29 డిసెం, 2016

28 డిసెం, 2016

రస బంధము






''దివిషద్వర్గము నీ ముఖంబునన తృప్తింగాంచు, నిన్నీశుగా
స్తవముల్ సేయు శృతుల్, సమస్త జగదంతర్యామివిన్  నీవ, యా
హవనీయంబును దక్షిణాగ్నియును నీయం దుద్భవించున్, గ్రతూ
త్సవ సంధాయక! నన్ను గావగదవే ! స్వాహా వధూ వల్లభా..''


ఈ లాలసత నాటి జనులకే కాదు వారేర్పాటుజేసుకొన్న దేవతలకుగుడగద్దు.
వరూధినీ కామమును నిరాకరించి యింటికి ద్రోవబట్టిన ప్రవరుడు ..
అగ్నిదేవునెన్నోరీతుల బొగడినాడు..
'' దివిషద్వర్గము నీ ముఖ్ముననే దృప్తిగాంచు '' నన్నాడు..
బదులు రాలేదు..

' నిన్నీశుగాశ్రుతులు బొగడునుగదా .. !! ''
యని యగ్ని గొప్పతాము నగ్గించినాడు..

నీవు  '' సమస్తజగదంతర్యామి '' వని యాతని 'రాచరికమూ ను బొగడినాడు..

'' ఆహవనీయంబును, దక్షిణాగ్నియును '' నీయందేగదా యుద్భవించునని యాతని సర్వాధారత్వమును బలికినాడు..
కడకు..

'' గ్రతూత్సవసంధాయక.. !!'' యని యేమో యొయ్యారముగ బిలిచినాడు..

ఇదేదియు గార్యసాధకముగాదనుకొన్న ప్రవరుడు..

'' స్వాహావధూవల్లాభా..'' యని ముగించినంతనే..
యుత్సాహము రేగిన వహ్ని .. '' హా '' యని పైకిలేచి నిలచి నాడట..

21 డిసెం, 2016

నవ రస భరితం నా తెలుగు పద్యం

శ్రీ గరికపాటి వారు 
''నవరస భరితం నా తెలుగు పద్యం''
 అన్న అంశం మీద తణుకు నగరంలో 2014 ఏప్రిల్ 3న మాట్లాడుతూ..
వీరరసానికి ఉదాహరణగా ..
పుట్టపర్తి వారి పద్యాన్ని ఉటంకించారు.. 
నన్నయ భట్టారక పీఠం 83 వ వార్షికోత్సవ సందర్భంగా 
ఈ సభ జరిగింది..
ఈ లింక్ నాకు మా అక్కయ్య నాగపద్మిని ద్వారా  చేరింది. దీనిని శ్రీ నాగ త్రివిక్రం గారు తనకు అందజేసినట్లు చెప్పింది ఆమె 
 శ్రీనాగ త్రివిక్రం గారికీ .. 
మా అక్కయ్య నాగపద్మినికీ.. 
నా బ్లాగ్ముఖంగా కృతజ్ఞతలు.
https://www.youtube.com/watch?v=rxKM3O8Mgko
you tube link  

ఇది ప్రసంగం దాదాపు 50 నిమిషాలు గడిచిన తరువాత పుట్టపర్తి వారి ప్రస్థావన వస్తుంది.
తెలుగు వాళ్ళ పౌరుషం మీద పద్యం ఇది 
ఎమ్మెల్యే ల ఇంటి ముందు ఈ పద్యం flexi కట్టి చదివించాలట .. 
గరికపాటి వారి చమత్కారాలు..చురుకలు 
సభను రంజింప జేసాయి .. 

''కదనముఖంబునన్ పిరికి కండలు కానని వారు 
వీరతాస్పదులగు భర్తలు వు ధ్ధవిడి శాత్రవులన్  చె రలా డి వచ్చుఁచో 
పదను దొలంకు వారి కరవాలపు నెత్తుట
కుంకుమాకృతుల్ వదనము లందు  దిద్దుకొ ను 
పత్నులకెల్ల నమస్కరించెదన్.. ''

ఖడ్గ తిక్కన బాలచంద్రుడు మొదలైన వీరులే కాదు 
మొన్న యూరీ దాడిలో కన్నుమూసిన మన వీర జవాను 
మదన్ లాల్ శర్మ తల్లి కొడుకు శవ పేటిక మోసి 
తన కొడుకు దేశం కోసం ప్రాణాలు విడిచాడని 
చిరంజీవి అ ని తనను తానే ఓదార్చు కుందట 
ఆమె పేరు ధర్మో దేవి .. 


 గరిక పాటి వారు ఉదహరించిన పద్యం 
పుట్టపర్తి రచించిన
సాక్షాత్కారము అనే కావ్యం  లోనిది .. 






24 నవం, 2016

ఎవ్వా ని వాకిట .


తిక్కన మహాశయుడే లేకున్నచో మన వాఙ్మయములో ఉండునదియే లేకుండునది
నేడు తెనుగు భాషలో లేకుండునదియేలేదు

అతడు కీచక  పాత్రను జిత్రించుటలో 
జూపించిన నేర్పు..
ద్రౌపదీ పాత్ర రచనమున గావించిన కూర్పు
కృష్ణుని పాత్రమున నిర్మించిన తీర్పు..
దుర్యోధనున కిచ్చిన మార్పు.. 
మాతయగు కుంతికి గావించిన చేర్పు.. 
కర్ణుని పాత్రమున పొంగిపొర్లెడు స్వామిభక్తికి ధీరోదాత్తత కొసగిన తార్పు.. 
తలచి తలచి ధ్యానించదగినవి

తిక్కనను ముందు నిలుపుకొని 
మనమే వాజ్మ యముతో నైనను 
పోటీ చేయవచ్చును..

సంస్కృత సాహిత్యమును గాలిచి వెదకినను తిక్కనను వెనుకవేయుమనీషి గలుగలేదని 
చెప్పు ధైర్యము నాకున్నది

షేక్స్పియర్ సృష్టించిన నాయికలు 
మన ద్రౌపదిముందర బలాదూర్..
మిల్టన్ మహాకవి సైతాను పాత్రను  సృష్టించిన యసాధారణమగు ప్రజ్ఞకు తలనూపుదుము..

కాని..
అంతకన్న నెన్నోరెట్లధికమగు నేర్పు 
తిక్కనార్యుని కీచకపాత్రమున నున్నది

రసికులలో చక్రవర్తి.. 
పండితులకు ప్రధమాచార్యుడు..
వైజ్ఞానికులకు బ్రహ్మర్షి..
కర్మయోగులలో జనకుడు..
రాజనీతిజ్ఞులలో చాళుకుక్యునకు కుడిచేయి 
కవి బ్రహ్మ.

బ్రహ్మాండమగు భారతమును బూరించునపుడు ఒకచోటనైన అలత శ్రమ వేసరిక యున్నదా..??
దోషైక దృష్టితో రాత్రి బగలు మనజీవితమెల్ల 
గష్టించి చూచిన నొక్కలోపము నెత్తి చూపగలమా..??

ఓ మహాకవీ.. నీవు తెనుగు జాతి కారాధ్యుడవు..
మాపున్నెముల నోము పంటవు..
మా జీవితముల కమృతమయ మూర్తివి..
మా శరీరముల చర్మమును జీల్చి 
నీకు పాదుకలుగా సమర్పింతుము..

కవితా ప్రపంచరవీ.. 
నీకు మా వందనము
మాజీవితమునమిమ్మెన్నడును 
మరువకుందుము గాక.





22 అక్టో, 2016

నును తావి తెరలు ..

తొమ్మిదవ తరగతి పిల్లలకు  
తెలుగు పాఠం శివతాండవం 
సిద్దిపేట కోదండ రామశర్మ గారు ఆలపించారు వినండి.. 

20 అక్టో, 2016

శిరోమదీయం పురశ్చన తిరశ్చన..


వ్యాసతు స తు గౌతమతు.. వ్యాళేంద్రతు.. యోనవేత్తి సాహిత్యం
సంప్రతి తంప్రతి కంప్రతి శిరోమదీయం పురశ్చన తిరశ్చన..
సాహిత్యం కానిదాన్ని 
అది వ్యాసు డై నా మరొకరైనా నేను 
చూడనన్నాడు ఒక కవి. 



12 అక్టో, 2016

గంధవహు తాళానికనువుగ..






బహు రత్నద్యుతి మేదురోదర దరీ భాగంబులన్ - బొల్చుని
మ్మిహికాహార్యమునన్ జరింతు మెపుడున్ ప్రేమన్నభోవాహినీ
లహరీ శీతల గంధవాహ పరిఖేలనంజరీ సౌరభ
గ్రహణేందిర తుందిలంబులివి మత్కాంతార సంతానముల్

పై పద్యం ప్రత్యేకంగా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారికి యెక్కువగా ప్రీతిపాత్రమైనదంటారు. 
మాటిమాటికీ వారీ పద్యం చెప్పేవారని 
చాలా మంది చెప్పగా విన్నాను. 

నేనొక్కసారి మాత్రమే చెళ్ళపిళ్ళవారిని చూశాను.
అప్పటికే ఆయనవృధ్ధుడు. 
ఏదో నా అంధ్ర సంస్కృత కవిత్వాలు వినిపించి వచ్చేశాను. ఇంతకూ ఆయన అం తగా మెచ్చుకునే వాడంటే 
ఈ పద్యంలో యేదో వుండివుంటుంది.

వరూధిని తన అ డ్రసుప్రవరునితో చెప్పే 
ఘట్టంలోనిదీ రచన. 

హిమవత్పర్వతాలలో అనేకాలు దరులుంటాయట. 
ఆ దరులలోపల నానా వర్ణములు గలిగిన రత్నాలు 
ఆ రత్నాల కాంతులతో 
ఆ గుహలు జిగ జిగ వెలిగిపోతుంటాయి. 

ఆకాశగంగ అక్కడే పారుతూ వుంటుంది. 
ఆ నదిపై నుండి వీచే చల్లని గాలులు 
పైగా అవి వట్టి గాలులు కావు. 
చందన మందారాదులైన అనేక వృక్షాలనూ పూలనూ స్పృశించి చల్లగా వీస్తుంటాయి. 

గాలికి ప్రధానంగా మూడు గుణాలు చెప్తారు. 
గంధమూ శైత్యమూ మాం ద్యము 
గంగానదీ తరంగ సంగమంతో వీచే గాలులైన దానివలన అవి చల్లగా వున్నై. 

వివిధ పుష్పలతాదులను స్పృశించి వచ్చేదానితో 
ఆ సుగంధాలన్నీ గాలిలో మిళితమై వుంటాయి. బ్రహ్మాండములైన చెట్లు 
వాని సంచారాన్ని అడ్డగించే దానివలన 
ఆ వాయువులు మందంగా వీస్తున్నాయి. 

ఇన్ని గుణాలనూ పెద్దన్న 
 'గంధవహ ' శబ్దంతో సూచిస్తున్నాడు. 
ఆ గాలుల తాకిడివల్ల 
తీగలలోని పుష్ప మంజరులు చలిస్తున్నాయి. 

ఆ పూగుత్తుల సౌరభములతో ఆకర్షింపబడి 
తుమ్మెదలు బారులు గట్టి పరిగెత్తుతూ వుంటాయట. 
అట్టి తుమ్మెదలతో నిండినవి 
తాను నివసించే హిమాలయ ప్రాంతాలని వరూధిని 
తన ఘనతను చెప్తూ వుంది. 

ఈ మాటలు అందరు కవులూ చెప్తే 
ఇక్కడి 'గంధవహ' శబ్దం 
అర్థపుష్టితో పరమ ఆకర్షణీయంగా వాడబడింది. 

రెండవ పాదం తుద నుండీ ప్రారంభమైన సమాసం సుమారొకటిన్నర పాదాన్నాక్రమించుకుంది. 
అది సంస్కృత సమాసమైనా
 సంస్కృత సమాసమని మనకు తోపింపచేయదు. 
కఠిన పదమొక్కటిన్నీ కనిపించదు. 
మెత్తగ ద్రాక్షారసం వలె సమానంగా సాగిపోతుంది

ఇలాంటి సమాసాలు సృష్టించడంలో 
పెద్దనామాత్యుడు సిధ్ధహస్తుడు. 
ఆయన రచన  అంతా శిరీష కుసుమ పేశలమైనది. 
బుధ్ధిని వేధించే క్లిష్ట కల్పనలకు గానీ 
సమ్యుక్తాక్షరాలకు గానీ పెద్దన్నగారు విరోధి. 

ఆయన కావ్యమంతా విసుగు లేకుండా 
ఒక్క వూపుతో చదివేయవచ్చు. 
పై పద్యంలో సమాసానికి మురిసిపోయి వుంటారు చెళ్ళపిళ్ళవారు. 
వారి మెప్పు నిజమైనదే.

2 అక్టో, 2016

దూత కావ్యాలెన్నో ..

flying on sea hanuman కోసం చిత్ర ఫలితం

పుట్టపర్తి రచించిన మేఘదూత కావ్యము 
కాళిదాసు మేఘదూతమునకు అనుసరణ ప్రాయమని నామ సామ్యమును బట్టి తెలియుచున్నది. 

దూత కావ్యమునకు మార్గోపదేశము ప్రధానము. రామాయణములోని హనుమంతుని దౌత్యమును ఒరవడిగా పెట్టుకొని 
కాళిదాసు మేఘదూతమును వర్ణించినాడనుట జగత్ప్రసిధ్ధమే. 

కాని వాల్మీకి నుండి కాళిదాసు గ్రహించినది 
కేవలము సందేశము కాదని 
మార్గోపదేశమును గూడ వాల్మీకి నుండియే 
కాళిదాసు గ్రహించినాడనవచ్చును. 

కిష్కింధకాండలో నీ అన్వేషణకు 
వానరులను నాలుగు దిక్కులకు పంపుచు సుగ్రీవుడు ఆయా దిక్కులలోని విశేషములను ఆటంకములను గొప్పదనములను వివరించును. 

తరువాత సుందరకాండలో 
హనుమంతుని సందేశ సన్నివేశమున్నది. 
ఈ రెంటిని మేళవించి 
కాళిదాసు ప్రత్యేకముగ దూతకావ్యము నిర్మించెను. 

ఇది తరువాతి సందేశ కావ్యకర్తలకు మార్గదర్శకమైనది. 
ఈ విషయము దృష్టిలో వుంచుకునే కాబోలు
 పుట్టపర్తి తన కావ్యములో 
హనుమత్సందేశమును స్మరించెను.

''హనుమంతుడొకనాడు
ఆర్ద్రహృదయుడు దూత
నీవొకడవేనేడు
నెనరు కల్గిన దూత ''
- వఝల రంగాచార్య 


12 సెప్టెం, 2016

ఆచెడు భావముల్.. కలచునప్పుడు..

శివతాండవంపై 
శ్రీ వఝ్ఝల రంగాచార్యులు  గారు పరిశోధన చేశారు
పుట్టపర్తి రచనలను విశ్లేషిస్తూ
'పాద్యము ' గురించి వారు క్రింది విధంగా రాసారు.

భగవంతుని 
గురుదేవునిగా యోగిపుంగవునిగా భావిస్తూ 
ఒక జీవుడు చేసే ఆత్మ నివేదన 
ఈ పాద్యము.



పరమాత్మ 
సర్వ జగన్నియామక శక్తిగా 
సానంద సాకార స్వరూపునిగా 
మొదటి రెండు కావ్యములందు వర్ణింపబడెను యోగపుంగవునిగా సంభావింపబడెను. 

పాద్యమునందు అట్టి పరమాత్మయే 
యోగిరూపమున గురుదేవుని రూపమున 
తన ఇంటికరుదెంచెనని చెప్పబడినది.


'' తరుణాబ్జ తుహిన ముక్తామాల బోలునే
  త్రముల దయార్ద్ర భాష్పములతోడ
  గంభీరభావ నిష్కలుష దీప్తులు పర్వి
  యొరబెట్టి విడిచిన పరిధితోడ
  నవరసాల కిసాల ప్రవిమలారుణకాంతి 
  నొడిగొన్న జుంజురు జడలతోడ
  నావంటి పతితులెందరినైన రక్షింప
  జూచిన అభయహస్తంబుతోడ... 

  యజ్ఞవేదికవలె బవిత్రారుణములు
  నిండుచూపులు దిక్కులనిండి వెలుగ
  మా గురుస్వామి నాపాలి మధురమూర్తి
  వచ్చినాడమ్మ మా ఇంటివరకు నేడు''



  ఈ పద్యమున 'ఇల్లు' అనగా 
భక్తిభావనాకుటీరము. 
అందొక సుమూర్తమున 
పరమేశ్వరుని రూపము ప్రత్యక్షమైనది. 
ఆ రూపము 'యోగి రూపమువలె' వున్నది.

పుట్టపర్తి ఈ రూపమును సంభావించుటకు కారణము ఆయన ఉపాసించెడి 
'అష్టాక్షరీ మంత్ర' ప్రభావమనవచ్చును. 
నారాయణ ఋషి ద్వారా 
అష్టాక్షరీమంత్రము లోకమున పరంపరగా ప్రవచింపబడెను. 

మంత్రమునకు ..మంత్రద్రష్టకు ..
అభేదమును భావించుట సంప్రదాయము. 
ఈ విధముగ పరమాత్మ రూపమును 
యోగి రూపముగ కవి సంభావించెను. 

ఆయన దివ్య రూపమును కీర్తించి 
తన వేదన లేక ఆర్తిని ప్రకటించెను. 
ఈ నివేదన 
భగవంతుని గుణాధిక్యము 
ఆత్న న్యూనతా భావముగా 
ఇరువది ఏడు పద్యములలో సాగినది. 

సృష్టింపబడిన ఛందోమయాకారం కూడా భావానుగుణముగా నున్నది. 
భగవంతుని స్వరూపము సీసపద్యమునందు వర్ణింపబడెను. 

తరువాతి  వన్నియు తేటగీతిపద్యములు. 
ఈ పద్యములలో జీ వుని వేదన వర్ణింపబడి 
అహంకారము త్యజింపబడినది. 

చివరకు తన్మయీభావస్థితిని 
జీవా త్మ అనుభవించినది.
ఆత్మ సమర్పణము భక్తి భావనాదశలలో చివరిమెట్టు. 

ఆ స్తితిని చేరకముందు 
భక్తునకు భగవంతునియెడ ఆసక్తి యుండును. 
ఈ ఆసక్తి భావనాపరము. 
దీనినే నారదాదులు అహేతుకమగు పదునొకండు భక్తి భావనాసక్తులుగా చెప్పిరి.

 ఆత్మ నివేదన మొనరించిన భక్తునకు 
పరమేశ్వరుడు ఎలవేళలా 
అతడు కోరినట్లు దర్శనమిచ్చుచుండును. 
భగవంతుని అనుభవముగాఢమై 
భావనలు పరిపక్వమై 
రసపర్యవసాయి అగును. 

భక్తి రసాయన కారులు వీటినే 
దాస్య సఖ్య మధుర శాంత రసములుగా చెప్పిరి. 

నారదాదులు చెప్పిన భక్తిభావములు - రసములు
గుణమాహాత్మ్యా సక్తి
స్మరణాసక్తి
రూపాసక్తి
పూజాసక్తి
దాస్యాసక్తి 
ఆత్మ నివేదనాసక్తి 
వాత్సల్యాసక్తి
కాంతాసక్తి
పరమవిరహాసక్తి
తన్మయతాసక్తి

పాద్యమునందు వర్ణింపబడిన జీవేశ్వరుల సంబంధము గాఢమైనది కాదు.
ఒక సన్ముహూర్త మున .. 
' కల వలె హతాత్తుగా వచ్చి '
 భగవంతుని రూపము నిలచినది

ఆ రూ పమును కనులార దర్శించి 
తనివితీర సంభాషింతమనుకున్నంతలో 
అందులకు తాను 'అర్హుడనా.. ?'
 యను సందేహము కల్గి జీవుడు కొట్టు మిట్టాడినాడు.

ఈ దశలో భావములు 
ఒకదానిపై ఒకటి యుబికి రాగా 
వాటిని నిలుపుకోలేక పోయినాడు
జీవుడు  భగవంతుని రూపమును దర్శించుటలో 
కలిగిన ఈ భావాసక్తులనే 'పాద్యము' వర్ణించినది

''సాత్మస్మిన్ పరమ ప్రేమ  రూపా' 
ప్రేమ  యనగా ఒక వస్తువునందు లేదా వ్యక్తియందు కల్గెడి అనురాగము. 
లౌకికమైన ప్రేమ  ఉపాధులనాశ్రయించి యుండును. అలౌకికమైన ప్రేమ 
భగవంతుని రూపము నాశ్రయించి యుండును. 
అట్టిదియే భక్తియని నారదాదుల అభిప్రాయము. 

ఉపనిషత్తుల యందు ఈ ప్రేమ భావనము 
'ఉపాసన' యని పేర్కొనబడినది.

లౌకిక విషయములందు ప్రేమ క్షణికమైనది. 
కాని భగవంతునియందు కల్గెడి ప్రేమ 
తైలధారవలె అవిఛ్చిన్నముగా నుండవలెను. 

పరమశబ్దముచే ఈ ప్రేమను 
భగవంతుని యందు తప్ప 
ఇతరుల యందుండకూడదని నారదాదులు సూచించిరి. 

భగవంతుని యందుండు ప్రేమ 
నిష్కామముగా నుండవలెను. 
పెనుగొండ లక్ష్మియందు మొదటిపద్యము లోని ప్రేమాధీశ్వరుడాను వర్ణనమిట్టిదే.

భగవంతుని సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్వమూ 
కవి సృజనాత్మక సాహిత్యములోని 
మొదటిపద్యమునందే ప్రకటింపబడినవి. 
పాద్యమునందు 
వాత్సల్య సౌశీల్య సౌలభ్యములు వర్ణింపబడినవి. 

'' వాసనయెలేని క్షుద్రపుష్పమ్మునెవరు 
  తలధరింతురు రాలిపోవలెనెగాని
  బ్రతుకుజీకిన నా ప్రేత హృదయమెంత
  ఇంపుగానందుకొంటివోయి గురూజీ''

తన బ్రతుకు 
'వాసనలేని క్షుద్ర పుష్పము ' వంటిదని 
ఆత్మన్యూనతను వెల్లడించి, 
ఇటువంటి నికృష్ట జీవితమును ఆకర్షించిన 
భగవంతుని స్తుతించెను. 

ఈ వర్ణనలో  
'' మహర్షీ ''
అని భగవంతుని సంబోధించుట చేత..
'యమే వైషవృణుతే తేన లభ్యః'
అను ఉపనిషద్వాక్యమిచట అనువర్తించును.
పాపినిగానీ.. పుణ్యవంతునిగానీ..ఎవరినైతే భగవంతుడు స్వీకరించాలనుకుంటాడో.. 
అతనిపై తన అవ్యాజకృపాకటాక్షము ప్రసరింపజేసి స్వీకరిస్తాడని అర్థము.
భగవంతుని వాత్సల్యము అవ్యాజకృపా కటాక్షము పైపద్యమున వర్ణింపబడెను. 

రెండవపద్యములో భగవంతుని వాత్సల్య భావమును 
'' ఆ మహాఋషి చూపులయందు పొడమి జీవకారుణ్యమెల్లడా చిలికినదియో'
అని జీవకారుణ్యమూర్తిగా సంభావించెను.

నా పేదహృదయమెంత ఇంపుగానందుకొంటివోయి మహర్షి.. '' 
అనుటలో ఇట్టి భావన విశదమగుచున్నది.
భగవంతుని వాత్సల్య గుణమును సన్నుతించుట
 భక్తి భావనా సక్తులలోని గుణ మహాత్మ్యాసక్తి యని చెప్పవచ్చును.
తన ను  అకారణముగా ఈ సంఘము బహిష్కరించినదని తాను తిరిగి మరణించుటకే జన్మనెత్తిన జడుడనని 
తన కారుణ్యగాధ భగవంతునికి నివేదించెను.

శివతత్వసారము మొదలగు భక్తి శతకములలో 
'నేనొక నికృష్ట మనుజుడ.. '
నని ఆత్మన్యూనత్వమును వెల్లడించుటకనిపించును

ఆధునిక కవులలో భావకవులు కొందరు 
తమను తాము అతి దైన్యంగా చిత్రించుకుని 
భగవంతుని కరుణామయునిగను 
పాపులను రక్షించువానిగను అభివర్ణించిరి. 

ఇది క్రీస్తు మత ప్రభావము కావచ్చును. 
ఆప్తుడగు జీవుడు తన దైన్యమును 
భగవంతునకు నివేదించి ఆయన కటాక్షమును కోరును. 

ఇట్టి జీవునకు 'ఆర్తుడ'నిపేరు. 
పాద్యమునందు కనిపించెడి
జీవునివేదనలో ఆర్తి లక్షణమున్నది.

'' లౌకికవిషాదముల గుండె రగిలి రగిలి
   నీ చరణ సీమ నాశ్రయించితిని నేను ''

భగవంతుని ఆశ్రయించిననూ 
ఆ సంబంధములోని ఒక నూత్న అనుతాపమును జీవుడు పొందుచున్నాడు. 
అతని దర్శనము జీవునకు అంత స్పష్టముగా లేదు. అందువలన..

'కలవలె హటాత్తుగ వచ్చి నిలిచినావు
 తండ్రి పతితుడ ఈ గృహాంతరమునందు
 సత్యమునువోలె నెపుడు శాశ్వతముగాగ
 నిండుచూపుల నన్ను మన్నింపవయ్యా..''

అని కోరుకొనెను.
స్వప్నావస్థ వలెనున్న అస్పష్టానుభవమును 
'సత్యము' వలె శాశ్వతము చేయుమని కవి భావన. 
ఈ పద్యమున రెండు విశేషములున్నవి.


 పరమాత్మను సత్యముతో నుపమించుటచేత
 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా '
అను ఉపనిషద్వాక్యమిచట అనువర్తించును.
పరమాత్మను 'తండ్రి' అని సంబోధించుట పాద్యమున రెండుమూడుచోట్ల కనిపించును
జీవేశ్వరులకు గల నవవిధ సంబంధములలో 
పితాపుత్ర సంబంధమొకటి. 

'పితాచరక్షకశ్శేషీ' అనుసంబంధము పాద్యమున 
జీవుడు ప్రదర్శించినాడనవచ్చును.

శాశ్వతముగా తన  హృదయమున నిలువుమని.. భగవంతుని ప్రార్థించినకవి
అతనికి సమర్పించిన 'ముఖపూజ' విలక్షణమైనది.
పలుకరింతమని బుధ్ధిపుట్టునుగాని 
వెంటనే సిగ్గు ఆవరించును..
మనసులో భావ శబలత్వమున్నది.. 
దరిజేరి నిలచెదామనినంతనే .. శరీరము కంపిం చి.. గుండెలు దద్దరిల్లుచున్నవి.. 

రాక రాక వచ్చిన గురుదేవుని జూడగా 
కనుల భాష్పములు నిండినవి..
ఆ భాష్పపూరంబుతో పాద్యమిడుదుననుకొనినంతలో

'ప్రతిజలకణము పరమ పూతంబు 
తమ పేరు పలుకదేమో'
అని సందేహము..

ఈ విధముగా సాగినది ముఖపూజ..
ఇందురేఖామాత్రముగా 'కాంతాసక్తి' కని పించుచున్నది..

తనను కాంతగా చిత్రించుకొని 
పరమాత్మను ప్రియునిగా భావించుట
కాంతాసక్తి.
ఈ విషయము అయిదారుపద్యములలో వర్ణింపబడి చివరగా..

'' నా తలపుపంట.. నావాడు.. నాధవుడు.. '' 
అని స్పష్టముగా మధుర భక్తి భావన.

తరువాతి రెండుపద్యములలో 
పుత్రభావముతో తల్లడిల్లుట వర్ణింపబడెను
జీవునకు కల్గిన ఈ అనుతాపము
 అతనికి అంటియున్న అహంకారము వలన కల్గుచున్నదని గ్రహించి 
ఆ అహంకారమును త్యజించెను.

'నేననెడి భావమున తెగనీల్గిపోవు
 శిరమువంచితి గురుదేవు చరణ సీమ'

'నేను' అను భావమును విడనాడుటయే 
అహంకార త్యాగము. 
అహము తొలగిన వెంటనే 
సర్వము భగవదధీనము అగును.
అదియే ఆత్మ  నివేదనము.

ఈ స్తితిలో కామ్యమునకు తావుండదు.
అందువలన అంతఃకరణము పరిశుధ్ధమై 
గురుదేవుని అమృత మయమైన వాక్కులను వినగల్గెను.
రూపమును కనగల్గెను..
అతని శీతలఛ్చాయలో తన్మయమును అనుభవించెను.

ఈ విధముగా పాద్యపద్య తారావళియందు 
జీవేశ్వరుల సంబంధములోని 
భావాసక్తులు ప్రకటింపబడినవి. 

ఇందు ప్రకటింపబడిన జీవుని వేదన 
'వేదనాశతకము'
 నందు విస్తృతముగా వివరించబడినది. 
భగవంతుని గుణాధిక్యము విభూతులుగా 
తద్విభూతుల అనుభవము గాఢమై 
భక్తి భావాసక్తులు
 దాస్య సఖ్య మధుర శాంతి రసములుగా
'విభూతి శతకము' నందు పర్యవసించినవి.

ఒక విధముగా పాద్యము 
వేదనాశతక .. విభూతి శతకములకు 
సంక్షిప్త రూపమని చెప్పవచ్చును.


















31 ఆగ, 2016

అతడే శ్రీ శ్రీ


అతడే శ్రీ శ్రీ  పేరున  వస్తున్న శ్రీ శ్రీ సాహిత్య నిధి లో ప్రచురింపబడ్డ పుట్టపర్తి అభిప్రాయం 

29 ఆగ, 2016

అంతో ఇంతో నవ్వబ్బా..

నవ్వు ఒక రకమైన ముఖ కవళిక
నవ్వడమంటే 

రెండు పెదవులు సాగదీయ బడతాయి
నోటి నుంచీ ఒక శబ్దం వస్తుంది..
ఆ శబ్దం..
రక రకాలు

సాధారణంగా
 సంతోషం..ఆనందం కలిగినపుడీ చర్య జరుగుతుంది..
 

 ప్రతి సందర్భంలోనూ
మనం రక రకాల నవ్వులని చూస్తాం
కొందరు ముసి ముసిగా ..
కొందరు గట్టిగా..

పసి పాపలవి బోసి నవ్వులు 

విరగబడి .. పగలబడి .. 
వికటంగా .. కుటిలంగా . . 
ప్రకటి తం గా.. అప్రకటితంగా .. 
ప క ప కా .. విక వికా..
అబ్బో .. నవ్వులెన్నో

నవ్వు  వ్యక్తుల మధ్య  స్నేహాన్ని 
సంభాషణల్లో ఉత్తేజాన్ని కలిగిస్తుంది .. 

అంతేకాదు 
నవ్వు అనేది ఆరోగ్యకరమైన అంటువ్యాధి .. 
దీన్ని సైన్సు జెలోటాలజీ అంటుంది .. 
హాస్యాలలో కూడా  రక రకాలు 
ఏ రంగాలలో ఉన్నవారికి 
అందులో  హాస్య సంఘటనలు ఎదురవుతాయి 
డాక్టర్లు యాక్టర్లు కలెక్టర్లు డ్రైవర్లు కండక్టర్లు గుమాస్తాలు కవులు కళాకారులూ .. 
 పోతన కవిత్వము గురించి వ్రాసిన పుట్టపర్తి 
ఆయన లోని హాస్యాన్ని కూడా స్పృశించారు 



శ్రీనాధునిలో విపరీతమైన హాస్యముకలదు..
అతనిది మందహసితము గాదు..
అతి హసితము..
ఒక్కొక్కసారి అప
సితము గూడ..
 

పోతనామాత్యులయందును హాస్యమున్నది..
శ్రీనాధుడు భోగ్యవస్తువులన్నియు నమరియుండి నవ్వినవాడు..
పోతన పరమ దారిద్ర్యములోనుండి..

తృప్తిగ నవ్విన భాగ్యశాలి..
కాని నగవునందును వారికి గొంత సమ్యమనమే యున్నది..
 

సామాన్యముగ పోతన్నది మందహాసమే..
అరుదుగా తప్ప హద్దు మీరిన చోటుండదు..
కృష్ణుని బాల్య లీలలలో 

యీ హాస్యము కొంత చోటు చేసుకొన్నది..
కాసంత యెక్కువ గూడనేమో..
తమరు చదివికొనవచ్చును..
 

వామనునికథలో 
గురుశాప తప్తుడైన పరిస్థితిలో గూడ బలి..
తన మందహాస ప్రియత్వమును విడువలేదు..
 

అనగా..
దుర్భర దారిద్ర్యమునందును పోతన్న..

తన హాస్య ప్రియత్వమును మానలేదన్నమాట..
ఆ పద్యమీ క్రిందిది..
 

పుట్టినేర్చుకొనెనో.. పుట్టక నేర్చెనో..
చిట్టి బుధ్ధులిట్టి పొట్టి వడుగు..
బొట్టనున్న వెల్ల బూమెలునని నవ్వి
యెలమి ధరణిదాన మిచ్చెనపుడు..

కాని సాధా రణముగ నిట్టి వరుదు..
 ఒక్క పదముతోనో
వాక్యముతోడనో
హాస్యమును సూచించుట పోతన్న వాడుక
 

యయాతి చరిత్రములోని యదువు చెప్పిన 
యీ క్రింది పద్యమట్టిది..
కాంతా హేయము దుర్వికారము దురా కండూతి మిశృంబు హృ
హృచ్చింతామూలము పీనసాన్వితము ప్రస్వేద వ్రణాకంపన
శృఆంతిస్ఫోటక యుక్తమీముదిమి వాంఛందాల్చి నానాసుఖో
పాతంబైన్ వయో నిధానమిది యయ్య తేర యీవచ్చునే..?? 
దీనిలో
'తేర యీవచ్చునే..'
అను పదము చదివి నపుడు మాత్రమే 

కాసంత మన పెదవి విచ్చును..

ఒక్కొక్కసారి
పోతన్నయే మన యెదుట నిలచి.. చిరునవ్వుతో
కెదికి హెచ్చరించుటయు కద్దు..
అట్టిది యొకటి..

తజ్జనని లోగిటంగల
రజ్జు పరంపరల గ్రమ్మరం సుతుగట్టన్
బొజ్జ దిరిగి రాదయ్యె జ
గజ్జాలములున్న బొజ్జ తఘ్ఘన్ వశమే..

అట్టి చోటులలో గూడ నితని హాస్యము లలితమైనదే..
ఈ పద్యమును చూడుడు.

''పొడుపు గొండమీద పొడుచుట మొదలుగా
బరువు వెట్టి వినుడు పశ్చిమాద్రి
మరుగు జొచ్చెగాక మసలిన చలిచేత..
జిక్కె చిక్కె ననగ చిక్క కున్నె..?? ''

ఈ పద్యము నందు నాల్గవ పాదమునందు మాత్రమే కొంత హాస్యమున్నది..
సాధారణముగ నాతనికి చేష్టలతో హాస్యమును వణించుట ప్రీతి..
ఇందుకుదాహరణములు 

తమరు గోపికల క్రీడలు మొదలైన వానిలో చూడవచ్చును..

1 ఆగ, 2016

డా.రేవూరి అనంతపద్మనాభరావు గారు

డా.రేవూరి అనంతపద్మనాభరావు గారు కడప ఆలిండియా రేడియో లో డైరెక్టరుగా పనిచేసేవారు 
1975 ప్రాంతాల్లో వారు మహాకవి పుట్టపర్తి పుత్రసమానుడిలా వారింటికి 
ప్రతిరోజూ వచ్చి ఒక గంటా రెండు గంటలు సాహిత్య చర్చలలో గడిపి వెళ్ళేవారు 
'ఒరే పద్మనాభుడూ '
అని పుట్టపర్తి వారు ఆయనను సంబోధించేవారు 
స్టేషన్ డైరెక్టరైనా ఆఫీసు అయిదున్నరకు అయిపోగానే పుట్టపర్తి వారిని చేరే వాడినని వారు చెప్పుకున్నారు 
పద్మ నాభరావు గారు అవధానాలు చేసేవారట మొదట్లో 
ఒకసారి అవధానం చేస్తున్న పద్మనాభరావుగారిని చూసి పుట్టపర్తి వారు 
 ఒరే మన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే గ్రంధ రచన చేయాలిరా 
ఈ అవధానాలు ఒట్టి సర్కస్ మాత్రమే
 వీని వల్ల ఒరిగేదేమీ లేదు అన్నారట
 అందువల్లనే 
తరువాత వారి అమూల్య సలహాను శిరసా స్వీకరించి 
 అవధానాలు తగ్గించుకొని గ్రంధరచన మొదలు పెట్టాను 
ఇప్పటికి దాదాపు ఎనభై పుస్తకాలు రాసిన తృప్తి నాకుంది 
ఒక పుస్తకానికి పుట్టపర్తి వారితో ముందు మాటకూడా వ్రాయించుకున్నాను అన్నారు
 చిన్నదాన్నయినా నాపై ప్రేమతో దయతో వారు ఇంటర్వ్యూ ఇవ్వటమే కాకుండా 
పొత్తూరి సాంబశివ రావ్ గొల్లపూడి వంటి మరికొన్ని ఫోన్ నంబర్లు ఇచ్చి ప్రోత్సహించారు
 వారికి నా కృతజ్ఞతలు 
 ఇక డా.రేవూరి అనంతపద్మనాభరావు గారి పుట్టపర్తి వారి స్మృతులు చూద్దామా ..

24 జులై, 2016

21 జులై, 2016