారుడ


చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్


చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ


జేసిన నేరముల్ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్యయయ్య 

నీ


దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. 



















ఏ పరమేష్టి కుంచె రచియించును
లోకమనూహ్య సుందరం
బా పరమేష్టి సర్వ నిగమౌఘ విధిజ్ఞుడు
నీదు పాల ని
ర్వాసితపాప..! తాపృధుక భావమువాడట
యెవ్వరింక దే
వా..! పరిపక్వ బుధ్ధులు..!ఖగాంగ..!
జగజ్జన జన్మ తారణా

(జనప్రియ రామాయణము నుండి)


                    పుట్టపర్తి భక్తి కవిత్వం
                   డా. వఝ్ఝల రంగాచార్య

శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు
శ్రీవైష్ణవ కుటుంబం నుంచీ ఎదిగి వచ్చినవారు. 
అయినా 
అనాదిగా భారతదేశంలో వర్ధిల్లిన 
భక్తి సంప్రదాయాలను 
ఆకళింపు చేసుకోవడమే గాకుండా 
ఆయా కవులు రచించిన 
భక్తి కావ్యాలకు స్పందించి 
కవితలు రచించారు 

ప్రవక్తలు ..
యోగులు ..
సిధ్ధ పురుషుల ..
జీవితానుభవాలను చదివి 
వారి వలె జీవించాలని ప్రయత్నించినవారు. 

కుముద్వతీ నది ప్రక్కన ఆశ్రమం నిర్మించుకొని 
తపస్సు చేసినవారు. 
తులసీదాసు రామాయణమును 
నిత్య పారాయణంగా చేసుకొని 
తులసివలె హరిహరా భేదమును 
తన సాహిత్యమున ప్రదర్శించిన వారు. 

హరి హరులను 
శ్రీరామచంద్రునిలో ఒకటిగా దర్శించిన వారు. శివతాండవంలో 
శివుని చైతన్యానికి ప్రతీకగా కల్పించినా 
పరదైవంగా విష్ణుమూర్తినే ఆరాధించినవారు

బహుమూర్తి ఉపాసన 
బహుమంత్రోపాసన ఆచరించినను 
ఆయన భక్తి కావ్యాలలో అధికంగా కానవచ్చేది 
శరణాగతి ధర్మం. 
పరదైవంగా హరినే విశ్వసించడం 

ఆయన  మొట్టమొదటి కావ్యం 
పెనుగొండలక్ష్మి లోని మొదటి పద్యం 
భగవంతుని ప్రేమాధీశ్వరుడనియు 
నిరంకుశ స్వాతంత్రయము గలవాడనియు చెప్పి 
ఆత్మ న్యూనతా భావం ప్రకటించింది.


"ఏమో ఈ వికటంపు రూపకము అందేయర్థ ముత్పన్నమై
ప్రేమాధీశ్వరు నిండు కన్నులకు దృప్తిన్ గూర్చునో హేతువై
మో మా యాత్మల కందరాదు వెడయూర్పుల్ జిమ్మి నిర్వేద ధా
రా మాంద్యమ్మున మోకరిల్లు మతియెల్లన్ యోచనా సంగతిన్"


సృష్టిని గూర్చి 
సృష్టించిన పరమేశ్వరుని గూర్చిన 
ఆలోచనతో ప్రారంభమై 
అతర్వాత పద్యములలో 
ఆత్మలు మాయాధీనములని 
వాటి ఆలోచనాశక్తి పరిమితమని చెప్పబడినది. 

ఈ సృష్టిని గూర్చి 
దాని స్వభావమును గూర్చి 
శోధించిన మతి 
తన అసహాయతను ప్రకటించింది. 
దైవమునే శరణము వేడింది. 
పెనుగొండలక్ష్మిలోని నాలుగవ పద్యము 
ఈ భావమును స్పష్టంగా ప్రకటించింది.

"నాకేమీ తోచదు. 
బుధ్ధీంద్రియ మంతరించినది యో స్వామీ భవన్మానసాంబుధి విద్యుల్లత లెట్లు వోయినను వోవున్ నిల్పు వాడెవ్వండు 
ధరాచక్రము నీకై మొగిచి యుండున్ 
సృష్టి సంక్రీడలున్"

అని 
ఈ సృష్టి యంతయు  పరమేశ్వరుని అధీనమని 
జీవుని ఆలోచన పరిమితము 
భగవంతుని లీలలు అపరిమితము లని 
జీవ జాలమంతయు 
అతనికి లోబడి యుండునని వర్ణింపబడినది.

ఈ విధముగా 
పుట్టపర్తి సృజనాత్మక సాహిత్య ప్రారంభమే 
భగవంతుని మహిమాధిక్యమును వర్ణించి 
అతని శరణు వేడుటయే జీవధర్మమని సూచించినట్లయినది

అనంతమైన కాలము 
నారాయణ స్వరూపికి చెప్పిన పద్యము విచిత్రమైనది.

"కనులు విప్పని ఈ యోగి కంఠమందు
చిలుక సాలను తులసి పేరులను గూర్చి
ప్రతిదినము పూజలొనరించు ప్రకృతి లక్ష్మి
యేమొ ఆ చిట్టి తల్లికేనోము కలదో"

పై పద్యమును 
'కనులు విప్పని యోగీ"
 అనుట వలన 
యోగ నిద్రా పరవశుడైన నారాయణ మూర్తి 
స్వరూపము స్ఫురించుచున్నది. 

అట్టి యోగి కంఠమున ప్రకృతి లక్ష్మి
 'చిలుక వరసలూ అను తులసి మాలతో అర్చించుచున్నదట. 

అనగా జీవుల నుధ్ధరించుటకై 
మాతృమూర్తి యైన లక్ష్మీదేవి 
భగవంతునికి పురుషకారము చేయుచున్నదను 
శ్రీ వైష్ణవ సంప్రదాయ రహస్య మిచ్చట సూచించబడుతున్నది. 

"ఆ చిట్టి తల్లికే నోముగలదో"
 అనుటవలన 
గోదా శ్రీ రంగనాధుల కధనము గూడ 
స్ఫురించుచున్నది.

కనులు విప్పిన యోగి శ్రీ రంగనాధుడు. 
శేషతల్పము పై శయనించువాడు. 
శేషుడు కాలస్వరూపము 
ఆ కాలస్వరూపము నధిష్టించిన పరమాత్మ 
శ్రీ రంగనాధుడు 

ఆ రంగనాధుని భర్తగా వరించి 
తులసీమాలలు సమ్ర్పించినది గోదాదేవి 
ఆమె ఈ విధముగా జీవులకు మార్గదర్శకమైనది. అందులకే 'చిలుక సాలూ'
 అను పదబంధము 
జీవ పరంపరను 
వ్యక్తము చేయుచున్నదని ఊహించుట. 


"ఎల్లే ఇళఙ్కిళయే ఇన్న మురఙ్గుదియో" 
అనెడి తిరుప్పావై పాశురమున 
గోపికను చిలుకగా సంబోధించుటయున్నది. 
ఈ సంప్రదాయ ప్రభావమే 
పుట్టపర్తి భక్తి కవిత్వమున కాలంబనము.

పుట్టపర్తి అష్టాక్షరీమంత్ర పారాయణము 
కోటానుకోట్లు చేసిరి. 
ఆ నారాయణమూర్తి స్వరూపమును 
యోగి రూపముగా భావించి ఆరాధించుట 
'పాద్యము' లో కని పిస్తుంది.

 షాజీ కావ్యంలో 
'ఆనందరూపమై మోదమొసగు 
సాత్విక వ్యక్తికి నమస్కార శతము' అని

"విషుల్ వ్యాప్తౌ" 
అని అంతట వ్యాపించిన విష్నుమూర్తిని 
ఆనందరూపునిగ 
ఆనందప్రదాతగ భావించుట చూడవచ్చును.

సాధారణ మానవుల సంకల్పములు 
పరమాత్మ శక్తి ముందు పని చేయవని
 "ఎదిరి వచ్చిన శక్తులన్నింటిని మింగి 
ఆ పరాత్పరు తలపు నాట్యంబులాడే"
అని భగవదాధిక్యమును ప్రకటించెను

"వేదనా శతకము" లో 
జీవగతమైన వేదన వెల్లడింపబడింది. 
'విభూతి శతకమూ'
 భగవద్విభూతులను అందముగా వర్ణించినది. 

