4 నవం, 2012

ఆపాత మధురం ఆలోచనామృతం



                        ఆపాత మధురం ఆలోచనామృతం
                    డాక్టర్ చక్రవర్తుల రామానుజాచార్యులు

పుట్టపర్తి వారు
చనిపోయే కొద్ది నెలల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ

ప్ర. అవధానం చేస్తున్నంత జీవిత బిజీగా వున్నారనిపిస్తోంది మరి..

లేదు..
 అట్లా అనుకోవద్దు
ఎవరికి ఏమి చెప్పినా ప్రయోజనం లేదు
అని అంటూ దిండు కిందనుంచీ ఒక లెటరు తీసారు
ఒక అవధాని ఆశీస్సులకోసం మాచర్ల నుంచి రాసారు.
చూడండి..
 అంటూ ఉత్తరం చేతికి ఇచ్చారు

మీ లేఖ కోసం ఎదురుచూస్తున్నాను.. అని రాశాడు పైగా
నన్ను ధీషణా అని సంబోధించాడు.
ఇతని శాబ్దిక జ్ఞానం ఏపాటిది..?
ఇతడు అష్టావధానం చేస్తున్నాడట..!

ఇపుడు మా ఊళ్ళో కడపలో
ఒక పాతిక మంది అష్టావధానులున్నారు.
ఈ వీధిలో ఇద్దరు పక్క వీధిలో ఇద్దరు ఉన్నారు
తాలూకాఫీసులోని గుమాస్తాలను
పృచ్ఛకులుగా  ఏర్పాటు చేసుకొని
అవధానం ముగిస్తున్నారు.

ఇక అవధానం విషయానికి వస్తే
Avadhaanam is not at all a proper held
to exhibit the talents of a poet

ప్ర. మీరూ అవధానాలు చేసినట్లు గా కొందరు చెబుతున్నారు నిజమేనా..

అవును నేనూ
నా చిన్నతనంలో అవధానాలు చేశాను
ఒకసారి
మున్నూరున్ ముప్పదియారు దేవతలు..
అంటూ ఒక సమస్యను
నాగపూడి కుప్పుసామి గారు ఇచ్చారు.
నేనెక్కడ చచ్చేది
ప్రాసస్థానంలో శకట రేఫను నిలపాలి.

దీనికి సాధురేఫంతో ప్రాస కూర్చి సమస్యను పూరించాను.
తిక్కన మౌసల పర్వంలో
ఈ విధమైన ప్రాసవుంది చూసుకోమని
సభలో అందరినీ ఒప్పించాను.

మరునాడు నాగపూడి కుప్పుసామిగారి వద్దకు వెళ్ళి
సాష్టాంగ పడి
సామీ
ఇలాంటి ప్రాసలు కూర్చమంటే
అప్పటికప్పుడు నేనేమి చేసేది
అని ఒక్క నమస్కారం చేసాను.
వారు నవ్వి ఊరుకున్నారు.

నేటి పండితులపై పాండిత్యంపై మీ అభిప్రాయం

వెనకటి రోజులలో
పాండిత్యం కవిత్వానికి బలం ఇచ్చేది.
తర్క వ్యాకరణాలు క్షుణ్ణంగా చదివిన వారు ఆశుకవిత్వం అవధానం అనే ప్రక్రియల్లో రాటుదేలారు.
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రులు గారి
తార్కిక బుధ్ధి అనూహ్యం.
తిరుపతి శాస్త్రి గారి వ్యాకరణ జ్ఞానం అపారం

ఆనాడు ఒక సభలో పొందిన పేరు
వేరొక సభలో సన్మానం పొందడానికి యోగ్యత కాదు
మళ్ళీ కథ మొదలయ్యేది.

అందువల్ల ఆనాడు పండితులు
తాము చదివింది చివరివరకూ గుర్తుంచుకోవలసి వచ్చేది.
ఇలాంటి అస్త్రాలను తమ దగ్గర పెట్టుకుని
రాజసభల్లో ప్రవేశించేవారు.

ఈనాడు అలాంటి అవసరం లేదు.
ఎప్పుడో పరీక్షకు చదివి కాగితం (సర్టిఫికేట్) సంపాదిస్తే
అది ఉద్యోగాన్నిచ్చి కల్పతరువులా ప్రతినెలా వేలల్లో డబ్బు ఇస్తుంది.

రాళ్ళ పల్లి వారికీ మీకూ గాఢానుబంధం ఉండేదంటారు అది ఎలాంటిదంటారు.

రాళ్ళపల్లి వారు నాకు గురువు వంటి వారు
వారివద్ద నేను ప్రాకృత భాషను అభ్యసించాను వారు చాలా సౌమ్యులు He is a cool thinker వారు సంగీత సాహిత్యాలలో అపారమైన ప్రతిభ కనబరచేవారు.
ఆయన ఒక పాఠాన్ని ఏర్పరిస్తే
దానిని కాదనే దమ్ములు ఎవరికీ వుండేవికావు.

ఆనాడు ఎంత పండితుడైనా
ఎంత ప్రావీణ్యం పొందినా
నిరంతర సాధనను వదలి పెట్టే వారు కారు.
రాళ్ళపల్లి వారూ నేనూ
మైసూరు వాసుదేవాచార్య గారి వద్దకు వెళ్ళాం
అపుడు వారు తంబూరా మీటుతూ
ఒక వర్ణాన్ని సాధన చేస్తున్నారు.

ఏమిటి మీరు గొప్ప విద్వాంసులు కదా
ఇప్పుడీ సాధన యేమిటి
అని అడిగాను.

వాసుదేవాచార్యగారు
ఈ సాధన ఎంతవరకు చేస్తుంటానో
అంతవరకే నేను విద్వాంసుణ్ణి అని అన్నారు.

మీరు పదునాలుగు భాషలలో పండితులని పేరు పొందరు కదా

అని అందరూ అంటుంటారు
నేను మాత్రం అలా అనుకోను
ఎందుకంటే ఒక్క విషయం చెబుతాను
ఒక్క భాషలో పండితుడు కావటానికే
ఒక్క జీవితకాలం సరిపోదు
మరి అలాంటప్పుడు
పధ్నాలుగు భాషలలో ఎలాపండితుణ్ణవుతాను
కాకుంటే
నాకు ఆ పధ్నాలుగు భాషలకూ సంబంధించిన జ్ఞానం ఉంది.

మీరు ఆంధ్రేతర భాషలలో ఏమైనా రచించారా

నేను విశ్వనాధవారి ఏకవీరను మళయాళంలోకి అనువదించాను అలాగే కన్నడంలోకి మరాఠీలోకి కొన్ని కవితలు అనువదించాను.

పద్య సాహిత్యం గురించి మీ అభిప్రాయం

ఏముంది
సదభిప్రాయమే
అయితే ఈనాడు చిన్నచూపుకు గురి అయింది
నాకు తెలిసిన ఒకడు
కవితా గోష్టిలో పాల్గొన్నట్లుగా నాతో చెప్పాడు
అక్కడ ఏం చదివావు
అని అడిగితే
ఒక కవిత చదివానని చెప్పాడు
ఇతరులేమి చవివారని అడిగితే
ఒకరిని గూర్చి
అతడేవో పద్యాలు చదివాడు లెండి అని అన్నాడు

అంటే అతని ఉద్దేశం లో పద్యాలు కవిత కాదనా
ఇలాంటి అభిప్రాయం నేడు ప్రాచుర్యం పొందింది.
నా దృష్టిలో పద్య కవిత్వం ఏ భాషా సాహిత్యానికైనా ప్రధానమైంది.

మీ సమకాలిక తెలుగు కవులతో అనుభవాలు

మీ సమకాలిక తెలుగు కవులతో అనుభవాలు

సమకాలికుల్లో విశ్వనాధవరితో నాకు గాఢానుబంధం ఉంది.
ఏ వేదిక మీద మేమిద్దరం కలుసుకున్నా రగడ అయ్యేది మేము మొదట ధర్మవరంలో కలిసాము.
ఆయన రైలు దిగి వస్తున్నారు
ఆయనకు నన్నయ అంటే అపారమైన భక్తి
నేను కన్నడంలో పంప భారతం చదివాను
నన్నయ మీద పంపని ప్రభావం వుందని గ్రహించాను
ఆ విషయమే ఇప్పుడు
ఆంధ్ర సాహిత్య చరిత్ర గ్రంధాలలో చోటుచేసుకుంది.

అప్పటికీ నన్నయ మీద పంపని ప్రభావం అనే వ్యాసం
భరతి సాహిత్య పత్రికలో ప్రచురింపబడింది
దానిని ఆయన చదివి వున్నాడు
 ఏమయ్యా
 నీ ఉపన్యాసంలో పొరబాట్లు రాశావే
నన్నయ మీద పంపడి ప్రభావం ఉందన్నావు
నీ వాదనను ఖండించడం కోసమైనా
నేను కన్నడం నేర్చుకొని పంప భారతాన్ని పరిశీలిస్తాను.
అని విశ్వనాధ నాతో అన్నాడు.
నాకు స్పర్థ ఒక్క విశ్వనాధతో మాత్రమే
నేనొకసారి సాహిత్య అకాడమీలో విశ్వనాధతో
సత్యనారాయణా నీకు ఏపాటి సంస్కృతం వచ్చు
అని ప్రశ్నించాను

తిట్టించుకొని కూడా మళ్ళీ అదే ఇంటికి వచ్చే సౌజన్యం
ఆయనలో వుంది
నా భార్య 387 సారులు రామాయణాన్ని పారాయణం చేసింది విశ్వనాధ మా ఇంటికి వస్తే
వంట ఇంట్లో నా భార్యకు
తన కల్ప వృక్ష పద్యాలను వినిపించేవాడు
 ఆమె ఆ పద్యాలకు
corresponding verses మూలమ్నుంచీ చెబుతుండేది
ఆయమ్మ కాలం చేసి మూడు సంవత్సరాలయింది
విశ్వనాధ విషయంలో
ఆయనను మొడటి రోజుల్లో అందరూ ఎత్తి పొడిచారు
అయినా చెక్కు చెదరని ఆయన గుండెనిబ్బరం
తరువాతి రోజులలో ఆయనను మహాకవిని చేసింది

విశ్వనాధకు ఉన్న depth of learning
ఏ ఇతర కవిలోనూ లేదు
తాను తొలిరోజులలో అనుభవించిన హింసకు ప్రతిగా
ఆయన తరువాత కాలంలో
అందరిమీదా రెచ్చిపోయే
attacking nature అలవరచుకున్నాడని
నేను అనుకుంటాను.


విశ్వనాధవారిని గురించి చెప్పారు కదా శ్రీ శ్రీ గారిని గూర్చి మీ అనుభవం ఏమిటి

శ్రీ శ్రీతో కూడా నాకు అనుబంధం ఉంది.
అతను ఒక వ్యాసంలో
రాయలసీమ కవులలో నన్ను గొప్పవాణ్ణిగా పేర్కొన్నారు.
అతను గుమ్మడి వేంకటేశ్వరరావు కలిసి
మదరాసు లా కాలేజీలో నాకు సన్మానం చేసారు.
శ్రీ శ్రీకి తెలుగులో వసుచరిత్ర అంటే చాలా యిష్టం.

వర్ధమాన రచయితల గురించి చెప్పండి

నన్ను కలిసికొన్న కొందరు
వర్థమాన రచయితల గురించి మాత్రం చెబుతాను
ఒక రచయిత ఇటీవల నా వద్దకు వచ్చి
నన్ను ఒక గ్రూప్ కట్టమన్నాడు
అపుడు నా బలం పెరుగుతుందని చెప్పాడు
ఎంత పిచ్చి ఊహ ఇది
నా పుస్తకం ఇష్టమైతే చదువుకుంటారు.
లేకపోతే అవతల పారేస్తారు.
ఏమయితే నాకేం అని చెప్పి పంపాను.
ఇంకొక రచయిత శతకం రాసి
దానికి నన్ను అభిప్రాయం రాయమని
నా వెంట పడ్డాడు
తీరా పుస్తకం తీసి చూస్తే
శివుణ్ణి శ్రీ భ్రమరహృదయేశ్వరా అన్నాడు
భ్రమర హృదయేశ్వరా అంటే
భ్రమరాంబికా హృదయేశ్వరా అని నేను అర్థం చేసుకోవాలా
ఎలా అయితేనేం
దానిమీద నాలుగు మాటలు రాసి చివరలో
ఈ రచయిత జాగ్రత్తగా
ఇంకా జాగ్రత్తగా
రచన సాగించి వుంటే బావుండేదని ముగించాను.

మరొక రచయిత వచ్చాడు
అతను ఏదో అవార్డు కోసం దరఖాస్తు పెడుతున్నాడు
దానితో పాటు తెలుగులో ఒక well known poet చేత
దరఖాస్తు దారుడు తెలుగు కవిత్వంలో దిట్ట
అని ఒక సర్టిఫికెట్ తీసి జత చేసి పంపాలట
ఆ సర్టిఫికేట్ నన్ను ఇవ్వమని కోరాడు
నేను అంత ప్రతిభ కల వాణ్ణి కాను అని అన్నాను
అతను ఒప్పుకోలేదు
చివరకు నన్ను ప్రలోభపెట్టాలని చూసాడు
అవార్డుకు వచ్చే మొత్తాన్ని
చెరి సగం తీసుకుందామని ఆశచూపాడు
భ్రష్టుడా
ఇక్కణ్ణుంచీ లేచి వెళ్ళమని తరిమివేసాను
ఇలాగ వుంది వర్థమాన రచయితల పరిస్తితి.

మీకు కలిగిన ప్రశంసలను గూర్చి చెప్పండి

ఎన్ని ప్రశంసలు కలిగినా ఒక్క ప్రశంస మాత్రం
నన్ను ఇప్పటికీ సంతోషపరుస్తుంది నా పండరీ భాగవతం చదివిన విశ్వనాధ నా కన్నా నీవు ఎన్నో రంగాలలో అధికుడవు అని ఉత్తరం వ్రాసాడు అవి విశ్వనాధ చాలా ఎత్తుకు ఎదిగిన రోజులు ఆ రోజుల్లో ఆ వుత్తరాన్ని ప్రచురించి అతనిపైన నా అధికారాన్ని చాటుకోవటం ఇష్టం లేక ఆ వుత్తరాన్ని ఎప్పటికైనా వైశ్వనాధులు తమ తండ్రి ఘనతను ఆకాశానికెత్తితే చూపెడదామని అలాగే వుంచాను
తర్వాత ఆ వుత్తరం కనిపించలేదు
ఇంట్లో అందరినీ అడిగాను
అపుడు మా అమ్మాయి నాగపద్మిని
ప్రస్తుతం హైదరాబాదు AIR లో పని చేస్తూ వుంది
ఆ వుత్తరం తన వద్ద వున్నదంటూ తెలిపింది
ఒకసారి విజయవాడలో శివతాండవం చదివాను
అదివిన్న విశ్వనాధ
నన్ను తన భుజాలపై ఎక్కించుకున్నాడు
ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే
విశ్వనాధకు తన ప్రతిభ పట్ల ఎంత గర్వం వుందో
ఎదుటి వాడి పట్ల కూడా
తానూ అంత గర్వాన్ని పొందుతాడు
ఆయన గుణ పక్షపాతి అని నిస్సందేహంగా చెప్పగలను

మీ స్వ స్థలం

మా వూరు అనంతపురం జిల్లాలో
పెనుగొండ దుర్గం మాది
కృష్ణ దేవరాయల గురువులైన తాతా చార్యుల వారి వంశం
మొదట్లో కావలి కాలేజీలో పనిచెయ్యమని అడిగారు
కానీ నేను ఈ వూరు వదలడం ఇష్టం లేక
దానికి సమ్మతించలేదు.

మీరు ఆంధ్రేతర ప్రాంతంలో కూడా చాలా కాలం వున్నారు కదా ఎలా గడిచింది

నేను ఢిల్లీ లో కొంతకాలం నివసించాను
అక్కడ ఉన్నకాలంలో
బౌధ్ధ వాఙ్మయంతో పరిచయం కలిగింది
దాంతో బౌధ్ధమతం పట్ల ఆసక్తి కలిగింది
కానీ ఆ తర్వాత
ఒకసారి అరవిందుల్ని కలవడం జరిగింది
దానితో అరవిందుని ఫిలాసఫీ పట్ల ఆకర్షితుణ్ణి అయ్యాను
నేను తరచుగా పాండిచ్చేరి లో వున్న
అరవిందాశ్రమానికి వెళుతుంటాను
నాలో ఇప్పటికీ ఒక తపన మిగిలి వుంది
అదేమంటే
అరవింద ఫిలాసఫీ ని
కార్ల్ మార్క్స్ సిధ్ధాంతాలను
బ్లెండ్ చేస్తే తయారయ్యే ఫిలాసఫీ
ప్రతి భారతీయుడూ అనుస్రించదగిన తత్వంగా నిలుస్తుందని
నా ప్రగాఢ విశ్వాసం
నా నీవితంలో ఆ పని చెయ్యాలనే తపన
విపరీతంగా వుంది
దీనిని సాధించగలనో లేదో

మీ ప్రస్తుత వ్యాసంగం ఏమిటి

నేను ప్రస్తుతం
వంద సంవత్సరాల రాయలసీమ చరిత్రను రాస్తున్నాను
దీనిలో నేను పూర్తిగా నేపధ్యంలో వుంటు
రాయలసీమ నాగరకతను
సంప్రదాయాలను స్థితిగతులనూ చిత్రిస్తున్నాను
దీనిద్వారా
ఒక విధంగా నా స్వీయ చరిత్రను కూడా చెప్పినట్లవుతుంది.
 ప్రతుతం ఆ పనిలో వున్నాను.

మీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటన ఏదైనా వుందా

నేను మద్రాసు విశ్వవిద్యాలయంలో
విద్వాన్ పరీక్ష యిచ్చాను
అప్పటికే నా రచన పెనుగొండ లక్ష్మి
ఆ పరీక్ష కు సిలబసులో చేర్చబడింది
నేను అదే పరీక్షలో తప్పాను
ఇంతకంటే ఏం చెప్పమంటారు.

ఒక సందేహం ఈనాడు త్యాగయ్య కృతులను ఆలాపిస్తున్న గాయకులు త్యాగయ్య ఫక్కీలోనే గానం చేస్తున్నారని భావించడమెలా త్యాగయ్య ఇలానే గానం చేసాడని ఎలా నమ్మగలం

నిజమే
నాడు ధ్వని గ్రహణం sound recording  లేకున్నా
త్యాగయ్య కీర్తనలను పరంపరగా
మౌళిక ప్రచారాన్ని పొందాయి
తర తరాలుగా అవ్యవహితంగా సాగిన గానమది
ఇప్పటికీ తిరువాయూరులో
వేదపాఠం లాగా కొనసాగుతూ వుంది
ఇప్పటి గాయకులలో ఎవరైనా
తమ గాత్రానికి తగిన సంగతులను ఏర్పరచుకోవచ్చునేమో గాని frame work మాత్రం
అక్షరాలా త్యాగయ్య ఆలపించిన తీరుగానే వుంటుంది

అందువల్ల ఆనాడు త్యాగయ్య
ఏ స్తితిలో ఒక కీర్తనను ఆలపించాడో
ఈనాడు మనం ఆ కీర్తనను
త్యాగయ్య పంధాలోనే వినగలుగు తున్నాం.

సరస్వతీపుత్రుని తృతీయ వర్ధంతి సందర్భంగా రచన
ఉదయం పత్రిక


20 అక్టో, 2012

విహారి మాటల్లో పుట్టపర్తి









నే నీ మధ్య కొందరితో 
సెల్ ఫోన్ సంభాషణ జరిపాను
మా అయ్యగారితో పరిచయం బాంధవ్యం 
సాహితీ మితృత్వం కలిగిన వారి స్వరాలను సేకరించటం

ఈ వరుస క్రమంలో 
విహారి గారినీ అడిగాను
ఆయన నేను మీకు మైల్ చేస్తాను అన్నారు 
అలా కాదండీ 
మీ గొంతులో వుంటే బాగుంటుందండీ అన్నాను

ఓ రెండు రోజులలో మెయిల్ వచ్చింది
చూసిన నాకు ఆశ్చర్యం ఆనందం
వెంటనే స్పందించిన విహారిగారికి 
హృదయ పూర్వక ధన్యవాదాలు





అనురాధ గారు,

నమస్కారం !!

నాన్న గారితో నా పరిచయం తెలుపుతున్నాను. స్వీకరించండి.


పుట్టపర్తి వారంటే పుంభావ సరస్వతి. 
సరసవతీ పుత్రుడు. 
ఎన్నెన్నో భాషల్లో 
ప్రాచీన అర్వాచీన సాహిత్యాల్ని 
ఆబగా అమృతాసేచనం  చేసిన అమరుడు.

1979 లో 
మధురాంతకం రాజారాం గారితో కలిసి 
కడప లో వారింటికి వెళ్ళటం 
మా మధ్య తొలి సమావేశం. 

మధ్యాన్నం రెండు గంటలైంది.   
నేల  మీద గోడకానుకుని కూర్చుని, 
షావుకారు గుమాస్త డెస్క్ ని ముందు పెట్టుకుని 
ఏదో  చదువుకుంటున్నారు. 
చేతిలో  పుల్ల కలం. 
పరిచయాలైనాయి. 
'మీ పేరు విన్నాను. 
బుచ్చి బాబు మీద మీ eligee 
భారతి లో  వచ్చింది కదూ? 
బాగుంది. 
అతనికి నిఖార్సైన నివాళి అది.' 
అన్నారు. 
ఆశ్చర్యపోయాను. 

ఎప్పుడో పధ్నాలుగేళ్ళ ముందు విషయం అది. 
అదీ వారి జ్ఞాపకశక్తి. 
కాసేపు సాహిత్య విషయాలు చెప్పారు. 
జనప్రియ రామాయణం 
కిష్కింధ లోని కొన్ని చరణాలు చదివారు. 
తమ ఇంగ్లిష్ దీర్ఘ కవిత 
లీవ్స్ అఫ్ ది విండ్ గురించి చెప్పారు. 

మాటల మధ్యలోకి milton వచాడు. 
ఊగిపోయారు ఈయన. 
సాయంత్రం ఐదు అవుతుండగా 
సెలవు తీసుకున్నాం.

ఆ తరువాత, 
1979 నుంచి వారి చివరి రోజుల వరకు 
ఎన్నెన్నో సభల్లో, సమావేశాల్లో , 
ఇంటి దగ్గరా, రామకృష్ణ సమాజం లో, 
ఎన్నో సార్లు వారిని కలుస్తూనే ఉన్నాను.

1983 లోనో 1984 లోనో అనుకుంటాను. 
ఆకాశవాణి వారి ఆహూతల ముందు 
ప్రత్యేక దీపావళి కవి సమ్మేళనం 
కర్నూలు లో జరిగింది. 
పుట్టపర్తి వారే అధ్యక్షులు. 
మహామహులు చాలా మంది ఉన్నారు. 

నేను పాల్గొన్నాను అందులో. 
'మనసులో దీపాలు' 
అని నేను కవిత ఎత్తుకొంగానే 
వారు కుర్చీ లో సర్దుకుని ముందుకి కదిలారు. 
కారణం 
ఆ కవిత లో మొదటి నాలుగు పాదాలు
'శాఖోటకం  పిందేల్ని ఊహించి, పళ్ళ రుచి తలచి
నోరూరించుకుంటూ కూర్చోవటం - అమావాస్య
మట్టి అంతఃపురాన్ని పలకరించి
రసాల బీజాన్ని బహూకరించటం - దీపావళి!'
అనేవి ఆ పాదాలు. 
కవితంతా అలా విపర్యోక్తి గా సాగుతుంది. 
నా కవిత పూర్తి  అయిన తరువాత 
'శాఖోటకం' పదాన్ని 
అద్భుతంగా విపులీకరించారు పుట్టపర్తి వారు. 

భూమి మీద పూతా, పిందే, 
ననలూ, చిగురూ, 
మొగ్గా, పోలూ లేని చెట్టు. 
'ఈ విహారి అసాధ్యుడు. 
సాహితీ వైదూష్యం కల కవి.' 
అన్నారు. 

ఆ కవితలో ఇంకా కొన్ని పాదాలు 
సామాజిక స్పృహ తో నిండి ఉండి 
సభ లో సంచలనం కలిగించాయి. 
ఆ మర్నాడు పత్రికల్లో నూ 
నా కవితకు పుట్టపర్తి వారి అధ్యక్ష వ్యాఖ్యానాలకి మంచి ప్రశంసలు వచ్చాయి.

ఆ తరువాత 
పుట్టపర్తి వారి ఆంగ్ల దీర్ఘ కవితను 
అన్నవరం ఆదిశేషయ్యగారు 
తెలుగులో 'గుండె గులాబీలు' పేరుతో 
అనువాదం చేయటం 
ఆ పుస్తకాన్ని నేను, 
N .C .రామసుబ్బారెడ్డి, 
M .జానకిరాం, 
ఆదిశేషయ్య కలిపి స్థాపించిన
 'రచన సాహిత్య వేదిక' 
తరఫున ప్రచురించటం జరిగింది. 

ఆ సందర్భంగా ఎన్నో సార్లు 
వారితో ముచ్చటిమ్పులు జరిగాయి.

తొమ్మిది ఏళ్ళు నేను కడప లో ఉండటం, 
పుట్టపర్తి వారితో సన్నిహితంగా మెలగటం, 
వారి పూర్ణ ప్రజ్ఞలో 
కొన్ని వీచికల్లో మునిగి తేలటం 
ఒక అపూర్వ ఆనందం, 
ఒక అనన్య అనుభూతి. 

వారిని ఈ విధంగా స్మరించుకునే 
అవకాశం కలిగించినందుకు 
మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

సెలవు, 
అభినందనలతో..
విహారి.







18 అక్టో, 2012

పుట్టపర్తి భక్తి కవిత్వం డా. వఝ్ఝల రంగాచార్య








వఝ్ఝల రంగాచార్యులు గారు 
పుట్టపర్తి వారి శివతాండవం పై PhD చేసారు
భౌతిక సిధ్ధాంత పరంగా 
నిరూపించే ప్రయత్నం చేసారట
వారు వ్రాసినదే ఈ వ్యాసం

పుట్టపర్తి వారి భక్తి తత్వపు నాడిని వీరు పట్టుకోగలిగారని నాకనిపించింది
మా అయ్యగారు రచించిన పాద్యం
తీవ్ర శరణాగతి భావనతో తల్లడిల్లిన భావ పరంపర 

ఆయువంతయు గూడ నిరాశతోడ

గడచినది శుభకాంక్ష యెన్నడును లేదు
నా ప్రభూ నీవు వచ్చుట నమ్మలేను
పుణ్యముల పంట నమ్మక పోవలేను 

ఆశ నిరాశలు ప్రేమ విరహం కోపం పాదాక్రాంతత

ఇలా..
ఎన్నో..

నా కలుషములు గొలువ మానములు లేవు

నా వ్యధల నెరిగించు వాఙ్మయము లేదు
నా కనుల నీరు నిల్వ సంద్రములు లేవు
నన్ను రక్షింపుమని పల్క నాల్క లేదు..

దాశరధీ శ తక కారుడ


చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్


చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ


జేసిన నేరముల్ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్యయయ్య 

నీ


దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. 



















ఏ పరమేష్టి కుంచె రచియించును
లోకమనూహ్య సుందరం
బా పరమేష్టి సర్వ నిగమౌఘ విధిజ్ఞుడు
నీదు పాల ని
ర్వాసితపాప..! తాపృధుక భావమువాడట
యెవ్వరింక దే
వా..! పరిపక్వ బుధ్ధులు..!ఖగాంగ..!
జగజ్జన జన్మ తారణా

(జనప్రియ రామాయణము నుండి)


                    పుట్టపర్తి భక్తి కవిత్వం
                   డా. వఝ్ఝల రంగాచార్య

శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు
శ్రీవైష్ణవ కుటుంబం నుంచీ ఎదిగి వచ్చినవారు. 
అయినా 
అనాదిగా భారతదేశంలో వర్ధిల్లిన 
భక్తి సంప్రదాయాలను 
ఆకళింపు చేసుకోవడమే గాకుండా 
ఆయా కవులు రచించిన 
భక్తి కావ్యాలకు స్పందించి 
కవితలు రచించారు 

ప్రవక్తలు ..
యోగులు ..
సిధ్ధ పురుషుల ..
జీవితానుభవాలను చదివి 
వారి వలె జీవించాలని ప్రయత్నించినవారు. 

కుముద్వతీ నది ప్రక్కన ఆశ్రమం నిర్మించుకొని 
తపస్సు చేసినవారు. 
తులసీదాసు రామాయణమును 
నిత్య పారాయణంగా చేసుకొని 
తులసివలె హరిహరా భేదమును 
తన సాహిత్యమున ప్రదర్శించిన వారు. 

హరి హరులను 
శ్రీరామచంద్రునిలో ఒకటిగా దర్శించిన వారు. శివతాండవంలో 
శివుని చైతన్యానికి ప్రతీకగా కల్పించినా 
పరదైవంగా విష్ణుమూర్తినే ఆరాధించినవారు

బహుమూర్తి ఉపాసన 
బహుమంత్రోపాసన ఆచరించినను 
ఆయన భక్తి కావ్యాలలో అధికంగా కానవచ్చేది 
శరణాగతి ధర్మం. 
పరదైవంగా హరినే విశ్వసించడం 

ఆయన  మొట్టమొదటి కావ్యం 
పెనుగొండలక్ష్మి లోని మొదటి పద్యం 
భగవంతుని ప్రేమాధీశ్వరుడనియు 
నిరంకుశ స్వాతంత్రయము గలవాడనియు చెప్పి 
ఆత్మ న్యూనతా భావం ప్రకటించింది.


"ఏమో ఈ వికటంపు రూపకము అందేయర్థ ముత్పన్నమై
ప్రేమాధీశ్వరు నిండు కన్నులకు దృప్తిన్ గూర్చునో హేతువై
మో మా యాత్మల కందరాదు వెడయూర్పుల్ జిమ్మి నిర్వేద ధా
రా మాంద్యమ్మున మోకరిల్లు మతియెల్లన్ యోచనా సంగతిన్"


సృష్టిని గూర్చి 
సృష్టించిన పరమేశ్వరుని గూర్చిన 
ఆలోచనతో ప్రారంభమై 
అతర్వాత పద్యములలో 
ఆత్మలు మాయాధీనములని 
వాటి ఆలోచనాశక్తి పరిమితమని చెప్పబడినది. 

ఈ సృష్టిని గూర్చి 
దాని స్వభావమును గూర్చి 
శోధించిన మతి 
తన అసహాయతను ప్రకటించింది. 
దైవమునే శరణము వేడింది. 
పెనుగొండలక్ష్మిలోని నాలుగవ పద్యము 
ఈ భావమును స్పష్టంగా ప్రకటించింది.

"నాకేమీ తోచదు. 
బుధ్ధీంద్రియ మంతరించినది యో స్వామీ భవన్మానసాంబుధి విద్యుల్లత లెట్లు వోయినను వోవున్ నిల్పు వాడెవ్వండు 
ధరాచక్రము నీకై మొగిచి యుండున్ 
సృష్టి సంక్రీడలున్"

అని 
ఈ సృష్టి యంతయు  పరమేశ్వరుని అధీనమని 
జీవుని ఆలోచన పరిమితము 
భగవంతుని లీలలు అపరిమితము లని 
జీవ జాలమంతయు 
అతనికి లోబడి యుండునని వర్ణింపబడినది.

ఈ విధముగా 
పుట్టపర్తి సృజనాత్మక సాహిత్య ప్రారంభమే 
భగవంతుని మహిమాధిక్యమును వర్ణించి 
అతని శరణు వేడుటయే జీవధర్మమని సూచించినట్లయినది

అనంతమైన కాలము 
నారాయణ స్వరూపికి చెప్పిన పద్యము విచిత్రమైనది.

"కనులు విప్పని ఈ యోగి కంఠమందు
చిలుక సాలను తులసి పేరులను గూర్చి
ప్రతిదినము పూజలొనరించు ప్రకృతి లక్ష్మి
యేమొ ఆ చిట్టి తల్లికేనోము కలదో"

పై పద్యమును 
'కనులు విప్పని యోగీ"
 అనుట వలన 
యోగ నిద్రా పరవశుడైన నారాయణ మూర్తి 
స్వరూపము స్ఫురించుచున్నది. 

అట్టి యోగి కంఠమున ప్రకృతి లక్ష్మి
 'చిలుక వరసలూ అను తులసి మాలతో అర్చించుచున్నదట. 

అనగా జీవుల నుధ్ధరించుటకై 
మాతృమూర్తి యైన లక్ష్మీదేవి 
భగవంతునికి పురుషకారము చేయుచున్నదను 
శ్రీ వైష్ణవ సంప్రదాయ రహస్య మిచ్చట సూచించబడుతున్నది. 

"ఆ చిట్టి తల్లికే నోముగలదో"
 అనుటవలన 
గోదా శ్రీ రంగనాధుల కధనము గూడ 
స్ఫురించుచున్నది.

కనులు విప్పిన యోగి శ్రీ రంగనాధుడు. 
శేషతల్పము పై శయనించువాడు. 
శేషుడు కాలస్వరూపము 
ఆ కాలస్వరూపము నధిష్టించిన పరమాత్మ 
శ్రీ రంగనాధుడు 

ఆ రంగనాధుని భర్తగా వరించి 
తులసీమాలలు సమ్ర్పించినది గోదాదేవి 
ఆమె ఈ విధముగా జీవులకు మార్గదర్శకమైనది. అందులకే 'చిలుక సాలూ'
 అను పదబంధము 
జీవ పరంపరను 
వ్యక్తము చేయుచున్నదని ఊహించుట. 


"ఎల్లే ఇళఙ్కిళయే ఇన్న మురఙ్గుదియో" 
అనెడి తిరుప్పావై పాశురమున 
గోపికను చిలుకగా సంబోధించుటయున్నది. 
ఈ సంప్రదాయ ప్రభావమే 
పుట్టపర్తి భక్తి కవిత్వమున కాలంబనము.

పుట్టపర్తి అష్టాక్షరీమంత్ర పారాయణము 
కోటానుకోట్లు చేసిరి. 
ఆ నారాయణమూర్తి స్వరూపమును 
యోగి రూపముగా భావించి ఆరాధించుట 
'పాద్యము' లో కని పిస్తుంది.

 షాజీ కావ్యంలో 
'ఆనందరూపమై మోదమొసగు 
సాత్విక వ్యక్తికి నమస్కార శతము' అని

"విషుల్ వ్యాప్తౌ" 
అని అంతట వ్యాపించిన విష్నుమూర్తిని 
ఆనందరూపునిగ 
ఆనందప్రదాతగ భావించుట చూడవచ్చును.

సాధారణ మానవుల సంకల్పములు 
పరమాత్మ శక్తి ముందు పని చేయవని
 "ఎదిరి వచ్చిన శక్తులన్నింటిని మింగి 
ఆ పరాత్పరు తలపు నాట్యంబులాడే"
అని భగవదాధిక్యమును ప్రకటించెను

"వేదనా శతకము" లో 
జీవగతమైన వేదన వెల్లడింపబడింది. 
'విభూతి శతకమూ'
 భగవద్విభూతులను అందముగా వర్ణించినది. 

భగవంతుని కరుణాకటాక్షముతోడనే 
తానీ శతకము చెప్పినట్లు 
కవి విన్నవించెను. 

"స్వేచ్చాకవికోకిలవలె చల్లగా 
భగవద్గుణాను కీర్తనము చేసి కొందు" 
నని భగవంతుని తోడి అభేదము 
తనకు అవసరము లేదని కోరుకొనెను. 

విభూతి శతకమున వర్ణింపబడిన 
వాత్సల్య 
దాస్య 
మధుర 
సఖ్య భక్తులు 
ఈ పద్యములో పరాకాష్ట నొందినవి.

"ఈ నిను జూచునప్డు
నిలువెల్లను గన్నులు
సేవలో సుఖం బానెడునప్డు
నాదు నిలువంతయు చేతులు
పల్కు పల్కి నీ యానతి గోరునప్డు
నిలువంతయు నోరులు
నీ స్తవంబునందేను రమించునప్డు
నిలువెల్లను కంఠము తీయరా ప్రభూ..!!"

విభూతి శతకం -80


పుట్టపర్తి రచించిన 'జనప్రియ రామాయణము'
లక్ష్మీ పద లాంఛనం.
అమ్మవారి నుండి అస్మత్ గురువు అంటూ
ఒక పధ్ధతిలో
గురు పరంపర చెప్పుకుంటారు శ్రీ వైష్ణవులు.

రామాయణం దీర్ఘ శరణాగతిని ప్రవచించే కావ్యం.
అందుకే పుట్టపర్తి శరణాగతి ధర్మం
ప్రపంచించే రామాయణాన్ని
లక్ష్మీ పద లాంఛనంగా అలంకరించారు.

బాలకాండ షట్పదులలో
కిషింధ కాండ చతుష్పదులలో రచించారు.
ఆయన మొదట రచించింది కిషింధ కాండ
కవితా వాహిక చతుష్పది.

కిష్కింధ కాండను చతుష్పదులలో వ్రాయడం
ధ్వని స్ఫోరకమనిపిస్తుంది.
కిష్కింధకాండలో వానరుల కధ ప్రత్యేకమైనది.
వానరులు చతుష్పాదులు.

అంతేగాక సూక్ష్మంగా
మరొక పరమ రహస్యం
చతురక్షర సంకేతమైన లక్ష్మ ణు డు
ఈ కధలో ఆచార్య స్థానీయుడు కావడం

సుగ్రీవుని భగవదాదేశానుసారం
గజపుష్పమాలను ధరింపజేయుట.
రామునకు హనుమంతునికి మధ్య
భగవంతునికీ భక్తునికి మధ్య
 ఆచార్యత్వం వహించుట

అంతే గాక
సంసార మోహమగ్నుడైన సుగ్రీవునకు
రమానుజుడైన లక్ష్మణుడు
కర్తవ్యోపదేశం చేయుట
అతని ఆచార్య స్థానమును ప్రకటించుచున్నది.

మరొక ధర్మ సూక్ష్మం
ధర్మార్థ కామ మోక్షములు వివేచనగా
వారికి మోక్షం కలిగించేది.
ఈ విధంగా పుట్టపర్తి ఎన్నుకున్న కిష్కింధకాండ
కవితా వాహిక
విపులార్థములు కలిగి యున్నదని
చెప్పవచ్చును.

ఈ కాండలో
ఆయన ఆరంభించిన మొదటి పద్యం
అంటే పుట్టపర్తి భావించిన రామాయణ కావ్యానికి
మొదటి పద్యం
"పరమా  పదనాధ శృతి హిత చరమ శ్లోకార్థ"
అని రాముణ్ణి విష్ణువుగా
పరమ పద నాధునిగా భావించి
సర్వ ధర్మముల వదలి
ఆయననే శరణు వేడితే
పాపాలన్నింటి నుండి
మనలను విముక్తి చేస్తాడని బోధిస్తూ
రామాయణాన్ని ఆరంభించి
శ్రీ సంప్రదాయానికి జనప్రియలో శ్రీకారం చుట్టారు
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు.

శ్రీరామ కధ రామాయణం భగవద్భాగవత కైంకర్యం.











14 అక్టో, 2012

అయ్య రేడియో లో ఎలా ఇరుక్కు పోయారు..?



















ఆకాశవాణి
మద్రాసు కేంద్రం
"......................"
ప్రసంగం
వక్త..శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు

అమ్మా ..రా..
"అప్పుడే వస్తా వుందా...మీ అయ్యది..?"
"ఏయ్ సిగ్నల్ లేదు అటు తిప్పవే.."

గర్.............
గర్...........
"ఆ ఇప్పుడు బాగొస్తావుంది.."

పుట్టపర్తి వారి కంఠం ఖంగున మోగుతోంది.
నడుమ నడుమ దగ్గు..

"చూడు..
ఎట్ల దగ్గుతున్నారో ..?
మందేసుకున్నారో..? లేదో.?"

ఇంతలో ఓ చిన్న పిల్ల 
ఆడుకుంటూ వచ్చింది..
అప్పుడప్పుడే మాటలొస్తున్నయ్ దానికి

"రాధా.."
"రాధా..రా.."
పిలిచింది అక్కయ్య

"అయ్య..అయ్య.."
అని రేడియో వేపు చూపించింది
దగ్గరగా వచ్చిందా పిల్ల
"ఇదిగో అయ్య .."

అని దాని కళ్ళల్లోకి ముద్దుగా చూసింది..
చివరిదవటంతో దాన్ని అందరూ ముద్దు చేసేవారే..

అందులోంచీ వస్తున్న 
అయ్య కంఠాన్ని గుర్తించింద ది..
అందరి ముఖం వంక చూసి నవ్వింది 

అందరూ సంతోషంగా చూసుకున్నారు 
ఒకరి ముఖాలొకరు..

అయ్య ప్రసంగం ధారాపాతంగా 
సాగిపోతూవుంది దగ్గుతో సహా..

కానీ ..
ఆ పిల్ల ఆందోళనగా రేడియో వేపు చూసింది.
ఒక్క పెట్టున ఏడుపు లంకించుకుంది..

"ఏమైందే.."
"ఏమైందే.."
ఒకటే ఏడుపు..

"ఏమైనా కుట్టిందేమో..?"

కానీ రాధ 
అక్కయ్య చేతిలోని రేడియో లాక్కుంది..
రెండు చిన్న చేతులతో 
గుండెకు గట్టిగా హత్తుకుని..

"అయ్య రేడియోలో ఇరుక్కు పోయారూ.."
అని అంటూ 
మరింత పెద్దగా ఏడ్వసాగింది..
"ఆ..
ఆ..
ఏమైంది..?"

"అయ్య ఈ రేడియోలో ఇరుక్కుపోయారు.."
అక్కయ్య గట్టిగా నవ్వింది..

"అవునే..
 అయ్య రేడియోలో ఇరుక్కు పోయారు 
ఇప్పుడెట్లా..?"
అంది..

"అమ్మా ..
అయ్య రేడియోలో ఇరుక్కు పోయారు.."
అది అమ్మ వంక చూసి మళ్ళీ ఏడుపు..
"అమ్మ అయ్యను బయటికి తీ అమ్మా.."
కన్నీళ్ళూ కలిసి కాటుక ముఖమంతా 
అలుక్కు పోయింది..

అక్కయ్య ఎత్తుకుంది..
"అయ్య బయటికెలా వస్తారిప్పుడు..?"
ఏడుపాపి అక్కయ్య ముఖంలోకి 
భయంగా చూసింది మళ్ళీ..

"ఇంక అయ్య రారు..
అవును కదే.. "

"ఆ.. అవును..
ఇంక అయ్య రారు..."

"అయ్యా .."
ఇంకా గట్టిగా ఏడుపు..

"ఏయ్ ఊరుకోండే.."

"ఏయ్ ఊరుకో.."

"నువ్వుండమ్మా..
ఏడ్వద్దు..
అయ్యకు ఏమీ కాలే ..
అయ్య రేపు వస్తారు..
సరేనా.."
అపనమ్మకంగా చూసింది..

"ఇది రేడియోనే మొద్దూ.."

అక్కయ్య నెత్తిన ఒకటి మొట్టింది..
మరునాడు అయ్య వస్తూనే 

ఇది పెద్ద న్యూసు.
అయ్యకు ఆనందమే ఆనందం
పాపకు ఆహ్లాదం..