Last Updated Oct 07 2011, 21:42:03, IST
వివిధ కవిత్వవేది'
కవిత్వవేది'' అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన కల్లూరి వెంకట నారాయణరావు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అపారం. డిగ్రీ చదువుకునే రోజుల్లో వారి సాహిత్య చరిత్ర మమ్మల్ని ఎంతో అలరించింది. అప్పటికి చాగంటి శేషయ్య, కందుకూరి వీరేశలింగం పంతులు, వంగూరి సుబ్బారావు వంటి వారి గ్రంథాలు రాకపోలేదు కాని కవిత్వవేది రచనలో ఒక విశేషం, శైలిలో ఒక విశిష్టత ఉండేవి. అది సంగ్రహమే కాదు సమగ్రం కూడా! ఐతే అప్పుడు మాకు కల్లూరి వెంకట నారాయణరావు గూర్చి అవగాహన లేదు. వారు రచించిన ఇతర గ్రంథాలను కూడా అధ్యయనం చేశాక ఆయన విరాట్ రూపం అర్థమైంది. ''పింగళివారి సాహిత్య చరిత్ర మెరుపు తీగెలు -మీ రచన స్థిర విద్యుత్ కాళిక'' అన్నాడు డా|| నండూరి రామకృష్ణమాచార్యులు! కల్లూరి వారు బహుముఖ ప్రజ్ఞావంతులు.
ఇటీవల అనంతపురం వాస్తవ్యులైన కె.వై.పి.ఏ. నాగరాజు గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. తద్వారా శ్రీ కల్లూరి వెంకట నారాయణ రావు జీవితము, రచనలు ట్రస్టు, ధార్మిక కార్యక్రమ విలువల గురించి విపులమైన సమాచారం అందింది.
రాయలసీమలో కవిత్వవేది మరొక పార్శ్వం ఆధ్యాత్మిక గురుత్వం! అనంతపురం జిల్లా గుత్తిరోడ్డులో తడకలేరు వద్ద ఆనంద శ్రీపాదాశ్రమం స్థాపించారు. అక్కడ బృందావనం -శ్రీరాఘవేంద్రస్వామి వారి మందిరం, షిర్డీసాయి మందిరం స్థాపించి ముముక్షువులకు ఎంతో సేవ చేశారు.
అనంతపురం జిల్లా బండమీదపల్లెకు చెందిన కవిత్వవేది అసలు పేరు కల్లూరు వేంకట నారాయణరావు. కల్లూరు సుబ్బారావు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించిన నారాయణరావు ఆంగ్ల, సంస్కృత, కన్నడ భాషలలో ఎం.ఎ. చేశారు. ఉపాధ్యాయుడిగా అనేక విద్యాసంస్థలలో సేవలందించారు. ప్రముఖ కథారచయిత గుడిపాటి వెంకటాచలంతో కలిసి పనిచేసిన అనుభవం కల్లూరిది. సర్వీసు ముగిసిపోకముందే స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. వీరు వివిధ కవిత్వ వేదులు. వారి రచనలలో 19 ముద్రితాలు కాగా 4 లిఖిత గ్రంథాలుగా ఉండిపోయాయి. అంతరార్థ కళాప్రపూర్ణ, కవితాతపస్వి, కవిశేఖర, ఆధ్యాత్మిక తత్త్వవేత్త, కవితానంద మహోదధి వంటి బిరుదులెన్నో వారిని వరించాయి. వారికి జరిగిన సత్కారాలకైతే లెక్కేలేదు. కలం పట్టి కవితా విహారం చేసిన కవిత్వవేది 1979లో అస్తమించారు. లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ వ్యవస్థాపకులు ఆంజనేయులు వీరి శిష్యులు. కల్లూరి జయంతి, వర్దంతులు పురస్కరించుకుని ప్రముఖులకు అనంతపురం పట్టణంలోని కవిత్వవేది కళామంటపంలో సత్కారాలు చేస్తున్నారు.
ఈ పురస్కారం అందుకున్న వారిలో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, జానుమద్ది హనుమచ్ఛాస్త్రి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, పుట్టపర్తి నారాయణాచార్యులు, అక్కినేని నాగేశ్వరరావు తదితరులున్నారు. కల్లూరు వేంకటనారాయణ రావు గుత్తి తాలూకా విసర్రాళ్ళ పల్లె, కడప జిల్లా రైల్వే కొండాపురం, అనంతపురం పట్టణానికి ఐదు మైళ్ళ దూరంలో తడకలేరు నదీతీరంలో శ్రీ ఆనంద శ్రీపాదాశ్రమును, శ్రీ రాఘవేంద్రస్వామి వారి పేరున స్థాపించారు.
నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కల్లూరు వేంకట నారాయణరావుని సన్మానించాలని భావించి ఆహ్వానం పంపగా ఆయన తిరస్కరించారు.
కల్లూరు వేంకట నారాయణరావు వంశీకులు సమీప బంధువులైన కల్లూరు అహోబల రావు, శ్రీకృష్ణ దేవరాయ గ్రంథమాల స్థాపించి రాయలసీమ రచయితల చరిత్రను నాలుగు సంపుటాలుగా రచించి ముద్రించారు.
సి.వి. రామారావు కల్లూరు వారికి అనుంగు శిష్యుడు. 'గుడ్ ఎర్త్' ఆంగ్ల నవలను సుక్షేత్రము పేర తెలుగులో అనువదించారు. ''నవజీవన'' అనే వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. సేవికారత్న రొద్దం మొదలి సుబ్బలక్ష్మమ్మ. కల్లూరి ప్రశిష్యురాలు. ఈమె ఇంటిలో సేవ చేసే రోజుల్లో కల్లూరువారి 'శ్రీ సద్గురు వేంకట నారాయణస్వామి గారి జీవితం -మహిమలు' అనే పుస్తకాన్ని వెలువరించింది.
సుబ్బలక్ష్మమ్మ వయో భారంతో ఉన్నా శాంతి సామ్రాట్టు -అశోక చరిత్రము పద్యకావ్యాన్ని పునర్ ముద్రణ చేసే పనిలో ఉన్నారు. అలాగే 'ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము' పుస్తకాన్ని కూడా పునర్ముద్రణ చేసే ప్రయత్నంలో ఉన్నారు.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి