7 సెప్టెం, 2012

భిన్నత్వంలో ఏకత్వం ..





యోగస్థః కురు కర్మాణి సజ్గం త్యక్త్వా ధనుంజయ 
సిద్ధ్యసిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే (శ్రీమద్భగవద్గీత)
ధనుంజయా! 
యోగనిష్టుడవై 
నీ నిత్యకృత్యములను నిర్వహింపుము. 
కర్మలయందు సంగము.. 
లేక ఆసక్తి వీడుము. 
సిద్ధించిన దానియందును, 
సిద్ధింపని దానియందును 
సమబుద్ధి కలిగియుండుటయే "యోగం". 
అంటే సమత్వమే "యోగం".

మా అయ్య నేనూసాయిబాబా దగ్గరికి వెళ్ళాం ..
నాకప్పుడు అయిదారేళ్ళేమో మరి
స్పెషల్ రూం లో ..
బాబా అయ్య ఇద్దరూ నేలమీద కూర్చున్నారు.
నేను ఇద్దరినీ మార్చి మార్చి చూస్తున్నాను.
 

కానీ 
నాకు వారేం మాట్లాడారో అర్థం కాలేదు.
ప్రయత్నించలేదేమో..
దాదాపు అరగంట సేపు 
సన్నని వెలుతురు ప్రసరించే 
ఆ గదిలో గడిపాం
 

ఇంకేముంది ..
అయ్య నేను ఇన్ని కోట్లు జపం చేసాను..
నాకు ఏమీ అనుభూతి కలుగలేదు ..
నా పరిస్తితి యేమిటి..
 

"సాధనలో మీ అనుభవం ఏమిటి..?"
ఇలా సంభాషణ జరిగి ఉండవచ్చు
లౌకిక విషయాలకు 

అయ్యవద్ద స్థానం లేదు కదా..
నేను అయ్య పాటను పాడినట్లు గుర్తు..
 

బాబా నా శిరస్సు నిమిరారు..
ఎంత గొప్ప అనుభవం
అసలు నేనెవరు.
ఈ జీవి యోగ్యత ఏమిటి..?
ఎందుకు ఒక జ్ఞాని కడుపున పుట్టాను..?
అని ప్రశ్నలు 
నేనూ వేసుకుంటూ వుంటాను..
 

ఇంటికి వచ్చిన అయ్య..
"బ్రహ్మాండంగా సాక్షాత్కరించిన యోగ శక్తిని 
అక్కడ నేను చూసాను.."
 అన్నారు.



పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి 
ఒక గురువు ఉండేవాడు ..
ఆయన పేరు నాకు తెలియదు 
కానీ 
ఆయన చిరునవ్వుతో 
చూసినవారికి పిచ్చెక్కినట్లవుతుంది. 
అంత గొప్ప ఏదో ఆ చిరునవ్వులో వుంది. 
ఇంతకూ ఆయన నన్ను ఆశీర్వదించాడు 
నేను ఆయనకు పాదాభివందనం చేసాను 
ఆయన మాణిక్య ప్రభువంశం వారికి బంధువు. 


నారాయణాచార్యులు గారు 
ఒకనాడు మా ఇంటికి వచ్చి 
"నీలో ఏమి సుగుణములున్నవని 
నా గురువు నిన్ను ఆశీర్వదించాడు..?"
అని అడిగాడు తీవ్రత నటిస్తూ..


నాలో ఉన్నవని కాదు 
ఉండాలని దీవించాడు 
దీవన అదనం ..
చిరునవ్వు దొడ్డది..
అన్నాను నేను.


"నువ్వు నా గురువుకు కూడా టోపీ వేసావా..?" అన్నాడు పుట్టపర్తి 
తనూ ఒక చిరునవ్వు నవ్వాడు. 
అది అతడి కవిత్వానికి మించినది. 
నువ్వు అదృష్టవంతుడివిరా అన్నాడు. 


ఆ తర్వాత 
ఒక అనుభవాన్ని చెప్పుకు పోసాగాడు. 
నారాయణాచార్యులు. 


దీని సారాంశం.
ఒకసారి పుట్టపర్తి 
సాయిబాబాను చూడడానికి వెళ్ళాడు నారాయణాచార్యులు గారు 
తన ఇల్లూ..
ఆయన ఊరూ ఒకటే అయినందున ..
తప్పేమీ సంబంధాలు ఇట్లాగే కొనసాగుతాయి 
అది అనుబంధమే అయిన సంఘటన ఇది.
 

ఆచార్యుల వారిని చూడగానే 
బాబాగారు సంతోషం ఉప్పొంగి 
"కవీ.. కవీ..
 శివతాండవం పాడవయ్యా.."
 అని పసిపిల్లవానిలాగా అర్థించాడు. 
ఆదేశించాడు 
ఆప్యాయతలో 
అభ్యర్థనకూ ..ఆదేశానికీ ..తేడా ఉండదు.
 

ఆచార్యుల వారికి 
శివతాండవం గానం చేయమని అడిగేవాడే 
రసికుడు కదా.. 


గానం ప్రారంభించినాడు 
బాబా ఆనందంతో 
ఇంత కలకండ (శూన్యంలోంచీ ) తీసి 
కవినోట పెట్టాడు. 
గానం ఆనంద చిత్రావతి అయింది. 
బాబా మరింత ఆనందంతో 
ఒక లాకెట్ శూన్యంలోంచీ తీసి 
కవి మెడలో వేశాడు. 
ఇట్లా వారి మధ్య సరస సంబంధం నడిచింది. 


ఆచార్యులవారు "వెళ్లి వస్తానని.."
 బయటకొచ్చాడు 
నడకన బుక్కపట్టణం చేరుకున్నాడు. 


అక్కడ 
ఒక శంకర పీఠస్వామి బస చేసి ఉన్నాడు. 
అతడు ఆచార్యుల వారికి చిన్ననాడు సహాధ్యాయి. 
అతడిని దర్శించి 
లాకెట్ వగైరా బహుమతులు చూపించి 
"ఇవన్నీ శూన్యంలోంచీ ఎట్లా వస్తాయి..?"
అని అడిగాడు ఆచార్యులు గారు. 



స్వాములవారు తన వంటవారిని పిలిచి 
వీరు నారాయణాచార్యులు 
నా సహాధ్యాయి 
గొప్ప కవి 
సన్మానించు 
అని ఆదేశించాడు. 



అతడు కలకండ శూన్యంలోంచీ తీసాడు
విభూది  కూ డా ..
కానీ అది చేతిలోంచీ జల జల రాలుతోంది 
నిక్కచ్చిగా మోతాదులో 
బాబా వద్ద వచ్చినట్లు రాలేదు. 


"ఇదేమీ..
 మోతాదులో రాలేదు జల జల రాలుతున్నదీ..?"
 అని ఆచార్లు అడిగాడు 
వంటవాడు "అదే.. ఇంకా తెలియటం లేదు.." అన్నాడు. 
"ఏది తెలియడం లేదూ ..?"
అన్నారు ఆచార్యులు. 
జవాబు లేదు..
వంటవాడూ ఆచార్లు గారిని తన ఓపిక ప్రకారం సత్కరించాడు. 
కాకపోతే లాకెట్ ఇవ్వలేదు.
 

అంతే ..
స్వాములవారు 
తాను అరవై ఏళ్ళనుంచీ జపం చేస్తున్నాననీ 
వంటవాడు మూడేళ్ళకిందట తన వద్దకు రాగా 
మంత్ర దీక్ష ఇచ్చినాననీ 
అతడు శూన్యంలోంచీ వస్తుజాలం తీస్తున్నాడనీ వివరించి చెప్పుకున్నాడు.
"ఎందుకు ఇట్లా అవుతుంది ..?"
అని ఆచార్లు అడిగాడు నన్ను 
అంటే ఆయన వద్ద తగు వివరణ ఉన్నదన్నమాట. 


"చెప్పండి.."  అన్నాను
"చెప్పేందుకేమున్నది ..?
ఒక్కొక్కని సాధన ..
ఒక్కొక్క విధంగా పరిణమిస్తూ ఉంటుంది. 
సాధకులందరికీ ఒకే అనుభూతి కలగాలని 
ఎక్కడైనా ఉన్నదా ..?
అంతమాత్రంలో 
అవతలవాని అనుభవం విరుధ్ధమని గానీ 
కొరగానిదని గానీ అనలేము..
దివ్యానుగ్రహం 
సహస్రానేక రూపాలలో లభిస్తుంది 
వీళ్ళకు అట్లా లభించింది..
మనకు ..?"
అని చెప్పుకుపోయాడు.
ప్రక్కనే ఉన్న కాఫీ చల్లారిపోతుంటే
 

ఎవరి సాధన వారిది ..
ఎవని అనుభవం వానిది..
ఎవని ప్రతిభ వానిది ..
అదే భిన్నత్వంలో ఏకత్వం ..
విడివిడి డ్రస్సులు 
సోకులు.. వాగాడంబరాలు..
కావు...
 
జి.కృష్ణ
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక.

5 సెప్టెం, 2012

పండరీ భాగవతము పీఠిక కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ




విశ్వనాధ వారు..
పుట్టపర్తి వారూ
సమ ఉజ్జీలు
మొదట స్పర్థ నెలకొన్నా
తరువాత మైత్రీ బంధం బలపరుచుకున్నారు.
 
విశ్వనాధ వారు 
కడపలో మా యింటికి తరుచూ వచ్చేవారట.
అయ్యతో అమ్మతో కూడా 
ప్రేమాభిమానాలు వారికి కద్దు
వంటింట్లో పీట పై కూర్చుని అమ్మతో 
వాల్మీకి రామాయణ విశేషాలు ముచ్చటించేవారుట.
 
అందుకేనేమో
అయ్య వారిపై అద్భుతమైన వ్యాసం వ్రాసి 
తన అభిమానానికి 
ఒక అందమైన రూపమిచ్చారు
విశ్వనాధవారు మురిసిపోయారుట ఆ వ్యాసానికి
 
"నాకంటే ఈయన కొన్ని విషయాలలో 
గొప్పవాణిగా పరిగణింపబడుట నేనెరుగుదును.."
అని వారు అనటంలోనే 
ఇద్దరి దగ్గరితనం కనిపిస్తుంది.
 
ఇది పండరీ భాగవతానికి పీఠిక
అయ్య ఒక్కో గ్రంధాన్ని ఏళ్ళతరబడి వ్రాసేవారు
 
ఈ రోజు కొంత వ్రాసి దాన్ని అవతల పెట్టేవారు
తరువాతెప్పుడో 
మళ్ళీ భావావేశం వస్తే మళ్ళీ దాన్ని పొడిగించడం
ఈ వ్యవధిలో 
విశ్వనాధవారి పీఠిక కనిపించలేదు
ముద్రణలో అందుకే అది లేదు.              
 

                   "పండరీ భాగవతము పీఠిక"
         కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ

పండరీ భాగవతమునకు 
విశ్వనాధ వారు వ్రాసిన పీఠిక ఇది. 
కాని 
కావ్య ముద్రణ సమయానికిది కనిపించలేదు. 
ముద్రణ ముగిసిన తర్వాత కొన్నాళ్ళకు దొరికినది.)

 
ఈ పండరి భాగవత గ్రంధ కర్త 
మహాకవి సరస్వతీపుత్ర పద్మశ్రీ 
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. 
ఈయన ఈ గ్రంధము వ్రాసి ముప్పదియేండ్లైనదట. 

ఈయన కీర్తి యంతకు ముందే మొదలు పెట్టినది. 
ఈ గ్రంధము మాత్రమిప్పుడు వెలికి వచ్చినది. 

ఇందులో 
పుండరీక చరిత్ర 
చొకామీళుని కధ 
నామదేవ చరితము 
గోరాకుంభారుకథ 
నర హరి  చరిత్రము 
అన్న అయిదు కధలు కలవు 
పందరీ క్షేత్రమునందలి మహా భక్తుల కథల సంపుటి
 
ఇది ద్విపద కావ్యము 
పూర్వము మన దేశములో 
కొన్ని ద్విపదకావ్యములు కలవు 
కొన్నింటికి కొంత మర్యాద కలదు. 

వేణుగోపాల శతకకర్త 
ద్విపదకావ్యములందు మర్యాద లేనివాడు. 
దానికి కారణమేమయి ఉండును ..?
పద్యమునందున్న వైశాల్యము 
ద్విపదకు లేదనచచ్చును 
ఒక లోతైన భావము 
ఒక విస్తారమైన భావము 
రచనా శిల్పము చేత మూర్తి కట్టించుటకు 
తగినంత వీలైన లక్షణము 
ద్విపదలో లేదని యాతడెంచినాడేమో.
 
కాని మన దేశములో 
స్త్రీల పాటలన్నియు ద్విపదలో నున్నవి. 
బసవ పురాణమునకు.. గౌరన హరిశ్చంద్రకు..
గల ప్రశస్తి కాదనుటకు వీలులేదు. 

రంగనాధ రామాయణము ద్విపద గ్రంధము. 
ద్విపద భారతమన్న గ్రంధము 
ఆంధ్ర విశ్వవిద్రాలయము వారు పూర్వమచ్చొంత్తించిరి. 

అందులో చాలా భాగము 
తిక్కన్న గారి పద్యాలు ద్విపదలో వ్రాసినట్లుండును. 
పద్య రచనకు ద్విపదరచనకున్న భేదము 
ఆ రెంటిని పోల్చి చూచినచో తెలియగలదేమో
 
ద్విపద యనిన తోడనే 
ఒక తాళము రెండు చరణములతో 
చెప్పదలచిన భావమైపోవుట. 
పాటకు వీలుగా నుండుట. 
సర్వజనులకు చదువుటకు వీలుగ నుండుట 
మొదలైన లక్షణములుండవలసినట్లు కనిపించవచ్చును.
 
ఈ కావ్యములో నా లక్షణములు చాలా నున్నవి. 
కాని ప్రౌఢి కూడనున్నది. 
కొన్ని చోట్ల దీర్ఘ సమాసములు కలవు. 
ప్రతి చరిత్రకు చివర 
కవి తన కథ చెప్పికొనుచుండును. 
దాని వలననే కవిని గురించిన వాకబు 
చాలా తెలియగలదు.

ఈయన వ్రాసిన గ్రంధము 
పూర్వ ద్విపద కావ్యముల కేమియు తగ్గిపోదు. తగ్గిపోదు సరికదా 
కొన్ని చోట్ల పూర్వ ద్విపద రచనకు 
మెఋగు పెట్టినట్లుండును. 

ఒక్క భేదము విస్పష్టముగా కనిపించును 
పూర్వ ద్విపద కావ్యకర్తలు 
సంస్కృతమును వాడినను 
వారిలో దేశ్య శబ్దముల బాహుళ్యము
విరివిగా కని పించును 

ఈ కావ్యములో మాత్రమే
 కొన్ని పలుకుబడులున్నను 
సంస్కృత శబ్దముల బాహుళ్యమెక్కువగా 
నున్నదేమో అనిపించును.
 
వ్రాసిన యైదు కథలు 
బంగారము వంటి కథలు 
కథలో ప్రాణమున్నచో
కవి యల్ప శక్తిమంతుడైనను భాసించును. 

అధికశక్తిమంతుడైనచో చెప్పవలసినదేమి 
ఈయన అధిక శక్తిమంతుడనుటకు 
తెలుగుదేశములో నీయన పొందిన 
ప్రతిష్టయే సాక్ష్యము. 
కాని ఈయన పద్యరచన కూడ 
మంచి ప్రౌఢముగా చేయగలకవి.
 
గ్రంధము చక్కగా ముద్రింపబడినది. 
అందందు ముద్రణ దోషములు 
లేవనుటకు వీలులేదు.
 
ఇట్టికవి 
పరుల యభిప్రాయమునాసించుట 
యెందులకో తెలియదు. 

అవతలి వానియందు 
గౌరవము నెరపుటకని యనుకొనుచున్నాను. 

మా నడుమ మైత్రి చాల ఏండ్లుగా కలదు 
కొన్ని కొన్ని యెడల నీయన 
నాకంటె గొప్పవాడుగ పరిగణింపబడుట నేనెరుగుదును. 

అట్టి నా నుండి యభిప్రాయమాసించుట 
వట్టి స్నేహధర్మము.
విజయవాడ
10.6.74

విమర్శ కుడు గా పుట్టపర్తి డా .జి .వి. సుబ్రహ్మణ్యం




సాహిత్య కారుడు..
సాహిత్య సృష్టి చేయటంలో 
వస్తువు చూట్టే తిరుగుతూ 
భూతకాలంలోనో భవిషత్ లోనో ఉండిపోతారు
దానిలో ప్రవహించే వివిధ రకాల 
రసావిష్కరణలో లీనమైపోతాడు
 
చర్మ చక్షువుకు అతీతమైన 
విషయాలను చూడగలుగుతాడు.
చూసిన విషయాలను సమర్థంగా వివరించడానికి వర్ణనాశక్తీ ప్రతిభావంతంగా వుండాలి
 
అంత కష్టపడి తయారుచేసిన కల్పనలో
తనకు బాధ్యతా అంతే వుంటుంది
తను రాసినది పదిమంది వికాసనానికి 
తోడ్పడకపోతే పో యె 
చెరచకుండా వుంటే చాలు
తప్పటడుగులకు అవకాశమిచ్చేది కాకూడదు..
 
సరే ..
ఒక కథో కావ్యమో తయారయింది.
రచయితకు తన రచనను తలుచుకుంటే ఆనందం
ఎవరైనా బాగుందంటే చెప్పలేని పొంగు
 
ఇలా ..
చదివిన వాళ్ళల్లో కూడా రక రకాల భావోద్వేగాలు 
వివిధ స్థాయిలలో కలుగుతాయి
 

ఒకడు బాగుందంటే..
ఇంకోడు ఏం బాగుందంటాడు..
మరొకడు భూతద్దాలు పెట్టుకుని 
తప్పులు వెదుకుతాడు..
ఇంకోడు శాస్త్రబధ్ధంగా దాన్ని విశ్లేషించడానికి దిగుతాడు..
 

ఇలా
ఒక కవి బ్రతుకు నలుగురి నోళ్ళల్లో 
నలిగి నలిగి బిక్కమొగమేస్తుంది.
కాస్త గట్టివాడైతే 
విమర్శను పాజిటివ్ గా తీసుకొని
ఒక వేళ తిట్టినా స్పోర్టివ్ గా తీసుకొని
మళ్ళీ కలం పడతాడు
 
చేసిన తప్పులను ఒకసారి సరి చూసుకొని
మళ్ళీ అలాంటితప్పు జరగకుండా జాగ్రత్తపడతాడు

విమర్శకుడు 
సృష్టికర్త కంటే హుషారుగా వుండాలి
కర్త చెప్పిన విషయం పై 
అతని కంటే ఎక్కువ అవగాహన వుండాలి
విశ్లేషించటంలో 

ఒక ప్రత్యేకమైన దృష్టీ నేర్పూ 
వ్యక్తీకరణా వుండాలి.

"విమర్శకుడుగా పుట్టపర్తి"
అంటూ జి వి సుభ్రమణ్యం గారు 
వారిలోని ఒక విశిష్టమైన కోణాన్ని 
మనకు చూపబోతున్నారు.
 
మా అయ్యగారి వద్దకు 
చాలామంది ముందు మాట వ్రాయమని వచ్చేవారు.
సాధారణంగా ఒప్పుకొనేవారు కాదు..
ఆయన స్థాయికి అవి అందేవి కాదు మరి..
 
కొన్నింటిని స్నేహ పూర్వకంగానో
మొహమాటంకొద్దీ వ్రాసినా
వారి కలం అందులోని మంచి చెడుగులలోకి 
తీక్ష్ణదృష్టిని ప్రసరించడానికి జంకేది కాదు.

వాటి ని అందుకున్నవారు 
విమర్శించినా అదేదో మహద్భాగ్యమన్నట్లు ఆనందపడేవారు.
అయ్య గారి పీఠికతో 
వారి పుస్తకానికి ఎంతో విలువ వచ్చేది మరి.
 
అందుకే 
"జలపాతస్నానం చేసిన ఒక క్రొత్తదనం 
చదువరులకు  అనుభూతమయ్యేది.."
అంటారు సుభ్రమణ్యంగారు.

ఆచార్యులవారు 
"ఈ శతాబ్ది సాహిత్య విమర్శకు
త్రివిక్రమ పరాక్రమాన్ని ప్రదర్శించిన పండితులు.."
అంటారు కూడా..

పుట్టపర్తి ప్రశంసిస్తే
మల్లినాధ సూరి వ్యాఖ్యానిస్తున్నట్లు వుంటుందట..
విలువలెరిగిన వివేకం
విజ్ఞతతో జీవిస్తున్నట్లుంటుందట..
చదవండి
చదవండి..


విమర్శ కుడు గా పుట్టపర్తి  
                       డా .జి .వి. సుబ్రహ్మణ్యం 


"అగ్ని శిఖల కన్నను జ్యోతిస్సు గల దీతని 
మనః ప్రవృత్తి 
వేయి కత్తి పోటుల కన్నను 
వాడియైనది మాట. 


ప్రపంచమునంతయు నొక్కసారిగ 
సహృదయతతో నింపివేయవలయునని ఈతని ఆశ. ప్రపంచమునకు తానొసగుదానికన్న ..
వేయిరెట్లధికముగ గోరువాడు..
ఆత్మనిశ్చయమెక్కువ ..
ధీరత చలించరానిది..

లేకున్న 
విశాలమగు ప్రపంచమును ధిక్కరించి 'యేనామకేచిదిహనః ప్రధయం త్వవజ్ఞాం జానంతి తేకిమపితాన్ ప్రతినైషయత్నః' 
అని ధైర్యముగా నిలిచి చెప్పుకొను గుండెలెవరికున్నవి..?

ఇంతేకాదు 
ఉత్తర రామ చరిత్రలో 
"వక్తవ్యమేవ వక్తవ్యం కుతోహ్యవచనీయతా - యధాస్త్రీణాం తధావాచాం సాధుత్వే దుర్జనోజనః

"నటీ అతి దుర్జన ఇతి వక్తవ్యం " 
అని పలికించి 
తనకు ప్రపంచముపై గల యేవగింతను 
కుండలతో గ్రుమ్మరించినాడు.."

భవభూతి- నాటక కర్త - శ్రీ పుట్టపర్తి



"The critic's duty is 
to keep communication open 
between reader and writer 
the present and past 
and also to indicate what of the past needs
 most attention in our time 
to keep in fact the classics before our eyes
 A related duty is 
to discriminate 
among the masses of the books 
being produced at the present moment
 in order to endure that 
the best works get a fair hearing. 

To do all this requires 
a highly developed sense of valus"
 - Philip Hossbaum (Essentials of Literary Criticism)


విమర్శ ..విమర్శకుడు..
అనుకోగానే పై ఫిలిప్ హాబ్స్ బాం మాటలు 
నా మనసులో తళుక్కుమని మెరుస్తాయి..

సరస్వతీపుత్ర 
శ్రీమాన్ పుట్టపర్తి  నారాయణాచార్యుల వారిని 
సాహితీ విమర్శకులుగా సమీక్షించేటప్పుడు ..
ముందుగా ఈ ప్రమాణాన్ని ముందుంచుకున్నాను. 

ఆచార్యులవారు ..
పధ్నాలుగు భాషా సాహిత్యాలలో ప్రజ్ఞా ధురీణులు 
ఆయా భాషా సాహిత్యాలలో 
గతంలోనూ వర్తమానంలోను 
ప్రవర్తిల్లిన సాహితీ ధోరణులూ..
ప్రక్రియలూ.. కవితాశైలులూ..
 కవుల సాహితీ వ్యక్తిత్వాలూ.. చారిత్రక విశెషాలూ..
 కళా మార్మిక శిల్పాలూ ..
వారికి కరతలామలకాలుగా ఉండేవి. 

ఆ అనంత పరిజ్ఞానం 
తులనాత్మక అనుశీలన విధానాన్ని 
తెలుగులో వెలుగు రేఖలు చిమ్మటానికి 
పుష్కలంగా తోడ్పడేది. 

అందువలన ఆచార్యుల వారు 
ఏ అంశం మీద మాట్లాడుతున్నా..వ్రాస్తున్నా..
భారతీయ భాషా సాహిత్య విజ్ఞాన సర్వస్వం 
ఆ అంశంలో ప్రతిఫలిస్తున్నట్లు ప్రత్యక్షమౌతుంది. 

అంతకు ముందు 
సాహితీ వి మ ర్శకులు దర్శించని 
ఎన్నో దృక్కోణాలు 
వారి అనుశీలనలో ప్రత్యక్షమయ్యేవి. 

 
పరంపరగా గతానుగతికంగా 
విద్వాంసుల మెదళ్ళలో 
గూళ్ళు కట్టుకున్న చాందస భావాలను 
వారి విమర్శలు బూజు దులుపుతున్నట్లుండేవి. 

 
ఒక జలపాత స్నానం చేసిన ఒక క్రొత్తదనం 
శ్రోతలకు అనుభూతమయ్యేది. 

 
విశే షమేమంటే 
గతాన్ని ఈనాటి వర్తమానానికి అనువుగా వ్యాఖ్యానిస్తున్నట్లు తోచేది. 

 
విమర్శకుడు ..
సాహిత్యం వెంట నడుస్తున్నాడా..?
సాహిత్యాన్ని విలువ కడుతున్నాడా..?
సాహిత్య సృష్టి కి ప్రమాణాలను కల్పిస్తున్నాడా ..?
 అని మూడురకాలుగా లోకం గమనిస్తూ ఉంటుంది. 

 
ఈ మూడింటిలో 
మొదటిరకం వారిని 'సమీక్షకులని' పిలుస్తుంది. 
రెండవ రకం వారిని 'అనుశీలకులని' వివేచిస్తుంది. 
మూడవరకంవారిని 'ప్రామాణికులని' గౌరవిస్తుంది. 

 
ఈ మూడంశలూ ఒకరిలోనే చూడగలిగితే 
ఆ విమర్శకుణ్ణి త్రివిక్రమునిలా ఆరాధిస్తుంది. 

 
ఆచార్యులవారు 
ఈ శతాబ్ది సాహిత్య విమర్శకు 
త్రివిక్రమ పరాక్రమాన్ని ప్రదర్శించిన పండితులు.
 

వారు 
ఈ యుగంలో చదవవలసిన 
క్లాసిక్స్ ను గురించి చెప్పారు 
మహాభాతోపన్యాసాలు చదివినా
 భాగవతోపన్యాసాలు చదివినా 
రంగనాధ రామాయణం 
వసుచరిత్ర 
పాండురంగ మహాత్యం మొదలైన గ్రంధాలమీద 
వ్రాస్తే.. ఉపన్యసిస్తే..
 వారే దానికి సమర్థులని 
సమకాలీన లోకం అనుకుంటూ ఉండేది.
 

వచన కవిత్వం పరుగు తీస్తున్న కాలంలో 
పదసాహిత్యాన్ని గురించి 
సంగీత సాహిత్య శిల్ప రహస్యాలను గురించి పదసాహిత్యంపై 
ఇతర భాషా సాహిత్యాల ప్రభావాలను గురించి సాధికారికంగా సంభాషించి 
విజ్ఞాననిధిగా చెలామణి అయ్యేవారు. 

 
నన్నయ్య గారికి తోడ్పడిన నారాయణభట్టు 
ఎలా ఉండేవాడో తెలుగు వారికి తెలియదు 

 
కాని ఈ శతాబ్దిలో 
నారాయణాచార్యుల వారి రూపంలో 
వారు అవతరించారా ఆధునికంగా అనిపిస్తుంది. 

 
వారి వాజ్మయ వారధిని తలచుకొంటే 
ఈ తరం దృష్టిని క్లాసిక్స్ వైపు మళ్ళించిన 
మహా విమర్శకులు వారు. 
అవి ఎందుకు క్లాసిక్స్ అయ్యాయో 
సాధికారికంగా నిరూపించి చెప్పిన 
ఆదర్శ విమర్శకులు వారు.
 

తెలుగులో నారాయణాచార్యుల వారిది 
ఒక సాహిత్య పీఠం 
విశ్వనాధ వారికి లాగానే 
వారికీ శిష్య వాహిని ఉన్నది. 
శిష్యులుండటం విమర్శక లక్షణం కాకపోవచ్చును 
కాని ఆయనదైన ఒక బాణీని 
తమ రచనలలో ప్రతిఫలింపచేసుకొనే
 ప్రతిభామూర్తులైన యువతరం ఒకటి ఉండటం విమర్శకాచార్య లక్షణం 

 
అందులో 
విశ్వనాధకూ పుట్టపర్తి వారికీ పోలికలున్నాయి 
ఇద్దరూ సమకాలీన కవులను ప్రోత్సహించారు 
వారి రచనలకు పీఠికలు వ్రాశారు. 
దరిచేర్చి తప్పొప్పులు చెప్పి 
వ్యక్తిత్వాలను ప్రసాదించారు. 

 
తమకు దగ్గరివారెవరైనా ..
తమ సాహితీ ప్రమాణాలకు 
వారి రచనలు అందక పోతే 
నిర్దాక్షిణ్యంగా వానిని విమర్శించారు.  

 
అందులో పుట్టపర్తి వారు సర్వస్వతంత్రులు 
వారి దృష్టికి ఆధునికులెంతో ప్రాచీనులూ అంతే 
అవసరం వస్తే నారాయణాచార్యులవారు 
విమర్శ నా స్త్రా లను  సం ధించారు. 
అవి శ్రీనాధునికి తగిలాయి. 
ప్రబంధకవులకు తగిలాయి. 
దెబ్బకొట్టి మన చేత తలలూపించే ప్రజ్ఞ 
వారికి పుట్టుకతో వచ్చిన తెలివి. 

 
నారాయణాచార్యులు ప్రశంసిస్తుంటే 
మల్లినాధసూరి వ్యాఖ్యానిస్తున్నట్లుండేది. 
విమర్శిస్తూంటే 
విద్వత్తు విరుచుకు పడుతున్నట్లుటుంది. 

 
విమర్శించినా 
మహాకవిని 
మహాకవిత్వాన్నీ 
కించపరిచేవారు కాదు 
అనౌచిత్యం ఉంటే వినేవాడు ఔనన్నట్లు 
తర్కబధ్ధంగా తులనాత్మక శోధనం ద్వారా వ్యక్తం చేసేవారు 

 
ఆయన విమర్శిస్తున్నప్పుడు 
విలువలెరిగిన వివేకం  
వి జ్ఞ త తో జీవిస్తున్నట్లుండేది 

 
ఇలా పుట్టపర్తి వారి విమర్శక వ్యక్తిత్వం 
 'ఫిలిప్ హాబ్స్ బాం' మాటలకు 
మంచి ఉదాహరణంగా మనకు తోస్తుంది.
 
పుట్టపర్తి వారు 
తమ వ్యాస సంపుటికి 
పరిచయ వాక్యాలు వ్రాసుకొంటూ..
తమ విమర్శక స్వభావాన్ని తెలియ చెప్పారు 

 
" విమర్శ ఉంటే ..
దానికి ప్రతి విమర్శన యెప్పుడు ఉంటుందన్న మాట..!! ఉండవలెను కూడ ..!!

 
కనుక ..
ఇంతకు తన విమర్శనలతో 
విమర్శకుడు చేయగలిగినదంతా 
తన తోడివారికి ఒక సూక్ష్మదృష్టిని కలిగించి 
వారిలో దాగియుండే 
విమర్శనా శక్తిని రెచ్చగొట్టడమే ..

 
నా యీ రచనలు అన్నీ 
అందరికీ బాగుండవలెనని నేను కోరను 
అట్లుండటము అసంభవము కూడ. 
అసలు రచయితకే కొంతకాలమైన తరువాత 
తన రచనలలోని కొన్ని సరిపడనివి ఉండును. 

 

అట్టిచో ..
ఇతరుల విషయమున చెప్పవలసినది లేదు 
ఇంతకును నా విమర్శనలు 
'నేను ఆయా గ్రంధములను ఎట్టి దృష్టితో చదివినాను..?' 
అనే విషయమును మాత్రమే 
పాఠకులకెరిగించును.."
 

ఈ మాటలు చదువుతుంటే 
పుట్టపర్తి వారి విమర్శక వ్యక్తిత్వం 
కొట్టవచ్చినట్లు కనబడుతుంది. 

 
వారు వాజ్మ యాన్ని దర్శించిన దృక్పధం 
వారి విమర్శ అద్దం పడుతుంది 
ఇంగ్లీషులో ప్రామాణిక అభిరుచి విమర్శకులు 
నడిచే దొడ్డ బాట ఇది. 

ఇది వైయక్తికమైన అభిమాన ద్వేషాలను 
వ్యక్తం చేసే విమర్శకాదు 
ఒక కవి దర్శన్నాన్ని 
ఒక విమర్శక దర్శనం ఢీ కొంటున్నట్లుంటుంది. 
అది విమర్శలో వేడిని.. వాడిని.. సృష్టిస్తుంది.
 
కొందరు విమర్శకులు 
వ్యాసాలను వర్ణిస్తున్నట్లు వ్రాస్తారు 
కొందరు వ్యాఖ్యానిస్తున్నట్లు వ్రాస్తారు. 
మరికొందరు సమన్వయిస్తున్నట్లు వ్రాస్తారు. 
ఇంకొందరు విశ్లేషిస్తున్నట్లు వ్రాస్తారు. 
మరి కొందరు 
ఎదుత వారిని ప్రేరేపిస్తున్నట్లు వ్రాస్తారు. 
కొన్ని నిప్పురవ్వల్లాంటి కొగ్రొత్త విశేషాలను 
దేశం మీద గ్రుమ్మరిస్తారు 
ఇలా ఎన్నో రకాలు 
పుట్టపర్తి వారు రెచ్చగొట్టే విమర్శలు చేసేవారు. 
వారి విమర్శ ఆలోచించే విస్ఫులింగాలను సహృదయులకందిస్తుంది. 
వారి విమర్శ 
ఆనందం కోసం గాని 
ఆహ్లాదం కోసం గాని చదువుకోం 

ఒక క్రొత్త చూపు కోసం 
వానిని చదువుకొంటాం 
నిద్రపోయే జాతిని మేల్కొలుపుతున్నట్లు 
విమర్శ చేయటం పుట్టపర్తి వారికే సరిపోయింది..!!

"ఒక మహావ్యక్తి 
అనేక ప్రక్రియలలో అత్యుత్తమ రచనలు చేసినప్పుడు వారిని ఏ విధంగా సంబోధించాలి ..?"
అనే అనుమానం మనకు సామాన్యంగా కలుగుతుంది. 

నారాయణాచార్యులవారు..
మహాకవి ..
భాషావేత్త ..
విమర్శకుడు..
వ్యాఖ్యాత ..
పరిశోధకుడు ..
అధ్యాపకుడు ..
వాదకుశలుడు ..
మహావక్త ..
సంగీత మర్మజ్ఞుడు..
పదకర్త ..
సంగీత కళానిధి ..
భక్తుడు..
ఇలా ఎన్నో కిరణాలున్న ప్రజ్ఞా ప్రభాకరులు
 

వీటన్నిటిలో మొదట లెక్కింపదగినది 
వారి కవితా శక్తియే 
మిగిలినవి దానికి దీటైనవని చెప్పలేము గాని 
వన్నె తెచ్చేవి.
 

ఇంగ్లీషు సాహిత్య చరిత్రలో 
ఆధునిక యుగారంభ దశలో 
కవులే విమర్శకులుగా రాణించిన యుగాలున్నాయి.
 మన తెలుగు సాహిత్యంలోనూ 
అటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి. 
అయితే కొందరు కవులైన దానికంటే 
విమర్శకులుగా ఎక్కువ రాణించారు. 

 
ఉదాహరణకు..
కట్టమంచి రామలింగా రెడ్డి గారిని 
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారిని 
పింగళి లక్ష్మీకాంతం గానినీ 
ఆ కోవలోని వారుగ చెప్పవచ్చు.
 

విమర్శకులైనా 
కవులుగా ఎక్కువగా తెలుగువారి చేత 
స్మరింపబడే వారి సంఖ్య ఇందులో మిన్న. 
విశ్వనాధ 
దువ్వూరి 
గురజాడ మొదలైన వారు 
ఈ కోవలోని వారు 

 
పుట్టపర్తి వారు కూడా 
ఈ వరుసలో తమ ఎత్తును గుర్తు చేస్తూ 
మన మనసుల్లో చిరకాలం నిలిచి ఉంటారు.
 

పుట్టపర్తి వారికి కవిత్వంలో లాగానే 
విమర్శలో కూడా ఒక బాణీ వుంది. 
ఒక చేవ ఉంది. 
ఒక పలుకుబడి ఉంది. 
ఒక శైలి ఉంది. 
ఒక అభివ్యక్తి ఉంది. 
ఒక ఆవిష్కృతి ఉంది. 
అన్నింటికంటే మించి ఒక ఆకర్షణ ఉంది. 

 
నారాయణాచార్యుల వారు 
మధురంగా విమర్శను వెలయిస్తారు. 
వారి విమర్శలో 
స్త్రైణమైన అభినయం కంటే 
పౌరుషమైన పరాక్రమం 
ప్రకటితమౌతూ ఉంటుంది.
 

సరస్వతీ పుత్రుల సాహిత్య విమర్శ 
తెలుగులో సరసత్వంతో కూడుకొన్న శాస్త్ర చర్చ 
"ఒకడు ' నాచన సోముడ" అన్నట్లు 
నారాయణాచార్యులు కూడా ఒక్కడు..

3 సెప్టెం, 2012

ఆశ్చర్యం..!! ఆనందం..!! ఎం ఎస్ రెడ్డి




అది ఎం ఎస్ రెడ్డి గారి
 శ్రీ కృష్ణ విజయం షూటింగ్ ..
నాగభూషణం గారు 
అచ్చం శ్రీ కృష్ణుని వేషధారణలో 
మేకప్ వేసుకొని కూచునివున్నారు.

ఎన్ టి ఆర్ గారు వచ్చారు..
వీడెవడు కృష్ణుని వేషంలో వున్నాడు..
అంటే శ్రీ
కృష్ణుని లానే వుంటుందీ పాత్ర  అన్నారట
అయితే అతన్నే పెట్టి సినిమా పూర్తి చేసుకోండి
అని చిరచిర లాడారట..ఎన్ టీ ఆర్
 
అతను  పౌండ్రక వాసుదేవుడు..
అచ్చం శ్రీ కృష్ణుని అనుకరిస్తూంటాడు
అతని ఆగడాలు భరించలేక 
ఒక నాడు కృష్ణుడతన్ని మట్టుబెడతాడు.
అని భాగవత వివరణ ఇచ్చారు ఎం ఎస్ రెడ్డి
కానీ మొదట భీష్మించిన ఎన్ టి ఆర్ ను 
నటిస్తే నటించండి లేకపోతే పోండి 
అన్న ఘన త ఎం ఎస్ రెడ్డి గారిదే.

తన నిర్మొహమాట మనస్తత్వంతో 
ఎన్ టి ఆర్ నే ఖంగు తినిపించిన మనిషి
 
నిర్మాతగా గేయ కవిగా పద్య కవిగా
చిత్రపరిశ్రమలో పెద్ద దిక్కుగా 
మంచి చిత్రాలు నిర్మించారు.

మల్లెమాల రామాయణం వ్రాసారు
సహజకవి ఆంధ్రా వాల్మీకి అని బిరుదులు
మంచి మనసు కల వాడూ
ముక్కు సూటిగా ఉండేవాడూ.
యం ఎస్ రెడ్డి గారు..

వారి తమ్ముడు వేణు గోపాల రెడ్డి గారు 
కడపలో మంచి డాక్టరు.
ఎన్నో సాహిత్యకార్యక్రమాలను 
ముందుండి నడిపించేవారు.
ఎం ఎస్ రెడ్డి గారికి పుట్టపర్తి  వారంటే  అభిమానం 
నా ఎనిమిదేళ్ళప్పుడనుకుంటా 
నేను అయ్య రాజన్న కవీ అందరూ 
మల్లెమాల గారి కుమార్తె పెళ్ళికి వెళ్ళాం
అప్పుడు రాజన్న నాకు జడలేసేవారు..
                            
 ఆశ్చర్యం..!!
ఆనందం..!!
 

నా పేరు ఊరు దాటక ముందే..
శ్రీ పుట్టపర్తి వారి పేరు
బహు భాషాకోవిదులుగా మహాకవిగా
తెలుగు నాడు ఎల్లలు దాటింది..!!
 
వారి సారస్వత పరిశ్రమను సమీక్షించడానికి
కొండంత అర్హత కావాలి..
అంచేత..
నేనాజోలికి పోదలుచుకోలేదు..
 
నారాయణాచార్యులవారికి షష్టిపూర్తి 
జరుపుతున్నారని తెలియగానే.
ముఫ్ఫైఏళ్ళ క్రితమే తన రచనల్లో 
మహనీయమైన మానవతా దృష్టిని ..
బహుముఖ రూపాలతో గోచరింపజేసిన
సరస్వతీపుత్రుని వయసు 
ఇప్పుడరవయ్యేనా..?
అని ఆశ్చర్యపోయాను..
 
సంస్కారమున్న ప్రతివ్యక్తి శతధా ఆకాంక్షించే
పుట్టపర్తి వారి నూరేళ్ళ జీవితంలో ..
అప్పుడే అరవయ్యేళ్ళు గడిచి పొయ్యాయా..?
అని బాధపడ్డాను కూడా..
 
అయితే..
ఇంత బాధలోనూ..
నాకొకందుకు ఆనందంగా వుంది..!
అది నారాయణాచార్యుల వారికి షష్టి పూర్తి జరుగుతున్నందుకు కాదు..
ఆ సందర్భంలోనైనా వారికి
కడపలో ఘన సన్మానం జరుపుతున్నందుకు..
 
ఏమైతేనేం..
కాస్త ఆలస్యంగానైనా..
పలువురు సాహితీ మిత్రుల సహకారంతో
ప్రతిభకు పట్టాభిషేకం చేస్తున్నందుకు..
 
నా తమ్ముడు చిరంజీవి వేణుగోపాల రెడ్డి నీ
తదితర సన్మానసంఘ సభ్యులను 
మనసారా అభినందిస్తూ..
కార్యక్రమం విజయవంతం కావాలని
కోరుకుంటున్నాను..
మీ
యం.ఎస్ . రెడ్డి.