అది తిరుపతిలోని మధురాంతకం రాజారాంగారి ఇల్లు.
కథకుడు, విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య
ఆనాటి రాత్రి అక్కడ ఆతిథ్యం పొందుతున్నారు.
భోజనానంతరం, వల్లంపాటివారు ఓ కావ్యం
చదవడం మొదలుపెట్టారు. అంతలో కరెంట్ పోయింది.
వల్లంపాటి కవితాగానం మాత్రం ఆగలేదు.
మధురాంతకంవారి సతీమణి ఆశ్చర్యపోయారు.
‘చీకట్లో ఎట్ల చదువుతున్నారన్నా?’ అని అడిగారు.
‘ఈ కావ్యం అచ్చులో చూసి చదవాల్సిన పనిలేదు -
అది నా నాలుకమీద నర్తిస్తూనే ఉంటుందమ్మా!’
అన్నారు వల్లంపాటి. ఆ కావ్యం ‘శివతాండవము’.
దాన్ని రాసింది
‘సరస్వతీపుత్ర’ పుట్టపర్తి నారాయణాచార్యులు. ‘సుకవి జీవించు ప్రజల నాలుకలపైన’
అన్న జాషువ వాక్యానికి ఇంతకన్నా నిర్ధారణ వేరేం కావాలి?
పాత కొత్తలకు వంతెన
భావకవితా మారుతం ఆంధ్రదేశమంతటా వీస్తున్న రోజులలో, వీస్తున్న
గాలి వెంట
పోకుండా, ప్రబంధ శైలికి తాత్కాలికంగానే అయినా విరామం ఇచ్చిన వారు
నారాయణాచార్యులు. ఆ విరామంలోనే సామాజిక చైతన్యాన్ని పురిగొల్పే
రచనలు చేశారు. శ్రీశ్రీతో భుజం భుజం కలిపి తిరిగినవారు. అయినా ధ్వని
ప్రధానమైన ‘శివతాండవం’ రాశారు. ఆకృతిలో చిన్నదైన ఈ కృతి ఆయనకి
విశేషమైన ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఒక్క మాటలో చెప్తే ప్రాచీనతకూ, నవ్యతకూ
సేతువు పుట్టపర్తి. మానవాళికి ఉండే ఆసక్తులన్నింటికీ ఆయనో ప్రతిబింబం.
అలాంటి అన్ని ఆసక్తుల మీదా ఆయనకి ఆసక్తీ, అనురక్తి. అనంతమైన
అనుభూతులకు అక్షర రూపం ఇచ్చి వందకు పైగా సత్కృతులు రచించిన
వారు నారాయణాచార్యులు. కవిత్వంతో పాటు విమర్శ, సమ్మోహన
వక్తృత్వం, బహు భాషా పరిచయం కలబోసుకున్న సాహితీ మేరువు.
విచిత్ర సన్నివేశం!
నారాయణాచార్యులవారు అనంతపురం జిల్లా చియ్యేడులో (28-3-1914)
జన్మించారు. పెనుకొండలో తెలుగు పండితులు. అక్కడే ఉన్న
మహాలక్ష్మమ్మగారి వద్ద సంగీతం, నృత్యం కూడా నేర్చుకున్నారు.
ఆయన పద్నాలుగో యేట రాసిన చిరు కావ్యం ‘పెనుగొండ లక్ష్మి’.
విశేషం ఏమిటంటే నారాయణాచార్యులు గారు మద్రాసు విశ్వవిద్యాలయం
విద్వాన్ పరీక్షకు వెళ్లినపుడు ఇదే పుస్తకం పాఠ్యగ్రంథం.
తను రాసిన పుస్తకం మీద తానే పరీక్ష రాసిన విచిత్ర సన్నివేశం
ఆయన జీవితంలో కనిపిస్తుంది. పుట్టపర్తి కేరళ విశ్వవిద్యాలయంలో
భాషా శాస్త్ర పరిశోధకులుగా పని చేస్తూనే విశ్వనాథ వారి ‘ఏకవీర’
నవలను మలయాళంలోకి అనువదించారు.
కన్నడ రచయిత బీచి రాసిన సరస్వతీ సంహార గ్రంథాన్ని తెలుగులోకి
అనువదించారు. సమర్థ రామదాసు రచనలను మరాఠీ నుంచి తె నిగించారు.
బుద్ధ భగవానుడు, వీర సావర్కర్, స్వర్ణపత్రము వంటి రచనలను కూడా
తెలుగులోకి అనువదించారు. ఆయన దేశమంతా తిరిగారు. బెనారస్
హిందూ విశ్వవిద్యాలయంలో కొన్ని ఉపన్యాసాలు ఇచ్చిన తరువాత
ఆయన హృషికేశ్‌లోని స్వామి శివానందుల ఆశ్రమంలో కొంతకాలం
ఉన్నారు. ఆ సమయంలో శివానందులు ఇచ్చిన బిరుదే ‘సరస్వతీపుత్ర’.
విరక్తి నుంచి విహాయసానికి..
ఎందుకోమరి, నారాయణాచార్యులు కొద్దికాలం విరక్తికి లోనైనారు.
అప్పుడే వారికి అత్యంత ప్రీతిపాత్రమైన విజయనగర చరిత్రను తనదైన
శైలిలో గ్రంథస్తం చేస్తూ ప్రొద్దుటూరు సమీపంలోని ఒక గ్రామంలో ఉన్నారు.
1948-49 ప్రాంతంలో కుందూ నదికి వరదలు వచ్చాయి. వారి పర్ణ
కుటీరం కూడా కుందూ ఆగ్రహానికి గురైంది. ‘అస్త సామ్రాజ్యం’ అన్న
కావ్యం వరద పాలైంది. పాత విరక్తికి కొత్త విరక్తి తోడైంది. కావ్యం కుందూ
మింగేయడం ఆయనను బాగా బాధించింది.
అప్పుడే విశ్వంగారు పుట్టపర్తివారిని కలుసుకున్నారు. ‘‘అప్పా! నాకెందుకో
ఈ మధ్య పద్యరచన చేయాలంటే అచ్చుబాటు కావడం లేదు. ప్రజల
హృదయాల్లో నిలిచే కావ్య రచన చేయాలని ఉంది. దానికి తగ్గ వస్తువేదై
నా ఒకటి సూచించు!’’ అన్నారట పుట్టపర్తి. ‘‘స్వామీ! పద్యం కంటె మాత్రా
ఛందస్సులో గేయ రచన అయితే బాగుంటుంది.’’ అంటూ మొదట రూపాన్ని
సూచించి, తరువాతే తన దృష్టిలో ఉన్న ఒక వస్తువును కూడా
నారాయణాచార్యులతో చర్చించారు విద్వాన్ విశ్వం. అదే ‘మేఘదూతము’గా
తెలుగు సాహితీ వినీల వీధులలో విహరించింది. ఆచార్యుల వారి
మేఘదూతము వారి అభ్యుదయ భావావేశానికి ప్రతీక. మానవతావాదా
న్ని ఎలుగెత్తి చాటిన గొప్ప గేయకావ్యం.
ఖైదీయే కావ్యనాయకుడు!
మేఘదూతము కావ్యానికి వస్తువుగా కడలూరు కారాగారంలో ఉండగా
తన అనుభవానికి వచ్చిన ఒక ఘట్టాన్ని విశ్వం సూచించారు. స్వాతంత్య్ర
సమరయోధుడైన తోటి ఖైదీ జీవితంలోని వాస్తవగాథ అది. నవ
ప్రేమానురాగాలను అనుభవించవలసిన తరుణంలో అతడు కారాగారంలో
బందీగా మిగిలిపోయాడు. కల్యాణం జరిగిన కొద్దినెలలకే ప్రభుత్వం
అతడిని కడలూరు జైలులో పెట్టింది. భార్యా వియోగమే కాదు,
పోలీసులు తన ఇంటిపై చేసిన దాడి, ప్రదర్శించిన దౌష్ట్యం,
బూటు కాళ్ల తాడనం వంటి చేదు జ్ఞాపకాలన్నీ ఆ యువ దేశభక్తుడి
ని నిరంతరం బాధించేవి. ఈ గాథ విని నారాయణాచార్యులు
కన్నీళ్లు పెట్టుకున్నారు. మాలతీ మాధవం నాటకంలోని ఘట్టాలు,
హంస సందేశం గుర్తుకు వచ్చాయి. కాళిదాసు మేఘ సందేశమూ
తలపునకు వచ్చింది. భార్య, కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో
అనుకుంటూ మేఘాలను చూస్తూ కాలం గడిపే కడలూరు ఖైదీ
కావ్య నాయకుడిగా రూపుదిద్దుకున్నాడు.
నిత్య విద్యార్థి
నారాయణాచార్యులు అధిరోహించిన శిఖరాలు సమున్నతమైనవి.
ఆయన పొందిన సత్కారాలు కూడా ఎంతో ఎత్తయినవి. అయినా
అధ్యయనం ఆయన నిత్య జీవితంలో భాగంగానే కాపాడుకుంటూ
వచ్చారాయన. చివరికి జీవిత చరమాంకంలో కూడా ఆయన
నిత్యం స్థానిక గ్రంథాలయానికి వెళ్లి చదువుకుంటూ, చదివిన
విషయంలో ముఖ్యం అనుకుంటే రాసుకుని ఉంచుకుంటూ
కాలం గడిపారు. పుట్టపర్తి వారు కవిగా జన్మించారు. కవిగా
జీవించారు. చివరి వరకు సాహిత్యాన్నే శ్వాసించారు.
- డా. జానమద్ది హనుమచ్ఛాస్ర్తి
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి