8 అక్టో, 2011





మూడు లాంతర్లు - 5

అయోవా రైటర్స్ వర్క్‌షాప్ (Iowa Writers Workshop) ఒక సారస్వత పాఠశాల. డెబ్భయ్యైదేళ్ళుగా కాల్పనిక సృజనను ప్రేమించి, సాధన చేసే విద్యార్ధులు, సృజనకారులకు ఆటపట్టుగా ఉన్నాది. అక్కడ పాఠాలు చెప్పేవాళ్ళు స్వయంగా సృజనకారులు. వాళ్ళు ఇంటర్వ్యూల వంటి వాటిలో చెప్పుకున్న సంగతుల్ని పరిశీలిస్తే సృజనను వాళ్ళు ఎంత శ్రద్ధతో, పట్టుదలగా నిర్వహించుకుంటారో, అర్ధం చేసుకోటానికీ, అందిపుచ్చుకోటానికీ ఎంతగా పరితపిస్తారో తెలుస్తుంది. అక్కడ ప్రవేశం దొరకటం, దొరికినా ఉత్తీర్ణులై బయటపడటం చాల కష్టమట. ఆ విద్యార్ధులు సృజనకారులుగా సఫలం కాలేకపోతే అప్పుడు ఇతర రంగాల్లోకి లాయర్లు, డాక్టర్లు ఇలాక్కూడా వెళ్ళిన సందర్భాలున్నాయట. అక్కడి చదువు చాల ఖర్చుతో కూడుకున్న పని. అది పాఠశాల అని పేరేగాని సృజనను బోధించగలిగింది తక్కువని, అక్కడ కల్పించిన వాతావరణం, చేరిన మనుషులే ఒక పరంపరగా సారస్వత సృజనను పట్టుదలగా అభ్యాసం చేసి అవగతం చేసుకొనేందుకు అవకాశాలనీ, చెప్పుకుంటారు. విశ్వవిద్యాలయాల్లో మామూలుగా ఉండే ఇంగ్లీష్ విభాగాలు భాష, సాహిత్యం, విమర్శ, సంస్కృతి వంటి విషయాలమీద చేసే పనికీ, నిర్వహణకూ భిన్నంగా కేవలం కాల్పనిక సృజన ఒక్కటే పాఠ్యాంశంగా, లక్ష్యంగా ఉన్న ఇలాంటి పాఠశాలలు బెనింగ్‌టన్ కాలేజీ (The Bennington writing seminars) అనీ, ఇంకా వర్జీనియా యూనివర్సిటీ (Creative writing program) వంటి చోట్ల ఇంకొన్ని మాత్రం ఉన్నాయి.
ఇలాంటి చోట్లకి వేలాది మంది చాల ఆత్రంగా రచయితలు కావాలని వెళితే వాళ్ళలో ఏ కొద్దిమందో రచయితలుగా నిలదొక్కుకోగలుగుతారు. అయినప్పటికీ సారస్వత విద్యార్ధులు సృజనను అభ్యాసం చెయ్యటానికీ, ప్రకటించుకోడానికీ ప్రయత్నాలు మానుకోరు. ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్ధుల్ని కవ్వించి, దండించి, ప్రోత్సహించి, అవమానించీ బోధించే పద్ధతులు కూడా కధలు కధలు చిత్రంగా ఉంటాయి. సృజనని బోధించే పనిలో వాళ్ళది ఒకొక్కరిదీ ఒక్కో తోవ గాని వాళ్ళ ధ్యాస, శ్రమా అన్నీ సృజన మీదే! మచ్చుకి ఒకటి, ఎల్కిన్ (Stanley L. Elkin) అని నవలా రచయిత, స్వయంగా ఉపాధ్యాయుడు చెప్పిన కధ ఉంది. ఎల్కిన్ గురువు రాన్డాల్జారెల్ (Randall Jarrell) అనే కవి ఆయన చదువుకుంటున్న యూనివర్శిటీకి కొన్ని నెలలు సారస్వత పాఠాలు చెప్పడానికి వచ్చేడు. ఏ పాఠమూ చెప్పకుండా రోజూ చెహోవ్ (Anton Chekhov) కధలు మాత్రం చదివిస్తున్నాడు. విద్యార్ధులు ఒక్కొక్కర్నీ ఒక కధ రాసుకొని తెచ్చిమ్మన్నాడు. ఎల్కిన్ కధల్ని దిద్ది ఉంచిన ప్రతిని ఇవ్వడానికి ఒకరోజు పొద్దున్నే రమ్మన్నాడు. తీరా చెప్పిన సమయానికి వెళ్తే ఆఫీసులో లేకుండా ఇంట్లో పడుకుని ఉన్నాడు. ఎల్కిన్ ఫోన్ చేస్తే నిద్రలేచి అప్పటికప్పుడు ఆ నిద్దరమొఖంతోనే కార్లో వచ్చి అతన్ని కూడా ఎక్కించుకొని, అతను రాసిన రెండు కధల దిద్దిన ప్రతుల్ని చేతిలో పెట్టేడు. ఆ కధల్లో ప్రతి పేజీలో ఎక్కడెక్కడ ఏమేం లోపాలున్నాయో అవన్నీ ఆయనకి బొమ్మ కట్టినట్టు గుర్తున్నాయి. అవి ఒకొక్కటీ పేజీలు తిప్పమంటూ ఎక్కడెక్కడ ఏమేం బాగులేదో అన్ని వివరాలూ చదివి చెప్తున్నట్టే జ్ఞాపకం తెచ్చుకొని ఒక గంటసేపు ఊరంతా కారు నడుపుతూనే అతనికి విమర్శ చేసి చెప్పేడు. ఆయన తన కధల్ని అలా చీల్చి చెండాడుతుంటే ఎల్కిన్ ఏం మాట్లాడకుండా వింటూ కూర్చున్నాడు. ఆయన ఒక గంట తరవాత ఎల్కిన్‌ని మళ్ళీ బయల్దేరినచోటే దించి ఇంటికెళిపోయేడు. చివరికి పాతికమంది విద్యార్ధుల్లో ఆయన ఒక్క ఎల్కిన్‌కి, ఇంకొకరికీ మాత్రమే A గ్రేడ్ ఇచ్చేడు. ఆయన వెళ్ళేముందు ఎల్కిన్ మళ్లీ వెళ్ళి ‘ఈ కధ ప్రచురిస్తే బావుంటుందా?’ అని అడిగితే ఆయన “I don’t know.” అన్నాడు. ఎల్కిన్ ఈనాటికీ తన విద్యార్ధులెవరైనా తమ రచనల్ని గురించి అవి ప్రచురించుకోవచ్చా అనడిగితే అతను ఈ కధ చెప్తాడట.
ఇలాంటి పాఠశాలల నిర్వహణను చూస్తే, చెప్పేవి వింటే వాళ్ళు సృజనని ఒక నిగూఢమైన సంపద లాగ, పరిశ్రమించి తవ్వి తవ్వి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ పోగా ఎప్పుడైనా అరుదుగా చేతికి చిక్కే నిధిలా చూస్తున్నారనిపిస్తుంది. ఐనా సరే తమ సమయాన్నీ, శక్తినీ సృజన కోసమే సంతోషంగా వెచ్చిస్తున్నారు. అదే వాళ్ళకి సంతోషం; అంతకంటే ఎక్కువగా ఒక తప్పనిసరైన ప్రవృత్తి. జాన్ ఇర్వింగ్(John Irving) అని ఆయన, చదువుకుని, ఏవో పదవులు అందుకుని కూడా ఉన్న సమయమంతా ఒక్క రాయడానికే వెచ్చించాలి అని అన్ని పన్లూ ఒదులుకున్నాడు. ఇలా సృజన తీవ్రమైన, నైసర్గికమైన స్వభావంగా ఉన్నవాళ్ళే అక్కడ చేరుతారు. అలాంటివాళ్ళు చెప్పే సూక్ష్మమైన విషయాలు (insights) ఇక్కడ చాల పనికొస్తాయి. సుమారు నలభై సంవత్సరాల క్రితం, అంతకు ముందూ మనకి కూడా ఇలాటి సృజనకారుల వ్యవస్థలుండేవని చూచాయగా తెలుస్తుంది. గడియారం రామక్రిష్ణ శర్మగారికి చదువుకోవాలనుండేదిగాని స్థోమత లేదు. ఆయన గురువు గారి కోసం వెతుక్కొని వేలూరి శివరామ శాస్త్రిగారి పంచన చేరిన సంగతులు శతపత్రము అని ఆత్మకధలో రామక్రిష్ణ శర్మ చెప్పుకుంటున్నారు. ఉపాధ్యాయునిగా శివరామ శాస్త్రిగారి మూర్తిమత్వం చాల కదిలిస్తుంది. కవిగా, సృజనకారునిగా శివరామ శాస్త్రిగారిది చాల అపురూపమైన ప్రతిభ అని, అంతటి ప్రతిభనూ మించి ఆయన కరుణార్ద్ర హృదయుడనీ ఆయన రాసినవి - దొరికిన కొన్నీ చదివినా అవగతమౌతుంది. ఆయన మహా పండితుడట, ఫ్రెంచ్, సంస్కృతం భాషల్లో విశేషమైన అధికారం ఉన్నవారట. ఆయన వస్తుంటే గొప్ప కవులని పెరుమోసినవాళ్లు సైతం భక్తితో, కొంత భయంతో పక్కకు తప్పుకొనేవారట. ఇవి నారాయణరావుగారు నాకు చెప్పిన సంగతులు. ఈమాట సంపాదకులు వెంకటేశ్వర రావుగారికి ఆయన చిన్నతాతగారట. ఆయన తన స్వంత ఖర్చుతో ఏలూరు దగ్గర సూరవరంలో మామిడితోటలో సారస్వత పాఠశాలను నిర్వహించేవారట. అక్కడ పాఠమే కాదు, భోజనం, బస, బట్టలు అన్నీ ఉచితం. పాఠం నేర్చుకునేవాళ్ళ కులాలు పట్టింపు లేదు. రామక్రిష్ణ శర్మ గారు చెప్తున్నారు:
“మా గురుదేవుల వ్యక్తిత్వం చాలా గొప్పది. విశిష్టమైనది. ఆగర్భ శ్రీమంతులైనా నిరాడంబరులు. దార్శనిక పండితులైనా నిరహంకారులు. మాన్యులను సామాన్యులను సమానంగా చూసే ఉదాత్తవర్తనులు. శిష్యవత్సలులు. వారిని గూర్చి ఎంతరాసినా తక్కువే. నాకు వారి సన్నిధిలో విద్యనభ్యసించే అదృష్టం లేదు. హతవిధి లసితానాం హీ విచిత్రో విపాకః అనే మాఘ శ్లోకాన్ని తలచుకుంటూ ప్రయాణమయ్యాను.” అని. శివరామ శాస్త్రిగారికి పిల్లల్లేరట. ఆయన చివరి రోజుల్లో తనకున్నది ఊళ్ళో దళితులకి రాసిచ్చి పోయేరట. ఆయన సృజనలు అగ్ని ప్రమాదంలో తగలబడి, పోయినవి పోయేయట. వెతికినా ఏమీ దొరకవు.
ఇలాంటి పాతకాలపు పాఠశాలల్లో విద్యార్ధులకి పాఠం, బస, భోజనం అన్నీ అక్కడే. వాళ్ళ పాఠం, పరీక్ష, యోగ్యతా పత్రాలూ అన్నీ కాయితంతో పని లేకుండా మౌఖికమైనవే, కాని చాల నాణ్యమైనవి. దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు తాతా రాయుడు శాస్త్రిగార్ని గురించి, ఆయన పాఠశాలను గురించీ ఇలాగే కృతజ్ఞతతో చెప్పుకున్నారు. త్రిపుర బెనారస్ విశ్వవిద్యాలయంలో సైన్స్ చదవటానికి వెళ్ళి, సగంలో ఆపీసి ఇంగ్లీష్ సాహిత్యం చదువుకోడానికి వెళ్ళిన సంగతులు, ఆయన ప్రొఫెసర్లు పాఠాలు చెప్పే పద్ధతుల్ని గురించి ఆ సంగతులూ కధలు కధలుగా చెప్పేవారు. ఆయన అధ్యాపకుల్లో ఒకరు గొప్ప ప్రతిభావంతుడు, గుడ్డివాడు. దృష్టిలోపం ఆయన పాండిత్యానికీ, అధ్యాపకత్వానికీ ఏమాత్రం అడ్డు రాలేదు. ఇంగ్లీష్ సాహిత్యాన్ని వేరొకరు చదివి చెప్తుంటే విని అనర్గళంగా పాఠం చేసి చెప్పేవారట. త్యాగపూరితమైన బాధ్యతల్ని సంతోషంగా తలకెత్తుకోవడంలో ఆ గురువుల ఆంతర్యం ఏమయి ఉంటుంది? బోధన సృజనకారుల వ్యక్తిత్వాల్లో ఒక పార్శ్వంగా ఉండటం సర్వ సాధారణం. చేరదీసి పాఠం చెప్పటం, నేర్చుకుంటే చూసి సంతోషించటం వాళ్ళ స్వభావమని తోస్తుంది.

8.

ఇప్పుడు వీస్తున్న గాలి అని నాలుగేళ్ళ కిందట sify.comలో వరుసగా వచ్చింది. చాలా మంది సృజనకారుల గురించి రేఖామాత్రమైన వ్యాఖ్యల్లాగ. ఈ రచయితల్లో రకరకాల ఉద్యోగాలు, పనులు చేసుకుంటున్నవాళ్ళు, చాల భిన్నమైన నేపధ్యాల్నుండి వచ్చినవాళ్ళూ ఉన్నారు. ఆ చిత్రాలు చదివితే సృజనతో వాళ్ళది అవినాభావ సంబంధమని బోధపడుతుంది.
ద్విధా భజ్యేయమప్యేవమ్ న నమేయమ్ తు కస్యచిత్|
ఏషా మే సహజో దోష: స్వభావో దురతిక్రమః ||
వాల్మీకి రామాయణం లోనిది ఈ శ్లోకం - నేను రెండు ముక్కలైపోయినా సరే గాని ఎంతమాత్రం వంగను సుమా! ఇది నాకు సహజంగా వచ్చిన దోషం. స్వభావాన్ని కాదని బతకడం ఎవరి తరం? అని దీని భావం. దేశ దేశాల్లోని సృజనకారుల చరిత్రలు చదివితే వాళ్ళ స్వభావమే ఈ తీరు అని తోస్తుంది. ఆబ్రహం మాస్లో(Abraham Maslow) అని మనస్తత్వ శాస్త్రజ్ఞుడు. మనుషుల ప్రవర్తనల వెనుక చోదక శక్తుల్ని గురించి పరిశోధించి ఆయన A Theory of Human Motivation అని ప్రతిపాదించినది సృజనశీలి స్వభావాన్ని విశదం చేసే ప్రయత్నం చేస్తుంది. మనుషులందరికీ అవసరాలు (Needs) అనేకం ఉన్నాయనీ, ఇవి ఒక క్రమానుసారం తీర్చుకోవటం అనివార్యమనీ ఆయన ప్రతిపాదించేడు. ముందు ప్రాధమికం, జాంతవమైన అవసరాలు - గాలి, నీళ్ళు, తిండి, నిద్ర ఇలాంటివి; ఇవి తీరేక ఆరోగ్యం, భద్రత; ఆపైన కుటుంబం, సంఘం, స్నేహాలు, సంబంధాలు; ఆపైన పరువు, ప్రతిష్ట, ఇతరుల నుండి మన్నన, గౌరవం; అవి తీరేక అప్పుడు తమకు సహజంగా అబ్బిన ప్రతిభా పాటవాల్ని అభ్యాసం చేసి వెలికితెచ్చుకోవలసిన అవసరం - ఇలాగ. ఈ చివరిదాన్ని ఆయన Self-actualization Needs అని ప్రతిపాదించేరు. ఇవి ముఖ్యంగా సృజనశీలతకు సంబంధించిన అవసరాలు. మనిషి ఏమేం కావటానికి అతని సహజమైన స్వభావంలో అవకాశం ఉందో అతను అవన్నీ అయ్యే తీరాలి (”What a man can be, he must be. It is a tendency to become actualized in what he is potentially. …the desire to become more and more of what one is, to become everything one is capable of becoming.”) భేతాళ కధల్లో ‘ఈ ప్రశ్నకు తెలిసి కూడా సమాధానం చెప్పకుండా మౌనం వహించావో, నీ తల వెయ్యి చెక్కలవుతుంది’ అని శపించినట్లుగా ఉంటుంది సృజనశీలికి మాస్లో హెచ్చరిక: నీకున్న పాటవాన్నంతట్నీ నీ వ్యక్తిత్వంలో వ్యక్తీకరించుకోకుండా దాచిపెట్టుకుంటే జీవితాంతం దుఃఖపడతావు (”If you deliberately set out to be less than you are capable, you’ll be unhappy for the rest of your life.”); తనతో తాను సమాధానం పడాలంటే మనిషి గాయకుడైతే పాడేతీరాలి, కవైతే కవిత్వం కట్టే తీరాలి (”A musician must make music, an artist must write, if he is to be ultimately at peace with himself. What a man can be, he must be.”) “బుద్ధిగా, హాయిగా రాసుకో!” అని నారాయణ రావుగారు; “రాస్తేనే మంచిదివై! రాసేస్తే గాని లోపలేముందో తెలీదు కదవై! రాసేస్తేనే కదా - It comes out. That is healthy!” అని త్రిపుర.
మాస్లో అవసరాల పట్టికలోని అనుక్రమం (hierarchy of needs) సృజనల్లో రాజీ, ‘జూటా’ ఎలా ప్రవేశిస్తాయో సూచిస్తుంది. ముందుగా దిగువనున్న అవసరాలు తీర్చుకొనే తీరాలి. లేదంటే పై అవసరాలు జ్ఞప్తికి రావు అని ఆయన సిద్ధాంతం. ఈ అవసరాల్లో ఆకలి, భద్రత, స్నేహం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ సృజన కంటే ముందున్నాయి. సర్వ సాధారణంగా ముందు అవన్నీ పూర్తిగా, సంతృప్తిగా తీరిన తరువాతే సృజన అవసరం ముందుకొస్తుందని ఆయన అనేకమందిని పరిశీలించి చేసిన నిర్ధారణ. అయితే కొద్దిమందిలో మాత్రం వాళ్ళ స్వభావాలు ఈ నియమాన్ని అతిక్రమించడం ఉంది. ఉదాహరణకు కొద్దిమంది మనుషులకి ప్రేమ, అభిమానం కంటే కీర్తి, ప్రతిష్ట (respect of others, achievement, self-esteem) ఎక్కువ ముఖ్యం. అలాగే ఇంకొద్దిమందిలో సృజనశీలత ప్రబలంగా ఉండి, మిగిలిన అవసరాలని ధిక్కరించి ప్రస్ఫుటమౌతుందని ఆయనే చెప్పుకున్నారు. మర్యాద సృజనకు ఎందుకు అడ్డం వస్తుందో మాస్లో సిద్ధాంతంలో కొంత వరకు గోచరమౌతుంది. జీవిక కోసం, సంపాదన కోసం తమ కాల్పనిక శక్తిని అసంతృప్తికరంగానే అయినా రక రకాల వ్యాపారాలకోసం వినియోగించిన కవులు, కళాకారులూ ఎందరో ఉన్నారు. జీవిక కోసం కాకపోయినా, తమ భద్రతకు, ఉనికికి, హక్కులకు, గౌరవానికే మౌలికంగా ప్రమాదం ఉన్న సమాజాల్లో సృజనను, కళను తమ భద్రతనూ గౌరవాన్నీ పరిరక్షించుకోవటం కోసం వినియోగించే ప్రయత్నాలే సాహిత్యంలో ఉత్పన్నమయ్యే ఉద్యమ ధోరణులు. ఆలాగే, జీవిక కోసమూ, హక్కుల కోసమూ కాకపోయినా సరే సాహితీ వ్యాసంగాన్ని, కళను తమ పరువు, ప్రతిష్ట, వీటికి సమీప అవసరాలైన సామరస్యం, అభిమానం, స్నేహ పురస్సరమైన మర్యాదలకు (belongingness needs) నిబద్ధంగానే నిర్వహించుకోవటం కూడా ఆయా స్వభావాల్లో ఈ అవసరాల ప్రాధాన్యతను సూచిస్తుంది. మన ప్రవర్తనలో, మనస్తత్వంలో ఇవి సహజమైన స్వభావాలే గాని, నికార్సైన, సంతృప్తికరమైన సృజనకు - అంటే self-actualization అని మాస్లో నొక్కిచెప్పిన లక్ష్యానికి ఇవన్నీ ఏదో ఒక మేరకు అడ్డంకులు. సృజనశీలత తీవ్రమైన స్వభావంగా ఉన్నవాళ్ళలో సృజన ఈ అనుక్రమాన్ని ధిక్కరించి - అంటే సంపాదన, మర్యాద, ప్రతిష్ట, సామరస్యం, సుహృద్భావం మొదలైన అవసరాలన్నిట్నీ కాదనుకొని - మొట్టమొదటి అవసరంగా ఆవిష్కృతమౌతున్నాది. ఇలాంటివాళ్ళ వెర్రిని eccentricity అన్నారు. దీనిమీద చదువుకుంటే ఎంతో ఉపయోగకరమైన పరిశోధనలున్నాయి.
ఆధునిక సమాజాల్లోన ప్రాధమిక అవసరాలు - కనీసం తిండి, బట్ట లాంటివి, దాదాపుగా అందరికీ తీరుతున్నాయి. కాని, సాంఘిక అసమానతలు ఇదివరకటిలాగే, అంతకంటె తీవ్రంగా ఉన్నాయి. వివక్షకు, పీడనకు గురయ్యే వర్గాల్లోన సృజనశీలురైన వాళ్ళందరికీ సహజంగానే ఈ అవసరాలు తీరటంలేదన్న స్పృహ, వేదన ఉండితీరుతాయి. ఆ కష్టం ఏమిటో అనుభవించనివాళ్ళకి తెలిసే అవకాశం తక్కువ. అంటే - బాధపడితే గాని బోధపడదు. గాంధీజీ స్వయంగా వివక్షకు, అవమానానికీ గురయినందుకే ఆయనకు పౌరుషం వచ్చిందని అంటారు. స్వయంగా పేదలై, ఆడవాళ్ళై, దళితులై, వికలాంగులై, దుర్బలులై ఆ కష్టం, అవమానం ఏమిటో అనుభవిస్తే అప్పుడది అంతరంగంలో ప్రజ్వరిల్లుతూ ఆ మనిషి స్వభావాన్ని నిర్దేశిస్తుంది. ఇలాంటి మనుషులు సృజనశీలురైతే, వాళ్ళ సృజనకు రెండురకాల స్వభావాలుండే అవకాశం ఉంది. ఒకటి - వాళ్ళు వస్తుతః బలమైన సృజనకారులు కానట్లయితే వాళ్ళ అభివ్యక్తిలో సృజన కంటె సాంఘిక అవసరానిది, వేదనదే పైచేయి అవుతుంది. అయినప్పటికీ ఆ వేదనను, అవసరాన్నీ స్వయంగా తామే అనుభవించి ఉన్నారు కాబట్టి వాళ్ళ సృజన ‘మా నిషాద!’ వాక్యం లాగ సత్యం గాను, విశ్వసనీయం గానూ ఉంటుంది. ఇంతకు మించి, ఆ మనుషులే స్వయంగా బలమైన సృజనకారులు కూడా అయితే అప్పుడూ వాళ్ళ జీవితానుభవమూ, సృజనానుభవమూ రెండింటికి రెండూ ప్రబలమైనవే కాబట్టి, రెండిట్లో ఏ ఒక్కటీ ‘జూటా’ కావు కాబట్టీ వాళ్ళ సృజనలు విశేషంగా అలరిస్తాయి. బాధపడితే గాని బోఢపడదు అన్నదాన్ని గురించి నారాయణరావు గారు చెప్పింది ఏమంటే - ఇంకొకరి కష్టసుఖాల్ని, వాళ్ళ అనుభవాల్ని అన్నింటినీ స్వయంగా అనుభవించడం మనలో ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. కాని బోధపడేటట్టు చెప్పడానికి వ్యాసాల కంటే, ప్రవచనాల కంటే, మనస్తత్వం, సాంఘిక శాస్త్రం వంటి శాస్త్రాల కంటే కూడా కాల్పనిక సృజనే ఎక్కువ శక్తివంతమైనది అని. ఈ మాట నిజమేననిపిస్తుంది. ఎందుకంటే కాల్పనిక సృజన, కళారూపాలు సాధించగలిగింది అంతరంగాల నడుమ ఔద్వేగిక సమన్వయం. మిగిలినవన్నీ సాధించేది ప్రధమంగా బౌద్ధిక సమన్వయం. దానికి అనుభవాల్ని అనువదించడానికీ, ప్రవర్తనను ప్రభావితం చెయ్యటానికీ ఉద్వేగానికున్నంత శక్తి ఉండదు.
మొదట చెప్పిన అయిదు అవసరాలు - శారీరకావసరాలు, భద్రత, ప్రేమాభిమానాలు, ప్రతిష్ట, సృజనశీలత - కాకుండా ఇంకొకటి తాత్విక జిజ్ఞాసను (transcendental need) చేర్చి ఈ ఆరు అవసరాలూ మనుషుల ప్రవర్తనల్ను నడిపించే చోదక శక్తులని మాస్లో నిర్ధారించేరు. వీటిలో చివరిది సృజనశీలత కంటె కూడా పైది. చిత్రంగా మన ప్రాచీన లాక్షణికులు, సృజనకారులలో కొందరు సృజనకు, తాత్విక జిజ్ఞాసకూ ఉన్న సంబంధాన్ని ఇలాగే అర్ధం చేసుకున్నారు. ‘సాహిత్యమ్ రసానందమ్ బ్రహ్మానంద సహోదరమ్‘ వంటి వాక్యాల్లోన, సారస్వత సృజన అనుభవం యోగి అనుభవానికి సబ్రహ్మచారి అనీ, యోగుల అనుభవమైన నిర్వికల్ప సమాధికి సమీపమైన లౌకికానుభవమనీ పాతకాలం వాళ్ళు వందలాది మంది నొక్కిచెప్పిన మాటల్లోన ఇది విశదమౌతుంది.
 ఇటీవలి కాలంలో పుట్టపర్తినారాయణాచార్యులు 
గారిదీ ఈ దృక్పధమే. వేమన కవి అవునా కాదా అన్న 
ప్రశ్నను చర్చిస్తూ ఆయన ‘వేమన కవి కంటె 
ప్రబలంగా యోగి. యోగి కవి కంటె పైమెట్టు మీది 
వాడు. ఆయన్ని క్రిందికి లాగి కవి అని ప్రకటించాలని 
ఎందుకు ఆరాటపడతారు?’ అని ఎదురు ప్రశ్న వేస్తారు. 
మాస్లో అనుక్రమంలో మర్యాద సృజనకు ఎలాగైతే అడ్డం పడుతోందో, అలాగే సృజన తాత్విక జిజ్ఞాసకూ అడ్డం వస్తోంది. చలంగారు ముందు మర్యాదను ఛీత్కరించుకొని సృజనను ఆశ్రయించి, ఆ పైన సృజననూ తిరస్కరించి తత్వాన్ని ఆశ్రయించేరు - మాస్లో మెట్ల నిచ్చెనను ఒక్కో మెట్టే ఎక్కుతున్నట్లుగా! త్రిపుర వెదుకులాట చలంగారు చివరి మజిలీ అనుకున్న చోటనే మొదలయ్యి, ఏ గమ్యం మార్గం లేకుండానే చప్పున ముగిసి మౌన వ్యాఖ్యగా చల్లారిపోయింది. అది సృజనను తిరస్కరించటం లేదు. తృష్ణను, చాపల్యాన్ని, కపటాన్ని, మర్యాదనూ తిరస్కరించటం లేదు.
సృజన అనుభవాన్ని పరిశోధిస్తున్న ఆధునికులు చిక్సెన్ట్‌మిహాయీ మిహాయీ(Csikszentmihalyi Mihaly)వంటి వాళ్ళ నిర్ధారణలు, స్వయంగా సృజనకారులైన పాశ్చాత్యులు చెప్పుకుంటున్నవీ పట్టిచూస్తే చిత్రంగా ఉంటాయి. వాటిని చలంగారు, నారాయణాచార్యులుగారు, త్రిపుర ఇలాంటి సృజనకారులందరి అవగాహనల్తో పోల్చి పరామర్శించవచ్చు.
(ఇంకా ఉంది
)

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి