6 జూన్, 2017

వస్తా వట్టిదె .. పో తా వట్టిదే ..

అలెగ్జాండరు ..
ఎన్నో కథలు..
రాజ్యకాంక్షను పెనవేసుకున్న 
పదహారేళ్ళ పసి హృదయం ..
ఒకవైపు యుథ్థోన్మాదం..
మరోవైపు గురువు పయనించిన 
తత్త్వ రహస్యదారులపై ఆసక్తి..

ఎంతమంది మహనీయులను చూసినా..

మరణం చేయి చాచేవరకూ..
ఆ సారసమీరం హృదయాన్ని స్ప్రుశించనేలేదు..

రాచరికపు నెత్తుటిదారులలో పడిపోతున్నప్పుడు

 అతణ్ణి అరిస్టోటిలు పట్టినిలిపినట్లనిపించేది..
ఆయన తన విద్యా బోధకుడు. 
 ప్లేటో ఆరాధకుడు .. 
 గొప్ప తాత్త్వికుడు ప్లేటో.. 


మనిషిమార్గాన్నిమార్చేవి రెండే రెండు..

తల్లి.. గురువు..
గురువు నతడు సొంతం చేసుకునే సరికి..
కాలం జారిపోయింది..
రిక్త హస్తాలే మిగిలాయి..
వాటినేఅతను ప్రపంచానికి చూపాలనుకున్నాడు..


కాస్త మట్టి..

గంగాజలం..
రామాయణ భారతాలు.. 
ఒక గురువు..
భారత దేశం నుంచీ కానుకగా కావాలని  
అరిస్టాటిల్ ఎందుకడిగాడో అర్థమైంది ..
అప్పటికే సమయం మించిపోయింది .. 
జీవితం అతి త్వరగా ముప్ఫయి రెండేళ్ల కే 
ముగిసి పోయింది .. 
ఇది అలెగ్జాండరు  జీవితం .. 
మరాఠీ నుంచీ 
''భారతీయ ఇతిహాసాం తిల్ సాహసోనేరిసావే''
 అనువదించిన పుట్టపర్తి 
మన గురించి ఏం చెబుతారో చూద్దాం.. 
పుట్టపర్తి ఒరిజినల్ మరాఠీ నుంచీ తర్జుమా చేసిన వ్యక్తి 
అంతే కానీ 
మరాఠీగ్రంధానికి  ఇంగ్లిష్ అనువాదం 
దానికి మళ్ళీ తెలుగు అనువాదం .. 
ఇలా కాదు 
మరాఠీ భాష సొగసులు పరిమళాలు 
ఆత్మ జారిపోనివ్వని కథ ఇది .. 
అనువాదాలలోను పుట్టపర్తికి గొప్ప పేరే వుంది .. 




గ్రీ కు చక్రవర్తి దేశమున నలువేపులకును 

జారుల నంపుచుండెను.

జయించిన జయింపవలసిన దేశములలో 

వారు సంచరించి వచ్చి..
యక్కడి స్థితి గతులను చక్రవర్తికి దెలిపెడువారు.

వారు దెచ్చిన వృత్తాంతములలో 

నరణ్యముల నేకాంతవాస మొనర్చు తపస్వులు.. తపోవనములు.. 
నిస్సంగులు..
గ్రామైక రాత్రముగ దిరుగు తత్త్వ చింతకులు .. 
వీరి వర్ణనములు గూడ నుండెడివి.

గ్రీకు చక్రవర్తికి స్వయముగ తత్త్వజ్ఞానమునందభిరుచిగద్దు..

అతడరిస్టోటిలు శిష్యుడు..

భారతదేశమునందలి ఇట్టి 

నిస్సంగులైన పురుషుల విషయమున..
గ్రీకుదేశమునందే యెంతయో యాదరముండెడిది..
భారతదేశమునకు రాకముందే వీరి కీర్తి 
యలగ్జాండరు చెవులకెక్కినది..

గ్రీకు దేశస్తులిట్టి యతులు మొదలైన వారిని 

తమ భాషలో
జిమ్నాసోఫిస్ట్  Gymnosophist  అని పిలచెడివారు..

ఇట్టివారిని ప్రత్యక్షముగ జూచి .. 

వారితో మాటాడవలెనని గ్రీకులకెంతయో ఆశ.

అరణ్యల దపమొనర్చికొను సన్యాసులనెందరినో 

అలగ్జాండరు దనకడకు రప్పించుకొనెను..
కొన్ని యెడల దానే పోయి వారిని జూచెను..
ఇట్టి సన్నివేశముల గురించిన కొన్ని కథలు
గ్రీకు చారిత్రకులు వ్రాసిరి..
వానిలో నొకటి రెండు కథల నిచట నుధ్ధృతీ కరింతును..

ఈ యుదాహరణములతో గ్రీకులు 

భగవంతుని పుత్రుడనుకొన్న యలగ్జాండరు
వ్యక్తిత్వము గూడ మనకు బోధపడగలదు..

గ్రీకు చక్రవర్తి 

యొకనాడొక యతిని గలిసికొన్నాడు..
అతనినితడు
'' నాకీ దిగ్విజయములో సంపూర్ణ యశస్సు లభించునా లేదా..??''
యని ప్రశ్నించెను..
దానికాసన్యాసి యేమియు బదులివ్వలేదు..
అతడొక కృష్ణాజినమునుదెఛ్చి ఇఛ్చి .. 
దీనిని బరచికొని గూర్చుండుమని 
చక్రవర్తితోనన్నాడు.

ఆ కృష్ణాజినమరటియాకువలె 

ముడుచుకొని పోయినది..
దానిని జక్కగా నేలపై బరచి కూర్చొనవలసినదనియతియన్నాడు..

దానిపై యలగ్జాండరో ... 

లేక యతని యాజ్ఞ తో మరియొకరో .. 
కూ ర్చొనుటకై యత్నించెను..

కాని దానిని బరచికొనుటెట్లు..??

ఒకవైపు సరిజేసిన మరియొకవైపునుండీ.. 
యది ముడుతలువడుచు వచ్చును..

వారెంతయోబ్రయత్నించిరి..

దాని ముడు తలుబోగొట్టుటకు సాధ్యము గాలేదు..

ఆయవస్తజూచి యాయతి ఫక్కున నవ్వినాడు..

అపుడాతడనెను..
'' చక్రవర్తీ..!! భారతదేశ దండయాత్రవలన 
నీకు గలుగబోవు లాభమింతే..!!
నీవొకవేపునుండీ ముందుకు సాగిపోవునప్పుడు..
నీచే జితులైన రాజ్యములు మరల నూత్న శక్తిని సంపాదించుకుని నీపై బడును.. 
వారిని జయించుటకు నీవు వెనుదిరిగినప్పుడు.. 
జయింపవలసిన రాజ్జములు నీపై బడును.. 
నీవెట్లును.. భారతదేశ సామ్రాట్టువు కాజాలవు..''

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి