21 సెప్టెం, 2011



http://www.eemaata.com/em/features/essays/1060.html

స్నేహితుడు, విమర్శకుడూ

నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వల్లంపాటి వెంకట సుబ్బ య్య పోయారని. నిన్న మొన్ననే ఆయనతో చికాగోలో గంట ల తరబడి మాట్లాడాను. జంపాల చౌదరిగారి ఇంట్లో తెలుగు కథల గురించీ, తెలుగు విమర్శ గురించీ. ఆయన మాటలు, ఆయన గొంతుకా, ఆయన స్పష్టమైన ఆలోచనలు, విలక్షణమైన వాక్య ధోరణీ ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. పొద్దున్న పనిమీద ఢిల్లీ వచ్చిన నన్ను అఫ్సర్‌ హైదరాబాద్‌ నుంచి పిలిచి, మీకో విచారకరమైన వార్త చెప్పాల్సివొస్తోంది-అని ఒక్కఅరక్షణం గడవకముందే వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు పోయారని అనగానే నేను నిర్ఘాంతపోయి ‘నిజమా’ అనడం గుర్తుంది కాని ఇప్పటికీ ఆ మాట నిజంలా వినిపించడం లేదు.
ఏదైనా వూహ కొస్తే, ఒక కథ గురించో, ఒక విమర్శా సిద్ధాంతం గురించో ఒక ఆలోచన వొస్తే అది వల్లంపాటి వినాలని, ఆయ న ఏమంటారో తెలుసుకోవాలని చటుక్కు న అనిపించేది. వెంకటసుబ్బయ్యగారు ఎ ప్పుడూ అందుబాటులో ఉండేవారుకారు. ఎక్కడో విసిరిపారేసినట్లు ఆ మూల వున్నారెందుకూ, ఆంధ్రదేశంలో ఏ విశ్వ విద్యాలయమూ అయన్ని పిలిచి ఎందుకు ఉద్యో గం ఇవ్వలేదెందుకు- అని చాలా సార్లు నా లోపల విసుక్కునేవాణ్ని. ఆయనకి అంతకన్నా దూరంగా నేను అమెరికాలో విస్కాన్సిస్‌లో ఉన్న మాడిసన్‌ వెళ్లిపోయాక విచిత్రంగా ఆయన దగ్గిరయ్యారు. రాత్రీ, పగలూ అనకుండా టెలిఫోన్‌ లో మాట్లాడ్డానికి వీలుదొరికేది. మరీముఖ్యంగా ఆయన కథా శిల్పం మీదా, విమర్శా సిద్ధాంతాల మీదా రాసిన పుస్తకం వచ్చిన తరవాత- ఆయనతో చాలాసార్లు వివరంగా మాట్లాడాను. మాట్లాడే విషయం లో గాఢతకీ, ఆ మాట్లాడే తీరుకీ ముచ్చటపడుతూ మాట్లాడాను.
తెలుగుకథకి ఉన్న సామాజిక స్వభావాన్ని ఆయన ఎంతో స్పష్టం గా, విమర్శయుతంగా పట్టుకున్నారు. కథ సామాజిక పురోగమన ధర్మాన్ని నెరవేర్చాలని ఆయన బలంగానమ్మారు. తెలుగు కథా విమర్శని గట్టి సిద్ధాంత పునాదుల మీద నిర్మించిన ప్రత్యేకత ఆయనదే. కథ చదివి అందులో విషయాన్ని తిరిగి చెప్పి అది సామాజిక ప్రయోజనం నెరవేరుస్తోందనే మాట పడికట్టుపదాలతో ఉద్ఘాటం చేసే విమర్శల ధోరణిని మొదటిసారిగా మార్చి, తెలుగుకథారూపాన్ని, దాని శిల్పాన్ని తాత్విక పునాదుల మీద నిలబెట్టిన వాడు వల్లంపాటి.
మార్కిస్టు సిద్ధాంతం మీద విశ్వాసం పోగొట్టుకోకుండా, సాహిత్య రూపాల మీద శ్రద్ద పెట్టిన చాలా కొద్ది మంది విమర్శకుల్లో ఆయన ఒకరు. సాహిత్య విమర్శంటే రాజకీయ ఉపన్యాసమే అయిపోయిన ఈ రోజుల్లో - సాహిత్య రూపం మీద దృష్టితో, ఆలోచనాత్మకంగా, విశ్లేషణ సామర్థ్యంతో కథని, కథాకథన మార్గాన్ని, కథా నిర్మాణాన్ని సిద్ధాంతీకరించిన విమర్శకుడు వల్లంపాటి.
ఇంగ్లీషులో ఉన్న సాహిత్య విమర్శని అది పొందిన వివిధ పరిణామాలతో చారిత్రక దృక్పథంతో బోధపరచుకున్న చాలా కొద్దిమంది తెలుగు విమర్శకుల్లో వల్లంపాటి ఒకరు. దానికి తోడుగా- తెలుగు సాహిత్యంతో మొదలుపెట్టి, ఆధునిక సాహిత్యం దాకా శ్రద్దగా చదివి న ప్రత్యేకత ఆయనది. మాటలు దొర్లించడానికీ, డొల్ల పొగడ్తలు పొగడడానికీ, పెద్ద ఆలోచన అక్కర్లేకుండా ప్రా చ్య పాశ్చాత్య విమర్శకుల పేర్లు గాలిలో కబుర్లలా ఉదాహరించే వాతావారణంలో ఆయన చదివిన చదువుని గమనించి ఆయ న చేసిన పనిని కొనసాగించే కొత్త విమర్శకు లు ఎక్కడైనా ఉన్నారా అని వెతుకుతుండే నాకు- ఆయన పోయారనే కబురు ఒక స్నే హితుడు పోయారనే నొప్పి కలిగించడంతో పాటు ఒక విమర్శ సంప్రదాయం బలంగా ఏర్పడకముందే ఆ సంప్రదాయ ప్రవర్తకు డు తెరమరుగయ్యాడే అనే నిరాశ కలిగించి దిక్కుతోచకుండా చేస్తోంది.
ఆధునికంగా వొస్తున్న మార్పుల వల్ల, ప్రపంచీకరణ వల్ల కలుగుతున్న చవకబారు లాభాలవల్ల తన సాంస్క­ృతిక స్థైర్యాన్నీ, నిలకడనీ, ఉనికినీ గబగబా పోగొట్టేసుకుని ఒక డొల్లబారిన సంకర సంస్క­ృతిని చేతులారా కావిలించుకోడానికి తహతహలాడుతున్న ఈనాటి నాగరిక యువతరం కన్నా ‘వెనకబడిన’ రాయలసీమలో ఇంకా వేళ్లూనిన సాహిత్యసంస్క­ృతి ఉందని గమనించి దానిని వివరించిన ప్రత్యేకత వల్లంపాటిది.
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వల్లంపాటి సాహిత్య గురువులు. ఆ మహా పండితుడి సాహచర్యంలో తెలుగూ, సంస్క­ృతమూ, కన్నడమూ చదివి, ఆ సాహిత్యాలలో ఉండే బలాన్ని తెలుసుకుని, దాన్ని ఆధుని క విమర్శ చైతన్యంతో విశ్లేషించి, అనుసరించిన విశేష ప్రజ్ఞావంతుడు వల్లంపాటి. పుట్టపర్తినారాయణాచార్యులుగారిని గురించి వల్లంపా టి మాట్లాడుతుంటే, ఆయన కళ్లల్లో వెలుగూ, ఆ గొంతుకలో మెచ్చుకోలూ నన్ను అచ్చమైన తెలివితేటల్లాగా చకచ్చకితం చేసేవి. పుట్టప ర్తి వారిని గురించి వల్లంపాటి మాటలు మళ్లామళ్లా వినాలని ఎదురుచూసేవాణ్ణి. కాని ఇంత మెచ్చుకోలుతోనూ వల్లంపాటి పుట్టపర్తివారిని సవిమర్శకంగా చూడడం మానలేదు. వల్లంపాటి ఎవరికీ ఆరాధకుడు కాలేదు. తన విమర్శ దృక్పథాన్ని ఎప్పుడూ వొదులుకోలేదు.
నన్ను ఎప్పటికీ వొదలని నిరాశ ఏమిటంటే, అటు పుట్టపర్తి వారి పాండిత్యాన్నీ మనం పూర్తిగా వినియోగించుకోలేదు. దానిని వినియోగించుకుని అందువల్ల పరిణతి పొందిన వల్లంపాటినీ మనం పూర్తిగా వినియోగించుకోలేదే అని. వల్లంపాటి రాసినది తక్కువేమీ కాదు. కాని రాయగలిగింది, అవకాశాలు సరిగా ఉంటే రాసి ఉండేది ఇంకా చాలా ఎక్కువ.
వల్లంపాటి ఏ విశ్వవిద్యాలయంలోనో మంచిస్థానంలో ఉంటే, తన దగ్గర చురుకైన విద్యార్థులు తయారయివుండేవారు. తనదైన ఒక ఆలోచనామార్గాన్ని, ఒక కథా విమర్శ సంప్రదాయాన్ని నిండు గా నిలబెట్టివుండేవాడు. ఆ అవకాశం ఆయనకు కల్పించే సాహిత్య వైజ్ఞానిక రంగం మనకి ఏర్పడలేదు. ఆయనే అలాంటి రంగాన్ని ఏర్పరచగలవాడు. కానీ ఆ పని ముగియకముందే వల్లంపాటి వెళ్లిపోయారు.
తెలుగులో కవిత్వాన్ని గురించి ఆలోచించిన వాళ్లూ, విమర్శలు రాసిన వాళ్లూ చాలా మంది ఉన్నారు. కాని కథని పట్టించుకున్న విమర్శకులు లేరని అనుకునేవాణ్ణి. ఆధునిక తెలుగు సాహిత్య ప్రపం చంలో కథకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి వల్లంపాటి చేసిన పని చూసి ఇది మరికొందరు అంది పుచ్చుకుంటారనే నమ్మకం కలిగింది.
కాని వల్లంపాటితో చర్చించవలసినవి నాకు చాలా ఉన్నాయి. రాజకీయ సిద్ధాంతానికీ, కథా ప్రాణానికీ ఉన్న సంబంధం గురించి మరీ మాట్లాడాలనుకునేవాణ్ణి. విమర్శ ఎంత తీవ్రమయినదయినా, ఆవేశ పడకుండా విని, సరళంగా, ఓపిగ్గా, సహేతుకంగా చర్చించగలిగిన ఆయనతో ఎలాంటి అభిప్రాయమైనా, సంకోచించకుండా చర్చించడానికి వీలుండేది. ఇంకా ఎన్ని ఉన్నాయో మాట్లాడడానికీ, ఆయనతో పోట్లాడడానికీ. కానీ ఈ లోపునే ఆయన వెళ్లిపోయారు.
చికాగోలో ఆయనతో ఎడతెరిపి లేకుండా చెప్పిన కబుర్లలో రెండు పెద్ద మేడలు కట్టాము. ఒకటి - తెలుగు కథల్లో మంచి కథలు కూర్చి ఒక ప్రపంచస్థాయికి రాగలిగిన సంపుటిని తయారుచేసి, దాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ప్రపంచవ్యాప్తం అయేలా ప్రచురిద్దామని. మంచి కథలు అంటే నిజంగా మంచి కథలే. వాటి సాహిత్య స్థాయి తప్ప మరే మినహాయింపు లేకుండా నిక్కచ్చిగా మంచి కథలే ఎంచుకుం దామనీ, ఆ సంపుటికి బలమైన విమర్శతో కూడిన ముందు మాట రాద్దామనీ. ఇది ఒక మేడ. ఈ మేడ గురించి ఇంకొంచెం చెప్పాలి.
తెలుగులో ప్రస్తుతం బలంగా వీస్తున్న రాజకీయ, సామాజిక, ప్రాంతీయతా ధోరణుల బలమైన గాలులు మా కథా సంపుటిలో కథ ల ఎంపికకి బలాన్ని ఇవ్వాలే గాని, ఆటంకాలు కాకూడదని ఇద్దర మూ ఒప్పుకున్నాం. తనకున్న కథానుభవాన్ని, కథాభిరుచినీ ఈ ప్రయత్నంలో జోడించడానికి జంపాల చౌదరిగారు, అంతకుముందే నవీన్‌ అంగీకరించారు. ఈ పనిలో - దూరంగా కూర్చున్న నా బోటివాడు చెయ్యగలిగినది ఎక్కువ కాదనీ, ఇందులో చాలా మంది అనుభవాలు కలవారనీ నేను మరీమరీ పట్టుబట్టాను. అప్పటికప్పుడు కూర్చుని రాత్రి చాలాసేపు అయేదాక వల్లంపాటీ, జంపాలగారూ, నేను ఓ కథల జాబితా తయారు చెయ్యడం మొదలుపెట్టాం కూడా. ఇలా మాట్లాడేటప్పుడు ఫలానా కథ ఎందుకు మంచిదో వల్లంపాటి విశ్లేషిస్తుంటే నేను టైముసంగతి మరిచిపోయి వింటూ కూర్చున్నాను.
ఇకపోతే, తెలుగు కథాకథన సంస్క­ృతి ఒకటి ప్రత్యేకంగా ఉందా, లేకపోతే ప్రపంచంలో ఉన్న కథల సముద్రంలో తెలుగు కథ కాకి రెట్టలా కలిసిపోతుందా అని ప్రశ్న వేసుకుని తెలుగులో కథ చెప్పే విధానాలని పేదరాసి పెద్దమ్మ కథలనించి కుప్పిలి పద్మ కథల దాకా, పింగళి సూరన కావ్యాల లాంటి నవలల నుంచి కేతు విశ్వనాథ రెడ్డి కథల దాకా అన్ని విశేష కథనా రీతుల్నీ చూసి విశ్లేషించి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలమా? తెలుగు కథాకథన సంప్రదా యం/విధానం సిద్ధాంతీకరించాలి. దానిమీద ఒక గోష్ఠి, ఒక చర్చ నడిపి ఒక మంచి పుస్తకం రాయాలి. ఇది మేం కట్టిన రెండో మేడ.
ఈ రెండు మేడలూ కబుర్లతో కట్టినవే. కాని ఆ క బుర్ల వొట్టి గాలి కబుర్ల కావు. వల్లంపాటితో ఏం మాట్లాడినా అవి గాలికిపోయే కబుర్ల కావు. ఆ కబుర్ల మేడలు అక్షరాల సౌధాలు అవకముందే వల్లంపాటి కన్నుమూశాడు. కానీ ఆ కబుర్ల పునాదులు నా మనస్సులో లోతుగా ఉన్నాయి.
ఈ రాత్రంతా ఢిల్లీలో ఉన్న నాకు నిద్రపట్టకుండా మనస్సు నిండా ఆ కబుర్లు ఆవరించుకుని ఉన్నాయి.
(ఆంద్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో)
రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌ లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌ గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాసారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని(Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు గారు ప్రస్తుతం ఎమరి యూనివర్సిటీ లో పనిచేస్తున్నారు. ... 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి