డూ ఆర్ డై..
ఇవే మాటలు..
ఆ ..ఇవే మాటలు మా ఇంటికొచ్చే సుధ చెప్పేది
సుధ కూచిపూడి చేస్తుంది..
చిన్నప్పటినుంచీ నేర్చుకుంది..
పాపం చిన్నప్పుడెప్పుడో అమ్మ చనిపోయింది దానికి..
ఎంత గట్టిదో తెలుసా..
దానికి ఒక చెల్లెలు ఒక తమ్ముడూ.
వాళ్ళ నాన్న హోమియో లేక ఆయుర్వేదం డాక్టరు..
ఆయన తన భార్య పోయిన తరువాత
ఇంకో ఆమెని పెళ్ళి చేసుకున్నాడు..
మీరేమనుకుంటారు..
రెండో అమ్మ వచ్చింది కదా..
ఇంక పాపం సుధా ఆమె చెల్లెలు తమ్ముడు.. ప్చ్
కదూ
పెళ్ళి నాటికి సుధ వయసు పదో పదకొండో వుండచ్చు
కానీ ఆపిల్ల వాళ్ళ రెండో అమ్మ ఆటలు సాగనివ్వలేదు
ఆమెని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచింది.
వాళ్ళ నాన్న సుధ మాటే వింటాడు..
ఆ ఇంట్లో సుధ మహారాణి
దాని అమ్మా నాన్న చెల్లెలూ తమ్ముడూ దాస దాసీజనం..
దాని ఆజ్ఞ జవదాటరు..
భలే వుంది కదూ..
ఇంకా వినండి ..
సుధ యోగా చేస్తుంది..
నాట్యం.. యోగా..
కడప రాఘ వేంద్ర స్వామి గుడి దాటి అలా వస్తే..
ఎడమ పక్క రోడ్డు రౌనఖ్ థియేటర్ కు వెళుతుంది
కృష్ణ కాలువ వెంట..
అక్కడే శ్యామ సుందర్ సారు ఇల్లు
రామకృష్ణా హైస్కూల్ లో టీచరు..
ఆయన అయ్యతో సభలూ సన్మానాలకు
అప్పుడప్పుడూ అయ్య వెంట వెళుతుంటాడు..
అయ్యకు ప్రయాణాలలో తోడు కావాలి కదా..
బస్సు ఎక్కితే .. పుస్తకం
బసలో పుస్తకం
అయ్యదే ఓ ప్రపంచం ..
అలా తిన్నగా ముందుకు వస్తే ..
ఎడమ చేతివైపు ఎత్తుగా ఒక ఇల్లు
అదే సుధ వాళ్ళది..
వచ్చిన కొద్దిరోజులకే నాట్య శిక్షణ మొదలెట్టింది
పిల్లలందరూ చేరిపోయారు
ఉచితంగా యోగా నేర్పిస్తానంది.
ఆడాళ్ళందరూ తయారు.
వాళ్ళింటి ఎదురుగా వున్న ఖాళీ స్థలాన్ని బాగుచేయించింది..
తెల్లారి అయిదున్నరకు అందరూ అక్కడికి చేరిపోయేవారు..
అక్కడ వాళ్ళకి ఆసనాలూ ...ప్రాణాయామాలూ..
కడపకు ఎవరొచ్చినా పెద్దవాళ్ళ దర్శనం చేసుకుంటారు
అలానే అయ్యను వెతుక్కుంటూ వచ్చారు
సుధా తన నాన్నా..
అంత గొప్ప వాడూ ..
ఎంత డాంబికంగా వుంటాడో..
కానీ ..
అయ్య వాళ్ళ కథ ఆసక్తిగా విన్నారు..
డాన్స్ నేర్చుకున్న పదహారేళ్ళ సుధ పట్ల
అయ్యకు అప్పట్లో ఓ విధమైన మెచ్చుకోలూ..
దాంట్లో తన గొప్ప దనాన్ని మర్చిపోయి పసిపిల్లవాడై పోతుంటారు అయ్య
తల్లిని కోల్పోయినా జీవితాన్ని తన చేతిలోనే వుంచుకున్న సుధ పట్ల ఉత్సుకత..
ఎందుకంటే చిన్నప్పుడు తల్లిని కోల్పోవటం
అనే కటిక చేదు అయ్యకు అనుభవమే..
యోగా చేసే సుధ పట్ల ఆసక్తి
ఆ సుధ యెలా వుండేది..
అందరు పదహారేళ్ళ పిల్లల్లా కాదు
తనో డిక్టేటర్.. కదా..
నుదుట పేద్ద కుంకుమ బొట్టూ
తెల్ల కాటన్ చీర గోచీ పోసి కట్టుకొని..
తల్లో మల్లె పూలు పెట్టుకుని..
ఇదీ వేషం..
ఆమె పట్ల మేము ఇంట్రస్ట్ గా చూస్తే
మా పట్ల తనూ ఇంట్రస్ట్ గా చూసింది
కానీ
కొన్ని నిమిషాలలో కనిపెట్టింది..
తనలో వున్న ప్రత్యేకతలు.. ఎదుటి వాళ్ళకు నచ్చాయని
అంతే
ఇంక దాని ప్రతాపం చూపడం మొదలెట్టింది..
ప్రతిరోజూ వచ్చి కూచోవటం..
తన గొప్పలు..
అయ్య ఆసక్తిగా వినడం..
ఇదీ కథ..
త్వరలోనే మా ఇంట్లో పిల్లైపోయింది..
అంతే అయ్యలో ఉత్సాహం ఉరకలు వేసింది..
యేమే సుధా.. రావే నీకు షేక్స్పియర్ చెబుతాను..
అన్నారు..
సుధకే కాదు.. అందరితోను ఇంతే
ఎవరు అయ్యకు చేరువైనా.. వాళ్ళకు
తనకు తెలిసిన వాళ్ళందరినీ పరిచయం చేయడం
అయ్య వీక్నెస్..
కానీ మొదట్లో వాళ్ళు కొంత ఉత్సాహంగా వచ్చినా
తర్వాత్తర్వాత మొదటి ఉత్సాహం ఉండదు
అదీగాక
అయ్యా వాళ్ళని ఒక గంట రెండు గంటల్లో వదలరు
మొత్తం షేక్స్పియర్ నూ
ఈరోజే వాళ్ళ బుర్రల్లో దూర్చేయాలి
అది అయ్యకు వారిపై అంకిత భావం
వాళ్ళ సాహిత్యంపై ప్రేమ
ఆ ఘాటు ను తట్టుకోవటం
మహా మహుల వల్లే అవలెదు..
కొన్నిరోజులు సాగిన ఆ పాఠం
ఒక రోజుకు ముగింపుకు వచ్చేసింది
ఆపిల్లకు వేయి పనులు..
తెల్లవారి పిల్లలకూ పెద్దలకూ యోగా శిక్షణ..
తర్వాత కాలేజీ..
సాయంత్రం నాట్య శిక్షణ..
రాత్రి అయ్య దగ్గర పాఠం..
రాత్రి పది గంటలకు మా ఇంటికి విచ్చేసేది..
ఎలా..
తెల్ల చీర గోచీ పోసి కట్టుకుని
నుదుట అమ్మవారిలా పేద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని
తల్లో విరిసిన మల్లె పూలు తురుముకుని..
కాళ్ళకు గజ్జెలతోనే..
అమ్మ నాకూ సుధకూ సంగీతం చెప్పేది..
అలానే స్వరజతులూ నేర్చుకున్నా..
మా ఇంట్లోనే పదకొండయ్యేది
ఈ రాత్రిపూట ఒక్కతీ ఆ మూలకు ఎలా వెళుతుంది..
చీకట్లో
దార్లో వీధి లైట్లు వుంటాయీ.. వుండవూ..
కానీ
ఆ యేం కాదు..
యెవడేం చేస్తాడు..
డూ .. ఆర్ డై..
అనేది..
ఇలా కొంత కాలం సాగింది..
అయ్యకెక్కడ తీరిక..
ఎప్పుడూ సన్మానాలు
నాలుగు రోజులకోఊరు..
పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు..
టీవీల వాళ్ళు పేపర్ల వాళ్ళు..
ఇంటర్వ్యూల కోసం వచ్చే వాళ్ళు..
మా ఇంట్లో బంధు జనం..
ఆ మా ఇల్లంటే గుర్తొచ్చింది..
ఎంత బాగుండేది తెల్సా..
ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు
పెద్దక్కయ్య వచ్చి ఒక మూడు రోజులు వుండిపోతే..
ఆమె వున్నన్నాళ్ళు వాళ్ళ ఇంటి విశేషాలూ
తన ఉద్యోగం కబుర్లు..
తను స్కూల్ టీచర్
తన స్కూల్ గురించీ పిల్లల గురించీ..
చెప్పి చెప్పి భలే నవ్వించేది..
ఆ పిల్లలకు తాను సంగీతం చెప్పడం..
గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్ల ఘాతుకాలూ..
మధ్యాన్న భోజన పధకానికి వచ్చే బియ్యం నూనె
టీచర్ల ఇళ్ళకెలా వెళ్ళిపోతాయో..
టీచర్లు పెద్ద పెద్ద క్యారియర్ల నిండా
మధ్యాన్న భోజనాన్ని నింపుకొని
ఎలా పోతారో..
ఒకటేమిటీ..
అందరూ అయ్య చుట్టూ కూచుని మాట్లాడితే
అయ్య కెంత ఇష్టమో ..
ఆమె పోయిన నాల్గు రోజులకే
రెండో అక్కయ్య కొడుకు యేదో పని మీద దిగేవాడు
వాడితో ఒక నాలుగు రోజులు కాలక్షేపం..
వాళ్ళ వూరు బళ్ళారి దగ్గర కామలాపురం..
పొలాలు మామిడిపళ్ళూ
ఆవులూ పంటా..
మా బావ బ్యాంక్ ఉద్యోగం..
అక్కడి విశేషాలు
తాతా.. తాతా..
అని వాడూ దగ్గర కూచుని మాట్లాడేవాడు
పదరా మనిద్దరం ముష్టి యుధ్ధం చేస్తాం..
అంటూ అయ్య అప్పుడప్పుడూ వాణితో
సరదాగా కుస్తీ పట్టు పట్టేవారు..
ఎక్కడున్నానూ..
అలా సుధ కథ కొంతకాలం సాగింది
ఆపిల్లకు కళలంటే ఇష్టం
చదువు ఇష్టం లేదు
కష్టపడి చదివేది
కొన్ని సార్లు పాసు , కొన్ని సార్లు ఫెయిలూ
తర్వాత వాళ్ళ నాన్నకు వేరే వూరు బదిలీ అయింది
కానీ
పరీక్షలకు కడపకు వచ్చేది నెల ముందుగా
మా ఇంట్లోనే మకాం..
ఇద్దరం కలిసి చదుకొనే వాళ్ళమా..
చక్కగా టిఫెన్ తిని ..
పట్టపగలే.. పుస్తకం పట్టుకు కూచుని అది తూగుడే తూగుడు..
అలా ఒక అయిదారు సార్లు పరీక్షలు రాసింది..
తర్వాత చదువేమైందో తెలీదు కానీ..
కొన్నాళ్ళకు మళ్ళీ మాఇంట్లో దిగింది..
వెంపటి చిన సత్యం వద్ద నృత్యం నేర్చుకుంటున్నానని చెప్పింది..
అయ్య పక్కన కూచుని..
ఆయన దృష్టిలో ఎలా పడింది
ఆయన వద్ద ఎలా చేరింది
అదో కథ..
కూచి పూడి వెళ్ళింది
సత్యం గారింటి ఎదురుగా ఇల్లు తీసుకుంది
ఆయన తెల్లవారి సూర్య నమస్కారాలకోసం పైకి వస్తాడట..
అది కనిపెట్టి
ఆవేళకు తానూ పైకి పోయి పెద్దగా విష్ణు సహస్త్ర నామాలు చదివేదట..
ఒకరోజు ఆయన సుధను చూడనే చూసాడు..
పరిచయం పెంచుకుని నాకు నాట్యం నేర్పండి..
నాట్యం నా ప్రాణం అందట..
అంతే..
అక్కడ ఆయన శిష్యురాలైపోయింది..
ఇతి సమాప్తః
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి