6 ఫిబ్ర, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు ..గత జన్మ .. పునర్జన్మ. (పుట్టపర్తి అనూరాధ)


గత జన్మ ..
పునర్జన్మ..
మనిషికి ఎప్పుడూ వీడని మిష్టరీలు..
మరణం తరువాత మనిషేమౌతాడు..
మరో జన్మ వుంటుందా..
ఈ సమస్య సామాన్యులనే కాదు..
మేధావులనూ వేధిస్తుంది.
మరణమనేది ఒక తెర ..
ఆ తెర వెనక్కి పోయిన వారు తిరిగి రాలేరు..
అక్కడ యేముందో తెలియదు..
అనేవారు అయ్య..
ఈ జగన్నాటకం నుంచీ నిష్క్రమించిన అయ్య..
ఆ తెర వెనుక సత్యాలను తెలుసుకునే వుంటారు..
తిరిగి వచ్చి చెప్పటానికి ఆయన పిచ్చివాడా..
తన ఆత్మ పురో గతి చూసుకోక..
తన చుట్టూ వారిని ప్రభావితం చేయాలని జీవిత కాలం ప్రయత్నించారు మరి..             

 








పూర్వ జన్మ ..
   పునర్జన్మ ..                                             
అనే కీలకమైన ప్రశ్నే..
నన్ను చంపుతూ ఉంది...

లేకపోతే ..
నేను అట్లా కంప్లీట్ గా..
మార్క్సిష్టు గా మారిపోలేక పోవడానికీ..

లేకపోతే ..
ఇట్లా ..కంప్లేట్ గా ..
అరవింద్ ఫాలోయర్ ..
కాకపోవటానికీ ..

ఆ ప్రశ్ననే ..
నన్ను అటూ ..ఇటూ ..
త్రాసులో తక్కెడలాగా..
ఊగే టట్టుగా చేస్తున్నది..

కార్ల్ మార్క్స్ ను చదువు కున్నప్పుడు..
బ్రహ్మాండమైన సానుభూతీ ..
తరువాత ..
అరవింద ఘోష్ ను చదువుకున్నప్పుడు.. 

అయ్యో ..
కేవలం భౌతిక దృష్టి తో..
తరువాత వాటినంతా ..
మానవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడేమో ..
అనేటటువంటి దృష్టీ ..

పృధివీ .. ప్రతిష్టా..
అంటాడు ..అరవింద ఘోష్..
భూమి లేనిది పరలోకమే లేదు పోరా ..
అంటాడు..
అందుకే ..
అతనంటే నాకు చాలా ఇష్టం..
బుధ్ధిజాన్నీ ..
సన్యాసి తత్వాన్నీ ..
అరవింద ఘోష్ అంగీకరించడు. 
సన్యాసి తత్వమంటే మహా కోపము ఆయనకు..

అట్లానే..
లైఫ్ పట్ల ఇంట్రస్ట్ లేకుండా చేసే టటువంటి..
బుధ్ధిజం అన్నా ..ఆయనకు చాలా కోపం ..
కనుకనే..
వీరిద్దరినీ..
ఎవరైనా  దగ్గరికి తెస్తే బాగుంటుందా ..
అనేటటు వంటి చాపల్యం..
చాలా తీవ్రంగా ఏడిపిస్తూ వుంది నన్ను ..

 పూర్వ జన్మ అనేటటువంటి దాని పైనా..
దైవ తత్వం పైనా..
నాకు నమ్మకం ఉన్నది..
అదే నా జీవితాన్ని నడిపిస్తూ ఉన్నది..

2 ఫిబ్ర, 2012




కేతు విశ్వనాధ రెడ్డి..
రాచమల్లు రామచంద్రా రెడ్డి ..
వై సి వి రెడ్డి ..
బండి గోపాలరెడ్డి..బంగోరే 
అందరూ మా ఇంటికి వచ్చే వారు..
వీరందరినీ తరచూ ..
మా ఇంట్లో సందర్శించే భాగ్యం ..
వారి చర్చలు వినే అదృష్టం కలిగింది.
వారందరూ అయ్యను ఎంతో గౌరవించే వారు..
అంతే కాకుండా ..
ఒక తండ్రిలా అభిమానించే వారు..
అయ్య కూడా..
తన కంటే చిన్నవారైనా ..
వారిలో ఒక్కనిగా కలిసి ..
కేతు విశ్వనాధ రెడ్డి.
వారి భావాలను పంచుకొనే వారు.
మార్క్సిజాన్ని క్షుణ్ణంగా చదివిన రా రా గారికి..
మార్క్సిజాన్ని అమూలాగ్రమూ ..
ఆకళింపు చేసుకున్న..
మహా కవి పుట్టపర్తి నారాయణా చార్యులకూ..
ఇంక దూరమేముంది..
వై సి వి రెడ్డి
చలం..
శ్రీ శ్రీ ..
కొడవగంటి కుటుంబరావ్ ..
మహీధర రామ మోహన రావు ల గురించి..
రా రా చేసిన మూల్యాంకనం చాలా లోతైనది..
వాదోపవాదాల్లో దిట్ట ..
శ్రీ శ్రీ ఆయనను..
క్రూరుడైన విమర్శకుడు..
అని అన్నారట..
రాసినవి ఎక్కువ సమీక్షలే అయినా ..
గొప్ప విమర్శకుణిగా చరిత్రలో నిలచిపోయాడు..
అయ్యతో వీరికి చిక్కని సాన్నిహిత్యం ఉండేది..
 వీణి గదాఘాతం నుంచీ తప్పించుకున్న వాణ్ణి ..
బహుశా నేనొక్కణ్ణే నేమో..
అనేవారుఅయ్య నవ్వుతూ..


రాచమల్లు రామచంద్రుణ్ణి గూర్చి..
వాడంటే నాకు ..
గొప్ప ప్రేమ ..
అభిమానమూ..
గౌరవమూ ఉన్నాయి..
చాలా నిశితమైన విమర్శకుడు.
క్షుణ్ణంగా చదువుకున్నవాడు.. 

చాలా మంది కమ్యూనిష్టులున్నారే..
వీళ్ళంతా ఫీల్డ్ వర్కర్స్ ..
మార్క్సిజాన్ని గురించి..
లాక్షణికంగా ..
వీళ్ళకు తెలిసింది చాలా తక్కువ ..
వాడు అటువంటి వాడు కాదు. 

శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసిన వాడు..
ఎక్కడా రాజీ పడకుండా ..
మహా కఠినమైన విమర్శకుడు. 

ఒక రకంగా వాడి గదా ఘాతం నించీ..
తప్పించుకున్నవాణ్ణి ..
నేనొక్కణ్ణే ..అని అనుకుంటున్నాను..?
 
నన్ను చూస్తే మాత్రం ..
నా కవిత్వాన్ని గురించి ..
వాడికే అభిప్రాయం ఉన్నా కూడా..
స్వామి బాగా చదువుకున్న వాడు..
చదువులో ఆయన్ని మించిన వాడెవడూ లేడు. 
అనేంత వరకూ ..
గొప్ప అభిమానం నాపై ఉండేది. 

మొన్న గూడా ..
ఇంకో రెండు మూడు రోజుల్లో పోతాడనంగా ..
హైదరాబాద్ పోయినాడంట. 

ఏదో ఇట్లే మాట్లాడుతా వుంటే..
స్వామి చాలా గొప్ప వాడు.. 
కానీ ఏం చేస్తాం..
ఆయనకు రావాల్సినంత 
పేరు ..ప్రఖ్యాతులు ..రాలేదు..
అని అన్నాడంట 

రష్యానించీ వచ్చినప్పుడు..
చెక్కపై వేసిన రెండు పైంటింగ్స్ తెచ్చినాడు.. 
ఇంతకూ ఎవ్వరి తోనూ రాజీ పడని..
కర్కశమైన అభిప్రాయాలు ఉండేవాడు వాడు.. 

కార్ల్ మార్క్స్ తత్వమును ..
బాగా అర్థం చేసుకున్న వాడు..  
ఇంకా కొంత కాలం బతక వలసిన వాడు ..
పాపం ఏం చేస్తాం..

1 ఫిబ్ర, 2012






 నా వయస్సెక్కువై పోయింది ..
నా చేత కాదు..
ఆ మాట..
అయ్య నోటి వెంట వింటే..
నాకు మనస్సంతా పిండినట్లవుతుంది.
 
ఎవరైనా సహాయం చేయగలిగితే..
నా ఆయుష్షును ..
అయ్యకు ఇచ్చి వేయాలని..
నా మనసు తహ తహ లాడేది..
అమ్మ ఉన్నంత వరకూ..
అయ్యలో ఈ బేల తనం ఉండేది కాడు.
 
అయ్యా నేనూ ఉన్నప్పుడు..
అయ్య కొంతలో కొంత ..
నన్ను చూసి జీవించాలనే ఇచ్ఛ ఉండేది..
అదీ నా కోసం..
అమ్మ తోనే అయ్య లోని సర్వ శక్తులూ పోయాయనిపించేది..
 
కేవలం అంతర్ముఖులై..
చివరి బాధ్యతైన నన్ను ఓ దారికి చేర్చి
జీవన్ముక్తిని పొందాలని అయ్య అనుకున్నారు..

నా పెళ్ళి కుదిరి నప్పుడు ..
నాతో పరోక్షంగా ..
మానవ సంబంధాలన్నీ ..
ఆర్థిక సంబంధాలే అన్నారు..
ఆ మాటే ..
నాకు ఇప్పుడూ..  కుచ్చు కుంటూ  వుంది..
 
అయ్యకు నా పెళ్ళి కుదరాలని వుంది..
ఇప్పుడే ఎందుకు అనీ వుంది..
ఇద్దరం తోడుగా ..

అమ్మ లేమిని తీర్చుకుంటున్నాం..
స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేని..
అయోమయ స్థితిలో ..
పెళ్ళి అనే ..
ఒక తాడుకు బందీ కావలసి వచ్చింది.
 
అదే పెళ్ళిని త్రోసిపుచ్చి ..
అయ్యకు తోడుగా నిలిచే..
ఒక నిర్ణయం తీసుకొని వుంటే..
 ఎంత బాగుండేది..
అని నా ఆత్మ నన్ను చంపుతూంది..
అయ్యను ..
ఆ వదినకు ఆహారంగా వేసి..
నిస్సహాయంగా వదిలి..
వచ్చినానని వేదన తినేస్తూంది.

అలా చేసి వుంటే..
అయ్య ఇంకో పది సంవత్సరాలు ..
సంతోషంగా జీవించేవారు..
తాను అనుకున్నవన్నీ పూర్తి చేసే వారు..


అయ్యకు పెన్షను అయిదువందలే..
జగమంత పేరు సంపాదించిన..

ఆ విజ్ఞాని..
కనీసం తన భద్రత కోసమైనా ..
కాసంత డబ్బును..
సంపాదించుకోలేక పోయాడు..
ఆ వదిన ధన పిశాచి..

అన్నయ్య ఆమె విధేయుడు..
 

ఇంక ఆ ముసలి వాడిని ..
ఆ వైకుంఠ నాధుడే కాపాడాలి..
కోట్లకు కోట్లు జపం మింగిన ఆ కృష్ణుడేడీ..?

కనపడడేం..? 
నా మనసును..
ఈ రోజు చెప్పకుంటే..
ఇంక ఏ రోజూ చెప్పలేను..
అనిపించింది..
 

ఠాగూర్ అంటే నాకు ప్రాణం..
ఇందులో ఏ సందేహమూ లేదు..
 
నా దృష్టిలో ..
శాపవశాత్తూ ..
ఇలకు దిగిన గంధర్వుడాయన..
నఖశిఖ పర్యంతమూ..
కవిత్వ స్వరూపమే అయిన మహావ్యక్తి ..



కానీ..
ఆయన గడ్డకు రావటానికి..
జీవితంలో కీర్తి ప్రతిష్టలు అందుకోవడానికీ..
ఆయన పడిన కష్టాలు వర్ణనాతీతాలు..
ఇటు చాదస్తులతోనూ..
అటు అసూయాపరులతోనూ..
విపరీతమైన
బాధలూ ..
కష్టాలూ.. 
అనుభవించినాడు. 

 
ఎంతగా అతన్ని హేళన చేసే వారంటే..
యూనివర్సిటీ వాళ్ళు..
ఆయన పాసేజ్ కో చేసి..
దీన్ని వ్యాకరణ శుధ్ధమైన భాషలో వ్రాయుడు..
అని క్వశ్చన్ ఇచ్చే వారు

పాపం..
అంటే ..
ఆయన దంతా తప్పుడు భాష అని లెక్క ..
ఇట్లా..
విపరీతమైన శ్రమలు పదినాడు..
కానీ ..


ఆయనలో కవిత్వం కానటువంటి పదార్థం..
ఒక్కటి కూడా లేదు..
ఎందుకూ ..
కొంత కొంత మంది ..
భారత దేశంలో ఎందుకు పుట్టినారా అనిపిస్తుంది..?

అట్లనే ..
అరవింద ఘోష్ ఠాగూర్ ..
నఖశిఖ పర్యంతమూ సౌందర్యమైతే..
అరవింద ఘోష్ ..
తత్వ స్వరూపుడు...
నాకు చాలాసార్లు..
ఈ చాపల్యం ఇప్పటికీ పట్టి పీడిస్తుంది..
ఈ కార్ల్ మార్క్స్ నూ..
ఈ అరవింద ఘోష్ నూ..
వీళ్ళిద్దరి సిధ్ధంతాలనూ
సమన్వయం చెసి ..
ప్రపంచానికి అందించగలిగి ఉండేటటువంటి ..
ఒక మహా వ్యక్తి ఉండినట్లయితే..
ప్రపంచం బాగుపడుతుందేమో ననే పిచ్చి..

ఈనాటికీ.. నాకు ఉన్నది...
నాకు వయస్సెక్కువై పోయింది..
నా చేత కాదు.

29 జన, 2012



నాకు స్ఫూర్తి నిచ్చిన సంఘటనలు..
మా ఇంట్లోనే వుండేవి...
నన్ను కన్నతల్లి..
లక్ష్మీ దేవి ఆమె పేరు. 
నేను అనంతపురానికి ఏడు మైళ్ళ దూరంలో ఉండే.. 
చియ్యేడు..
అనే ఊర్లో పుట్టినాను. 
మా మాతా మహులంతా కూడా కాశీ పండితులు. 

మా పెద్ద తాత గారు కొండమాచార్యులవారు. 
వివాహానికి ముందే ..
మా తల్లి ఆయన కాశీ పండితులైనందువల్ల..
ఆయన దగ్గర సంస్కృతం చక్కగ నేర్చుకుంది. 
మంచి పాండిత్యం కూడా ఉండేదామెకు. 
కానీ నాకు ఐదవ సంవత్సరంలోనే ..
మా తల్లి చనిపోయింది. 

మా నాన్న గారు మైసూరులో..
కృష్ణ బ్రహ్మతంత్ర పరకాల స్వామి దగ్గర..
సంస్కృతం చదువుకున్నారు. 

అప్పట్లో వారితో పాటు చదువుకున్న వారు..
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు ..
రాళ్ళపల్లి గోపాల కృష్ణ శర్మ గారు..
మరికొందరు.. ఉండే వారు.
మా అమ్మ మరణించిన సుమారు పదునాలుగేండ్లకు..
మా తండ్రిగారు రెండవ వివాహం చేసుకున్నారు. 
ఆమెది మైసూరు..
సంగీతంలో చక్కటి సాధన చేసిన మనిషామె.

మా నాయన పరమ సాహిత్యప్రియులు. 
ఆయనది చాలా రసికమైన జీవితం 
మా ఇంట్లో ..
నిరంతరమూ సాహితీ చర్చలు జరుగుతూ ఉండేవి. 
వాటినన్నిటినీ కూడా చాలా శ్రధ్ధగా గమనిస్తూ ఉండేవాడిని. 

పైగా చిన్నప్పుడు నాకు ..
సంస్కృతమూ ..
తెలుగూ ..
తెలుగు ప్రబంధాలూ..
మా నాన్నగారే చెప్పారు..

ఈ రీతిగా ..
ఆయన సాహితీ జీవితం..
మా ఇంట్లో నిరంతరమూ జరుగుతూ ఉండేటటువంటి సాహిత్య సంగీత గోష్టులూ..
ఇవన్నీ నాకు బ్రహ్మండంగా స్ఫోరకాలైనాయి ..
చిన్నప్పుడు..
అప్పుడు నేను థర్డ్ ఫారం చదువుతూ ఉండేవాడిని.

నాకు ఒక చెక్క పెట్టె ఉండేది. ..
ఆ పెట్టెకు పక్కలో కూచొని ..
అల కవితా లోకమునకు ..
అనే కంద పద్యం మొదలు పెట్టినాను. 
మా నాయనగారు కాఫీ తాగి.. గడ్డకొచ్చి ..
నేను ఏదో మూడీగా..
ఆ లోచిస్తూ ఉండడం ..
గమనించారు. 
దూరం నుంచీ దగ్గరకొచ్చి..
ఏం రాస్తున్నావు ..?
అని ఆ పేపరు తీసుకున్నారు. 
అల కవితాలోకమునకు..
అని ఫస్ట్ లైన్ రాసినాను..
చాతకాని వాడివి..
పద్యం ఎందుకు ఆరంబించావురా ..
అని ..
కలిమికి వైరంబదేమి కలిగెను చెపుడా ..
కలికాల మహిమ ..
సద్గుణ కవికుల నృప సింహములకు  కనకుండుటయే రాసుకో  ..
అన్నారు..

ఇట్లా.. 
ఆయన ఆసువు మహా సులభంగా చెప్పేవాడు. 

కాఫీ తాగేవాడు. ..
సురలోకంబున కమృతము..
నరలోకమ్మునకు కాఫి..
..........
ఎరుగక కాఫీని తిట్టుటే ..మది నేర్పో ..
ఇట్లా.. 
(నవ్వు..)
మాట్లాడితే పద్యం చెప్పేటటువంటి ధోరణి ..
ఆయనకు ఉండేది. 

ఇది ఆయనపై తిక్కన కవితా ప్రభావమని..
నేను అనుకుంటాను. 
వీళ్ళంతా తిక్కన భక్తులు...
కట్టమంచి రామలింగా రెడ్డి ..
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ..
మా నాయనా ..

ఇలా..
మా నాయన గారికి ..
దాదాపు..
పదహైదు పర్వాలు నోటికి వచ్చు ..
అందువల్ల ..
ఆ ఆశు కవితా ధోరణి ..

తిక్కన ప్రభావం వల్ల ..
ఆ ఆశుకవితా ధోరణి అలవాటు పడిందేమో నని..
నా ఊహ ..
ఇట్లా ప్రతిదినమూ ..అడుగడుగునా..
మా ఇంట్లో ..                                  
ఈ సాహిత్య గోష్టులు ..
సంగీత గోష్టులూ..
జరుగుతూనే ఉండేవి ..
స్కూలుకు పోవడానికి పదిగంటల వరకూ..
రోజూ ఇదే చర్చ ..
ఇదంతా చాలా నిశితంగా గమనించేవాణ్ణి నేను. 

సాయంకాలం స్కూల్ నుంచీ వస్తూనే..
మళ్ళీ పదిమందీ చేరడమూ..
మళ్ళీ ఇదే చర్చ. 
నేను రాసే ప్రతి పద్యమూ కూడా ..
ఆయన నాకు తెలీకుండా చూస్తూ ఉండేవాడు.
అయినా..
ఆయన నా గూర్చి ఒక గొప్ప మాట చెప్పలేదు. 

నేను పెద్ద వాణ్ణయిన తరువాత గూడా..
నేనెక్కడైనా ఉపన్యాసాలిస్తూ ఉంటే..
ఆయన నాకు కనబడకుండా..
నలుగురిలో..
ఎక్కడో ..
అప్రత్యక్ష్యంగా ..
వినిపోతూ ఉండేవాడు. 


ఎవరైనా ఏం స్వామీ..
మీ కొడుకును గురించి ..ఒక్క మాట చెప్పరే?
అంటే ..
తండ్రి కొడుకు గురించి గొప్ప మాట చెప్పటం..
వాడికి ఆయుష్కరం కాదప్పా..!
అని చెప్పేటటువంటి వాడాయన..
అందువల్ల ..
నాకు సాహిత్యంలో ప్రవేశించడానికి..
ప్రబోధకమైన శక్తి మా నాయన. 
వాతావరణం మా ఇంట్లోనే ఏర్పడింది.
పైగా ..
నన్ను కన్నతల్లి ..
మా నాయన..
ఇద్దరూ కవిత్వంలోనే మాట్లాడుకోవడమూ ..
పద్యాలూ..                                      
శ్లోకాలలో ..
జాబులు రాసుకోవడమూ ..
కూడా చేసే వారు. 
నన్ను గురించి ..
మా అమ్మ ఒక పద్యం జాబులో రాసింది.

నీలాల కనులలో..
నిల్వ నుత్సాహంబు..
బుడి..బుడి..నడల..
నల్లెడల బాకు..
పట్టుకొమ్మని..
వెంటబడి పట్టబోవంగ..
యెత్తుకొమ్మని ..
చేతులెత్తు పైకి..
కురులు ఫాలస్థలంబున గునిసియాడ..
కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మనగ..
తాను నర్తించు..
ధయి..ధయ్యి..ధయ్యి..మనుచు..
చిన్న పాపడు సుఖముగనున్నవాడు..

27 జన, 2012

 
ఏ రచయిత అయినా ..
తన కాలానికి సంబంధించిన సమస్యలకే..
ప్రతిస్పందించి రచన చేస్తాడు కదా ..!
అటువంటప్పుడు..
ఆ రచనకి శాశ్వత కాలం నిలిచే శక్తి ఎలా వస్తుంది. 

జరిగే ప్రతి సన్నివేశానికీ ..
కవి హృదయం స్పందిస్తుంది. 
సందేహం లేదు ..


కానీ ..
ప్రతి స్పందనకూ ..
కావ్యత్వం యిస్తే ..
వాని స్పందన..
మనసులో ఎంతకాలం పని చేసిందో..
అంత కాలమే..
ఆ కావ్యానికి కూడా ఆయుష్షు వుంటుంది. 

కలిగిన ప్రతీ స్పందనను ..
రాయడం విజ్ఞతకు లక్షణం కాదు.
అందుకే అనుభవం కావాలంటారు. 
వయస్సు కొంత ముదరవలె ..
అప్పుడప్పుడూ..
చేకూర్చుకున్న సంస్కారం ..
ఒక పరిణతమైన స్థితికి వస్తుంది.
ఆ స్తితిలో రచన చేయ వలె ..

సమకాలిక సంఘటనే కావలసిన అక్కరలేదు. 
పూర్వకాల సంఘటన అయినా తీసుకోవచ్చు.
ఏది తీసుకున్నా ..
అందులో తన సంస్కారం చోటుచేసుకుంటుంది. 
ఈ విషయం ఇంకా విస్తరిస్తే పెద్దగా చెప్పవచ్చు. 

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను...
మళయాళం లో భాగవతం..
"ఎళుత్తచ్చన్" వ్రాసినాడు. 
అందులో కృష్ణుడు ఏడ్చినప్పుడల్లా..
యశోద అరటి పండు ఇస్తుందట..
కారణం ..
వాళ్ళ దేశాచారమది...

ఇలాంటివి ఎన్నో ఉంటాయి..
కలిగిన ప్రతి భావననూ ..
కాగితం మీద పెట్టడం ..
అదంతా ప్రింటు కివ్వడం..
చాలా అనాగరికమైన అలవాటు.
ఒక కవి పరిణతుడు కావడానికి ముందు...
ఎన్నో వ్రాసి చించి వేయాలి.

నేను ఎన్నో సార్లు ..
నా రచనలు అనేకం చించివేసాను. 
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు కావ్యాలే చించి వేసారు. 
రాసిందంతా ప్రెస్సుకు పోవాలనే..
నేటి యువకుల్లో కనిపించే దురాశ.
 
ఇప్పటి కవిత్వం దుస్థితిలో ఉందని ..
సాహితీ విలువలు పడిపోతున్నాయని..
చాలా మంది అంటున్నారు..
నిన్నటి మహా రచయితలు కూడా..
నేటి సాహిత్యం పై సదభిప్రాయాన్ని చెప్పటం లేదు. 
ఈ విధంగా ..
సమకాలీన సాహిత్యాన్ని యోగ్యంగా లేదనడం ..
కొన్ని దశాబ్దాలుగా కూడా వుంది. 
ఇదంతా చేమకూర వేంకట కవి చెప్పినట్టు..
ఏ గతి రచియించిరేని..
సమకాలము వారలు మెచ్చరే కదా..
అని అనుకోవచ్చా..
 
ఈనాడు వచ్చేదంతా ..
మంచి సాహిత్యం కిందకి చేరడం లేదనే మాట..
వివేకంతో కూడినదే ..
రాసే వాళ్ళకే విసుగైపోతున్నదన్నమాట.. 
ఇది ఒక శుభ పరిణామం..
ప్రమాణాలు పడిపోతున్నాయనే రొద కూడా..
వాళ్లలోనుంచే ఆరంభమౌతోంది..!

కానీ ..
వాళ్ళ దృష్టిలో ..
ప్రమాణాలనేవి ఏవో సరిగా చెప్పడం లేదు 
అక్కడే మళ్ళీ అస్పష్టత వుంది. 
వారనుకునే ప్రమాణాలు ఏవో..
కొంత విడదీసి చెబితే..
మా బొంట్లకు బాగుంటుంది. 

ఎంతసేపు చెప్పినా..
భాష ..
భావం ..
రెండే ప్రధాన వస్తువులు..

మరి భాష పడిపోయిందా..?
భావం పడిపోయిందా..?
వాళ్ళే తేల్చి చెప్పాలి. 
నా దృష్టిలో రెండూ పడిపపోయినాయి..

కొన్ని చిన్న కథలు..
నవలలు మాత్రం..
మంచివి వస్తున్నాయనిపిస్తోంది.
 
మీకు కోపం వస్తుందేమో..
నవలా సాహిత్యం ..
కన్నడంలో ..
తమిళంలో ..
బాగా వస్తొందనే అభిప్రాయం నాకుంది. 
ఇక కవిత్వ మంటారా.. 
ప్రతి భాష లోనూ ఇంతే అయిపోతొంది. 

ప్రతి భాషలోనూ ..
రాజకీయాల ప్రభావం ..
ఎంతవరకూ విసంకటంగా సాగుతుందో..
అంతవరకూ..
ఈ దుస్తితి తప్పదు.

వాల్మీకికి ముందు..
కావ్య రచన లేదంటారు కదా.. 
అటువంటప్పుడు ..
ప్రధమ రచన అయిన ఆదికవి వాల్మీకి రామాయణం ఇంతవరకూ కూడా..
స్థిరంగా నిలిచి వుండడానికి కారణం ఏమిటి..?
ఆ విధంగా సమగ్ర రచన చేసే శక్తి ..
వాల్మీకికి ఎలా సంక్రమించింది..?

ప్రాచీనులతో మనకు చిక్కే లేదు.. 
సరస్వతీదేవి ఆవిర్భావమే..
వాల్మీకితో ఆరంభమయ్యిందంటారు కదా..!
ఆ  ఆవిర్భావమే ..
సర్వాంగ సుందరంగా జరిగింది. 

కేవలం లౌక్య దృష్టితో ఆలోచిస్తే ..
నాకు తోచే అభిప్రాయమిది ..

సామవేదం కేవలం గానాత్మకం..
అధర్వణం ప్రయోగాత్మకం..
ఋగ్వేదం శృత్యాత్మకం..
వీటి అధ్యయనం వాల్మీకికి వుంది. 
కనుక రామాయణ రచన ..
సమగ్రంగా జరిగి వుంటుందని నా ఊహ..

ఇది నా ఊహ మాత్రమే సుమండీ..

కానీ ఒకటి నిజం ..
వాల్మీకి వలె ..
సర్వాంగ సుందరమైన రచన..
మరొక్కనికి చేయడం అసాధ్యం 

మరి ..
ఆయన సంస్కారమేమిటో ..?
ఆయన చదువేమిటో ..?
మనం గ్రహించలేం..
 
కొన్ని కొన్ని చోట్ల..
ఋగ్వేదంలో..
మనకు మంచి కవిత్వం దొరుకుతుంది. 
నా చిన్నప్పుడు ఋగ్వేదంలో..
కొన్ని ఘట్టాలు చదివి ఆశ్చర్య చకితుణ్ణి అయ్యాను. 
ఉషస్సూక్తులు మొదలైనవి...

అప్పుడే తెనిగించే సాహసానికి పూనుకున్నాను. 
తర్వాత ఎందుకో..
ఆ ప్రయత్నం నిలిచి పోయింది.
 
కడుపులో చల్ల కదలకుండా వున్న కాలంలో..
పురాణాలు ప్రబంధాలు రాశారు ..
అని ప్రాచీన సాహిత్యాన్ని ఎత్తి చూపే వారికి..
మీ సమాధానం ఏమిటి..?
అంతకు మించిన గొప్ప విలువలు..
నేటి రచనలు ప్రతిబింబిస్తున్నాయా..?

ఆనాటి వాళ్ళు కడుపులో చల్ల కదలకుండా ఉండడానికి కారణం ..
ఆనాటి రాజకీయాలు..
అంతే కాకుండా ..
అప్పటి వాళ్ళంతా కడుపులో చల్ల కదలని వాళ్ళే అనుకోవడం మన మూర్ఖత్వం. 
ఫ్యూడలిజం..
పెట్టుబడిదారీ సమాజం..
ఆనాటి నుంచీ ఇప్పటి వరకూ అనుభవిస్తూండేదే.
ముఖ్యంగా ..
నేటి మన జీవితంలో జీవశక్తి నశించింది..
జిజ్ఞాస పోయింది..
సుఖాన్ని కూడా చక్కగా అనుభవించలేని పరిస్తితికి వచ్చినాము ..
మన దౌర్భల్యానికి సిగ్గు పడకుండా..
వాళ్ళని నిందించడం..
"అబధ్ధం పఠత్వా కుతోద్యం కరోతి"
అన్నట్టు ఉంటుంది. 

కడుపులో చల్ల కదలక కాదు..
  చల్లే లేకుండా..
గొప్ప వాళ్ళైన వాళ్ళను..
ఎంతమందినో నేను చూసినాను.
ఇవన్నీ కూడా ..
ఆడలేక ..మద్దెల పైన మొత్తుకునే మాటలు..
ఇటువంటి వాని పైన నాకు సానుభూతి లేదు...
 
ఇలా ..
ఎంతో వివరంగా..
సునిశిత మేధాశక్తి ఉట్టి పడేలా..
నిష్కర్షగా ..
ఎన్నో సాహితీ విషయాలను వివరించారు. 
తెలుగు జాతి ఏనాటికీ మరువలేని మహా కవి..
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు...

ఆ సరస్వతీ పుత్రుని మాటలు.. 
అపూర్వ మేధా సంపత్తిని ప్రకాశింపజేసే..
మాణిక్యాల మూటలు..
ఆ విలువైన మాటల్ని ..
పాఠకులకు అందజేయాలని..
ఆయన దగ్గర సెలవు తీసుకుని..
బయలుదేరింది స్వాతి.
 
స్వాతి మాస పత్రిక అయ్యతో జరిపిన ఇంటర్వ్యూ లోని కొన్ని ఇవి...