5 సెప్టెం, 2012

పండరీ భాగవతము పీఠిక కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ




విశ్వనాధ వారు..
పుట్టపర్తి వారూ
సమ ఉజ్జీలు
మొదట స్పర్థ నెలకొన్నా
తరువాత మైత్రీ బంధం బలపరుచుకున్నారు.
 
విశ్వనాధ వారు 
కడపలో మా యింటికి తరుచూ వచ్చేవారట.
అయ్యతో అమ్మతో కూడా 
ప్రేమాభిమానాలు వారికి కద్దు
వంటింట్లో పీట పై కూర్చుని అమ్మతో 
వాల్మీకి రామాయణ విశేషాలు ముచ్చటించేవారుట.
 
అందుకేనేమో
అయ్య వారిపై అద్భుతమైన వ్యాసం వ్రాసి 
తన అభిమానానికి 
ఒక అందమైన రూపమిచ్చారు
విశ్వనాధవారు మురిసిపోయారుట ఆ వ్యాసానికి
 
"నాకంటే ఈయన కొన్ని విషయాలలో 
గొప్పవాణిగా పరిగణింపబడుట నేనెరుగుదును.."
అని వారు అనటంలోనే 
ఇద్దరి దగ్గరితనం కనిపిస్తుంది.
 
ఇది పండరీ భాగవతానికి పీఠిక
అయ్య ఒక్కో గ్రంధాన్ని ఏళ్ళతరబడి వ్రాసేవారు
 
ఈ రోజు కొంత వ్రాసి దాన్ని అవతల పెట్టేవారు
తరువాతెప్పుడో 
మళ్ళీ భావావేశం వస్తే మళ్ళీ దాన్ని పొడిగించడం
ఈ వ్యవధిలో 
విశ్వనాధవారి పీఠిక కనిపించలేదు
ముద్రణలో అందుకే అది లేదు.              
 

                   "పండరీ భాగవతము పీఠిక"
         కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ

పండరీ భాగవతమునకు 
విశ్వనాధ వారు వ్రాసిన పీఠిక ఇది. 
కాని 
కావ్య ముద్రణ సమయానికిది కనిపించలేదు. 
ముద్రణ ముగిసిన తర్వాత కొన్నాళ్ళకు దొరికినది.)

 
ఈ పండరి భాగవత గ్రంధ కర్త 
మహాకవి సరస్వతీపుత్ర పద్మశ్రీ 
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. 
ఈయన ఈ గ్రంధము వ్రాసి ముప్పదియేండ్లైనదట. 

ఈయన కీర్తి యంతకు ముందే మొదలు పెట్టినది. 
ఈ గ్రంధము మాత్రమిప్పుడు వెలికి వచ్చినది. 

ఇందులో 
పుండరీక చరిత్ర 
చొకామీళుని కధ 
నామదేవ చరితము 
గోరాకుంభారుకథ 
నర హరి  చరిత్రము 
అన్న అయిదు కధలు కలవు 
పందరీ క్షేత్రమునందలి మహా భక్తుల కథల సంపుటి
 
ఇది ద్విపద కావ్యము 
పూర్వము మన దేశములో 
కొన్ని ద్విపదకావ్యములు కలవు 
కొన్నింటికి కొంత మర్యాద కలదు. 

వేణుగోపాల శతకకర్త 
ద్విపదకావ్యములందు మర్యాద లేనివాడు. 
దానికి కారణమేమయి ఉండును ..?
పద్యమునందున్న వైశాల్యము 
ద్విపదకు లేదనచచ్చును 
ఒక లోతైన భావము 
ఒక విస్తారమైన భావము 
రచనా శిల్పము చేత మూర్తి కట్టించుటకు 
తగినంత వీలైన లక్షణము 
ద్విపదలో లేదని యాతడెంచినాడేమో.
 
కాని మన దేశములో 
స్త్రీల పాటలన్నియు ద్విపదలో నున్నవి. 
బసవ పురాణమునకు.. గౌరన హరిశ్చంద్రకు..
గల ప్రశస్తి కాదనుటకు వీలులేదు. 

రంగనాధ రామాయణము ద్విపద గ్రంధము. 
ద్విపద భారతమన్న గ్రంధము 
ఆంధ్ర విశ్వవిద్రాలయము వారు పూర్వమచ్చొంత్తించిరి. 

అందులో చాలా భాగము 
తిక్కన్న గారి పద్యాలు ద్విపదలో వ్రాసినట్లుండును. 
పద్య రచనకు ద్విపదరచనకున్న భేదము 
ఆ రెంటిని పోల్చి చూచినచో తెలియగలదేమో
 
ద్విపద యనిన తోడనే 
ఒక తాళము రెండు చరణములతో 
చెప్పదలచిన భావమైపోవుట. 
పాటకు వీలుగా నుండుట. 
సర్వజనులకు చదువుటకు వీలుగ నుండుట 
మొదలైన లక్షణములుండవలసినట్లు కనిపించవచ్చును.
 
ఈ కావ్యములో నా లక్షణములు చాలా నున్నవి. 
కాని ప్రౌఢి కూడనున్నది. 
కొన్ని చోట్ల దీర్ఘ సమాసములు కలవు. 
ప్రతి చరిత్రకు చివర 
కవి తన కథ చెప్పికొనుచుండును. 
దాని వలననే కవిని గురించిన వాకబు 
చాలా తెలియగలదు.

ఈయన వ్రాసిన గ్రంధము 
పూర్వ ద్విపద కావ్యముల కేమియు తగ్గిపోదు. తగ్గిపోదు సరికదా 
కొన్ని చోట్ల పూర్వ ద్విపద రచనకు 
మెఋగు పెట్టినట్లుండును. 

ఒక్క భేదము విస్పష్టముగా కనిపించును 
పూర్వ ద్విపద కావ్యకర్తలు 
సంస్కృతమును వాడినను 
వారిలో దేశ్య శబ్దముల బాహుళ్యము
విరివిగా కని పించును 

ఈ కావ్యములో మాత్రమే
 కొన్ని పలుకుబడులున్నను 
సంస్కృత శబ్దముల బాహుళ్యమెక్కువగా 
నున్నదేమో అనిపించును.
 
వ్రాసిన యైదు కథలు 
బంగారము వంటి కథలు 
కథలో ప్రాణమున్నచో
కవి యల్ప శక్తిమంతుడైనను భాసించును. 

అధికశక్తిమంతుడైనచో చెప్పవలసినదేమి 
ఈయన అధిక శక్తిమంతుడనుటకు 
తెలుగుదేశములో నీయన పొందిన 
ప్రతిష్టయే సాక్ష్యము. 
కాని ఈయన పద్యరచన కూడ 
మంచి ప్రౌఢముగా చేయగలకవి.
 
గ్రంధము చక్కగా ముద్రింపబడినది. 
అందందు ముద్రణ దోషములు 
లేవనుటకు వీలులేదు.
 
ఇట్టికవి 
పరుల యభిప్రాయమునాసించుట 
యెందులకో తెలియదు. 

అవతలి వానియందు 
గౌరవము నెరపుటకని యనుకొనుచున్నాను. 

మా నడుమ మైత్రి చాల ఏండ్లుగా కలదు 
కొన్ని కొన్ని యెడల నీయన 
నాకంటె గొప్పవాడుగ పరిగణింపబడుట నేనెరుగుదును. 

అట్టి నా నుండి యభిప్రాయమాసించుట 
వట్టి స్నేహధర్మము.
విజయవాడ
10.6.74

4 కామెంట్‌లు :