12 ఆగ, 2014

కుప్పించి ఎగసిన ..

అది కురుక్షేత్రం..
రథ ..గజ.. తురగ.. పదాతి  సైన్యం..
అతిరథ ..మహారథులు..
కౌరవులు .. పాండవులు
 

అర్జునునకు సారధి  కృష్ణుడు
కేవలం సారథ్యం మాత్రమే వహిస్తాడు
ఆయుధం పట్టడు..
ఇది ఆయన ప్రతిజ్ఞ..
  

భీష్ముడు మహాభక్తుడు
కృష్ణ స్వరూపాన్ని ఎరిగినవాడు..

కృష్ణుడు  ఎంత భక్త పరాధీనుడో భీష్మునకు తెలుసు..

తన భక్తులకు ఆపద వస్తే తల్లడిల్లిపోతాడు..
ఆ కృష్ణునికి అర్జునుడంటే ప్రాణం
కృష్ణుని ప్రాణాన్ని తన బాణాలతో రక్త సి క్తం చేసి..
కృష్ణుని కాగ్రహం తెప్పించి
తన ప్రతిజ్ఞ తానే మరచిపోయేటట్లు చేశాడు భీష్ముడు
తద్వారా..
తనను నమ్ముకున్న వారినాదుకోడానికి 

తాను ఎంతకైనా దిగిపోతాడు కృష్ణుడని  సంకేతించాడు
లేకపోతే జగత్ప్రభుడు రధ సారధ్యం చేయడమేమిటి..
 

వెనక్కి తిరిగి రక్తమోడుతున్న అర్జునుని చూసి అగ్రహోదగ్రుడయ్యాడు కృష్ణుడు
 

అంతే..పగ్గాలు విసిరేశాడు
 రధం మీదనుంచీ ఒక్క సారి కిందకి దూకాడు
కుండలాలు ఒక్కసారి పెద్దగా ఊగాయి
వాటి కాంతి గగనభాగమంతా అలమికొంది..
కడుపులోని లోకాలు కదిలిపోయాయి..


పైన వేసుకున్న పచ్చని పటం  జారిపోయింది..
చక్రం పట్టి ..భీష్ముని చంపుతానని 
ముందుకురుకుతున్న కృష్ణుని
''బావా బావా.. వద్దు వద్దు 

ఆగు బావా .. ఆగుబావా  నన్ను నగుబాటు చేయవద్దు ''
 అంటూ కాళ్ళు పట్టుకున్నాడర్జునుడు..

ఇది 'కుప్పించి యెగసిన' పద్యం
మరి సంస్కృతంలో వ్యాసుడు దీనినెలా రచన చేశాడు
దీనికి పోతన్న తెనిగింపెలా వుంది..
యేయే పదాలకు వానికి సరితూగే తెలుగు వేయడానికి పోతన్న ఎంత కష్టపడ్డాడు..
పుట్టపర్తి వారు మహా భాగవతోపన్యాసాలు లో 

ఇలా చెప్పారు..


 
ఆ కృష్ణ పరమాత్మ భక్త పరాధీనత యెలాంటిదంటే 

తను చేసిన ప్రతిజ్ఞ నైనా దాటేంతటిది..
తాను ఆయుధం పట్టనని కురుక్షేత్రం లో ప్రతిజ్ఞ
ఆ ప్రతిజ్ఞను దాటేలా చేస్తానని భీష్ముడన్నాడు
యెలా..
కృష్ణుని

''స్వనిగమ మపహాయ మత్ప్రతిజ్ఞాం ఋతమధికార్తు మవప్లుతో రధస్థః
ధృత రధ చరణో భ్యయాచ్చలగ్దు-ర్హ రిరివహం మిభం గతోత్తరీయః
శితవి శిఖవతో విశీర్ణ దంశః క్షతజ పరిప్లుత ఆతతాయినోమే
ప్రసభ మభిససార మద్వధారథః-సభవతుమే భగవాన్ గతి ర్ముకుందః''

 ఈ రెంటికి దెనిగింపే పోతనామాత్యుల..

''కుప్పించి ఎగసిన గుండలమ్ముల కాంతి
గగన భాగం బెల్ల గప్పికొనగ.. 
నురి కి న నోర్వక నుదరంబులో నున్న
జగములవ్రేగుకు జగతి గదల..
జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున
బైనున్న పచ్చని పటముజార..
నమ్మితి నాలావు నగుబాటు సేయకు..
మన్నింపుమని క్రీడి మరల దిగువ
గరికి లంఘించు సింహంబు  కరణి మెర సి..
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు..
విడువు మర్జున ..యనుచు మద్విశిఖవృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు..''


యను పద్యము
తెలు గు దేశమున నీ పద్యము నోటికి రాని 

వా రుండరనుకొందును. 

ఇందులో మొదటిపాదము 
''అవప్లుతః"  యను దానికి దెనిగింపు
 

ఈ శబ్దములోని స్పూర్తిని
 'కుప్పించి యెగసిన'
 యనుట నిండుగా దెలుపుచున్నది
 

ఆ కుప్పించి యెగురు నప్పుడు 
గుండలంబులు చౌకళించి..
వాని కాంతి  గగనమున వింతరంగు బూయుట పోతనామాత్యుల భావనయే
 

'చలద్గు'
యనెడు సంస్కృతమున కాంధ్రీకరణము 

రెండవపాదము మూలమునందు 
'భూమి చలించుటకు' గారణములేదు
 

శ్రీధరులాకొరతను 
'ఉదరస్థ సర్వ భువన భారేణ '
యని పూరించిరి
 

ఆ విషయమును 'ఆంధ్ర కవి' యందుకొన్నాడు
'గతోత్తరీయః'

 యనుటకు 'పైనున్న పచ్చని పటము జారుట '
తెనుగు
'పచ్చని ' యను విశేషణము పోతన్నదే
 

కృష్ణ భగవానుడు ధరించిన యుత్తరీయ మేల జారినది.. ?
 దీనికి సమాధానము స్పష్టముగ వ్యాసుడీయలేదు
 

దానిని సమర్థించుట శ్రీ ధరుల వంతు
వారికిది చిక్కుగా గన్ప డినది 

'తేనైవ సమ్రంభేణ' యని
శ్రీధరులు తిన్నగా జారుకొనిరి
 

ఇక పోతనామాత్యులు దా నిని సవరించుకొనవలెను
'ఆ సంభ్రమము'  

రెండవ పాదములో రానే వచ్చినది
 

మరల నదే జెప్పినచో ససిగా నుండదు
అందుకై 'చక్రంబు జేపట్టి ' యన్నారు
 

ఇది 'ధృత రధ చరణః ' అను దానిని హేతువుగ నన్వయించుటయే
దీనితో నా 'యురుకు'టకు నీ 'రయము'నకు భేదమేర్పడినది
భూమి చలించుటకు 'వ్రేగు' హేతువు 

పటము జారుటకు 'పరుగు' కారణము ..

నాల్గవపాదము 
అమాత్యుల స్వకపోల కల్పితము
'నేడు భీష్ముని ... విడువు మర్జున'
యన్నమాట తెనుగు కవిదే
పద్యం చాల యందముగ కుదిరినది
 

కాని
'మత్ప్రితిజ్ఞాం ఋతమధికర్తుం'

 యనునది తెనుగున రాలేదు
 

రెండవ శ్లోకము 
మొదటిదానితోనే గతార్థమగుటచే పోతన్న వదలిపెట్టెను.

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి