వ్యాసకర్త: లక్ష్మీదేవి               
 తంజావూరు రఘునాథ నాయకుని 
తొలి యవ్వనపు రోజులలో  
ఆనాటి పరిస్థితులగురించి,
దేశభక్తి , దేశద్రోహము వంటి ప్రవృత్తులున్న 
నాటి వ్యక్తుల మధ్య జరిగిన ఘటనలగురించి 
ఆసక్తికరంగా, ఆసాంతం ఒక్క వూపున చదివించేటట్లు పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన చారిత్రకనవల అభయప్రదానము.

రఘునాథ రాయలవారి తండ్రి అచ్యుతప్ప నాయకుని పాలనాకాలమది.
యుద్ధవిద్యలు, 
రాజనీతులు మొదలైనవాటితో పాటు 
సంగీతసాహిత్యాది రంగాలలో విశేష ప్రతిభ గలిగి , పరిశోధకుడై, నిష్ణాతుడై పరిపూర్ణంగా వికసించిన వ్యక్తిత్వం తో వెలుగొందే రాకుమారుడు రఘునాథుడు, 

సంగీత,సాహిత్యాలలో అభిరుచి గల్గిన పత్ని కళావతితో సల్లాపములు (సరదా అయిన మాటలు)తో నవల ప్రారంభమే  ఆకట్టుకుంటుంది.

ఆ రాజ్యంలో 
అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న పోర్చుగీసువారు,
 స్వతంత్రం ప్రకటించుకోవాలని 
తదనంతరపరిణామాల గురించి ఆలోచించని సామంతులు, 
వీరి అండ చూసుకొని 
పరమకిరాతకుడై ప్రజాకంటకుడైన సోలగుడి చేతిలో చిక్కి భైరవపూజకు బలికాబోతున్న అమాయక దంపతులను రక్షించడానికి 
వారి తండ్రి యైన ప్రముఖవ్యాపారి వరదప్పనాయకుడు శరణువేడగా 
రఘునాథ రాయల తండ్రి అచ్యుతప్పనాయకుడు ఒసగే అభయప్రదానము, 
దాన్ని నెరవేర్చేందుకు 
సామోపాయంతో రఘునాథనాయకుడు, 
భేదోపాయంతో యజ్ఞనారాయణదీక్షితులు (రాకుమారునికి సహపాఠీ, అనుంగుమిత్రుడు, సారూప్య అభిరుచిగలవాడు) ప్రయత్నించి 
అనేక రకాలైన చదరంగపుటెత్తులతో 
శత్రువర్గములోని ఒక ప్రముఖవ్యక్తి సహకరించగా పాటుపడిన వైనము 
ఆసాంతమూ ఆసక్తి కరంగా రచించినారు.

విజయనగర రాజుల పతనం తర్వాతి సామంత రాజులు, శత్రువర్గాల  ప్రవర్తనలు, జరిగిన సంఘటనలు మొత్తంగా నాటి చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి.

అనేక ప్రముఖ సంగీత, భాషా గ్రంథాలు, 
గ్రంథకర్తల ప్రస్తావన కూడా 
ఇందులో మనకు లభించే ముఖ్యమైన చరిత్ర సమాచారం.

రఘునాథ రాయలు, 
అమాత్య గోవిందదీక్షితుల వ్యక్తిత్వాలు
 విజయనగర సామ్రాజ్య స్థాపనోద్దేశ్యాలను 
పరిరక్షించే కార్యక్రమాలలో 
ఎంతగా అంకితమై ఉంటారో బాగా చిత్రించినారు.

సంభాషణల్లో బలమైన ప్రతిపాదనలు, 
వాదనలు, వ్యక్తిత్వ చిత్రణలో అంకితభావాలు, స్వతంత్రభావనలు విరుద్ధ పాత్రల రూపును వి
భిన్నంగా  తీర్చిదిద్దుతాయి.

కథలో గతజ్ఞాపకాలలో 
మరింత వెనక్కి తీసుకొని వెళ్ళే ప్రక్రియ, 
చివరవరకూ ముఖ్యమైన ఒక పాత్ర యొక్క చరిత్ర తెలియకుండా ఉండి కుతూహలం పెంచడం, 
సరళమైన గ్రాంథికంలో అందమైన భాషాప్రయోగం, సంభాషణల్లో నాటకీయత ఆవిష్కరింపబడడం 
పుట్టపర్తి వారి శైలీ శిల్ప రచనా ప్రతిభను తెలియజేస్తుండగా 

ఆయా వ్యక్తుల పరిచయాల్లోనే  
రచయితకు సంగీత, సాహిత్యాలలో ఉన్న అభినివేశాన్ని చెప్పకనే చెప్తుంది.
అచ్చులో ఈ పుస్తకం దొరుకుతుందనుకోను.

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో 
ఉచితంగా దింపుకొని చదువుకోవచ్చు.
కానీ కాపీరైట్ సంగతులు నాకంతగా తెలియవుగానీ రెండువందల డెబ్భై పేజీల ఈ-బుక్ ని అచ్చు వేస్తే  చాలామంది పాఠకులకు ఒక మంచి పుస్తకం దొరుకుతుందని ఖచ్చితంగా చెప్పగలను.




  అభయప్రదానము