భగవంతుని కరుణాకటాక్షముతోడనే 
తానీ శతకము చెప్పినట్లు 
కవి విన్నవించెను. 

"స్వేచ్చాకవికోకిలవలె చల్లగా 
భగవద్గుణాను కీర్తనము చేసి కొందు" 
నని భగవంతుని తోడి అభేదము 
తనకు అవసరము లేదని కోరుకొనెను. 

విభూతి శతకమున వర్ణింపబడిన 
వాత్సల్య 
దాస్య 
మధుర 
సఖ్య భక్తులు 
ఈ పద్యములో పరాకాష్ట నొందినవి.

"ఈ నిను జూచునప్డు
నిలువెల్లను గన్నులు
సేవలో సుఖం బానెడునప్డు
నాదు నిలువంతయు చేతులు
పల్కు పల్కి నీ యానతి గోరునప్డు
నిలువంతయు నోరులు
నీ స్తవంబునందేను రమించునప్డు
నిలువెల్లను కంఠము తీయరా ప్రభూ..!!"

విభూతి శతకం -80


పుట్టపర్తి రచించిన 'జనప్రియ రామాయణము'
లక్ష్మీ పద లాంఛనం.
అమ్మవారి నుండి అస్మత్ గురువు అంటూ
ఒక పధ్ధతిలో
గురు పరంపర చెప్పుకుంటారు శ్రీ వైష్ణవులు.

రామాయణం దీర్ఘ శరణాగతిని ప్రవచించే కావ్యం.
అందుకే పుట్టపర్తి శరణాగతి ధర్మం
ప్రపంచించే రామాయణాన్ని
లక్ష్మీ పద లాంఛనంగా అలంకరించారు.

బాలకాండ షట్పదులలో
కిషింధ కాండ చతుష్పదులలో రచించారు.
ఆయన మొదట రచించింది కిషింధ కాండ
కవితా వాహిక చతుష్పది.

కిష్కింధ కాండను చతుష్పదులలో వ్రాయడం
ధ్వని స్ఫోరకమనిపిస్తుంది.
కిష్కింధకాండలో వానరుల కధ ప్రత్యేకమైనది.
వానరులు చతుష్పాదులు.

అంతేగాక సూక్ష్మంగా
మరొక పరమ రహస్యం
చతురక్షర సంకేతమైన లక్ష్మ ణు డు
ఈ కధలో ఆచార్య స్థానీయుడు కావడం

సుగ్రీవుని భగవదాదేశానుసారం
గజపుష్పమాలను ధరింపజేయుట.
రామునకు హనుమంతునికి మధ్య
భగవంతునికీ భక్తునికి మధ్య
 ఆచార్యత్వం వహించుట

అంతే గాక
సంసార మోహమగ్నుడైన సుగ్రీవునకు
రమానుజుడైన లక్ష్మణుడు
కర్తవ్యోపదేశం చేయుట
అతని ఆచార్య స్థానమును ప్రకటించుచున్నది.

మరొక ధర్మ సూక్ష్మం
ధర్మార్థ కామ మోక్షములు వివేచనగా
వారికి మోక్షం కలిగించేది.
ఈ విధంగా పుట్టపర్తి ఎన్నుకున్న కిష్కింధకాండ
కవితా వాహిక
విపులార్థములు కలిగి యున్నదని
చెప్పవచ్చును.

ఈ కాండలో
ఆయన ఆరంభించిన మొదటి పద్యం
అంటే పుట్టపర్తి భావించిన రామాయణ కావ్యానికి
మొదటి పద్యం
"పరమా  పదనాధ శృతి హిత చరమ శ్లోకార్థ"
అని రాముణ్ణి విష్ణువుగా
పరమ పద నాధునిగా భావించి
సర్వ ధర్మముల వదలి
ఆయననే శరణు వేడితే
పాపాలన్నింటి నుండి
మనలను విముక్తి చేస్తాడని బోధిస్తూ
రామాయణాన్ని ఆరంభించి
శ్రీ సంప్రదాయానికి జనప్రియలో శ్రీకారం చుట్టారు
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు.

శ్రీరామ కధ రామాయణం భగవద్భాగవత కైంకర్యం.











కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి