2 నవం, 2014

నీకు అంత్య దశలో కృష్ణ దర్శనమౌతుంది..

పుట్టపర్తికి కంచి పరమాచార్యతో సాన్నిహిత్యం చాలా లోతైనది..
సంప్రదాయానికి నిర్వచనం స్వామి
యే బంధాలకూ లొంగని పుట్టపర్తి
వీరి కలయికే విచిత్రంగా వుంది కాదూ 

నిజమే ..
ఆరోజుల్లోనూ అలానే వుండేది
కంచి స్వామి ఒకప్పుడు పెనుగొండ వెళ్ళారు
అప్పుడు పుట్టపర్తి తొమ్మిదేళ్ళ పసివాడు
ఆ పసివానివంక చూసి 

వాని నొసటి గీతలను చదివిన స్వామివారు
వీడు గొప్ప కీర్తిమంతుడౌతాడని చెప్పారు

తరువాత తల్లి వియోగం లో మసలే పుట్టపర్తికి కుటుంబమ్నుంచీ నిరాదరణ.. కుంగదీసింది..
రెండవపెళ్ళి చేసుకున్న తండ్రి..
ఆమెకు పిల్లలు
మరలిన తండ్రి దృష్టి
పుట్టపర్తిని తీవ్ర నిరాశకు గురిచేశాయి

తిరుపతిలో విద్వాన్ చదువుతున్నరోజుల్లో
కంచి స్వామి తిరిగి మళ్ళీ పుట్టపర్తి ని పలకరించారు
 

పుట్టపర్తి చదివే

సంస్కృత విద్యాలయానికి వెళ్ళారు స్వామి
అప్పుడు సంస్కృతంలో అష్టావధానం జరిగింది..
అప్పుడూ పుట్టపర్తి పాండిత్యం స్వామివారిని మురిపించింది..

తర్వాత సీను ప్రొద్దుటూరుకు చేరింది..
అప్పుడు పుట్టపర్తి వివాహితుడు
అక్కడి ఒక పాఠశాలలో పనిచేస్తున్నారు
అక్కడి పండితుల మధ్యా విపరీతమైన పోటీలు
కక్ష్యలు ఘర్షణ వాతావరణం..

ప్రొద్దుటూరుకీ పరమాచార్య విచ్చేశారు
స్వామివారికి ఆహ్వానం పలకడానికి ఎవరు అర్హులు..??
అందరూ వెనుకంజ వేశారు..
పుట్టపర్తి పొలిమేరలనుంచీ సంస్కృతంలో బ్రహ్మండమైన  శ్లోకాలతో
స్వామివారిని ఆహ్వానించి కన్యకాపరమేశ్వరీ ఆలయానికి తీసుకురావటం జరిగింది..

అక్కడ కొద్ది రోజులు స్వామి బస చేశారు..
మన తెలుగు పండితులకు

అరకొరాసంస్కృతమే  తప్ప 

అన్య భాషా పరిచయమే లేకపాయె
కానీ నిజమైన శక్తి గలవారిని కిందకి లాగటం లోనూ
కుయుక్తులను ప్రదర్శించి తరిమేయడంలోనూ పాండిత్యమెక్కువ..

తమిళ సాహిత్యమూ
భక్తుల సాన్నిహిత్యమూ గల పుట్టపర్తి స్వఛ్చత స్వామిని తిరిగి దగ్గర చేసింది..
అప్పుడు పుట్టపర్తి అక్షర లక్షల గాయత్రి 

కొన్ని కోట్ల అష్టాక్షరీ చేసి వున్నారు..
అంతే కాదు..

ఇంకో ముఖ్య విషయం
అందరూ స్వామివారి ముందు సాగిల పడేవారు
కోర్కెలు విన్నవించే వారు..
తాము చాలా సంప్రదాయబధ్ధులమని ప్రదర్శనకు దిగేవారు ఎక్కువ

కానీ
నేనిన్ని కోట్ల సాధన చేసాను నాకు ఎందుకు 

ఏ ఆధ్యాత్మిక అనుభూతి కలుగలేదు..
అని పదే పదే అడిగే శిష్యులు ఎవరుంటారు..
నాకు కృష్ణ దర్శనమెప్పుడవుతుందని సర్వమూ ఒడ్డి హిమాలయాలకు పరిగెత్తే వారు ఎవరుంటారు..

అందుకే ప్రతిష్టాత్మక  కంచి పీఠాధిపతి..
నడిచేదైవమని ప్రపంచమంతా పిలిచిన సన్యాసి..
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్య
పుట్టపర్తికి వాగ్దానం చేసారు..
నీకు అంత్య దశలో కృష్ణ దర్శనమౌతుంది..
అని..

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి