22 డిసెం, 2011

ముగ్ధ పూజ





"మనసు మెదలదు..గన్నులు గనవు.., పలుకు
బయలుదేరదు..ఉపచార వాక్యములకు..
ప్రభలు చల్లు నివాత దీపంబు నీవు...
మోహనంబైన యొక్క ముగ్ధ పూజ నాది.."

అయ్యది ఉష్ణ శరీరం ..
అయ్యకు తలపై దండిగా నూనె పెట్టి 
బాగా మర్దన చేయాలి..
భృంగామలక తైలం ..
అరి కాళ్ళకు .. 
అర చేతులకూ..
మొత్తం వళ్ళంతా బాగా మాలిష్ చేసేవాళ్ళం 
మా అక్క చెల్లెళ్ళందరం..
మొదట్లో అమ్మ చేసేదనుకుంటా..

ఓ నాలగైదు గంటలు నాని 
తరువాత స్నానం చేసేవారు అయ్య..
 
ఇలానే ఒకరోజు 
అయ్య తలనిండా నూనే పెట్టుకొని కుర్చీలో కూర్చున్నారు..
తులసీ రామాయణాన్ని చదువుతున్నారు..
అది పారాయణ కాదు 
కంఠస్ఠం చేయటం..

ఇంతలో  వీధిలో 
ఒక బిచ్చగాడు నిలబడ్డాడట
అయ్యను చూశాడు ..
నెత్తిమీద నూనె పెట్టుకొని..
స్నానం చేయకుండా..
 అలానేనా రామాయణాన్ని చదివేది..?


  వచ్చిన వాడు బిక్ష అడగకుండా..
ఇలా మాట్లాడేసరికి..
అయ్యకు కోపమొచ్చింది..
అసలే అయ్యకు విపరీతమైన కోపం 
 

వాడలా అడిగే సరికి 
అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు..

 

వాడిని నీ అమ్మ కడుపు కాలా ..
ఏరిగితే  కడుక్కునేదానికి రాని నీవు.. ..
నాకు చెప్తావా.. ఫో రా.. ఫో .. 
అని శివతాండవం చేసారు..

 
ఏదో ..
ఒకటో.. రెండో గంటలు 
దేవుని ముందు కూర్చుని 
పూజ అయిందనిపించేవానికి నిబంధనలు గానీ..

ఇరవై నాలుగ్గంటలూ ..
ఆ రాముణ్ణీ.. 
ఆ కృష్ణుణ్ణీ ..
పట్టుకు పాకులాడే వానికి స్నానమేమిటీ..? పానమేమిటీ..?
అదీ అయ్య భావన..

ఏమైందని అమ్మ వచ్చి విచారించింది..
అయ్యకు ఎదురు చెప్పే సాహసం 
అమ్మకు ఎక్కడిది..?

 ఎందరో సాధు సంతులను ..
కలసి వారి తత్వాన్ని 
నిరంతరం మననం చేసే అయ్య..

వచ్చిన వాడు ..
ఏ సాధకుడో.. 
లేక సాక్షాత్తూ ఆ శ్రీ రామ చంద్రుడో..
లేక ఆయన సేవకుడు హనుమంతుడో..
అయ్య మనసులో .
.

అంతే..
చిన్న టవలు కట్టుకుని .. 
నూనె కారుతున్న ఆ అవతారం తోనే ..
పరుగు పరుగున వీధులన్నీ వెతికారు..
అతని కోసం..
ఇంట్లో పిల్లలూ .. 
శిష్యులూ .. 
బాణాల్లా కదిలారు..
రామచంద్రుని వెదకడానికి..
 
ఊహూ..
ఎ..ఖ్ఖడా ..కనపడలేదు..
ఇల్లిల్లూ అడుక్కునే వాడయితే 
నాలుగిళ్ళ అవతలో .. 
లేదా పక్క వీధిలోనో దొరకాలి..
కానీ ఇతనలా దొరక లేదే..
ఇతనే శ్రీ రామ చంద్రుడేమో..?                   
లేదు ..లేదు.. 
ఆంజనేయ స్వామి అయివుంటాడు..
 
ఇక పశ్చాత్తాపం ..
అంతులేని ఆత్మ పరిశీలన..
ఈ విధమైన దాగుడు మూతలు 
అయ్యకు దేవునికీ చాలాసార్లే జరిగాయి..

భగవంతుడూ .. 
భాగవతమూ.. 
భక్తుడూ ఒక్కటేరా.. 
అని తన శిష్యునికి భాగవత సారాన్ని వివరిస్తూ..
శ్రీనివాసా ..
అని ఆఖరిమాటగా కన్ను మూసిన అయ్యకు..

అయ్య జీవితపు ఆఖరి క్షణంలో 
జాలిపడి ఆ పరమాత్మ 
అయ్యకు సాక్షాత్కరించి 
పసిపిల్లాడిలా అక్కున చేర్చుకున్నాడని  
అనుకుందాం..

                                

ఉప్పలపాటి రఘూత్తమరావ్..

ఉప్పలపాటి రఘూత్తమరావ్..
అయ్యకు పరమ భక్తుడు..
MA Mathas..MA English..
హైస్కూల్ లో టీచరు..

అయ్యతో అదేమి అనుబంధమో ..
అయ్య ఆజ్ఞను శిరసావహించటం తప్ప వేరే కర్తవ్యమే లేనట్లు వుండేవాడు..
రాత్రీ పగలూ అయ్యతోనే..

జ్యోతిష్య పండితుడు కూడా..లెక్కల్లో అసాధ్యుడు..
ఒకసారి అయ్యకు గుర్రప్పందేలు ఎవరో ఎక్కించారు..
ఇక గురు శిష్యులిద్దరూ.. ఆ గుర్రాలపై పడ్డారు..

రఘూత్తమ రావు సారు గుర్రాల నంబర్లకు జ్యొతిష్యాన్ని జోడించి విపరీతమైన లెక్కలు కట్టేవాడు..
ఈ గుర్రానిదీ నంబరు దీని అధిపతి గురువు..దాని అధిపతి కుజుడు..                             

కానీ లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళు వేసిన పాచికలు యేవీ పారలేదు..
ఎప్పుడూ ఆమె వీరిని చూసి నవ్వేసి వెళ్ళిపోయేది..
కొన్నాళ్ళు ఆ పిచ్చిలో మునిగితేలి ఇక వదిలేసారు..
అమ్మ కోపంతో రఘూత్తమ రావ్ సారును ఘూత్తముడు అనేది కోపంగా..

అయ్య జాతకాన్ని ఎన్ని వందల సార్లు శోధించి చూసాడో మహానుభావుడు..
నాకు డబ్బు వస్తుందా..?
నా కూతురికి మంచి మొగుడొస్తాడా..?
ఇవి కావు ..
అమ్మ

నేను 30 కోట్ల అష్టాక్షరి చేసాను..

నాకు పునర్జన్మ వుందా.. ?
కృష్ణ సాక్షాత్కారమౌతుందా..?

ఇవే ప్రశ్నలు..

వీనికి ఆయన గ్రహాలను సాధించి వదిలి పెట్టేవాడు..
టిఫెను .. భోజనమూ.. పడక .. అన్నీ అయ్య తోనే..
అప్పుడప్పుడూ..అమ్మని వినమని పిలిచేవారు..
అమ్మ కొంచం విని మెల్లగా వెళ్ళీపోయేది..
ఇది ఎన్నవసారో అమ్మకు కూడా గుర్తు వుండదనుకుంటా..

ఆయన విపరీతంగా MA లకు కట్టేవాడు..
పరీక్షకు వెళ్ళాలంటే..
కట్టిన ప్రతిసారీ అయ్య ఏం పోతావులేరా..వుండు.. అనేవారట..
చిత్రంగా ఆయన అయ్య మాటకు ఎదురు చెప్పేవాడేకాదు..
సుమారు ఇరవైసార్లు కట్టాడంట ఇలా..
అయ్యను శ్రీ మహా విష్ణువుగా ఆయన చెబుతా
డు...
మత్రోపదేశం చేయమని అయ్య వెంట బడ్డాడట..
 
చూడు.. నా వెనుక వస్తే.. నీకన్నీ కష్టాలే..
మీ అమ్మ తో వెళ్ళు (అంటే అమ్మతో ఉపదేశం పొందమని)..ధన కనక వస్తు వాహనాలతో సుఖిస్తావు.. అని ఎన్నో సార్లు.. చెప్పారట అయ్య..
 
ఎన్నో సంవత్సరాలు ఉపదేశం ఇవ్వలేదు..
కానీ నాకు అవేవీ వద్దు..నాకు మీరే గురువు అని ప్రధేయపడ్డాడు..
అన్నట్లుగానే ఆయన కళ్ళ ముందరే ఆయన భార్య చనిపోయింది..

మా సుభ్రమణ్యం అన్నయ్య

ఎదిగిన ఒక కూతురు.. కొడుకూ .. పోయారు..
అయినా నేను గురు పాదుకలు వదలలేదు..అనేవాడు ఆయన..

వాళ్ళ ఇంట్లో కూడా అయ్య సాంగత్యం వదలమని పోరేవారు..

ఇది పూర్వ జన్మ సంబంధమా..?

కాక పిచ్చితనమా..?

ఇలా ఈయనే కాదు.. ఎందరో .. అయ్యను మనస్ఫూర్తిగా నమ్మారు..
 
ఆయన జీవితం తెరిచిన పుస్తకం ..
జీవన విధానంలో ఎక్కడా దాపరికాలు లేవు..
అది మంచికానీ చెడుకానీ..
 
కానీ మా సుభ్రమణ్యం అన్నయ్య అమ్మ పాదాలు పట్టుకున్నాడు..
అతను మా తోడబుట్టిన వాడు కాదు..
అంతకంటే ఎక్కువ..
కోమటివాడు..తొమ్మిదేళ్ళ వయసులో మా ఇంటికి ముడి పడ్డాడుట..
 
అన్నయ్య ఎనిమిదేళ్ళ వయసులో ఒకరోజు ఎందుకో యేడుస్తూ రామకృష్ణా హైస్కూల్ వైపు వస్తున్నాడట..
అయ్య దారిలో ఎదురయ్యారు..
 
యేమిరా యేడుస్తున్నావు.. అన్నారట..
అమ్మ కావాలి అన్నా
డు అన్నయ్య..
 
ఇంట్లో వుంది చూడుపోరా. . అన్నారు అయ్య..
 
అంతే..
 
ఇంటికి వచ్చి అమ్మను చూసాడు..తెలియని మాయలో పడిపోయాడు..
 
అప్పుడు ఇంటినిండా శిష్యులు..
వచ్చీ పోయేవారు..
 
పడసాలలో మూల మూలకూ కూర్చొని జపాలు చేసేవారు..
 
ఇదీ మా ఇల్లు..
 
ఇక ఇంటికి పోలేదు..వాళ్ళ అమ్మ నాయనలు వచ్చి పిలచినా బ్రతిమాలినా సరే..
 
వాళ్ళు కోపంతో ఆగ్రహించి అమ్మను అయ్యను విపరీతంగా తిట్టి తిట్టి పోయేవారట..
 
అమ్మ ఒరే సుబ్రమణ్యం ..మీ ఇంటికి పోరా.. అంటే వినడు..
 
ఒకసారి యేదో ఎర్రగుంట్లలో రేషన్ షాపులో పనిచేసాడట..
అక్కడ రా
త్రి దొంగతనంగా ఒకటి రెండు బియ్యపు మూటలు రాత్రి బస్సులో వేసుకొని వచ్చి ఇంట్లో వేసి మళ్ళీ వెంటనే బయలుదేరి పొద్దున ఎర్రగుంట్ల కు చేరేవాడు..
 
ఎలానో oriental general insurance  లో ఉద్యోగం సంపాదించాడు.
 
అన్నయ్య చదివింది ఎనిమిదో క్లాసు అనుకుంటా..
ఏ స్థాయికి ఎదిగాడో తెలుసా.. divisional manager ..
 
నమ్ముతారా..?
 
మహిమ నమ్ముకున్న దేవునిదా..?
నమ్మిన భక్తునిదా..?
 
అయ్య ఒకసారి ఆశ్రమ జీవితమంటారు..
ఒకసారి భజనలూ .. పూజలూ.. జపతపాలు అంటారు..
ఇంకేవో వ్యామోహాలు..

ఒకసారి హిమాలయాలకు ఇంట్లో చెప్పకుండానే వెళ్ళి పోతారు ఒక కాగితం ముక్క రాసిపెట్టి..
సంసారం పట్టించుకోవటం ఆయన ఇష్టం..
 
అమ్మ రామాయణాన్ని పట్టుకొని రాముణ్ణి నిలదీస్తుంది..మరి..


కటిక చీకటిలో దొంగ కరణి బోవు..
నంతటి యవస్ఠ యే పాపమయ్య నీకు..
తెలుపగూడదో లేత వెన్నెలలు జిలుకు..
నవ్వులందించి సాగనంపగ లేనో..


అని అమ్మ పశ్చాత్తాపం అనే ఖందికలో యశోధర గొంతుతో అయ్యను సూటిగా ప్రశ్నించింది..


అంతేకాదు..


అడవులందు కాయ క్లేశమనుభవించి..
పూతమేయనుభూతిని పొందలేవో..
ఇంటిలోనుండి నేను సాధింతు దాని..
దృప్తుడా లాభ నష్టముల్ ..దేల్చి కొమ్ము..
అని ఓ ధీర వనితలా సవాలు విసిరింది ..

 
మరి ఈ పిచ్చి భక్తుని సంసారాన్ని కాపాడటానికి ఆ దేవుడే రక రకాల ఇబ్బందులను పడ్డాడని నేనంటాను..
 
అవునా కాదా ..? యేమో..

పండరీ భాగవతాన్ని రఘూత్తమ రావు సారు కొన్ని వందల వందల సార్లు.. చదివాడు..
 
భగవద్గీత భాగవతం అన్నీ ఆయనకు కంఠస్తాలే..
పండరీ భాగవతంలోని ఘట్టాలను వివశులై ఏడుస్తూ అయ్యకంటే ఎక్కువ వినిపించిన దృశ్యాలు నాకింకా నిన్నటివి లానే వున్నాయి..



20 డిసెం, 2011

మా ..రాజన్న



రాజన్న అయ్య శిష్యుడు..
నరాల రామారెడ్డి ..,

రాజన్న.. 
అయ్యను గురువుదేవుడని 
ప్రతి సభావేదిక పైనా స్తుతించేవారు.


రాజన్న కవి.. గాయకుడు..
వసు చరిత్ర పద్యాలను 

కమ్మగా పాడేవాడు..
అతని గొంతులో పద్యాలు కొత్త అందాలను సంతరించుకొనేవి..
నరాల రామారెడ్డి

చక్కని రూపం..

కమ్మటి కంఠం..
 


గూగుల్లో రాజన్న కవి ఫొటో లేదు..
జమ్మలమడక మాధవ రాయ శర్మ గారిదీ లేదు..                                                
నాకు చాలా నిరాశ కలిగింది..
జనాలు మంచి వారిని 
ఇలా మరిచి పోతున్నారేమిటా 
అని బాధ ..

C.V.సుబ్బన్నా కవే..
అయ్యంటే సరిపోదని అనేవారు..
గాయకుడని కవులు వదిలేస్తారు..
కవి అని గాయకులొదిలేస్తారు..
ఇలా రెండు విధాలా 

బ్రతికి పోతున్నాడు రాజన్న అనేవాడాయన..

కవుల మధ్య 

ఈ మత్సరాలెందుకో నాకు అర్థం కాదు..
కానీ రాజన్నను 

నా చిన్నతనం నుంచీ చూస్తున్నాను..
పైన అయ్యతో మాట్లాడి కిందకి వచ్చి 

అమ్మతో మాతో కూడా చక్కగా మాట్లాడే వాడు..
ఇప్పుడు రాజన్న లేడు...
మనసులో  ఏదో బాధ..
నరాల రామారెడ్డి కూడా 
మాకు బాగా పరిచయం 
అష్టావధానాలు ఎంత బాగా చేసే వాడో..
రాజన్న నరాల రామారెడ్డి 

అయ్య శిష్యుల మనే వారు..
పంచకావ్యాలు చదివారు..
నరాల రామా రెడ్డి కార్తీక దీపం
 సినిమాలో ఒక పాట రాసాడు..
అయ్యకు శిష్యులంటే వల్లమాలిన వాత్సల్యం..


శ్రీ S.రాజన్నకవి..

ఒక గాంధర్వ కళా తపస్వి భువిపై .., నుల్లాసియై డిగ్గి..,దే
వకథా మర్మములన్నియుందెలిసి..,భావస్నిగ్ధుడై .. పల్కు గా..
యకుడై..,నాట్య రసజ్ఞుడై..,యారాధ్య శౌండీర్యుడై..
సుకవీంద్రుండగు పుట్టపర్తి గురుపూజ్యున్ గొల్తు భక్త్యున్నతిన్..

చనువో..భక్తియో..! పారవశ్యమో..!మరె సారస్వతా కాంక్షయో..!
ఘనమౌ నీ కవితా రసమ్ము మది సోకన్ హర్ష పూరమ్ములో..
మునకల్ వైచెదనోయి..! రమ్య కవితా మూర్దన్య..! నీ కీర్తి నెం..
తని వర్ణింతును పుట్టపర్తి గురుదేవా..! భవ్య వాగ్వైభవా..!!

విధి రమణీస్మితాతిగము విభ్రమమున్ బెనవైచుకొన్న నీ..
పదియును నాల్గుభాషల యపార పరిశ్రమ తెల్గు నేలలో ..
సదమల చంద్రికా ధవళ చర్చితమైనది.. కావ్య మోహినీ ..
మధుర దృగంబుజాత పరిమార్గిత సత్కవి లోక తల్లజా..!!

రచియింతువో..! భక్తి రక్తి స్పృహా దీప్తి..
కవిరాజు శ్రీనాధ కమ్ర ఫణితి..
రచియింతువో..! మా ప్రబంధ కవీంద్ర సౌం..
దర్య భావాల మాధుర్యలీల..
పలికింతువో..!! నాటి వాగ్గేయ కారుల ..
కిన్నరీ బృంద సంగీత రీతి..
నడిపింతువో ..! యుపన్యాస భంగిమ తుంగ ..
భద్రా సముత్తుంగ భంగ భంగి..!!
సర్వ కవులు నీలోన సాక్షాత్కరింత్రు..
నేను నేనని ప్రతిభా ప్రణీత మతులు..
ముగ్ధ హృదయ ..! పద్మశ్రీ విభూష..!! పుట్ట
పర్తి గురుదేవ..! సూక్తి పుంభావ మూర్తి..!!


"ప్రకృతికో ..మాయకో ..కాక భావనా ప్ర
     పంచ సౌదామినికో ...తపః ప్రభకో..,శూన్య
     మునకో.., యానంద రూపమై మోదమొసగు..
     సాత్విక వ్యక్తికీ నమస్కార శతము.."

    "షాజీ" నుంచీ..

పర్వీన్ సుల్తానా ఒకసారి మా వూరు వచ్చింది..
అయ్యకు ఆహ్వానం ..
అయ్య తో మేమూ అందరం వెళ్ళాం..
బ్రహ్మండంగా పాడింది 
అంటే చాలా చిన్నమాట..

ఆమె తన గానంతో..  
ప్రకృతిని  అత్యంత సుందరంగా 
దృశ్యం గావించింది..

ఆమె అమృతం తాగిందా..
ఇంత మధురంగా పాడుతుంది ..
అని  రాగానుభూతిలో 

మైమరచిపోయేలా  
మంత్ర ముగ్ధులమైపోయాం..

నేనప్పుడు పధ్నాలుగేళ్ళ పిల్లనేమో..
 
పాడుతూ పాడుతూ మధ్యలో ఆపి ..
అదిగో చూడండి.....
చీకటి నిండిన తూరుపు..
మెల్లగా ఓ వెలుగు రేక 
చీకటి ముసుగు తొలగించుకు కన్ను తెరిచింది..
అంటూ మళ్ళీ మమ్మల్ని 
తన వెంట తీసుకు పోయింది..

తన తిర్కాల పాటవంతో..
అదిగో ..
నీలాకాశం ..
చూడండి ..
పక్షులు ఆనందంగా ..
నిర్భయంగా..
పసిపిల్లల్లా ఆనందంగా 
గిరికీలు కొడుతున్నాయి..

మళ్ళీ రాగాలాపన..
మబ్బులు తొలగించుకుంటూ 
పైకొస్తున్న సూర్యుణ్ణి ..
ఆమె కంఠ లాలిత్యంలో మేము దర్శించాం..              
                         
అయ్య ఆమెను చూసి చాలా విచలితులైపోయారు..

ఆనందాశ్రువులు .. 
అయ్యను చూసి మేము ఇంకా పరవశించిపోయాము..

అక్కడ హిందుస్థానీ సంగీతం తెలిసిన 
వాళ్ళు యెవరూ లేరని 
ఆమె భావించినట్లుంది..


కానీ అయ్య ఊరికే వదలరుగా..

ఆమెకు రెండు మూడు ప్రశ్నలు వేసి 
ఆమె తన అన్నేళ్ళ సాధనను 
మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోవలసిన 
అవసరం కల్పించారు..

కానీ అయ్య లోని పాండిత్యం 
సంగీత సాధికారత 
ఊరికే విడిచి పెడతాయా మరి..
ఆమె కడపను ఇప్పటి వరకూ
 గుర్తు పెట్టుకుని వుంటుందని నేను అనుకుంటున్నాను.. 

అయ్య మిద్ది పైన హర్మొనియం వాయిస్తూ.. అన్నమాచార్యులు క్షేత్రయ్య..
కీర్తనలు మైమరచి పాడేవారు..

అదొక భావావేశం.. 

అక్కయ్యలు అందరూ చుట్టూచేరేవారు..
వాళ్ళూ పాడే వాళ్ళు..

రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు స్వరపరచినవి..
తానే స్వరపరచుకున్నవి కొన్ని..

 మగువ తన కేళిక మందిరము వెడలెన్.....  క్షేత్రయ్య..

నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచే చదువూ ..........అన్నమాచార్యులు

నల్లనిమేని నగవూ చూపుల వాడు............అన్నమాచార్యులు

అలరులుకురియగ ఆడెనదే అలకల కులుకుల అలివేల్మంగా..........అన్నమాచార్యులు
అలరులు కురియగ ఆడెనదే  
నాగపద్మిని అక్కయ్య నాట్యం చేసేది..
అబ్బ.. మా ఇల్లొక ఆనందారామం ..

అయ్య కడప మోచంపేట శివాలయంలో 
గురువారం గురువారం 
సాయీ సచ్చరిత్ర మరాఠీ పుస్తకం చదివి 
తెలుగులో అనువదించి పురాణం చెప్పేవారు..

పురాణం తరువాత
 హార్మోనియం.. తబలా..వాయిస్తూ భజనలు..
ఆ చుట్టుపక్కల వారు అందరూ 
అయ్య భక్తి ప్రవాహంలో 
మునకలేయటానికి 
సాయంకాలం కోసం ఆశగా 
ఎదురుచూసే వారంటే అతిశయోక్తి కాదేమో..


17 డిసెం, 2011


ఏ పరిమేష్ఠి కుంచె.., రచియించును..
లోక మనూహ్య సుందరం..
బా  పరమేష్ఠి  సర్వనిగమౌఘ  విధిజ్ఞుడు..
నీదు  పాల  ని..
ర్వా  సిత  పాప..!  తాపృధుక  భావము వాడట..!
యెవ్వరింక.., దే..
వా ..! పరిపక్వ బుధ్ధులు..!  ఖగాంగ
జగజ్జన  జన్మ  తారణా..!
"శ్రీనివాస ప్రబంధము" నుండీ..
 
ఇటీవల ఎక్కడో చదివాను..విశ్వనాధవారిని కలవడానికి ఎవరో వచ్చారట..

విశ్వనాధ వారిని కలవాలి అన్నారట..
కూర్చోండి .. అనేసి ఎవరో స్త్రీ లోపలికెళ్ళి పోయిందట..


కాసేపు ఎదురుచూసినా..  లోపలినుంచీ అలికిడి లేకపోయేసరికి ఆవిడ నెమ్మదిగా లోనకు నాలుగడుగులేసిందట..

అక్కడ ఓ ఆయన మామిడి ముక్కలు ఊరగాయకు రెడీ చేస్తున్నారట..
ఆయన ఏం కావాలి అన్నట్లు చూసారు..

గుంటూరు శేషేంద్ర శర్మ
ఆమె మళ్ళీ విశ్వనాధవారిని కలవాలి అని సంశయిస్తూ అడిగింది..

నేనే విశ్వనాధను చెప్పండి అన్నారట..
ఇవన్నీ వాళ్ళ నిజజీవితంలోని విషయాలు..

గొప్పవారైనవారు నిజజీవితంలో ఎలా వుంటారు అని అందరికీ చిన్న కుతూహలం..

నాగేశ్వరరా రావ్ సూరిబాబు రామతిలకం..
విశ్వనాధవారు మా ఇంటికి వచ్చి అయ్యతో రామాయణ చర్చలు చేసేవారట..

అమ్మతో వంటింట్లో పీటవేసుకుని కూర్చుని కబుర్లు చెప్పేవారట..

 
అమ్మ చెప్పేది.. 


సూరిబాబు ..,జమ్మల మడక మాధవరాయ శర్మ.., గుంటూరు శేషేంద్ర శర్మ..,గడియారం శేషశర్మ.. మల్లంపల్లి సోమశేఖర శర్మ..


మూర్తీభవించిన ఆంధ్రతేజం శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. ఆంధ్ర చారిత్రక పరిశోధకులలో, తొలితరం వారిలో అగ్రగణ్యులు,పూజనీయులు.

గడియారం ఆయనకూ అయ్యకు   యేవో వివాదాలున్నా అవి అక్కడి వరకే..
 
పువ్వుల సూరిబాబు ఆయనను కంచుకంఠం సూరిబాబు అనేవారుట..ఆయన సింగరూ డ్రామా ఆర్టిస్టు కూడా..1946 లో మైసూర్ మహరాజా వారి దర్బారులో ఆయన నాటకం వేసారుట కూడా.. 

ఆయన ఆహ్వానించగా అయ్య మా రెండవ అక్కయ్య తరులత (అప్పటికి ఏడెనిమిదేళ్ళ పిల్ల..) శ్రీ కృష్ణ తులాభారం నారద సంసారము అనే నాటకాలకి వెళ్ళారు.
కర్నాటకలోని గదగ్ సంస్ఠానానికి వెళ్ళి పండిత గోష్టిలో అయ్య పాల్గొన్నారు..
 
సూరిబాబు బెజవాడ రాజరత్నం బలిజేపల్లి..
అప్పుడు బంగారు వెల చాలా తక్కువ..అయిదో పదో బంగారు కాసులు ఇచ్చి శాలువా కప్పే వారుట..

అయ్య నిజ జీవితంలో కూడా ఎప్పుడూ కావ్యలోకంలో విహరిస్తున్నట్లు ఉండేవారు..

అమ్మ అయ్యకు అన్నం వడ్డించి విసనకర్రతో అయ్యకు విసురుతూ కూర్చునేది..

అయ్యకోసం గడ్డపెరుగు తీసిఉంచేది అమ్మ.
విశ్వనాధ

ఎక్కడికైనా సభకో సన్మానానికో వెళ్ళాలంటే కూడా.. అయ్యకు తలకు నూనె పెట్టాలి ఎవరో ఒకరు..

ఇస్త్రీ బట్టలు పంచె జుబ్బా తీసి రెడీగా పెట్టాలి..బయట చెప్పులు కూడా అయ్యకు సిధ్ధంగా వుంచాలి..

బయట కారు ఆగి వుంటుంది.. అయ్యను తీసుకు వెళ్ళడానికి వచ్చిన వారితో అయ్య ఏవో విషయాలు మాట్లాడుతూ ..పంచె జుబ్బా వేసుకుని ..తలకు నూనె పెట్తించుకుని ..తల దువ్వుకుని.. చెప్పులు వేసుకుని వెళ్ళేవారు..

ఇలాగే ప్రయాణాల్లో కూడా.. ఏదో పుస్తకం చదువుతూ ..డబ్బులు చాలాసార్లు అయ్య పోగొట్టుకున్నారట..

అందుకే అమ్మ అయ్యకు బనియను కుట్టించి దానికి ముందుకు జేబు వుండేవిధంగా ఏర్పాటుచేసింది..

అప్పటినుంచీ కొంత పర్లేదు..
ఆ బనియనుకు దొంగల బనియను అని పిలిచేవాళ్ళం తమాషాగా..


14 డిసెం, 2011





"రసమో..!వ్యంగ్యమో..!భావమో..!
మరియతంద్రాలంకృతిన్యాసమో..!
ఇసుమంతైననెరుంగనోయి ప్రభువా..! 

యీ కొండలన్జింత వె..
క్కసమైనప్పుడు నెడ్చికొంటినదియే 

కావ్యాత్మగా మారె నీ..
యసమాన ప్రతిభా ప్రభావము 

సమ్మోహచ్చేద కౌక్షేయమై...."
"సాక్షాత్కారము "

                                                   




డైరెక్టర్ విశ్వనాధ్..
 సుమలత రాజశేఖర్ విశ్వనాధ్ గార్లు మా వూరికి వచ్చారు..
శృతిలయలు..సినిమా విజయం సందర్భంగా..
అయ్యను ఆహ్వానించారు..
రామకృష్ణా హైస్కూల్ లోనే సభ..
రాజశేఖర్ సుమలతలను అయ్యకు నమస్కరించమని విశ్వనాధ్ చెప్పారు..వారు పాదాలంటి అయ్యకు నమస్కరించారు.

అయ్య సినిమాల గురించి మాట్లాడుతూ..
ఈ సినిమా నేను చూడలేదు.
ఎప్పుడో ఎవరో చెప్పగా భక్త తుకారాం చూశాను..
నాకు నచ్చలేదు..అన్నారు..
బళ్ళారి రాఘవ హరిశ్చంద్ర నాటకాన్ని అయ్య ఎంతో గొప్పగా ఆ సభలో ఆవిష్కరించారు..
బళ్ళారి రాఘవ అభినయం చూసిన తాను వేరెవరినుంచీ అటువంటి నటనను ఆశించడంలేదని సున్నితంగా తన అభిప్రాయం చెప్పారు అయ్య.

11 డిసెం, 2011

పుట్టపర్తికి స్మృత్యంజలి

వాహినీ పిక్చర్స్ అధినేత B.N.రెడ్డి..
మల్లీశ్వరి,మిస్సమ్మ,గుణసుందరికథ,వందేమాతరం,పూజాఫలం,బంగారుపాప,రంగులరాట్నం ,రాజమకుటం,పెళ్ళిచేసి చూడు,పూజాఫలం..ఇలా యెన్నో తీసారు..
అప్పుడు ఆయన అంత పెద్ద వాడు కాదు. అప్పుడప్పుడూ అయ్యగారిని కలిసే వారట..
అయ్యగారూ.. అని సంబోధించేవారు.
తులజక్కయ్య వయసు పదిహేనేళ్ళు అయ్యకు ఆమె వ్రాయసగత్తె.
రాయలనాటి రసికతా జీవనము..షాజీ.. సిపాయిపితూరీ.. ఎన్నో అయ్య డిక్టేట్ చేస్తూండగా రాసిందామె.
ఆమె మాటల్లో ఒక సినిమా ప్రొడ్యూసరు ఇంటికి వచ్చేవాడు..
ఆయన అయ్యకు మహారధి కర్ణ అనే సినిమాకు వ్రాయమన్నారు.
కానీ అయ్య సినిమాకు వీలైన స్క్రిప్ట్ వ్రాయలేదు.  అందుకే అది సినిమా రూపం దాల్చలేదు..
ఆ B.N.రెడ్డి గారి అభిప్రాయం ఆయన మాటల్లో నే..


పుట్టపర్తికి స్మృత్యంజలి
 
ఏకాంతమునయందు..
నెన్నినాళులనుండి
పాడుకొనుచున్నదో తానూ..! వాల్మీకి
రామాయణమునంతానూ..! చెవియొగ్గి
వినవయ్య వాల్మీకి విశదహృదయముబోలు..
జాహ్నవీ వేదనా శబలితము రామకథ......



                      
 
                 




   

 
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు  మహోన్నతమైన సాహిత్య కృషీవలుడు.
సాహిత్య క్షేత్రంలో 
వివిధ ప్రక్రియలను చేపట్టి 
సాహిత్యాన్ని సుసంపన్నం చేసి 
మనకొక వారసత్వాన్ని విడిచిపెట్టి పోయాడు. చవకబారు ప్రచారాలకు 
ప్రలోభాలకు వశం కాకుండా
 స్వతంత్రుడై కర్మ యోగిగా.. జీవించాడు..
శ్రీ పుట్టపర్తి మరణంతో 
తెలుగు సాహిత్య చరిత్రలో పాతతరం అంతరించింది.
విశ్వనాధకు సమ ఉజ్జీ.. 
అయి ఆయన తర్వాత ఆ తరానికి అంతే సత్తాతో .. 
అంతే స్థాయితో పుట్టపర్తి ప్రతినిధిగా నిలిచాడు.
అయితే ఆయనలో 
అంతా పాతదనమే అని చెప్పడం సత్యం కాదు.. సౌమ్యమైన ఆధునికతకు నిలిచిన భావుకుడు ఆయన.

చందోబధ్ధమైన పద్యాన్ని 
ఎంత పకడ్బందీగా నడిపాడో 
మాత్రాచ్చంధస్సుతో కూడిన గేయాన్ని కూడా
అంతే సమర్థవంతంగా నిర్వహించాడు.
వారి పండరీ భాగవతం 
జనప్రియ రామాయణం 
శ్రీనివాస ప్రబంధం 
ఎంత గొప్ప సంప్రదాయ బధ్ధమైన కావ్యాలో మేఘదూతం 
అగ్నివీణ 
ఇంగ్లీషులో Leaves in the Wind
 సమకాలీన సామాజిక జీవనానికి 
అంతే ప్రతిబింబాలు.
ఆయన కమనీయ కృతి 
"శివతాండవం"పై వాటిలో చేరని ఒక విశిష్ట రచన. 
దాని కదే సాటి. 
తెలుగు జాతి ఆయనకు ఎంతో ఋణపడి వుంది.

పుట్టపర్తి పద్య గేయ కవియే కాదు 
వచనకవి కూడా..
ఆయన రచనా వైవిధ్యంలో 
వచనాన్ని కూడా కవితవలె కళగా తీర్చి దిద్దినాడు.
"గద్య పద్యముల భిన్నత" 
అనే వ్యాసంలో గద్యానికి పద్యంతో 
సమానంగా పట్టం కట్టాడాయన.


'కవికి ధ్వనియు ఆవేశము ముఖ్యములు. 
వచనమున కౌచితి జీవగర్ర... 
గద్యమునకు స్పష్టత జీవధర్మం...
వచన రచయితకు సర్వతో ముఖ దృష్టి అత్యవసరం...కవికీయున్న మంచిదే..
లేకున్ననూ పెద్ద కొరతగా కానపడి 
కళను వికారంగా మార్చదు.
కనుక యీ రెండును విభిన్నములగు కళలు. 
అట్లే సృష్టించు వ్యక్తులు కూడా భిన్నులే...


పుట్టపర్తి కవితా స్పూర్తి ఎంత గొప్పదంటే.. 
ప్రాచీన కవితాభిమానులు సరే 
ఆయనను తలకెత్తుకున్నారు. 
కానీ శ్రీ శ్రీ అంతటి వాడు కూడా 
ఆయన "జనప్రియ రామాయణాన్ని" చూసి 
విస్మయం చెంది 
"నాకు రామాయణ భారతాలంటే సరిపోదు 
కానీ 
ఈ రచనను చూస్తే యేమో చదువుదామనిపిస్తూంది"
అని అంటాడు.

పుట్టపర్తి మానవతామూర్తి. సూర్యోదయం నుంచీ సూర్యాస్తమయం వరకు చమటోడ్చి చింపిరి గుడ్డలతో వున్న ఒక పాటక యువతిలోని అందాన్ని చూసి "నిన్ను సంపన్నురాలుగా చూడాలని కోరుకుంటాను" అన్నాడు.


"My heart longs to see you in riches
God is unfair,wealth is only for some"

(Leaves in the Wind)


దుమ్ములో పొర్లాడుతూ 
మృత్యువాత పడిన ఒక గాడిదను చూసి 
పసిపిల్లలు దాన్ని చుట్టుముట్టి 
దాని శవంపై దయాదృష్టి ప్రసరిస్తూ వుండగా..  
ఒక పెద్దమనిషి 
ఆ దృశ్యాన్ని చూచి 
"గాడిదనేగా..! చావనీ.. 
కొన్ని గాడిదలు (మరుజన్మలో) 
మనుషులుగా పుట్టవచ్చు." అని అంటాడు 
అదే ఆంగ్ల కవితలో...
సమాజంపై ఎంతటి కొరడా దెబ్బ కొట్టాడు..! 
ప్రేమ ఒకటే నిజమైన వేదాంతమంటాడు ఈ కవి.
ప్రేమను ఎవరూ బలవంతంగా అనుభవింపచేయజాలరు.
అది సహజమైనది.వేదాంతమూ అంతే.
నన్ను నేను ప్రేమిస్తాను. 
ప్రతిమనిషిలో నన్ను చూచుకుంటాను.
అప్పుడు నేను 
వేయి మంది దేశభక్తులతో సమానుడనవుతాను" అంటాడు ఆయన
చక్రవర్తి కుమారుడైన గౌతమబుధ్ధుని 
త్యాగ శీలాన్ని ఆయన కొనియాడారు. 
రాజభోగాలను వీడి 
'ఆత్మక్షుత్తు' తో (Hunger of Soul) 
సత్యాన్వేషణకు బయలుదేరి 
వర్షాకాలం మేఘమువలె 
మానవజాతిపై కృపావర్షం కురిపించడానికి 
తిరిగి వచ్చాడు బుధ్ధుడు అంటాడు. 
సన్యాసియైనా మహాదాత 
అని బుధ్ధుని అభివర్ణిస్తాడు.

పుట్టపర్తి గొప్ప ఆస్తికుడు.
భక్తాగ్రేసరుడు.జన్మతో వైష్ణవుడు.
విశిష్టాద్వైతములను ఉపాసించకూడదనే 
ఆ మత సిధ్ధాంతాన్ని త్రోసిరాజన్నాడు. 
హరిహరులు ఆయనకు అభేదము.
వైష్ణవుడై శివుని ఆరాధించాడు.

అంతేకాదు 
హిందూమతములో వర్గవిభేదాలను అధిగమించి 
అందరి దేవుళ్ళలో పరమాత్మను దర్శించి 
పూజించాడు.

అన్ని ప్రాంతాల్లోని భక్తి సిధ్ధంతాలను ఆదరించాడు.
సమర్థ రామదాసు.. 
చైతన్యప్రభు.. 
తులసీదాసు.. 
శివానంద సరస్వతి.. 
రమణ మహర్షి.. 
అరవిందుడు.. 
షిర్డి సాయిబాబాతో సహా 
అన్ని తత్వాలను అవగాహన చేసుకొని 
వాటిని అనుసరించాడు. 
బౌధ్ధమును జైనమును కూడా ప్రశంసించాడు.
ఇదీ పుట్టపర్తివారి వ్యక్తిత్వం విశిష్టత. 
ఆయన సాహిత్య విశ్వరూపాన్ని
 స్వరూపాన్ని స్మరించుకొని 
వినమ్రు డనై ఆయనకు నమస్కరిస్తాను.

6 డిసెం, 2011

ముమ్ముర్తులా విద్వత్కవి-విశాలాంధ్ర.

                


అది 1990 సెప్టెంబర్ ఒకటవ తేదీ 
మహాకవి పుట్టపర్తి పరమపదించిన రోజు.
ప్రముఖ దినపత్రిక విశాలాంధ్ర 

తన అనుబంధాన్ని ఇలా వ్యక్తపరిచింది.



         ముమ్ముర్తులా విద్వత్కవి-విశాలాంధ్ర.

సాహిత్య సంగీత,నాట్యశాస్త్రాల్లో 

పండితులు ఉండవచ్చు 
హృద్యమైన రసబంధురమైన శైలి 
వైశిష్ట్యం గల కవులూ ఉండొచ్చు.
ఈ రెండూ దండిగా ఉన్నా 
తోటి కవి పండితుల పట్ల భర్తృహరి చెప్పినట్లు మాత్సర్యం లేనివారు అరుదు. 
ఈ మూడు విశిష్టలక్షణాలను.. 
తనలో సమన్వయం చేసుకొన్న 
అద్వైత మూర్తిగా 
సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారిది ఆంధ్ర సాహిత్యంలో అదో అపూర్వ స్థానం.

మహాకవులు తప్ప 
మామూలు కవులే కరువైన 
ఈనాటి తెలుగు సాహిత్య వినీలాకాశంలో 
నిరంతర జాజ్వల్యమాన తేజోవంతమైన 
ధృవతారగా ఆయన స్థానం అక్షరాలా అపురూపమైనది.ఆ 

మామూలు కవులైన 
వాల్మీకి,వ్యాస పరంపరలో 
మొన్న కన్నుమూసిన పుట్టపర్తివారు 
ప్రాతః స్మరణీయులు.
 

శతాధిక గ్రంధకర్తృత్వంవల్ల 
వీసమెత్తు భేషజం
 ఆయన వ్యక్తిత్వానికి సోకలేదు... 
శాస్త్ర పరిజ్ఞానం,
ఆధునిక ధోరణులపట్ల 
ఉద్యమాల పట్ల 
ఏ మాత్రపు తూష్ణీభావానికి తావీయలేదు.
జనప్రియరామాయణాన్ని 

పోతన భాగవతాన్ని 
తెలుగు పలుకుబళ్ళ తీయదనంతో 
ఎంత రసనిష్యందంగా వ్యాఖ్యానించి 
కుంచె పట్టారో అంతగా 
చందో పరిష్వంగపు బందోబస్తులు
 పట పటా తెంచిన శ్రీశ్రీ ప్రభృతి ఆధునిక కవి 
ప్రయోగాలను ఆదరంగా పరిశీలించారు. 

భక్తి,రక్తి ముక్తి దాయకమైన శివ కేశవ లీలా విలాసాలనెంత తన్మయత్వంతో కీర్తించారో.. సామాన్యుని ఆర్తికి అరుదైన కవితా స్పర్శతో అజరామరమైన కావ్య ప్రతిపత్తి కల్పించారు.

మొదటి లక్షణానికి శివతాండవం..
రెండవదానికి మేఘదూతం ఉదాహరణ.
భారతీయ భాషా ప్రపంచరోచిస్సులకు 

దివాంధులైన సగటు కువిమర్శక 
కూపస్థ మండూక ప్రవృత్తికి
 భిన్నమార్గం ఆయనది  

'రాలెడు ప్రతిసుమమేలా నవ్వును..? 
హైమవతీ కుసుమాలంకారమునందున 
తానొక టౌదునటంచునో..?'  
అని శివతాండవ అవతారికలో 
ఆకాంక్షించిన సరస్వతీపుత్ర కవిసుమం 
ఆ స్థానాన్ని అపేక్షించి 
ఈ లోకం నుండీ నిష్క్రమించింది.
ఆ పువ్వు వాడదు,
వడలదు,
వయసు మీరదు-
నాస్తితేషాం  యశఃకాయే....
అన్నిటా గీతా ప్రవచనమైన 
"పండితాస్సమ దర్శినః" 
అన్న ఋజువైన జీవన మార్గం ఆయనది.
తెలుగు కీర్తికిరీటంలో కలికితురాయిగా
 ప్రకాశితమైన ఆయన స్మృతికి
 విశాలాంధ్ర శ్రధ్ధాంజలి.

సంపాదకీయం 3.9.1990